చందమామపైకి చలో చలో | Chandrayaan 2 Launching From Sullurpet On 14th July | Sakshi
Sakshi News home page

‘చంద్రయాన్‌–2’కు సర్వం సిద్ధం 

Published Sun, Jul 14 2019 1:29 AM | Last Updated on Sun, Jul 14 2019 11:47 AM

Chandrayaan 2 Launching From Sullurpet On 14th July - Sakshi

సూళ్లూరుపేట (శ్రీహరికోట)/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. నెల్లూరు జిల్లా సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. షార్‌లోని బ్రహ్మ ప్రకాశ్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్యర్యంలో, ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ పర్యవేక్షణలో శనివారం మిషన్‌ సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 7 నుంచి శనివారం దాకా ప్రయోగ వేదిక మీదున్న రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాకెట్‌ సిద్ధంగా ఉందని, పరీక్షలన్నీ పూర్తి చేశామని చెప్పి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) చైర్మన్‌ ఆర్ముగ రాజరాజన్‌కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో కూడా బోర్డు శనివారం రాత్రి మరోసారి సమావేశమైంది.

ఈ సందర్భంగా రాకెట్‌కు కె. శివన్‌ ఆధ్వర్యంలో  మళ్లీ లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ప్రయోగ సమయానికి 20 గంటల ముందు అంటే ఆదివారం ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌.. 3,850 కిలోల బరువుగల చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని భూమి నుంచి చంద్రుడిపైకి మోసుకెళ్తుంది. జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3–ఎం1 రాకెట్‌ పొడవు 43.43 మీటర్లు, బరువు 640 టన్నులు. ఇందులో 3,850 కిలోల బరువుగల చంద్రయాన్‌–2 మిషన్‌ను పంపుతున్నారు. ఉపగ్రహంలో 2.3 టన్నుల ఆర్బిటర్, 1.4 టన్నుల ల్యాండర్‌ (విక్రమ్‌), 27 కిలోల రోవర్‌ (ప్రజ్ఞాన్‌)లో 14 ఇండియన్‌ పేలోడ్స్‌ (ఉపకరణాలు)తోపాటు ఆమెరికాకు చెందిన రెండు, యూరప్‌ దేశాలకు సంబంధించి రెండు పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. 

ఇలా పనిచేస్తుంది... 
– మొదటి దశలో జీఎస్‌ఎల్వీ మార్క్‌3–ఎం1 రాకెట్, దాని ఇరువైపులా ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్‌–200 బూస్టర్ల సాయంతో నింగికి పయనమవుతుంది. ఈ దశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 131.30 సెకన్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. 
– రెండో దశలో ద్రవ ఇంజన్‌ మోటార్లు 110.82 సెకన్లకే ప్రారంభమవుతాయి. 203 సెకన్లకు రాకెట్‌ శిఖర భాగాన అమర్చిన చంద్రయాన్‌–2 మిషన్‌కు ఉన్న హీట్‌ షీల్డ్స్‌ విడిపోతాయి. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 308.50 సెకన్లకు రెండో దశను పూర్తి చేస్తారు. 
– మూడో దశలో అత్యంత కీలకమైన క్రయోజనిక్‌ (సీ–25) మోటార్లు 310.90 సెకన్లకు ప్రారంభమవుతాయి. 958.71 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేస్తారు. అనంతరం రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్‌–వన్‌ చంద్రయాన్‌–2 మిషన్‌ 973.70 సెకన్లకు (16.21 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170.06 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 39,059.6 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్‌ ఆర్బిట్‌ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఈ బాధ్యతను బెంగళూరులోని మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ అధీనంలోకి తీసుకొని మిషన్‌ చంద్రుడిపైకి వెళ్లే వరకు ఆపరేషన్‌ నిర్వహిస్తుంది. 

16 రోజుల్లో కక్ష్య దూరం పెంపు... 
ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 39,059.6 కిలోమీటర్ల నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌ను చంద్రుడి వైపు మళ్లిస్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రోబర్న్‌ చేసి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు అపరేషన్‌ చేపడతారు. 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి ఉపరితలంపైన దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి రోవర్‌ చంద్రుడి ఉపరితలంపైకి రావడానికి సుమారు 4 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఇది సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రరోజు).. అంటే 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇదంతా జరగడానికి 52 రోజులు పడుతుంది. ఇలా 3.50 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్‌ 6న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి మీదకు చేరుకుని పరిశోధనలకు శ్రీకారం చుడుతుంది. 

తిరుమలలో ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు... 
తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె. శివన్‌ శనివారం దర్శించుకున్నారు. చంద్రయాన్‌–2 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement