GSAT
-
జూలైలో జీశాట్–ఎన్2 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో జీశాట్–ఎన్2 (జీశాట్–20) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సుమారు ఐదు టన్నుల బరువు (4,700 కిలోలు) కలిగిన ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ప్రయోగ వేదిక నుంచి పాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.దేశంలోని మారుమూల రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాండ్‌బ్యాండ్, ఇన్–ఫ్లైట్ సేవలను అందించేందుకు ఇస్రోలోని ఫ్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉండి 15 ఏళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు.ఇది పూర్థిస్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటివరకు పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక ఎత్తయితే ఈ జీశాట్–ఎన్2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్‌రూంలో పరీక్షలు పూర్తిచేశారు. వైబ్రేషన్ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం. -
తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్
న్యూఢిల్లీ: సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్‌ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్‌ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్‌ఎక్స్‌ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కాలం చెల్లిన జీశాట్–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. 2011 జులై 15న పీఎస్ఎల్వీ సీ17 రాకెట్ ద్వారా జీశాట్–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. శుక్రవారంతో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది. -
జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేడు జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీఐఎల్), కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–వీ వీఏ257 రాకెట్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్‌కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ జీశాట్–24 ఉపగ్రహాన్ని టాటాప్లే అనే సంస్థకు లీజుకిచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌కు చేరుకుని రాకెట్ ప్రయోగం పనులను పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 4,000 కిలోలకుపైన బరువున్న భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా.. ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు. -
జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా
సాక్షి, శ్రీహరికోట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రారంభించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపివేశామన్నారు. కాగా ప్రయోగాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో అధికారులు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్ టైమ్ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్ చేస్తుంది. జీశాట్-1 బరువు 2275 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్-1 ఉపగ్రహం... జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనున్నది. The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course. — ISRO (@isro) March 4, 2020 -
ఇస్రో ‘జీశాట్-30’ శాటిలైట్ ప్రయోగం సక్సెస్..
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన జీశాట్-30 శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది. టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఫ్రెంచ్ భుభాగంలోని కౌరు నుంచి భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రయోగం జరిగిందని ఇస్రో తెలిపింది. ఏరియన్ 5 వాహక నౌక జీశాట్-30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది. 3,357 కిలోల బరువున్న జీశాట్-30 ఉపగ్రహం.. చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేయనుంది. -
ఈ నెల 17న జీశాట్ ప్రయోగం
-
జీశాట్–31 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్–31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్–31 కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డైరెక్టర్ కున్హికృష్ణన్ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు. జీశాట్–31తోపాటు సౌదీకి చెందిన 1/హెల్లాస్ శాట్–4 జియోస్టేషనరీ శాటిలైట్‌ను ఏరియన్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగించిన 42 నిమిషాల్లోనే 2 ఉపగ్రహాలు అత్యంత సునాయాసంగా ముందుగా నిర్ణయించిన సమయానికే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించాయి. జీశాట్–31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కౌరునే ఎందుకు.. జూన్, జులైలో మరో జియోస్టేషనరీ శాటిలైట్ జీశాట్30ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.పాండియన్ చెప్పారు. ఫ్రెంచ్ గయానాతో భారత్‌కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయన్నారు. ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 ద్వారా ప్రయోగించే వీలున్నప్పటికీ ఇక్కడ చంద్రయాన్–2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బహుళ ప్రయోజనకారి.. సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ అధునాతన ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసింది. ఇందులో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్ల వ్యవస్థను అమర్చారు. ఇది ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్శాట్–4సీఆర్, ఇన్శాట్–4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్–31 ఉపగ్రహం భర్తీ చేయనుంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా వీశాట్నెట్వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్, సెల్యులార్ బ్యాకప్, డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, స్టాక్ ఎక్చ్సేంజీ, ఈ–గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెలి కమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్ఫర్ ఇది చేయనుంది. -
