Falcon Heavy Rocket
-
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్
న్యూఢిల్లీ: సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్‌ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్‌ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్‌ఎక్స్‌ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
ట్విట్టర్ పిట్ట లోగో స్థానంలో ఎక్స్ సింబల్
-
ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్?
ఓవైపు ఎక్స్‌గా పేరు మార్చేసి మరీ ట్విటర్‌ను #TwitterX అతలాకుతలం చేసేసిన ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్.. ఏకంగా ఎక్స్ వీడియోస్ అనే బూతు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేశాడు. ఈలోపు ఆయనగారికే చెందిన మరో X కంపెనీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్కి చెందిన ఫాల్కన్ రాకెట్ .. అయనోస్పియర్‌కు పెద్ద రంధ్రం చేసేసిందట. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పొరలను ‘‘ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో(ఐనో), ఎక్సో, మాగ్నెటోస్పియర్లుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అందులో అయానోస్పియర్‌కు జులై 19వ తేదీన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం ద్వారా భారీగానే డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. జులై 19వ తేదీన కాలిఫోర్నియా వండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో అయానోస్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని.. ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్గార్డెనర్ చెబుతున్నారు. ► రాకెట్ల ఇంధనం మండించినప్పుడు ఇది సాధారణంగా జరిగేదే అయినా.. అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ రాకెట్‌తో అయానోస్పియర్‌కు జరిగిన డ్యామేజ్ ఎక్కువేనని ఆయన అంటున్నారు. ► అయానోస్పియర్.. మొత్తం అయాన్లతో ఆవరించబడి ఉంటుంది. సోలార్ ప్లాస్మా అయాన్లతో చర్య జరిపి ఆకాశంలో కనిపించే అద్భుతమైన రంగులను సృష్టించడానికి కారణం ఇదే. అంతేకాదు.. భూ అయస్కాంత తుఫానులకు అయానోస్పియరే కారణమని అమెరికా పరిశోధన సంస్థ నాసా చెబుతోంది. ► వాతావరణ పొరల్లో అయానోస్పియర్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఇది కమ్యూనికేషన్, నేవిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబించడం, మార్పు చేయడం లాంటివి చేస్తుంది. ఒకవేళ అయానోస్పియర్‌కు డ్యామేజ్ జరిగితే.. అది GPS, నేవిగేషన్ సిస్టమ్‌లపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది. ► ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగం వల్ల ఇది సంభవించి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ప్రైవేట్ కంపెనీతో అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్న స్పేస్ఎక్స్ లాంటి కంపెనీలతో వాతావరణానికి పెను నష్టం తప్పదనే అభిప్రాయమూ చాలాకాలంగా వ్యక్తమవుతూ వస్తోంది. ► గమనించదగ్గ విషయం ఏంటంటే.. అయానోస్పియర్‌కు స్పేస్ఎక్స్ రాకెట్లు నష్టం చేయడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగష్టు 24వ తేదీ జరిగిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం, అలాగే.. 2022 జూన్ 19వ తేదీన జరిగిన ప్రయోగంలోనూ ఇదే తరహాలో అయానోస్పియర్‌కు నష్టం వాటిల్లింది. ► ఇదిగాక.. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ స్పేస్ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద భారీ రాకెట్ ప్రయోగం(టెస్టింగ్ దశలో).. పేలిపోగా, టెక్సాస్ బేస్ వద్ద నష్టం భారీ స్థాయిలో జరిగింది. దుమ్మూధూలి ఎగసిపడి మైళ్ల దూరం వరకు పర్యావరణానికి నష్టం వాటిల్ల జేయడంతో పాటు అక్కడి జీవజాలంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది. ఇదీ చదవండి: వాట్సాప్ స్టేటస్లతోనూ ప్రమాదమే! -
మరోసారి చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
స్పేస్ ఎక్స్ (స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) మరోసారి చారిత్రాత్మక అత్యంత శక్తివంతమైన మానవ రహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది. ఫ్లోరిడా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు ఒక మానవరహిత క్రూడ్రాగన్‌ను శనివారం ప్రారంభించింది. స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 రెండవ దశలో భాగంగా దీన్ని లాంచ్ చేసింది. శక్తివంతమైన, పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనతో, ప్రయోగాలు నిర్వహిస్తూ ఇతర గ్రహాలపై మానవుల నివాసమే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ సాధించిన ఇది గొప్ప మైలు రాయిగా నిపుణులు భావిస్తున్నారు. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తోందని స్పేస్ ఎక్స్ఫౌండర్ ఎలాన్ మస్క్ నాసా మీడియా సమావేశంలోభావోద్వేగంతో ప్రకటించారు. మాజీ వ్యోమగామి కెనెడీ స్పేస్ సెంటర్ డైరెక్టర్ బాభ్ కబానా కూడా ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగంలో విజయం సాధించిన స్పేస్ ఎక్స్ పలుపరిశోధనల అనంతరం గత ఏడాది ఉపగ్రహ ప్రయోగానంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ చేసి ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో గొప్ప ముందడుగు వేసింది. వీటి ద్వారా చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్లాలని ఈ సంస్థ ప్రాణాళికలు రచిస్తోంది. అంతేకాదు, భూమికి సుదూరంలో ఉన్న బృహస్పతి, శని గ్రహాలకు మానవ రహిత(రోబోలు) యాత్రలు చేపట్టాలని కూడా స్పేస్ ఎక్స్ యోచిస్తోంది. తాజా ప్రయోగంతో ఈ ప్రక్రియ ఎంతో దూరంలో లేదని నిరూపించింది. కాగా టెస్లా ఇన్కార్పొరేషన్ సీఈవో ఎలాన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో స్పేస్ఎక్స్ సంస్థను స్థాపించారు. ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తోన్న సంస్థతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం తన అవసరాల మేరకు ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. Crew Dragon is on its way to the International Space Station! Autonomous docking at the @Space_Station set for early tomorrow morning. Watch live starting at 3:30 a.m. EST, 8:30 a.m. UTC → https://t.co/gtC39uBC7z — SpaceX (@SpaceX) March 2, 2019 Webcast is live→ https://t.co/gtC39uBC7z pic.twitter.com/7VgyvPfwu0 — SpaceX (@SpaceX) March 2, 2019 -
భూమిని ఢీ కొట్టనున్న కారు..!
ఫ్లారిడా, అమెరికా : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కారు భూమి ఢీ కొడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. స్పేస్ ఎక్స్ కంపెనీ గత వారం టెస్లాకు చెందిన రోడ్‌స్టర్ కారును గత వారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంగారక కక్ష్యలోకి కారును ప్రయోగించగా.. అది కక్ష్యను దాటి ప్రయాణిస్తోంది. కక్ష్యను వదలి ప్రయాణిస్తున్న కారు 10 లక్షల ఏళ్ల తర్వాత భూమి లేదా శుక్ర గ్రహాన్ని ఢీ కొడుతుందని ముగ్గురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఆ సమయానికి భూమిపై జీవరాశి ఉండకపోవచ్చునని కూడా అభిప్రాయపడ్డారు. కారు భూమి వైపు దూసుకొచ్చే సమయంలోగా మహా ప్రళయాలు సంభవించి మానవాళి అంతరించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమి వైపు ప్రయాణించే సమయంలో వేగానికి కారు మండిపోయి అగ్నిగోళంగా మారి ఢీ కొడుతుందని వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు రాయల్ ఆస్ట్రనామికల్ సోసైటీ మేగజిన్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్న టెస్లా కారు 2091లో భూమికి చేరువగా వస్తుందని పరిశోధకులు వివరించారు. ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్-9 రాకెట్లను కలిపి రూపొందించారు. ఫాల్కన్ హెవీని పునర్వినియోగించుకోవచ్చు. ప్రయోగ అనంతరం ముందుగా నిర్దేశించిన ప్రదేశానికి రాకెట్లు తిరిగి చేరుతాయి. దీని ఎత్తు 23 అంతస్తులు ఉంటుంది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా లక్షా నలభై ఒక్క వేల పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు. -
