సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది.
మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్‌సైట్‌లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment