‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రయోగం విజయవంతం.. కానీ... | SpaceX Falcon Heavy launch was a success | Sakshi
Sakshi News home page

‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రయోగం విజయవంతం.. కానీ...

Published Thu, Feb 8 2018 3:06 AM | Last Updated on Thu, Feb 8 2018 4:51 AM

SpaceX Falcon Heavy launch was a success - Sakshi

నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్తున్న రాకెట్‌. (ఇన్‌సెట్లో) టెస్లా స్పోర్ట్స్‌ కారు

కేప్‌ కనవెరాల్‌: అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయికి అమెరికా సాక్షిగా నిలిచింది. ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్‌ సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’(స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది.

నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌.. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్‌ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్‌ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాం డ్‌ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్‌ కాలిపోయినట్లు ఎలన్‌ చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్లోరిడాలోని కేప్‌ కనవెరాల్‌లో సంబరాలు మిన్నంటాయి.  

కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’..
తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్‌ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్‌ మస్క్‌ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్‌ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది.

ఫాల్కన్‌ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్‌ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ సుమారు 64 మెట్రిక్‌ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్‌ హెవీ కంటే శాటర్న్‌ వీ రాకెట్‌ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్‌ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్‌ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్‌ మస్క్‌ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement