
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్తుతానికైతే అపరకుబేరుల జాబితాలో 384 బిలియన్ డాలర్లతో ఇలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరి ప్రపంచంలో అధిక దేశం ఏది?.. జీడీపీ పరంగా చూసుకుంటే యూరప్ దేశం లగ్జెంబర్గ్. అలాంటప్పుడు మళ్లీ ధనిక దేశం, మస్క్ కంటే ధనికుడు అనే మాట ఎందుకు వస్తుందంటారా?.. అక్కడికే వస్తున్నాం..
ఇలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్‌ల పేర్లే అత్యంత ధనికుల లిస్ట్‌లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. వీళ్లతో పాటు మరో నలుగురైదుగురి పేర్లే ఈ జాబితాలో పైకి కిందకి తారుమారు అవుతుంటాయి. అయితే వాస్తవ ప్రపంచానికి కాస్త దూరంగా వెళ్తే.. ఇలాంటి ధనికులు వందల మంది కలిసొచ్చినా కూడా ఆయన సంపదకు దరిదాపుల్లో కూడా కనిపించరు!. ఆయన పేరే టీచల్లా.
టీచల్లా.. వకాండా(Wakanda) అనే దేశానికి రాజు. ఈ దేశం ఆఫ్రికాలో ఉంది. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన.. శత్రు దుర్భేద్యమైన దేశంగా వకాండాకు పేరుంది. అక్కడ దొరికే వైబ్రేనియం అనే మెటల్ కారణంగా ఆ రాజుకు, ఆ దేశానికి వెలకట్టలేనంత సంపద రాగలిగింది. ఇప్పుడే కాదు. ఇంకా కొన్ని వందల ఏళ్లు గడిచినా ఆ సంపద విలువను ఎవరూ అందుకోలేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ దేశం కల్పితం మాత్రమే.

మార్వెల్ కామిక్స్, ఆ సిరీస్‌లో వచ్చే సినిమాలు చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. రాజుగా కన్నా బ్లాక్ పాంథర్ అనే సూపర్ హీరోగానే ఆయన ఈ ప్రపంచానికి సుపరిచితుడు. కల్పిత దేశమైన వకాండలో వైబ్రేనియం(Vibranium) అనే అత్యంత అరుదైన.. అతివిలువైన ఖనిజం ఉంటుంది. దాని సాయంతో ఈ భూమ్మీద ఏ దేశానికి కూడా సాధ్యపడని అత్యాధునిక టెక్నాలజీని ఈ దేశం ఉపయోగిస్తుంటుంది. అలా.. ఈ భూమ్మీద అత్యంత ధనిక దేశంగా వకాండా నిలిచింది.
ఇంతకీ టీచల్లా(బ్లాక్‌పాంథర్) సంపద ఎంతో తెలుసా?.. అక్షరాల 90 ట్రిలియన్ డాలర్లు. అయితే కొన్ని కామిక్ పుస్తకాల్లో మాత్రం ఆయన సంపద కేవలం 500 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఏరకంగా చూసుకున్నా కూడా.. టీచల్లానే ఈ భూమ్మీద అత్యంత ధనికుడన్నమాట. ఇక వ్రైబేనియం కారణంగా వకాండ ఈ భూమ్మీదే అత్యంత ధనికమైన దేశంగా నిలిచింది.

వకాండాలో రకరకాల తెగలు ఉంటాయి. బ్లాక్ పాంథర్ అనే బలమైన సంరక్షణలో ఆ దేశం ఉంటుంది. అక్కడి తెగల ప్రజలు చిన్నాపెద్దా తేడా లేకుండా యుద్ధ శిక్షలో ఆరితేరి ఉంటాయి. వాటి మధ్య ఎన్ని వైరాలున్నా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం ఏకతాటికి వస్తుంటాయి. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన దేశంగా వాకాండాకు పేరుంది. అందుకు కారణాలు లేకపోలేదు.
తమ భూభాగంలో దొరికే వైబ్రేనియంతోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని, రక్షణ వ్యవస్థలను తయారు చేసుకుంటుంది ఆ దేశం. పటిష్టమైన నిఘా వ్యవస్థ, కంటికి కనిపించని రక్షణ వలయం ఏర్పాటు చేసుకుని శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటోంది.
అత్యంత ఖరీదైన సహజ సంపద ఉన్నందున.. కొన్ని తరాలపాటు ప్రపంచ దేశాలకు వీలైనంత దూరంగా ఉంటూ ఐసోలేషన్ పాటిస్తూ వచ్చింది ఆ దేశం. అయితే టీచల్లా రాజు అయ్యాక ఆ పరిస్థితి మారింది. వర్తక వాణిజ్య ఒప్పందాల, దౌత్యపరమైన సంబంధాల కోసం ప్రపంచ దేశాలకు వకాండా తలుపులు తెరిచాడాడు. అలాగే.. అగ్రదేశాలకూ వకాండా నుంచి అత్యాధునికమైన సాంకేతికత సాయం కూడా అందింది. దీంతో వకాండా ఆర్థిక అభివృద్ధి .. ఈ భూమ్మీద మరేయితర దేశం అందుకోనంత స్థాయికి చేరింది. అదే సమయంలో వైబ్రేనియం మీద కొన్ని దేశాలు, వ్యక్తులు కన్నేయడంతో వకాండాకు శత్రువులను సంపాదించి పెట్టింది కూడా.

మైక్రోసాఫ్ట్ నెట్‌వర్క్)MSN) డాటా ప్రకారం.. డీసీ సూపర్ హీరో బ్రూస్ వేన్(బ్యాట్‌మన్) సంపద విలువ 9.2 బిలియన్ డాలర్లు కాగా, మార్వెల్ తరఫున టోనీ స్టార్క్(ఐరన్ మ్యాన్) సంపద విలువ 12.4 బిలియన్ డాలర్లు వీళ్లతో పాటు ప్రొఫెసర్ ఎక్స్, అక్వామాన్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే సూపర్ విలన్‌లలో విక్టర్ వోన్ డూమ్ సంపద 100 బిలియన్ డాలర్లు కాగా, లెక్స్ లూథోర్ సంపద విలువ 75 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం సూపర్ హీరోల ప్రపంచంలోనూ టీచల్లా రిచ్చెస్ట్ అన్నమాట. అయితే వాస్తవ ప్రపంచంలోనూ వెలకట్టలేని సంపదతో ఓ ధనికుడు ఉన్నాడని మీకు తెలుసా?
ఒక మహా చక్రవర్తి.. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు. ఆయనే మన్సా మూసా (Mansa Musa). ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గాంబియా, గినియా, నైగర్, నైజీరియా, చాద్, మారిటేనియా తదితర దేశాలతో కూడిన విశాల ‘మాలి’ సామ్రాజ్యాన్ని ఈయన పాలించాడు. ప్రస్తుత మాలిలోని టింబుక్టును నిర్మించింది ఆయనే. క్రీ.శ. 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది.

మూసా సామ్రాజ్యంలో బంగారు, ఉప్పు గనులు ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకించి బంగారు గనులు ఎక్కువగా ఉండటంతో బంగారం వేల టన్నుల్లో ఈయన ఖజానాలో ఉండేది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది. ప్రస్తుతం ఈ భూమ్మీద అందరి దగ్గర ఉన్న సంపదను కలిపినా.. అప్పట్లో ఆయన ఒక్కడి దగ్గర ఉన్న సంపదే ఎక్కువట!!. అంతేకాదు.. హజ్ యాత్రకు ఆయన దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆయన ఈజిప్ట్‌లో పంచిన బంగారంతో.. ఆ దేశంలో బంగారం విలువ పడిపోయిందట!. అలాగే ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు. మూసా 1337లో కన్నుమూశారు. అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూసా నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నం కాగా, ఆ సంపదను కొల్లగొట్టుకుని పోయారు.
Comments
Please login to add a commentAdd a comment