జీశాట్–ఎన్2 ఉపగ్రహానికి క్లీన్‌రూంలో పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో జీశాట్–ఎన్2 (జీశాట్–20) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సుమారు ఐదు టన్నుల బరువు (4,700 కిలోలు) కలిగిన ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ప్రయోగ వేదిక నుంచి పాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
దేశంలోని మారుమూల రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాండ్‌బ్యాండ్, ఇన్–ఫ్లైట్ సేవలను అందించేందుకు ఇస్రోలోని ఫ్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉండి 15 ఏళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు.
ఇది పూర్థిస్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటివరకు పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక ఎత్తయితే ఈ జీశాట్–ఎన్2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్‌రూంలో పరీక్షలు పూర్తిచేశారు. వైబ్రేషన్ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment