somnath
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వర్క్‌షాపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనలు, వాటి ఫలితాలు, సాకేంతికత, మెటీరియల్స్ మొదలగు వాటిని భారత ఆటోమోటివ్ పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై ఈనెల 11న అంతరిక్ష ప్రధానకేంద్రమైన బెంగళూరులో నిర్వహించామని శనివారం ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇన్‌స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇస్రో, ఇన్‌స్పేస్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రాకెట్ పరికరాలు, ఉపగ్రహాలకు చెందిన పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్స్ కూడా ఈ సెమినార్లో పాల్గొన్నాయి.రోజు రోజుకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అప్డేట్ అవుతోంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాల్సి అవసరం వుందని ఈ రెండు సంస్థల ఛైర్మన్లు అన్నారు. ఆటోమోటివ్ రంగంలోని కెమెరా ఇమేజింగ్ సెన్సార్లు, ఉష్ణోగ్రత, పీడన సెన్సార్లు, అకౌస్టిక్, వైబ్రేషన్ సెన్సార్లు, గైరోస్కోప్‌లు, యాక్సిలరోమీటర్లు, ప్రత్యేకమైన పూతలు, అడ్హెసివ్‌లు, యాంటీ వైబ్రేషన్, నాయిస్ సప్రెషన్ టెక్నాలజీలు, ఇన్సులేషన్ టెక్నాలజీలు, భద్రతా వ్యవస్థలు అనే వాటిపై కూలకషంగా సెమినార్లో చర్చించారు.ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ పారిశ్రామిక అనువర్తనాల కోసం భారత అంతరిక్ష కార్యక్రమం నుంచి జ్ఞానాన్ని బదిలీ చేయడం ప్రాముఖ్యత గురించి వివరించి మరీ చెప్పారు. స్పేస్–గ్రేడ్ టెక్నాలజీలు, వాహన భద్రత, పనితీరు స్థిరత్వాన్ని ఎలా మెరుగు పరుస్తాయో అన్వేషించమని ఆటోమోటివ్ పరిశ్రమలలోని వారికి సూచించారు. ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. వర్క్షాప్ద్వారా ఉత్పన్నమయ్యే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి వివరించారు. రాకెట్ ప్రయోగాల్లో వాణిజ్యపరమైన విస్తరణ కోసం ఆటోమోటివ్ పరిశ్రమలో కన్సార్టియం విధానం నేతృత్వంలో రాకెట్ పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్లు పని చేయాల్సి వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో అన్ని సెంటర్లుకు శాస్త్రవేత్తలు, ప్రయివేట్ పార్టనర్లు పాల్గొన్నారు. -
కార్టూన్లు వేయడం చాలా ఇష్టం
సాక్షి, హైదరాబాద్: తాను చిన్నప్పుడు కార్టూనిస్టు కావాలని అనుకునేవాడినని, ఇప్పటికీ కార్టూన్లు వేయడం అంటే చాలా ఇష్టమని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన స్పేస్టూన్ కార్టూన్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేరళలో కార్టూనిస్టులు ఎక్కువగా ఉండటంతో కార్టూన్లు అంటే చాలా ఆసక్తి ఉండేదని పేర్కొన్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యామని, ఆ ప్రయోగం విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. ప్రపంచ పటంలో ఇస్రోకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.ఏదైనా విషయాన్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పే సత్తా కార్టూనిస్టులకు ఉందని, కార్టూనిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి పలువురు ప్రముఖ కార్టూనిస్టులు గీసిన కార్టూన్లను సోమనాథ్ తిలకించారు. ఆ తర్వాత ఆయన కూడా స్వయంగా ఓ కార్టూన్ గీశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఏదైనా విషయాన్ని నవ్వుకొంటూనే సులువుగా అర్థమయ్యేలా చెప్పడం కార్టూనిస్టులకే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సు«దీర్నాథ్, హైదరాబాద్ పొలిటికల్ కార్టూనిస్టుల ఫోరం గౌరవ అధ్యక్షుడు నర్సిమ్, కార్టూనిస్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్ చెప్పుకొచ్చారు. -
Isro: భారత్ స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
చండీగఢ్: భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్ స్టేషన్ ప్రాథమిక వెర్షన్ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘భారత్ స్పేస్ స్టేషన్‌కు సంబంధించి వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్‌ను 2028లో కక్ష్యలోకి పంపి 2035కల్లా దానికి పూర్తిస్థాయి రూపు తీసుకువస్తాం. స్పేస్ స్టేషన్ క్రూ కమాండ్ మాడ్యూల్, నివాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్ అనే విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్టేషన్ 25 టన్నుల బరువు ఉంటుంది. అవసరమైతే తర్వాత దీనిని విస్తరిస్తాం. స్పేస్ స్టేషన్ ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు నింగిలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. దీనిని అమెరికా, కెనడా, జపాన్, యూరప్ సంయుక్తంగా నిర్మించాయి. 1984నుంచి 1993 మధ్య ఐఎస్ఎస్ను డిజైన్ చేశారు. ఇదీచదవండి.. అయోధ్య వాతావరణం.. ఐఎండీ ప్రత్యేక వెబ్‌పేజీ -
Raveena Tandon: కూతురితో కలిసి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న కేజీఎఫ్ 2 నటి (ఫోటోలు)
-
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