భళా.. ‘బాహుబలి’!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్.. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను ఈ ఉపగ్రహం తీర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే బుధవారం సాయంత్రం 5.08 గంటలకు మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. ఉపగ్రహాన్ని వాహకనౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో చేర్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్ నుంచి బయల్దేరిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. దీంతో ప్రయోగాన్ని వీక్షిస్తున్న శాస్తవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. గజ తుపాను నేపథ్యంలో ఓ దశలో ప్రయోగ నిర్వహణపై ఆందోళనలు నెలకొన్నా, చివరకు వాతావరణం సహకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్3– డీ2 రాకెట్ ప్రయోగం రెండోసారీ విజయవంతం కావడం విశేషం. 2017లో జీశాట్19ను నింగిలోకి పంపేందుకు మార్క్2–డీ1ను వాడారు. భవిష్యత్తులో చేపట్టనున్న మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’లో ఈ రాకెట్‌నే వినియోగించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మూడు దశల్లో ప్రయోగం.. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో 16.43 నిమిషాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లు (ఎస్–200)ను మండించడంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110)ను మండించి రాకెట్ వేగాన్ని పెంచారు. తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్–200 రెండు బూస్టర్లను విడదీసి మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. ఎల్–110 దశ 5.18 నిమిషాలకు రెండో దశను పూర్తి చేసింది. ఆ తర్వాత 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం(సీ–25)తో మూడో దశను ప్రారంభించారు. 16.28 నిమిషాలకు క్రయోజనిక్ దశ కటాఫ్ అయిపోయింది. 16.43 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,423 కిలోల జీశాట్–29ను విడదీసి భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని జయప్రదం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో చేసే ప్రయోగాలు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగం.. ఎవరెస్ట్‌తో సమానంఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఈ ప్రయోగం మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తయినదని ఇస్రో చైర్మన్ కె.శివన్ అభివర్ణించారు. మన సమాచార ఉపగ్రహాలనే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ను డిసెంబర్ 2021 నాటికి చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి ముందు ప్రయోగాత్మకంగా మానవ రహిత గగన్‌యాన్‌ను డిసెంబర్ 2020 నాటికి పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, 2019 జనవరిలో చంద్రుడిపై పరిశో«ధనలు చేసేందుకు చంద్రయాన్–2 గ్రహాంతర ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 2019లో 10 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. అధునాతన పేలోడ్లతో.. జీశాట్–29లో ప్రత్యేకించి కేయూ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ భీమ్‌తో పాటు వన్ యూజర్ స్టీరిబుల్ భీమ్, క్యూ/వీ– బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్స్ పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఈ ఉపగ్రహం ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తుంది. విలేజ్ రీసోర్స్ సెంటర్స్ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయా లు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది. ఉపగ్రహం వివరాలు.. ► రాకెట్: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ► ఉపగ్రహంతోకలిపి మొత్తం బరువు: 640 టన్నులు ► ఎత్తు: 43.39 మీటర్లు ► వ్యాసం: 4 మీటర్లు ► ప్రయోగ దశలు: మూడు (ఘన, ద్రవ, క్రయోజెనిక్) ► జీశాట్29 ఉపగ్రహం బరువు: 3,423 కిలోలు ► ఉపగ్రహ జీవితకాలం: 10 ఏళ్లు ► పనిచేయడానికి కావాల్సిన విద్యుత్: 4600 వాట్లు రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ శివన్ -
ప్రయోగానికి సిద్ధమైన జీశాట్–11
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత బరువు(5,725 కిలోలు) కలిగిన జీశాట్– 11 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిం చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25నే జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఇంతకుముందు ఈ రికార్డు 3,477 కిలోల బరువైన జీశాట్–17 పేరిట ఉండేది. జీశాట్–17లో 42 ట్రాన్ఫాండర్లు అమర్చి పంపగా, జీశాట్–11లో 40 ట్రాన్స్‌ఫాండర్లు పంపనున్నారు. ఈ ప్రయోగాన్ని ఫ్రాన్స్‌లోని కౌరూ అంతరిక్షకేంద్రానికి చెందిన ఏరియన్–5 రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఐసాక్ సెంటర్లో తయారు చేసి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు చేర్చారు. మే మొదటివారంలో ఈ ప్రయోగం నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. -
వాయిదా పడిన జీశాట్–11 ప్రయోగం
బెంగళూరు: సమాచార ఉపగ్రహం జీశాట్–11 ప్రయోగం వాయిదా పడింది. మే 25న ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రయోగాన్ని వాయిదా వేశామనీ, అంతరిక్షంలోకి ఎప్పుడు పంపుతామో త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో డైరెక్టర్ కె.శివన్ వెల్లడించారు. -
ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సంసిద్ధమైంది. గురువారం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేజింగ్(షార్) నుంచి సాయంత్రం 04.56 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జీశాట్-6ఏ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. జీశాట్-6 తరహాలోనే జీశాట్-6ఏ కూడా శక్తిమంతమైన ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఏంటీ జీశాట్-6ఏ..? ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్-6ఏ రెండోది. 2015 ఆగష్టులో జీశాట్-6ను ఇస్రో ప్రయోగించింది. కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడేందుకు జీశాట్-6ఏను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు జీశాట్-6ఏ మరింత బలం చేకూర్చుతుంది. దాదాపు 2 టన్నులు బరువుండే జీశాట్-6ఏ ఉపగ్రహం పదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తుంది. దీని తయారీ కొరకు ఇస్రో రూ. 270 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక యాంటెన్నా వినియోగం.. జీశాట్-6ఏ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. విచ్చుకుంటే ఆరు మీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడటానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం ఒక్కసారి కక్ష్యలో చేరిన తర్వాత ఇది తెరచుకుంటుంది. ఇప్పటివరకూ ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైనది. మొబైల్ కమ్యూనికేషన్‌తో పాటు మిలటరీ అవసరాలకు కూడా ఈ యాంటెనా ఉపయోగపడనుంది. ఏంటీ ఎస్-బ్యాండ్..? విద్యుదాయస్కాంత స్పెక్ట్రమ్‌లో 2 నుంచి 4 గిగాహెర్జ్ పౌనఃపున్యాల మధ్య ఉండే బ్యాండ్‌ను ‘ఎస్’గా పిలుస్తారు. ప్రస్తుతం ఎస్-బ్యాండ్‌ను వాతావరణ రాడార్లలో, సముద్ర ఉపరితలంపై సంచరించే ఓడల్లో, కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగంలో ఉన్న 4జీ నెట్వర్క్ సైతం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే సేవలు అందిస్తోంది. జీఎస్ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా.. జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగిస్తోంది. జీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్లను వినియోగించి ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది పన్నెండవది. క్రయోజెనిక్ సాంకేతికతను అందిపుచ్చుకున్న తర్వాత చేస్తున్న ప్రయోగాల్లో ఆరవది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది. -
నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’
- అత్యంత బరువైన జీఎస్ఎల్వీ-మార్క్3 డి1 ప్రయోగం సక్సెస్ - రోదసీలోకి జీశాట్-19 ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 640 టన్నుల జీఎ్సఎల్వీ-మార్క్3 డి1 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్ ధావన అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ,136 కిలోల బరువైన జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ప్రయోగమిలా.. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 పొడవు 43.43 మీటర్లు. బరువు 640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్–200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్–110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది. 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు. 17 ఏళ్లనాటి కల సాకారం భారత అంతరిక్ష సంస్థ.. ఇస్రో నమ్మినబంటు పీఎ్సఎల్వీ వాహకనౌక 1,850 కిలోల బరువున్న ఉపగ్రహాలను దిగ్విజయంగా రోదసిలోకి చేరవేస్తోంది. జీఎ్సఎల్వీ రాకెట్ 2,200 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మనదేశం విదేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో మార్పువచ్చేలా నాలుగు టన్నుల బరువున్న భారీ ఉపగ్రహాలనూ రోదసిలోకి చేరవేసేందుకు ఓ వాహకనౌకను రూపొందించుకోవాలని ఇస్రో సంకల్పించింది. జీశాట్–19తో ఉపయోగాలివీ.. జీశాట్–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్ బరువు 1,394 కిలోలు. జీశాట్–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. -
జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య పెంపు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 6న ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు పెంచారు. భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 0.136 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. జీశాట్-18 సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), అపోజి (భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2,004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. మొదటి విడతలో 251.7 కి.మీ. దూరంలోని పెరిజీని 14,843 కి.మీ.లకు పెంచుతూ అపోజీని మాత్రం 35,888 కి.మీ. నుంచి 35,802 కిలోమీటర్లుకు తగ్గించారు. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి ప్రస్తుతం 35,802 కి.మీ. అపోజి, 35,294 కి.మీ. పెరిజిని పెంచుతూ భూమికి 36 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10.21 గంటలకు ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరో రెండు రోజుల్లో ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.