అంతరిక్షంలో కొత్త పుంతలు
‘ఎల్లుండి ఏం తమాషా జరుగుతుందో/ ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి/ చెబితే మాత్రం నమ్మకండి’ అంటాడు మహాకవి శ్రీశ్రీ తన ‘శరశ్చంద్రిక’ కవితలో. అరవై య్యేళ్ల క్రితం సైన్స్ ఫిక్షన్ రచయితల ఊహకందని విషయాలు సైతం వాస్తవ రూపం దాల్చే రోజులొచ్చేశాయి. ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ప్రయోగించిన రాకెట్లన్నిటినీ తలదన్నే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ‘ఫాల్కన్ హెవీ’ బుధవారం నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 23 అంతస్తుల భవంతికి సమానమైన ఎత్తున్న ఈ రాకెట్‌కు 27 ఇంజిన్లు అమర్చి మండించడం ద్వారా ఈ అనూహ్య ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. అది తీసుకెళ్లిన టెస్లా సంస్థ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అంగారకుడి కక్ష్యకు ఆవలనున్న గ్రహ శకలాల మధ్య తిరుగాడు తోంది. అచ్చం వ్యోమగామి పోలికతో రూపొందించిన బొమ్మ డ్రైవర్ సీటులో కూర్చుని ఉండగా, అంతరిక్ష అద్భుతాలను గానం చేస్తూ డేవిడ్ బోవీ 1972లో విడుదల చేసిన గీతమొకటి ఆ కారులో శ్రావ్యంగా వినిపించే ఏర్పాటు చేశారు. ఆ కారులోని మూడు కెమెరాలు తమ కళ్లముందున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు భూమ్మీదకు పంపే సదుపాయమూ ఉంది. అంగారకుడి కక్ష్యలో అది తిరుగాడాలని శాస్త్రవేత్తలు భావించినా అనుకోని రీతిలో అది ఆ కక్ష్యను దాటిపోయింది. అంగా రకుడే వారి లక్ష్యం గనుక ఆ కారు రంగును కూడా ఎర్రగానే ఉంచారు. దాని ఖరీదు 2 లక్షల డాలర్లు(సుమారు రూ. కోటీ 29 లక్షలు). అది భయమో, విస్మయమో...ఆకాశంలో నిరంతరం జ్వలించే బంతిలా కన బడే అంగారకుడంటే మానవాళికి ఆదినుంచీ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే అంగా రకుడి చుట్టూ అనేక ఊహలల్లింది. అంగారక గ్రహంపై మనుషుల్ని పోలిన జీవరాశి ఉన్నట్టు, వారు భూమ్మీద దండయాత్ర చేసేందుకు వచ్చినట్టు హెచ్‌జీ వెల్స్ 1906లో వెలువరించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల చిత్రించింది. కుజుడి ఉపరిత లంపై ఉన్న ఇనుము ఆక్సైడ్ రూపంలో ఉన్న కారణంగా ఆ గ్రహం ఎర్రెర్రగా కనబ డుతున్నదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రహాన్ని చేరుకోవాలని, అక్కడున్నదేమిటో తెలుసుకోవాలని, ముఖ్యంగా ఆవాసానికి అది అనువుగా ఉంటుందో, లేదో తేల్చా లని ఆసక్తి ఉన్నవారికి కొదవలేదు. శాస్త్రవేత్తలు సైతం అలాంటి కలలు సాకారమ య్యేందుకు అనువైన పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచ యిత ఆర్థర్ సి. క్లార్క్ అన్నట్టు ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుం టాయి. అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి. ఈ రెండూ ప్రమా దకరమైనవేనంటాడు క్లార్క్. ఎందుకంటే ఒంటరితనం ఎటూ భయానకం. మరె వరో ఉన్నారనుకున్నా వారెలాంటివారో తెలియనంతకాలమూ అది కూడా భీతిగొ ల్పేదే. ఎవరిలోనూ కలవలేని అశక్తత ఉన్న వ్యక్తి సైతం సమూహంలో ఒంటరిగా ఉండాలనుకుంటాడు తప్ప అందరూ నశించి తానొక్కడే మిగిలిపోవాలనుకోడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే ఈ తత్వమే అన్వేషణలకు పురుడుపోసింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ అన్వేషణాక్రమం ఎన్నో నేర్పుతున్నది. మనుషుల్ని ‘బహుళ గ్రహ’ జీవులుగా మార్చాలని స్పేస్ ఎక్స్ 2002 నుంచీ కలలుగంటోంది. అందుకవసరమైన సాంకేతికతను అభివృద్ధి పరిచే క్రమంలో అది తలమునకలై ఉంది. అందులో ఇప్పుడు జరిగిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం మొట్టమొదటిది. వాస్తవానికి ఈ ప్రయోగం 2011లో జరపాలని సంకల్పించారు. అప్పటినుంచి అది వాయిదాలు పడుతోంది. 