నింగిలోకి ఎక్స్‌పోశాట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్శాట్నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. నిప్పులు చిమ్ముతూ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్ఎల్వీ రాకెట్ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం... ఎక్స్‌పోశాట్, వియ్శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్ఎల్వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు బెలిఫ్శాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది. ► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్ కీలకం కానుంది. ► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం. ► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. ► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ... ► ఉపగ్రహం బరువు 469 కిలోలు. ► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ (ఎక్స్–పోలారిమీటర్ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ► ఇందులోని మరో పేలోడ్ ఎక్స్పెక్ట్ (ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) 0.8–15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది. ► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం. ► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్ ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్శాట్–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు. -
Aditya L1: ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్రో చీఫ్
ముంబై: ఆదిత్య ఎల్1 సూర్యునికి, భూమికి మధ్యలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్‌కు జనవరి 6వ తేదీన చేరుకుంటుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ముంబై ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోమనాథ్ సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఆదిత్య ఎల్1, అంతకముందు విజయవంతమైన చంద్రయాన్ 3 మిషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఆదిత్య ఎల్1 దాదాపుగా గమ్యాన్ని చేరుకుంది. జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎల్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఎల్-1 కక్ష్యలోకి పంపేందుకు మండించాల్సిన ఆరు ఇంజన్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఎల్-1 పాయింట్లో భూమికి సూర్యునికి మధ్య గ్రావిటీ ఉండదు. అయితే అక్కడ జీరో గ్రావిటీ ఉండటం మాత్రం అసాధ్యం ఎందుకంటే చంద్రుడు, మార్స్, వీనస్ గ్రహాలకు సంబంధించిన గ్రావిటీ ప్రభావం ఈ పాయింట్లో కొంత మేర ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపారు. ‘శాటిలైట్ ఎల్1 పాయింట్లో కుదరుకున్నప్పటి నుంచి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. అందులోని పరికరాలు పనిచేసినంత కాలం సూర్యునికి సంబంధించిన డేటా భూమికి పంపిస్తూనే ఉంటుంది. సూర్యునిలో జరిగే చాలా చర్యలకు భూమి మీద వాతావరణ మార్పులకు మధ్య ఉండే సంబంధాన్ని ఎల్1 ద్వారా పరిశోధనలు చేసి కనిపెట్టగలమని ఆశిస్తున్నాం’ అని సోమనాథ్ చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్ కథ ఇక ముగిసినట్లే.. ‘14 రోజుల మిషన్ తర్వాత చంద్రయాన్ 3లో భాగమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని మీద హాయిగా నిద్ర పోతున్నాడు. రోవర్ ఇక ఎప్పటికీ నిద్ర పోతూనే ఉంటాడు. ప్రజ్ఞాన్ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ పనిచేస్తాడనుకున్నాం. ల్యాబ్‌లో కూడా ఇది విజయవంతంగా పరీక్షించి చూశాం. దురదృష్టవశాత్తు చంద్రునిపై మాత్రం ఇది జరగలేదు. ల్యాబ్‌లో సాధ్యమైనవి కొన్ని చంద్రునిపై నిజంగా సాధ్యపడవు. రేడియేషనే ఇందుకు కారణం’అని సోమనాథ్ తెలిపారు. దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సూర్యున్ని అధ్యయనం చేసేందుకుగాను భారత్ తొలిసారిగా ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. -
Aditya-L1: జనవరి ఆరున కక్ష్యలోకి ఆదిత్యఎల్1
అహ్మదాబాద్: భగభగమండే భానుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్షనౌక ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన తన కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనావేశారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఎన్జీవో ఏర్పాటుచేసిన ‘భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్(ఎల్) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. ఆరో తేదీన ఎల్1 పాయింట్లోకి చేరగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తాం. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుంది. ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలుపెడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేíÙంచనుంది. స్పేస్‌క్రాఫ్ట్ తన కక్ష్యలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలంపై మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘ ప్రధాని మోదీ ఉద్భోదించినట్లు అమృతకాలంలో భారత్ ‘భారతీయ స్పేస్ స్టేషన్’ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం’ అని వివరించారు. -
చందమామపై మన అడుగే తరువాయి!
అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో. ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్‌కు ముందు ఉంటాయి. సీఎమ్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్‌ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది. ఇస్రో మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్, భారతదేశపు తొలి సౌర అన్వేషణ మిషన్ అయిన ఆదిత్య ఎల్1. ఇది ‘లాగ్రేంజ్ పాయింట్ 1’ యొక్క ప్రత్యేకమైన వాన్టేజ్ పాయింట్ నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. చంద్రునిపైనా సూర్యునిపైనా చేసే పరిశోధ నల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇస్రో కేంద్రాలు, విద్యా సంస్థల సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో నిండిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక çసూర్యుని రహస్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు పని చేస్తుందని భావిస్తున్నాం. ఇది భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడు–భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు ఉద్దేశించిన మార్గంలో ఉంది. ఇక్కడే అది జనవరి 2024లో హాలో కక్ష్యలోకి చేర్చబడుతుంది. చంద్రయాన్–3 మిషన్ ఒక చరిత్రాత్మక విజయం. ఆ విజయం సిద్ధించిన ఆగస్టు 23ను ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడం ముదావహం. 14 రోజుల (ఎర్త్ డేస్) మిషన్ జీవిత కాలంలో, ఇది చంద్రుని మట్టిలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మేంగనీస్, సిలికాన్, ఆక్సి జన్లను కనుగొన్న విలువైన డేటాను అందించింది. మనం తలపెట్టిన చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ), పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్ఎల్వీ) ప్రోగ్రామ్, ఎక్స్–రే ఆస్ట్రానమీ మిషన్ ‘ఎక్స్‌పోశాట్’, స్పేస్ డాకింగ్ ప్రయోగం, ఎల్‌ఓఎక్స్ –మీథేన్ ఇంజన్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు కలిసి, భారత్ అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని నిర్వచించాయి. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ ఎల్వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కి.మీ. ప్లానార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టగలదు. బహుళ ఉప గ్రహాలను తీసుకెళ్లగలదు. ఉపగ్రహాలను ఎప్పుడు ఎక్కడ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ప్రవేశపెట్టగల (లాంచ్–ఆన్–డిమాండ్ ) సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ప్రయోగించడానికి కనీçస మౌలిక సదుపాయాలు ఉంటే చాలు. అలాగే ప్రయోగించ డానికి ఖర్చు కూడా తక్కువే! ఎక్స్‌పోశాట్ అనేది భారత్ మొట్టమొదటి నిర్దిష్ట సైన్స్ మిషన్. ఇది శాస్త్రీయ పేలోడ్లను ఉపయోగించి తీవ్ర పరిస్థితుల్లోనూ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్–రే మూలాలను పరిశోధిస్తుంది. అటువంటి దీనిని 2023–2024లో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధ మయింది. స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్)ను 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది మానవ అంతరిక్షయానంలో అనువర్తనాల పరిధితో డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినజంట అంతరిక్ష నౌక. ఈ మిషన్‌లో రెండు చిన్న– ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్గా, మరొకటి టార్గెట్‌గా, సహ–ప్రయాణికులుగా కలిపి ప్రయోగించబడతాయి. ‘భవిష్యత్తులో ‘చంద్రయాన్’ మిషన్ లలో చంద్రుని నుంచి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేయడంలో డాకింగ్ ప్రయోగ విజయం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. రానున్న కాలంలో సాంకేతికత పరంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన ‘ఎల్‌ఓఎక్స్ మీథేన్’ (లిక్విడ్ ఆక్సి జన్ ఆక్సిడైజర్, మీథేన్ ఇంధనం) ఇంజిన్ల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇది అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాలపై పర్యావరణాల ఉనికి కోసం మాన వుడు చేసే అన్వేషణను సులభతరం చేస్తుంది. అంత రిక్షంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను సంశ్లేషణ చేయడం ద్వారా తయారు చేయగలిగిన మీథేన్ అంత రిక్షంలో సుదూరం ప్రయాణించే నౌకలకు ఇంధనంగా ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎల్‌ఓఎక్స్ మిథేన్ ఇంజిన్ల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం కలిగిందని చెప్పాలి. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ ప్రారంభించడం, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన అంతర్ గ్రహ అన్వేషణను ప్రారంభించడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రధాన మంత్రి నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా వేదికపై భారత్ ఉనికిని మరింత పటిష్టం చేస్తాయి. ‘భారత్ అంతరిక్ష కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త శిఖరాలను చేరుకోవ డానికి సిద్ధంగా ఉంది. ప్రయోగించబడిన ప్రతి మిషన్, ప్రతి ఆవిష్కరణతో ఇస్రో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సగర్వంగా పునరుద్ఘాటిస్తుంది. (‘మలయాళ మనోరమ’కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అందించిన కథనం ఆధారంగా) -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
గగన్‌యాన్‌లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్‌యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
అక్టోబర్ 21న తొలి టెస్ట్ ఫ్లైట్.. గగన్‌యాన్‌పై మోదీ సమీక్ష
అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన తొలి ఫైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-(టీవీ-డీ1)ను అక్టోబర్ 21న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫైట్ టెస్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.. TV-D1 క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి దానిని భూమికి తీసుకురావడం. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. 🚨 ISRO's Gaganyaan mission first flight test TV-D1 is scheduled on 7-9 am October 21, 2023. pic.twitter.com/i1SJgVm0HZ — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలో ప్రయోగించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మూడు అన్ క్రూడ్ మిషన్లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా గన్‌యాన్ మిషన్ పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిషన్ సంసిద్ధత, భారత అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్తోపాటు ఇతర అధికారులతో సమీక్ష జరిగింది. -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
శుక్రయాన్‌కు పేలోడ్లు సిద్ధం
న్యూఢిల్లీ: చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదిత్యయానం కొనసాగుతోంది. ఇక శుక్ర గ్రహంపై జెండా పాతేందుకు భారత్ సిద్ధమవుతోంది. శుక్ర యాత్రకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దానికి సంబంధించిన పేలోడ్లు ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన బుధవారం వివరించారు. శుక్రుని అధ్యయనం భూగోళం భవితవ్యానికి సంబంధించి కీలక సమాచారం అందజేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకట్రెండేళ్లు పట్టవచ్చు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెర తీశాయి. -
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్‌ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దించి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?
జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ? చంద్రుడి గుట్టు విప్పేందుకే... ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి? ► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు. ► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. దక్షిణ ధ్రువంపై దిగాలని... ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. ► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు. ► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. ► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని అమర్చారు. ► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. ► రోవర్లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. ► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి. -
విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్–3
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ► ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. ► చంద్రయాన్–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది. ► చంద్రయాన్–3లో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది. ► చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్–2 రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు. ► చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు. చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్.. జూలై 13న చంద్రయాన్–3 ప్రయోగం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్–1 ప్రయోగం 2008 అక్టోబర్22న, చంద్రయాన్–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూలైలో చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ప్రయోగాన్ని జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శుక్రవారం రాత్రి చంద్రయాన్–3 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి చేరుకుందని చెప్పారు. సోమవారం నిర్వహించే జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ శనివారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి, సభ్యులు ఇస్రో చైర్మన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన్ని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆ తర్వాత సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. జీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో 4 ఉపగ్రహాల కాలపరిమితి పూర్తి కానుండటంతో.. వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నామని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ స్థానంలో నావిక్–01 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగానికి సంబం«ధించి ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 2024 చివరికల్లా మానవ రహిత ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షార్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.