Shar
-
ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు ఎలక్ట్రికల్ పరీక్షలు పూర్తి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సంబంధించి ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు శుక్రవారం ఎలక్ట్రికల్ పరీక్షలను పూర్తిచేశారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రోజూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత ప్రయోగాన్ని నిర్వహిస్తారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ నెల 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని షార్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు శుక్రవారం నుంచే https://lvg. shar.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష సర్టిఫికెట్ కూడా ఉండాలని పేర్కొన్నారు. -
14న చంద్రయాన్–3 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి. స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారనే వాదన కూడా ఉంది. 2019లో చంద్రయాన్–2ను కూడా జులై 15న ప్రయోగించారు. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 4 దశల్లో ప్రయోగిస్తే అదే జీఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం 3 దశల్లోనే ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ కంటే జీఎస్ఎల్వీ–మార్క్–2 రాకెట్ కొంచెం బరువు ఎక్కువ, 2 వేల కిలోలు బరువున్న ఉపగ్రహాలు తీసుకెళుతుంది. అదే ఎల్వీఎం మార్క్–3 అత్యంత శక్తివంతమై రాకెట్. ప్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం రూపొందించి ఏరియన్–5 రాకెట్ తరహాలో వుంటుంది. మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఈ రాకెట్‌కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్ బూస్టర్లు వుంటాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. 110 టన్నుల ద్రవ ఇం««ధనంతో (ఎల్–110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈనెల 14న ప్రయోగమని తెలిపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ప్రయోగసమయంలో 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–3 ఉçపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్ పరిశ్రమల సహకారం తీసుకున్నారు. -
28న జీఎస్ఎల్వీ–ఎఫ్12 కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్12) ప్రయోగించేందుకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తారు. అయితే శనివారం ఎంఆర్ఆర్ సమావేశం, లాబ్ సమావేశం అనంతరం కౌంట్‌డౌన్ సమయం, ప్రయోగ సమయం అధికారికంగా ప్రకటించనున్నారు. శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరోమారు ల్యాబ్ సమావేశం నిర్వహించారు. జీఎస్ఎల్వీ ఎప్12 రాకెట్‌కు సంబంధించి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం 10.42 గంటలకు 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపుకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా వుంది. కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి మిసైల్‌మ్యాన్ ఏపీజే అబ్దుల్‌కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ పిలుపునిచ్చారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాలులో దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన ఈ ఏడాది పదో తరగతిలోకి వెళ్లనున్న విద్యార్థులు 56 మందిని ఎంపిక చేసి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువికా–2023 కార్యక్రమానికి ఆహ్వానించి తీసుకొచ్చారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్‌తో వర్చువల్ పద్ధతిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సుమా రు గంటకు పైగా సమాధానాలు ఇచ్చి వారిని ఉత్తేజ పరిచారు. అనంతరం చైర్మన్ ఎస్.సోమనాథ్ మా ట్లాడుతూ ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైన వారని, వారిలో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు. నేటి తరం విద్యార్థులు స్పేస్ టెక్నాలజీ వైపు రాకుండా ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతు న్న నేపథ్యంలో వారిని స్పేస్ సైన్స్ వైపు మళ్లించేందుకు యువ విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనే వి మేథమేటిక్స్‌తో ఎక్కువగా ముడిపడి ఉంటా యని అన్నారు. అందుకే మేథమేటిక్స్‌లో మంచి ప్రావీ ణ్యం ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలుగా రావడానికి ఎంతో వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, షార్ కంట్రోలర్ శ్రీని వాసులురెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్.వెంకట్రా మన్, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
పీఎస్ఎల్వీ– సీ53 ప్రయోగానికి ‘షార్’ సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్ (అకా ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
Chandrayaan-2: జాబిల్లిని ముద్దాడి రెండేళ్లు
సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్–2లో భాగంగా మొదట ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది. సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చివరి రెండు నిమిషాల్లో ఆందోళన నెలకొంది. ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చేస్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడిపై తేమ ఉనికి.. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో సోమవారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడుతూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకరణాలు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణువులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోందన్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటికప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు. ఆర్బిటర్‌తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాలను మ్యాపింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రుడిపై ఖనిజాల అధ్యయనానికి అవసరమైన త్రీడీ మ్యాప్‌లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. కొనసాగింపుగా చంద్రయాన్–2 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసేలా రూపొందించగా సాంకేతిక లోపంతో పది నెలలు మాత్రమే పనిచేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమయ్యింది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(జీఎస్ఎల్వీ ఎఫ్–10) ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్‌ను ప్రయోగించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం విఫలమయ్యింది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఉపయోగించాల్సి వుంది. ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు. ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపించేవిధంగా రూపొందించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. -
ఏప్రిల్ 18న నింగిలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐశాట్–1) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ శాటిలైట్ ప్రయోగాన్ని ఆదివారం (28వ తేదీ) నిర్వహించాల్సి ఉంది. అయితే మరోమారు వాయిదా వేసుకుని, ఏప్రిల్ 18న నిర్వహిస్తామని బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించారు. ఉపగ్రహంలో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. అనేక సార్లు వాయిదా.. షార్ ప్రణాళిక ప్రకారం ఈ ఉపగ్రహ ప్రయోగం 2020 జనవరి 15న నిర్వహించాల్సి ఉండగా, సాంకేతిక పరమైన కారణాలతో 2020 ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. సాంకేతిక లోపాలను సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 25కు, తర్వాత మార్చి 5కు ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. 2020 మార్చి 5న కౌంట్‌డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించిన తరువాత ప్రయోగాన్ని నిలిపివేసి, వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా సుదీర్ఘకాలం వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాదిలో రెండో ప్రయోగంగా దీనిని చేపట్టగా మళ్లీ వాయిదా పడటం విశేషం. ఇస్రో చరిత్రలో ఇదో నూతన అధ్యాయం జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా 2,100 కిలోల బరువు కలిగిన సరికొత్త రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) ‘జీఐశాట్–1’ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. మొట్ట మొదటిసారిగా జీఐశాట్–1ను భూస్థిర కక్ష్యలోకి పంపిస్తుండటం విశేషం. -
అర్ధసెంచరీకి అడుగు దూరంలో..
సాక్షి, సూళ్లూరుపేట: షార్ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌దే అగ్రతాంబూలం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్ఎల్వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్ 20న తొలిసారిగా పీఎస్ఎల్వీ డీ–1, 2017 ఆగస్ట్ 31న ప్రయోగించింది. 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ బహుళ ప్రయోజనకారిగా మారి ఇస్రో చరిత్ర, గతినే మార్చేసింది. పీఎస్ఎల్వీ రాకెట్ ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రంలా తయారైంది. బుధవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్‌తో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోనుంది. ఇస్రోకు దేశీయంగానే కాకుండా వాణిజ్యపరమైన ప్రయోగాల్లోనూ అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా దోహదపడుతోంది. దేశీయంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో పాటు అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్తూ ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 49 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 310 విదేశీ ఉపగ్రహాలు, 46 స్వదేశీ ఉపగ్రహాలు, దేశంలోని పలు యూనివర్సిటీలకు 10 స్టూడెంట్ ఉపగ్రహాలను పంపించి ఇస్రో ప్రగతికి బాటలు వేస్తోంది. కంటికి రెప్పలా.. దేశీయ అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూమిని అన్ని రకాలుగా పరిశోధన చేసే రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను (రిశాట్) ప్రయోగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి కంటికిరెప్పలా కాపాడుతోంది. సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతోంది. ఇప్పటివరకు రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు మూడోసారి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 48 రాకెట్ ద్వారా రిశాట్ – 2బీఆర్1 అనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 2012 ఏప్రిల్ 20 పీఎస్ఎల్వీ సీ – 19 రాకెట్ ద్వారా రిశాట్ – 2 అనే ఉపగ్రహాన్ని పంపించారు. దీని కాలపరిమితి పూర్తవడంతో ఈ ఏడాది మే 22న పీఎస్ఎల్వీ సీ 4–6 రాకెట్ ద్వారా రిశాట్ – 3బీ అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్ భూమ్మీద 20 గీ 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఛాయా చిత్రాలు తీసేవి. సీ – 48లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎక్స్‌బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ భూమ్మీద జరిగే మార్పులను 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే చిన్నవాటినైనా సరే అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది. దేశ సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగువిస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది. భవిష్యత్తులో రి«శాట్ ఉపగ్రహాలను పెంచుకునే దిశగా ఇస్రో అడుగులేస్తోంది. -
రేపు సా.3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం
-
నేడు పీఎస్ఎల్వీ సీ–48కి కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48కు మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉ.9.30 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను సోమవారం ఉ.6 గంటలకు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కౌంట్‌డౌన్ సమయంలో మార్పుచేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం సాయంత్రం ‘షార్’కు విచ్చేయనున్నారు. ముందుగా ఆయన తిరుమల, శ్రీకాళహస్తిలలో దర్శనాలు చేసుకున్న అనంతరం చెంగాళమ్మ ఆలయం వద్ద పూజలు చేయడానికి వస్తారని షార్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం ప్రయోగించబోయే పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగంతో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోనుంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయగా వీటిలో రెండు మాత్రమే విఫలమయ్యాయి. -
ఇస్రో విజయ విహారం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి జయ కేతనం ఎగురవేసింది. విజయాల పరంపరను కొనసాగిస్తూ షార్ నుంచి 74వ ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా ముగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ద్వారా 1625 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–3 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 14 ఉపగ్రహాలను భూమికి 509 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సర్క్యులర్ సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో వివిధ దశల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ విజయంతో ఈ ఏడాది అయిదు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లయింది. ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బృందాన్ని ఆలింగనం చేసుకోగా, శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. వచ్చే మార్చిలోపే 13 మిషన్ల ప్రయోగం 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. రాబోయే నాలుగు నెలలు ఇస్రో కుటుంబం తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు సక్సెస్ అయ్యింది. పీఎస్ ఎల్వీ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 21 ప్రయోగమిది. ఈ ఏడాది 5వ ప్రయోగం కావడం విశేషం. కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఈ ప్రయోగం తొమ్మిదవది. మనదేశ ఖ్యాతి మరింత పైకి: జగన్ సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భూతల మ్యాపింగ్, ఛాయాచిత్రాలను మరింత అత్యాధునికంగా తీసి సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచంలోనే మన దేశ ఖ్యాతిని శాస్త్రవేత్తలు అగ్రభాగాన నిలిపారని జగన్ ప్రశంసించారు. ఈ ప్రయోగాలను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో మరో మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కేసీఆర్ అభినందనలు.. సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యం, కృషికి ప్రస్తుత విజయం తార్కాణంగా నిలుస్తుందన్నారు. దేశీయ అవసరాలకే కార్టోశాట్–3 దేశీయ బౌగోళిక అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. కార్టోశాట్ సిరీస్‌లో ఇప్పటికే ఎనిమిది ఉపగ్రహాలను పంపించగా, ఇది తొమ్మిదవది. కార్టోశాట్–3 థర్డ్ జనరేషన్ ఉపగ్రహం కావడం విశేషం. గతంలో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ప్రాంకోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రరల్ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి. దీనిద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయడం, విపత్తులను విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకించి నిఘాలో సైనిక అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతోంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
చంద్రుడి గుట్టు విప్పేందుకే..!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): చంద్రుడు ఎలా ఉద్భవించాడు? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలు ఏంటి? భూమి ఏర్పడిన తొలినాళ్లలో చంద్రుడిలాగే ఉండేదా? అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే ఇస్రో చంద్రయాన్–2ను ప్రయోగించింది. చంద్రుడిని అధ్యయనం చేయడం వల్ల తొలినాళ్లలో భూవాతావరణం ఎలా ఉండేదన్న విషయాన్ని అర్థం చేసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పదేళ్లపాటు కష్టపడ్డారు. జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్–2 కాంపోజిట్ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది. ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేలా పంపిస్తాయి. ఇందులో ల్యాండర్ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు. ల్యాండర్ ‘విక్రమ్’అత్యంత కీలకం.. చంద్రయాన్2 మిషన్‌లోని ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు ‘విక్రమ్’గా నామకరణం చేశారు. 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఇలా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు బాల్స్ ద్వారా రోవర్లు పంపారు. అయితే భారత్ మాత్రం నేరుగా ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో కీలకమైనవి. ల్యాండర్ ‘విక్రమ్’చంద్రుడివైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ సంక్లిష్టమైంది. ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ప్రయోగం సక్సెస్ అయినట్లే. ఈ ల్యాండర్లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్‌ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్ ఎక్స్ఫర్మెంట్’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్ ముయిర్ ప్రోబ్’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్–2లో ప్రయోగించారు. ప్రజ్ఞాన్ ‘రోవర్’తో త్రీడీ చిత్రాలు ఓసారి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాక అందులోని రోవర్ విడిపోతుంది. దీనికి ‘ప్రజ్ఞాన్’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుంటే ప్రజ్ఞాన్ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్‌కు ఒక సెంటీమీటర్ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్ ఈ డేటాను ఆర్బిటర్‌కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. ఈ రోవర్‌కు ముందుభాగంలో మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్ నావ్ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లాజర్ ఇన్డ్యూసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది. ఆర్బిటర్‌లో అయిదు పేలోడ్స్ ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీంట్లో 5 పేలోడ్స్ వున్నాయి. ‘లార్ట్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’అనే ఉపకరణం చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాల మ్యాపింగ్ చేపడుతుంది. ‘ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్’చంద్రునిపై నీరు, మంచు జాడను అన్వేషిస్తుంది. ఇక ‘ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్’ ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తుంది. ‘టెరియన్ మ్యాపింగ్ కెమెరా’ ఖనిజాల అధ్యయనం, త్రీడీ మ్యాపింగ్‌లో సాయపడనుంది. -
భారత సంకల్పానికి నిదర్శనం
న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్‌పై చంద్రయాన్–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్ కె.శివన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్ కానుంది’ అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలకు పార్లమెంట్ అభినందనలు చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్–2పై కాంగ్రెస్ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో చంద్రయాన్–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు. -
చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెలలో సగం రోజులు చీకటిలో ఉండి, మరో సగం రోజులు చల్లని వెన్నెల కురిపించే నెల రాజు గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రుని చుట్టు కొలత 10,921 కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. నానాటికీ చంద్రుని పరిమాణం కూడా తగ్గిపోతోందనే విషయం కూడా వారి పరిశోధనల్లోనే వెల్లడైంది. అదే విధంగానే చంద్రుడు భూమికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఏడాదికి సుమారు 15 అంగుళాల చొప్పున చంద్రుడు దూరంగా వెళుతున్నాడని కూడా నాసా వెల్లడించింది. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు చాలా వరకు ఇప్పటికి 125 ప్రయోగాలు చంద్రుడిపైకి చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 1969లో అపోలో రాకెట్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికాదే. ఈ ప్రయోగం జరిగి కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. రష్యా 1958 నుంచి చంద్రునిపైకి 53 ప్రయోగాలు చేసింది. అందులో 35 మాత్రమే విజయం అయ్యాయి. 1990 నుంచి జపాన్ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. ఇజ్రాయెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్‌ను çపంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. 2008లో భారత్ చంద్రుడి మీదకు చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటర్ ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్, భారత్ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినప్పటికీ అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలే ఇప్పటికీ ముందంజలో ఉన్నాయి. తాజాగా, భారత్ రెండో సారి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, రోవర్‌ను ల్యాండర్ ద్వారా పంపి దాన్ని చంద్రుడిపైకి దించడం మాత్రం చేస్తున్నది భారత్ మాత్రమేనని చెప్పుకోవచ్చు. చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన వారు పెద్ద పెద్ద బాల్స్ వంటి వాటిలో రోవర్లను అమర్చి పంపారు. భారత్ మాత్రం ల్యాండర్‌ను చందమామపై దించే మొట్టమొదటి దేశంగా ఖ్యాతి సాధిస్తోంది. -
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే
శ్రీహరికోట: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచినా మేం మళ్లీ పుంజుకున్నాం. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించగానే మా బృందం రంగంలోకి దిగింది. అప్పట్నుంచి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి చంద్రయాన్–2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశాం. జీఎస్ఎల్వీ మార్క్–3 చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడం ఎంతో సంతోషంగా ఉంది. మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్–2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. కేవలం భారత్ ఒక్కటే కాదు. ప్రపంచమంతా చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావాలని ఎదురుచూసింది. మేం దాన్ని సాధించాం. చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
అందరి చూపూ ఇక సెప్టెంబర్ 7 వైపు!
హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది? చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే! భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్–2 మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్ వేరుపడుతుంది. జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్ లోపలి నుంచి రోవర్ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్ 54వ రోజు జరగాల్సి ఉండింది. కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిప్పులు చిమ్ముతూ...
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్.. చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్ఎల్వీ–మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు. ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్–2 మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్‌లోని మూడో దశ క్రయోజనిక్‌లో పోగో గ్యాస్ బాటిల్స్ నుంచి క్రయోఇంజిన్ ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు. 48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది. టెన్షన్.. టెన్షన్ చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్లో అమర్చిన రోవర్ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్‌లోని మీడియా సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్లోని మైక్‌లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది. మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం ఇలా జరిగింది.. మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్–2 మిషన్‌లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27కేజీల బరువైన రోవర్ (ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్–110 అంటే ద్రవ ఇంజిన్ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్‌షీల్డ్స్ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–ఒన్ చంద్రయాన్–2 మిషన్‌ను క్రయోజనిక్ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. రాకెట్ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్‌ను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్లోనే పూర్తి చేస్తారు. చంద్రుడిపైకి ఇలా... ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు. ఆ 15 నిమిషాలు... చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. 14 రోజుల్లో 500 మీటర్లు రోవర్ సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుం ది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ కథ ఇదీ.. అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది. 1969 జూలై 16న నాసా కేప్ కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్–5 రాకెట్ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ అల్డ్రిన్ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్ మాడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు. ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్1 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రయాన్–1తో పరిశోధనలిలా.. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్–1 ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు. అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్–1 మిషన్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్–2 మిషన్‌ను ప్రయోగించారు. ఇస్రోకు నాసా అభినందనలు చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్లో నాసా పేర్కొంది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు. – ట్విట్టర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు. – ట్విట్టర్ ఆడియో సందేశంలో మోదీ గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది. – డాక్టర్ కె.శివన్, ఇస్రో చైర్మన్ -
జాబిలమ్మ మీదకు చంద్రయాన్–2
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. సాక్షి, సూళ్లూరుపేట (శ్రీహరికోట): జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా ‘త్రీ–ఇన్–వన్‌గా చెప్పకునే ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) కాంపోజిట్ ఎర్త్‌స్టాక్ (పీఈఎస్)ను జాబిల్లి మీదకు పంపించే సమయం ఆసన్నమైంది. జీఎస్ఎల్వీ మార్క్3, ఎం1 రాకెట్ 16.22 నిమిషాల తరువాత భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 38,000 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 38,000 కిలోమీటర్లు నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మం డించి నాలుగుసార్లు కక్ష్యదూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్ లూ నార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయాణం చేసేందుకు మళ్లి స్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూరా రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కిలోమీటర్లు నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను చేపడతారు. అయితే ఈ 15 నిమిషాలనే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లో ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రుడిపై దించే ప్రక్రియను నూతనంగా రూపొందించారు. చంద్రయాన్–1కి చంద్రయాన్–2కు మధ్య 15 నిమిషాల వ్యవధి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళనగా ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనుంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత రోవర్ లోపల ఉండే తలుపు తెరుచుకునే విధంగా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది. రోవర్ సెకెన్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు. చంద్రయాన్–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
మూన్‌పై మన మార్క్
-
ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు..!
రేదొరా నిను చేరగా..! అంతరిక్షంలో.. ఎన్నో వింతలు..విశేషాలు..మరెన్నో అద్భుతాలు..వాటిని శోధించేందుకు అగ్రదేశాల పోటీ. వాటికి దీటుగా భారత్ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసింది. ఇస్రోను ప్రధాన ఆయుధంగా మలుచుకుని వినువీధిలో ఎదురులేని శక్తిగా నిలిచింది. 1970లో రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత అమెరికా,చైనా దేశాలు చంద్రునిపై ప్రయోగాలు చేశాయి. 2008లో జిల్లాలోని షార్ వేదికగా చంద్రయాన్–1ను ఇస్రో విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన తర్వాతే నీటిజాడలు వెలుగుచూశాయి. ఆ తర్వాత మంగళ్యాన్––1ను అంగారకుడి కక్ష్యలోకి పంపింది. నేడు చంద్రయాన్–2తో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ శోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దీనికి వేదికవుతోంది షార్. భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసే ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా శ్రీహరికోట వైపు చూస్తున్నాయి. – సూళ్లూరుపేట సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు భవిష్యత్ అంతా భారీ ప్రయోగాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించేందుకు 2000 సంవత్సరం నుంచి కృషి చేసి పరిపక్వతను సాధించగలిగారు. తొలుతగా 2014 డిసెంబర్ 23 జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో ఎస్–200, ఎల్–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. అందులో సీ–25 లేకుండా క్రూ మాడ్యూల్‌ను పంపించి మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టి విజయవంతం చేశారు. ఆ తర్వాత 2017 జూన్ 5న జీఎస్ఎల్వీ–మార్క్3డీ1 ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచార ఉపగ్రహాన్ని, నవంబర్ 14న మార్క్ 3డీ2 ద్వారా 3,700 కిలోల బరువు కలిగిన జీశాట్–29 అనే సమాచార ఉపగ్రహాన్ని సునాయాసంగా ప్రయోగించారు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగాలు విజయాలు సాధించాయంటే అది 19 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితమని చెప్పొచ్చు. కీలక దశల్లో స్ట్రాపాన్ బూస్టర్ల తయారీలో పరిణితి ఇందులో కీలకంగా మారిన మొదటి దశ 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ల అవసరాన్ని గుర్తించారు. మామూలుగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లలో మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. M మార్క్–3 రాకెట్లో అయితే 400 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు బూస్టర్లు అవసరం కావడంతో వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2000 నుంచి 2010 వరకు దీనికి ఏమి అవసరముంటుందో గుర్తించి 2010 జనవరి 24న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో ఉపయోగించే 110 టన్నుల ద్రవ ఇంధనం నింపిన మోటార్లు (ఎల్–110) వాడతారు. మామూలు ప్రయోగాల్లో అయితే 40 టన్నులకు మించి వాడరు. ఇక్కడేమో ఉపగ్రహం బరువును బట్టి రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు. ఎల్–110ను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్లో తయారు చేసి 2010 మార్చి 5న భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఇక మూడో దశలో అత్యంత శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజిన్లను వినియోగిస్తారు. దీన్ని ఇస్రో పరిభాషలో సీ–25గా పిలుస్తారు. మామూలుగా జీఎస్ఎల్వీలో 12.5 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తే అదే మార్క్–3కు వచ్చే సరికి రెట్టింపు క్రయో ఇంధనం అంటే 25 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తారు. 12.5 టన్నుల బరువు కలిగిన క్రయోజనిక్ దశను రూపొందించేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రమైన కృషి చేశారు. 25 టన్నుల క్రయో దశను రూపొందించేందుకు రెండేళ్ల వ్యవధిని తీసుకున్నారు. సీ–25లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాప్తి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇస్రోకు బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ప్రస్తుతం సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్‌ను ముచ్చటగా మూడో సారి రోదసీలోకి తీసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్ 3–ఎం1 రాకెట్ ద్వారానే నిర్వహించనున్నారు. గగన్‌యాన్ లక్ష్యంగా ... సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2022 నాటికి మానవ సహిత ప్రయోగాలే (గగన్‌యాన్) లక్ష్యంగా 2014, 2016, 2018 సంవత్సరాల్లో మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి ముందంజల్లో నిలిచింది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గగన్‌యాన్ తరహా ప్రయోగాలను నిర్వహించేందుకు 2014 డిసెంబర్ 18నే బీజం పడింది. భవిష్యత్‌లో గగన్‌యాన్ ప్రయోగాలు చేసేందుకు ముందుస్తుగానే జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ రాకెట్‌ను, ఆర్ఎల్వీ టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ వంటి మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు మంచి జోష్ మీదున్నారు. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయమే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలో మీటర్లు ఎత్తుకెళ్లిన తర్వాత శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువు కలిగిన హైపర్ సోనిక్ పైలట్‌ను విడుదల చేసింది. ఆ పైలట్ 65 కిలో మీటర్లు ఎత్తుకెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు రన్‌వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా హైపర్ సోనిక్ పైలట్‌ను శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలో మీటర్లు దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దీనికి ఇండియన్ కోస్టల్ గారŠుడ్స, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమేట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసీలో వదిలి పెట్టి మళ్లీ క్షేమంగా తీసుకురావడానికి ఉపయోగపడే రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. గగన్‌యాన్ ప్రయోగం కోసమే పాడ్ అబార్ట్ టెస్ట్ మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగానే నిర్వహించారు. ‘ ప్యాడ్ అబార్ట్æ టెస్ట్’ ప్రయోగాన్ని 259 సెకండ్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలో మీటర్లు మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి ప్యారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు వేచి ఉండి వాటిని రికవరీ చేశారు. అయితే ఈ ప్రయోగంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకున్నప్పటికీ విజయవంతగానే నిర్వహించారు. క్రూ మాడ్యూల్‌ను సముద్రంలో దించే సమయంలో సుమారు 10 నిమిషాల ముందే వదిలేయడంతో మాడ్యూల్ కిందభాగం కొద్దిగా దెబ్బతింది. అయితే వ్యోమగాములే ఉంటే దీని వల్ల ఇబ్బందేమీ ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. మానవ సహిత ప్రయోగాల్లో ప్రమాదాల నివారణకే ప్రయోగాలు 2003లో యూఎస్ఏకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ వ్యోమగాములను విజయవంతంగా రోదసీలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి భూమికి చేరుకునే సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది. ఇందులో ఆమెరికా వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొన్ని పరీక్షలు చేసుకుంటున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను భూ సమీప కక్ష్యలోకి పంపించి వారిని సురక్షితంగా ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఆ సమయంలో రాకెట్ ఎలా పని చేస్తుంది. వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాన్ని నిర్వహించి వాటి వివరాలను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. భవిష్యత్‌లో వ్యోమగాములను రోదసీలోకి పంపి మళ్లీ తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ మాడ్యూల్, ఆర్ఎల్వీ–టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ అనే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలతో సాంకేతిక పరంగా పట్టు సాధించారు. ఈ మూడు ప్రయోగాలకు సుమారు రూ.170 కోట్ల దాకా వ్యయం చేశారని తెలుస్తోంది. అయితే మానవ సహిత ప్రయోగాలను నిర్వహించేందుకు మరో రెండు మానవ రహితంగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్న తర్వాత గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇస్రో ఇటీవల కాలంలో చేసే ప్రతి ప్రయోగాత్మక ప్రయోగం మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అవుతుండడంతో యావత్ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. 2000లో మార్క్–3కి బీజం సుమారు 3 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన కమ్యూనికేషన్ శాటిలైట్స్‌తో పాటు, మానవుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు, చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల నిమిత్తం చంద్రయాన్–2 వంటి మిషన్ పంపేందుకు మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌక అవసరమని 2000లో గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 2003లో దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో రూ. 3 వేల కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా షార్‌లోనే రూ.700 కోట్లతో ఈ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. షార్కు దేశ ప్రథమ పౌరుడు రాక సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు అత్యంత కీలక కేంద్రమైన సతీష్ ధవన్‌స్పేస్ (షార్) సెంటర్‌కు దేశ ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్ రానున్నారు. షార్‌ను ఇప్పటికి మగ్గురు రాష్ట్రపతులు సందర్శించగా ప్రస్తుతం నాల్గో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఈ నెల 14న షార్‌ను సందర్శించనున్నారు. అయితే షార్‌ను సందర్శించిన భారత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ఇస్రో శ్రీహరికోట నుంచి చేపట్టిన మొట్టమొదటి ఎస్ఎల్వీ–3డీ1 ప్రయోగ సమయంలో ఆ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి హోదాలో షార్‌లో రెండో ప్రయోగ వేదికను ప్రారంభించేందుకు విచ్చేశారు. అయితే ఆయన స్వతహాగా శాస్త్రవేత్త కావడంతో రాష్ట్రపతి హోదాలోనే పలుమార్లు ప్రయోగాలను వీక్షించేందుకు విచ్చేసిన సందర్భాలున్నాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన రెండో ప్రయోగ వేదికను 05–05–2005న ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు. అదే రోజున రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ06 ద్వారా కార్టోశాట్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితే ఆయన ఆ సమయంలో 4వ తేదీనే షార్కు చేరుకుని ప్రయోగ పనుల్లో కూడా పాలుపంచుకోవడం విశేషం. ఆ తర్వాత 2012 జనవరి 2న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ కూడా షార్ కేంద్రాన్ని సందర్శించారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాల దృష్ట్యా షార్‌లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు రూ. 20 కోట్లతో నిర్మించిన న్యూ మిషన్ కంట్రోల్‌రూంను ఆమె చేతులు మీదుగా అప్పట్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ పీఎస్ఎల్వీ సీ20 ప్రయోగానికి వీక్షించేందుకు విచ్చేశారు. అయితే ఆయన కేవలం ప్రయోగాన్ని వీక్షించేందుకు మాత్రమే వచ్చి వెళ్లారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ నెల 14న షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. షార్‌లో ఇటీవల రూ.695 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు షార్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న సాయంత్రం సెకండ్ వ్యాబ్‌ను ప్రారంభించనున్నారు. -
రాబోయే ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయ మైదానంలో బుధవారం షార్‌లోని భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యూరోపియన్‌కు చెందిన నోవాశాట్, ఎస్–14 అనే రెండు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నామని చెప్పారు. రెండో ప్రయోగవేదికపై అక్టోబర్ మొదటి వారంలో జీఎస్ఎల్వీ మార్క్–3, డీ–2 ప్రయోగం ద్వారా జీశాట్–29 అనే ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. వెంటనే నవంబర్, డిసెంబర్ నెలల్లో పీఎస్ఎల్వీ సీ43, సీ 44 రాకెట్లును ప్రయోగిస్తామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం 2019 ప్రథమార్థంలో ఉంటుందన్నారు. సూర్యుడిపై పరిశోధనకు నాసాతో ఇస్రో ఇప్పటికే చర్చలు జరుపుతోందని, ఫలప్రదమైతే ఆదిత్య–1 పేరుతో ఉపగ్రహాన్ని పంపడం తమ లక్ష్యమన్నారు. -
పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగానికి కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12న వేకువజామున 4.04 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకకు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ41 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 43వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సంసిద్ధమైంది. గురువారం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేజింగ్(షార్) నుంచి సాయంత్రం 04.56 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జీశాట్-6ఏ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. జీశాట్-6 తరహాలోనే జీశాట్-6ఏ కూడా శక్తిమంతమైన ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఏంటీ జీశాట్-6ఏ..? ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్-6ఏ రెండోది. 2015 ఆగష్టులో జీశాట్-6ను ఇస్రో ప్రయోగించింది. కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడేందుకు జీశాట్-6ఏను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు జీశాట్-6ఏ మరింత బలం చేకూర్చుతుంది. దాదాపు 2 టన్నులు బరువుండే జీశాట్-6ఏ ఉపగ్రహం పదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తుంది. దీని తయారీ కొరకు ఇస్రో రూ. 270 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక యాంటెన్నా వినియోగం.. జీశాట్-6ఏ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. విచ్చుకుంటే ఆరు మీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడటానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం ఒక్కసారి కక్ష్యలో చేరిన తర్వాత ఇది తెరచుకుంటుంది. ఇప్పటివరకూ ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైనది. మొబైల్ కమ్యూనికేషన్‌తో పాటు మిలటరీ అవసరాలకు కూడా ఈ యాంటెనా ఉపయోగపడనుంది. ఏంటీ ఎస్-బ్యాండ్..? విద్యుదాయస్కాంత స్పెక్ట్రమ్‌లో 2 నుంచి 4 గిగాహెర్జ్ పౌనఃపున్యాల మధ్య ఉండే బ్యాండ్‌ను ‘ఎస్’గా పిలుస్తారు. ప్రస్తుతం ఎస్-బ్యాండ్‌ను వాతావరణ రాడార్లలో, సముద్ర ఉపరితలంపై సంచరించే ఓడల్లో, కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగంలో ఉన్న 4జీ నెట్వర్క్ సైతం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే సేవలు అందిస్తోంది. జీఎస్ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా.. జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగిస్తోంది. జీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్లను వినియోగించి ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది పన్నెండవది. క్రయోజెనిక్ సాంకేతికతను అందిపుచ్చుకున్న తర్వాత చేస్తున్న ప్రయోగాల్లో ఆరవది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది.