2022లో అంగారకుడిపైకి మానవుడు
మెక్సికో సిటీ: అంగారక గ్రహం(మార్స్)పై మానవ నివాసయోగ్య పరిస్థితులు ఉన్నాయా, లేవా ? అన్న అంశంపై ఓ పక్క శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తుండగానే సాధ్యమైనంత త్వరగా అక్కడ మానవ కాలనీని నిర్మించాలనే వ్యూహంతో టెక్ బిలియనీర్, స్సేస్ ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ వేగంగా దూసుకుపోతున్నారు. గ్రహాంతర రవాణా వ్యవస్థ (ఇంటర్ ప్లానెటరీ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్) కింద తాము రూపొందిస్తున్న రాకెట్లు మానవులను అంగారక గ్రహానికి తీసుకెళతాయని ఆయన చెప్పారు. మానవుల తొలిబ్యాచ్‌ను తీసుకొని తమ రాకెట్ భూమి నుంచి 2022లో బయల్దేరుతుందని ఆయన మెక్సికోలో జరిగిన 67వ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో తెలియజేశారు.
భూమి నుంచి అంగారక గ్రహానికి వెళ్లడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 80 రోజులు పడుతుందని, ఈ 80రోజుల ప్రయాణం బోరు కొట్టకుండా ఉండేందుకు గురుత్వాకర్షణలేని ఆటలు ఆడేందుకు, ఇష్టమైన సినిమాలు చూసేందుకు, వీనుల విందైన సంగీతం వినేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మస్క్ తెలిపారు. అలా ఓ పది లక్షల మందిని అక్కడికి తీసుకెళ్లాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మానవులను అంగారక గ్రహానికి తీసుకెళ్లి అక్కడ నివాసాన్ని కల్పించేందుకు ఒక్కొక్కరికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు అవుతుందని, ఈ ఖర్చును భారీగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను, అది తీసుకెళ్లిన ఉపగ్రహాన్ని పదే పదే ఉపయోగించేందుకు వీలుగా తయారు చేయడం వల్ల ఖర్చును తగ్గించవచ్చని, భవిష్యత్తులో జరిగే శాస్త్రవిజ్ఞాన పురోభివృద్ధి వల్ల కూడా సహజంగానే కొంత ఖర్చు తగ్గవచ్చని ఆయన చెప్పారు. ఎంత తగ్గినా యాభై లక్షల డాలర్లకన్నా తగ్గక పోవచ్చని కూడా ఆయన అన్నారు. మానవ అంతరిక్ష నౌకను తీసుకెళ్లే రాకెట్‌ను తాము పటిష్టంగా రూపొందిస్తున్నామని, అపోలో అపరేషన్ ద్వారా చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లిన నాసా శాటర్న్ వీ రాకెట్‌కన్నా నాలుగు రెట్లు శక్తివంతమైన ఇంజన్లను ఇందులో ఉంటాయని తెలిపారు.
ఒకటి పనిచేయకపోతే మరోటి పనిచేసేలా రాకెట్‌లో పలు ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మానవ నౌకను తీసుకెళ్లే రాకెట్ పొడవు దాదాపు 400 అడుగులు, వెడల్పు 39 అడుగులు ఉంటుందని మస్క్ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంగారక గ్రహానికి వెళ్లే మొదటి బ్యాచ్ మనుషులు ప్రాణాలు త్యజించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఎన్నారు. మొదటి బ్యాచ్‌లో తమరు వెళతారా ? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ వెళ్లాలనే ఉద్దేశం ఏమీ లేదని, తమ కంపెనీ పురోభివృద్ధి కోసం ఎల్లప్పుడు కృషిచేసే వ్యక్తి ఎవరైనా ఇలాంటి సాహసం చేయకపోవచ్చని అన్నారు.
చంద్రుడిపై సగం రోజులు చీకటిగా ఉండడం, అక్కడ మానవ నివాసిత వాతావరణం లేకపోవడం వల్ల తాను చంద్రుడిపైకి వెళ్లే ప్రయోగానికి విముఖత చూపానని, అంగారక గ్రహంపై కావాల్సినంత సౌరశక్తి కూడా ఉంటుందని, మిథేన్, ఆక్సిజన్ గ్యాస్ ద్వారా అక్కడ మొక్కలు పెంచేందుకు కూడా అవకాశం ఉందని ఆయన వివరించారు. మరో 40 నుంచి 100 ఏళ్ల కాలంలో అంగారకుడిపై మానవ నివాస ప్రాంతాలు ఏర్పడుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.