టిక్‌:టిక్‌:టిక్‌ | Chandrayaan 2 Launching From Sriharikota | Sakshi
Sakshi News home page

టిక్‌:టిక్‌:టిక్‌

Published Sun, Jul 14 2019 1:28 AM | Last Updated on Sun, Jul 14 2019 10:15 AM

Chandrayaan 2 Launching From Sriharikota - Sakshi

జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించేందుకు ఇక కేవలం కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 ద్వారా చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్న చందంగా ఈ ప్రయోగం ద్వారా ఇస్రో బహుళ ప్రయోజనాలను సాధించనుంది. ఈ ప్రయోగం భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం...
ఇస్రో ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలన్నింటికంటే చంద్రయాన్‌–2 చాలా సంక్లిష్టమైంది. జాబిల్లి చుట్టూ తిరిగే ఆర్బిటర్‌.. ఉపగ్రహంపై దిగే ల్యాండర్లు రెండింటినీ జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా పంపనున్నారు. ల్యాండర్‌ జాబిల్లిపైకి సురక్షితంగా దిగాక అందులోంచి రోవర్‌ బయటకు వచ్చి ఉపరితలంపై దాదాపు అర కిలోమీటర్‌ దూరం ప్రయాణిస్తుంది. అత్యంత శీతల (–157 డిగ్రీ సెల్సియస్‌) పరిస్థితుల్లో ఈ యంత్రాన్ని పనిచేయించడం ఒక సవాలే. జీఎస్‌ఎల్వీ రాకెట్‌ ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడితే 50 రోజుల ప్రయాణం తరువాత అది జాబిల్లిపైకి చేరుతుంది. జాబిల్లికి సుమారు 150 కి.మీ. దూరంలో ఉన్న దశలో ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ వేరుపడుతుంది. నాలుగు రోజులపాటు చక్కర్లు కొడుతూ నెమ్మదిగా వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. దశలవారీగా వేగాన్ని 30 కిలోమీటర్లకు తగ్గించుకొని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. చందమామ ఉపరితలంపైకి ల్యాండర్‌ దిగిన నాలుగు గంటల తరువాత అందులోంచి రోవర్‌ బయటపడుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో ల్యాండర్‌ నుంచి వేరుపడి ఆ తరువాత 14 రోజుల్లో సుమారు 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ల్యాండర్‌పై మన జాతీయ పతాకం ముద్రితమై ఉంటుంది. రోవర్‌కు ఉన్న ఆరు చక్రాలపై అశోకచక్రను ముద్రించారు. చంద్రయాన్‌–2 మొత్తం ఖర్చు రూ. 978 కోట్లుకాగా అందులో రూ. 603 కోట్లు ల్యాండర్, ఆర్బిటర్ల నిర్మాణానికి, నేవిగేషన్, భూమ్మీది నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఖర్చు పెట్టారు. మిగిలిన రూ. 375 కోట్లను జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 నిర్మాణం, క్రయోజెనిక్‌ ఇంజిన్, ఇంధనాల కోసం ఉపయోగించారు.

ఇవీ లక్ష్యాలు... 
చంద్రయాన్‌–2 ప్రధాన లక్ష్యం ఇప్పటివరకూ ఏ దేశమూ ప్రవేశించని ప్రాంతాల్లో ప్రయోగాలు చేయడం. తద్వారా ఎప్పుడూ చీకటిలోనే ఉండే దక్షిణ ధ్రువ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు ఏమైనా ఉందా? అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు స్వచ్ఛమైన ఇంధనం హీలియం–3 ఛాయలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. జాబిల్లిపై ఉన్న హీలియం–3ని సమర్థంగా వాడుకోగలిగితే భూమి మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను ఏకంగా 250 ఏళ్లపాటు తయారు చేసుకోవచ్చనని అంచనా.  

వినువీధిలో భారత పతాక మరోసారి రెపరెపలాడేందుకు రంగం సిద్ధమైంది. జాబిల్లిపై నీటి జాడలను నిర్ధారించిన చంద్రయాన్‌–1కు కొనసాగింపుగా మరోసారి చందమామపై కాలుమోపేందుకు చంద్రయాన్‌–2 సిద్ధమైంది. మునుపెన్నడూ.. ఎవ్వరూ చేయని రీతిలో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో... ఓ ల్యాండర్‌ను దింపడం.. రోవర్‌ను నడపడం, జాబిల్లి చుట్టూ ఉపగ్రహాన్ని తిప్పడమన్న లక్ష్యాలతో నింగికి ఎగరనున్న చంద్రయాన్‌–2 అవసరమేమిటి? ప్రయోగాలు ఏం తేల్చనున్నాయి?

ఇస్రో శాస్త్రవేత్తలకు కలాం ఇచ్చిన సలహా... 
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాం ఇస్రో శాస్త్రవేత్తలకు ఇచ్చిన సలహా ఈనాటి చంద్రయాన్‌–2గా పరిణమించిందంటే ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ స్వావలంబన సాధించాలని, అందుకుతగ్గ సామర్థ్యం మనకు ఉందని బలంగా నమ్మి, ప్రోత్సహించిన వ్యక్తుల్లో కలామ్‌ ఒకరన్నది తెలిసిందే. 2003లో జాబిల్లిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో ఆలోచిస్తోందన్న వార్తలు వస్తున్న తరుణంలో తనను కలిసిన ఇస్రో శాస్త్రవేత్తలతో కలాం మాట్లాడుతూ చంద్రయాన్‌ ప్రాజెక్టు ద్వారా జాబిల్లిని చేరితే ఆ విజయం దేశ యువత, పిల్లల్లోనూ స్ఫూర్తి నింపుతుందని సూచించారు. అంతేకాకుండా 2009లోనూ జాబిల్లిపైనే ఎందుకు ప్రయోగాలు చేయాలో చెబుతూ భవిష్యత్తులో భూమికి, అంగారకుడికి మధ్య వారధిగా జాబిల్లి ఉపయోగపడుతుందని చెప్పారు. జాబిల్లి చుట్టూ 100 కి.మీ. దూరంలో చంద్రయాన్‌–1 తిరుగుతూ సమాచారం సేకరిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు కలాంకు వివరించినప్పుడు అంతదూరం వెళ్లిన అంతరిక్ష నౌకను జాబిల్లిపైకి దింపవచ్చు కదా అని సూచించారట. ఈ సూచన ఫలితంగానే చంద్రయాన్‌–1లో మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ (ఎంఐపీ) రూపకల్పన జరిగిందని, జాబిల్లిపై దిగిన ఈ పరికరం అక్కడ నీరు ఉన్న విషయాన్ని నిర్ధారించిందని చంద్రయాన్‌–1 ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం. అన్నాదురై తెలిపారు. భవిష్యత్తులో జాబిల్లి అంతరిక్ష పారిశ్రామిక కేంద్రంగా మారే అవకాశముందని 2009లోనే కలాం అంచనా కట్టారు. కేంద్రక సంలీన చర్య ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమైన రోజున హీలియంకు డిమాండ్‌ పెరుగుతుందని, దీనిద్వారా తయారు చేసే విద్యుత్‌తో భూమ్మీద వాహనాలు నడుస్తాయని, జాబిల్లిపై మానవ ఆవాసాలకూ ఉపయోగపడుతుందని కలాం అప్పట్లో వివరించినట్లు అన్నాదురై వివరించారు. 

ట్విట్టరాటీ జాబితాలో అగ్రస్థానంలో జాతీయ పతాకం 
‘‘చంద్రయాన్‌–2 ద్వారా జాబిల్లిపైకి ఏం తీసుకెళితే బాగుంటుంది?’’ఇటీవల ట్విట్టర్‌ ప్రపంచానికి ఇస్రో వేసిన ప్రశ్న ఇది. ఇందుకు భారీగా స్పందించిన నెటిజన్లు... జాతీయ పతాకాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతోపాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. గౌతమ్‌ సింగ్‌ అనే వ్యక్తి.. ఇండియా మ్యాప్‌ను తీసుకెళ్లాలని, భవిష్యత్తులో గ్రహాంతర వాసులెవరైనా జాబిల్లిని సందర్శిస్తే.. ఈ మ్యాప్‌ చూసి మనం ఎవరో తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. జాతీయ పతాకం వారికి ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. ఇంకొందరు మన దేశం మట్టిని అక్కడికి తీసుకెళ్లాలని సూచించగా.. కొంతమంది ఈ ఆలోచనకు మద్దతుగా నిలిచారు. ఇంకొందరు మాత్రం ఆ గ్రహాన్ని కలుషితం చేయడం సరికాదని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement