అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది.
ఇస్రో ఏమందంటే..
గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు.
మన బాహుబలి ఉంది కదా!
జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు.
భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్‌తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది.
ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment