చంద్రుడి గుట్టు విప్పేందుకే..! | Chandrayaan 2 launches successfully | Sakshi
Sakshi News home page

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

Published Tue, Jul 23 2019 6:02 AM | Last Updated on Tue, Jul 23 2019 6:02 AM

Chandrayaan 2 launches successfully - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): చంద్రుడు ఎలా ఉద్భవించాడు? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలు ఏంటి? భూమి ఏర్పడిన తొలినాళ్లలో చంద్రుడిలాగే ఉండేదా? అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే ఇస్రో చంద్రయాన్‌–2ను ప్రయోగించింది. చంద్రుడిని అధ్యయనం చేయడం వల్ల తొలినాళ్లలో భూవాతావరణం ఎలా ఉండేదన్న విషయాన్ని అర్థం చేసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్‌2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పదేళ్లపాటు కష్టపడ్డారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌3 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్‌–2 కాంపోజిట్‌ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్‌ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది. ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేలా పంపిస్తాయి. ఇందులో ల్యాండర్‌ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్‌ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు.

ల్యాండర్‌ ‘విక్రమ్‌’అత్యంత కీలకం..
చంద్రయాన్‌2 మిషన్‌లోని ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’గా నామకరణం చేశారు. 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఇలా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు బాల్స్‌ ద్వారా రోవర్లు పంపారు. అయితే భారత్‌ మాత్రం నేరుగా ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తోంది. ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో కీలకమైనవి. ల్యాండర్‌ ‘విక్రమ్‌’చంద్రుడివైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ సంక్లిష్టమైంది. ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ప్రయోగం సక్సెస్‌ అయినట్లే. ఈ ల్యాండర్‌లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్‌ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్‌ ఎక్స్‌ఫర్‌మెంట్‌’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్‌ ముయిర్‌ ప్రోబ్‌’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీయాస్మిక్‌ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్‌–2లో ప్రయోగించారు.

ప్రజ్ఞాన్‌ ‘రోవర్‌’తో త్రీడీ చిత్రాలు
ఓసారి ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాక అందులోని రోవర్‌ విడిపోతుంది. దీనికి ‘ప్రజ్ఞాన్‌’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుంటే ప్రజ్ఞాన్‌ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్‌కు ఒక సెంటీమీటర్‌ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్‌ ఈ  డేటాను ఆర్బిటర్‌కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. ఈ రోవర్‌కు ముందుభాగంలో మెగా పిక్సెల్‌ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్‌ నావ్‌ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్‌ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్‌లో 2 పేలోడ్స్‌ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లాజర్‌ ఇన్‌డ్యూసెడ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్‌ రెట్రోరెఫ్లెక్టర్‌ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది.

ఆర్బిటర్‌లో అయిదు పేలోడ్స్‌
ఆర్బిటర్‌ బరువు 2,379 కిలోలు. దీంట్లో 5 పేలోడ్స్‌ వున్నాయి. ‘లార్ట్‌ ఏరియా సాఫ్ట్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’అనే ఉపకరణం చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాల మ్యాపింగ్‌ చేపడుతుంది. ‘ఎల్‌ అండ్‌ ఎస్‌ బ్యాండ్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌’చంద్రునిపై నీరు, మంచు జాడను అన్వేషిస్తుంది. ఇక ‘ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రో మీటర్‌’ ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తుంది. ‘టెరియన్‌ మ్యాపింగ్‌ కెమెరా’ ఖనిజాల అధ్యయనం, త్రీడీ మ్యాపింగ్‌లో సాయపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement