జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య పెంపు
Published Sun, Oct 9 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 6న ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు పెంచారు. భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 0.136 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. జీశాట్-18 సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), అపోజి (భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే.
కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2,004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. మొదటి విడతలో 251.7 కి.మీ. దూరంలోని పెరిజీని 14,843 కి.మీ.లకు పెంచుతూ అపోజీని మాత్రం 35,888 కి.మీ. నుంచి 35,802 కిలోమీటర్లుకు తగ్గించారు. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి ప్రస్తుతం 35,802 కి.మీ. అపోజి, 35,294 కి.మీ. పెరిజిని పెంచుతూ భూమికి 36 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10.21 గంటలకు ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరో రెండు రోజుల్లో ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Advertisement
Advertisement