స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపిన టెస్లా రోడ్‌స్టర్ కారు
ఫ్లారిడా, అమెరికా : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కారు భూమి ఢీ కొడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. స్పేస్ ఎక్స్ కంపెనీ గత వారం టెస్లాకు చెందిన రోడ్‌స్టర్ కారును గత వారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
అంగారక కక్ష్యలోకి కారును ప్రయోగించగా.. అది కక్ష్యను దాటి ప్రయాణిస్తోంది. కక్ష్యను వదలి ప్రయాణిస్తున్న కారు 10 లక్షల ఏళ్ల తర్వాత భూమి లేదా శుక్ర గ్రహాన్ని ఢీ కొడుతుందని ముగ్గురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఆ సమయానికి భూమిపై జీవరాశి ఉండకపోవచ్చునని కూడా అభిప్రాయపడ్డారు.
కారు భూమి వైపు దూసుకొచ్చే సమయంలోగా మహా ప్రళయాలు సంభవించి మానవాళి అంతరించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమి వైపు ప్రయాణించే సమయంలో వేగానికి కారు మండిపోయి అగ్నిగోళంగా మారి ఢీ కొడుతుందని వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు రాయల్ ఆస్ట్రనామికల్ సోసైటీ మేగజిన్‌లో ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్న టెస్లా కారు 2091లో భూమికి చేరువగా వస్తుందని పరిశోధకులు వివరించారు.
ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర
స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్-9 రాకెట్లను కలిపి రూపొందించారు. ఫాల్కన్ హెవీని పునర్వినియోగించుకోవచ్చు. ప్రయోగ అనంతరం ముందుగా నిర్దేశించిన ప్రదేశానికి రాకెట్లు తిరిగి చేరుతాయి. దీని ఎత్తు 23 అంతస్తులు ఉంటుంది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా లక్షా నలభై ఒక్క వేల పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు.
Comments
Please login to add a commentAdd a comment