2016లో ఫ్లారిడాలోని ప్రయోగ వేది కపై ఫాల్కన్ 9 రాకెట్ పేలి 20 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన ఉపగ్రహం క్షణాల్లో బూడిదైంది. తాను ప్రయోగించబోయే ఫాల్కన్ హెవీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురుకావొచ్చునని, తానైతే దేనికైనా సిద్ధంగా ఉన్నానని అప్పట్లోనే మస్క్ ప్రకటించాడు. విఫలమై ప్రమాదం సంభవిస్తే అందుకు కారణాలేమిటో పరిశో ధించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ పనిలో ముందుకెళ్తా మని కూడా చెప్పాడు. భూగోళంపై ఈ మూల నుంచి ఆ మూలకెళ్లి తిరిగి స్వస్థలానికెలా చేరుకుంటున్నామో అదే రీతిలో ఏ గ్రహానికైనా వెళ్లొచ్చే రోజులు రావాలన్నది, అది కూడా చౌకగా ఉండాలన్నది ఎలన్ మస్క్ కాంక్ష. అందుకే ఈ ప్రయో గంలో మూడు బూస్టర్లను పంపి అవి తిరిగి భూమిని చేరుకునే ఏర్పాటు చేశారు. అయితే రెండు బూస్టర్లు అనుకున్నట్టే విజయవంతంగా వెనక్కు వచ్చినా మూడోది మాత్రం మధ్యలోనే కాలిపోయింది. ఈ రెండు బూస్టర్లూ మరో ప్రయోగానికి ఉపయోగపడతాయి. ఎలన్ మస్క్ 2002లో తొలిసారి తన పథకమేమిటో చెప్పినప్పుడు అందరూ వింతగా చూశారు. కానీ తాజా విజయంతో ఆయన సంస్థ ప్రపంచంలోనే ఇప్పుడు అగ్రగామి ప్రైవేటు అంతరిక్ష వాణిజ్య సంస్థగా అవతరించింది. ఇంత ఆర్భాటం లేదుగానీ... గత నెల 21న ‘హ్యుమానిటీ స్టార్’ పేరిట కాంతులీనే బంతిలా ఉండే ఉపగ్రహాన్ని చడీచప్పుడూ లేకుండా ప్రయోగించారు. విజయవంతమైన తర్వాతే దాన్ని ప్రకటించారు. ఇప్పుడది 90 నిమిషాలకొకసారి భూమిని చుట్టివస్తుంది. భూగోళంలో ఏ మూలనున్నవారికైనా స్పష్టంగా కనబడు తుంది. దాని గమనాన్ని తెలుసుకోవడానికి అదే పేరుతో ఒక వెబ్సైట్ ఏర్పా టుచేశారు. మానవాళి తన గురించి, తన చర్యల గురించి, వాటికుండే పర్యవసా నాల గురించి అవలోకనం చేసుకుని తీరుతెన్నులను మార్చుకుంటుందన్న ఆశతో దీన్ని రూపొందించానని రాకెట్లాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీటర్ బెక్ చెబుతు న్నాడు. అయితే ఆశయాలు ఎంత ఉన్నతంగా ఉన్నా, ప్రతీకలెంత ప్రభావవం తమైనవైనా ఇప్పటికే వ్యర్థాలతో అస్తవ్యస్థంగా తయారైన అంతరిక్షం భవిష్యత్తులో మరింత కంగాళీగా మారడానికి తప్ప ఈ ప్రయోగాల వల్ల ఉపయోగమే లేదని నిట్టూర్చే నిరాశావాదులున్నారు. ఏదేమైనా స్పేస్ ఎక్స్, రాకెట్లాబ్ సంస్థలు అంత రిక్ష ప్రయోగాలను ఒక కొత్త దశకు తీసుకుపోయాయి. ఈ ప్రయోగాలు అంతి మంగా మానవాళి శ్రేయస్సుకే తోడ్పడాలి. ప్రభుత్వాలకైనా, ప్రైవేటు సంస్థలకైనా అదే గీటురాయి కావాలి. -
‘స్పేస్ ఎక్స్’ ప్రయోగం విజయవంతం.. కానీ...
కేప్ కనవెరాల్: అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయికి అమెరికా సాక్షిగా నిలిచింది. ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాం డ్ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్ కాలిపోయినట్లు ఎలన్ చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్లోరిడాలోని కేప్ కనవెరాల్లో సంబరాలు మిన్నంటాయి. కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. -
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
-
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ : అంతరిక్షంలో టెస్లా కారు
కెన్నడీ స్పేస్ సెంటర్, ఫ్లారిడా : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం మంగళవారం విజయవంతమైంది. 18, 747 జెట్ లైనర్ల వేగంతో ఫాల్కన్ హెవీ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కారును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చిన 27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించిన శాస్త్రజ్ఞులు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలా కనిపించింది. ఫాల్కన్ రాకెట్ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్ కోస్ట్ కంపించిపోయింది. మొత్తం ఆరు గంటల పాటు కొనసాగిన ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులు లైవ్‌లో తిలకించారు. చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్ హెవీ సొంతం. 23 అంతస్తుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ ప్రయోగం తర్వాత కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు తిరిగి చేరుకున్నాయి. అయితే, ఒక రాకెట్ సముద్రంలో దిగాల్సివుండగా మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా 1,41, 000 పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు.