Space Research Organization of the United
-
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
‘స్పేస్ ఎక్స్’ ప్రయోగం విజయవంతం.. కానీ...
కేప్ కనవెరాల్: అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయికి అమెరికా సాక్షిగా నిలిచింది. ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాం డ్ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్ కాలిపోయినట్లు ఎలన్ చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్లోరిడాలోని కేప్ కనవెరాల్లో సంబరాలు మిన్నంటాయి. కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. -
కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం అనంతరం క్యూరియాసిటీ మౌంట్ షార్ప్ బేస్‌కు చేరిందని యూఎస్ స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచానికి తన సత్తా చాటిన క్యూరియాసిటీ ఇప్పుడు కొత్త అన్వేషణను ప్రారంభిస్తుందని నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డెరైక్టర్ జిమ్ గ్రీన్ వెల్లడించారు.