ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు | GSAT 6A Is Ready To Launch From SHAR | Sakshi
Sakshi News home page

ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు

Published Wed, Mar 28 2018 3:29 PM | Last Updated on Wed, Mar 28 2018 4:47 PM

GSAT 6A Is Ready To Launch From SHAR - Sakshi

జీశాట్‌-6ఏ ఉపగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ప్రయోగానికి సంసిద్ధమైంది. గురువారం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్‌ అండ్‌ రేజింగ్‌(షార్‌) నుంచి సాయంత్రం 04.56 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జీశాట్‌-6ఏ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. జీశాట్‌-6 తరహాలోనే జీశాట్‌-6ఏ కూడా శక్తిమంతమైన ఎస్‌-బ్యాండ్ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.

ఏంటీ జీశాట్‌-6ఏ..?
ఎస్‌ బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో జీశాట్‌-6ఏ రెండోది. 2015 ఆగష్టులో జీశాట్‌-6ను ఇస్రో ప్రయోగించింది. కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడేందుకు జీశాట్‌-6ఏను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు జీశాట్‌-6ఏ మరింత బలం చేకూర్చుతుంది. దాదాపు 2 టన్నులు బరువుండే జీశాట్‌-6ఏ ఉపగ్రహం పదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తుంది. దీని తయారీ కొరకు ఇస్రో రూ. 270 కోట్లు ఖర్చు చేసింది.

ప్రత్యేక యాంటెన్నా వినియోగం..
జీశాట్‌-6ఏ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. విచ్చుకుంటే ఆరు మీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడటానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం ఒక్కసారి కక్ష్యలో చేరిన తర్వాత ఇది తెరచుకుంటుంది.

ఇప్పటివరకూ ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైనది. మొబైల్‌ కమ్యూనికేషన్‌తో పాటు మిలటరీ అవసరాలకు కూడా ఈ యాంటెనా ఉపయోగపడనుంది.

ఏంటీ ఎస్‌-బ్యాండ్‌..?
విద్యుదాయస్కాంత స్పెక్ట్రమ్‌లో 2 నుంచి 4 గిగాహెర్జ్‌ పౌనఃపున్యాల మధ్య ఉండే బ్యాండ్‌ను ‘ఎస్‌’గా పిలుస్తారు. ప్రస్తుతం ఎస్‌-బ్యాండ్‌ను వాతావరణ రాడార్లలో, సముద్ర ఉపరితలంపై సంచరించే ఓడల్లో, కొన్ని కమ్యూనికేషన్‌ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగంలో ఉన్న 4జీ నెట్‌వర్క్‌ సైతం ఎస్‌-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారానే సేవలు అందిస్తోంది.

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-08 రాకెట్‌ ద్వారా..
జియో స్టేషనరీ లాంచింగ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా ఇస్రో జీశాట్‌-6ఏను ప్రయోగిస్తోంది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ రాకెట్లను వినియోగించి ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది పన్నెండవది. క్రయోజెనిక్‌ సాంకేతికతను అందిపుచ్చుకున్న తర్వాత చేస్తున్న ప్రయోగాల్లో ఆరవది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్‌-6ఏ ఉపగ్రహం చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement