Aditya L1: ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్రో చీఫ్‌ | Isro Chief Reveals Interesting Things About Aditya L1 Chandrayan 3 | Sakshi
Sakshi News home page

ఆదిత్య ఎల్‌1 గమ్యాన్ని చేరేది అప్పుడే..

Published Fri, Dec 29 2023 3:37 PM | Last Updated on Fri, Dec 29 2023 4:36 PM

Isro Chief Reveals Interesting Things About Aditya L1 Chandrayan 3 - Sakshi

ముంబై: ఆదిత్య ఎల్‌1 సూర్యునికి, భూమికి మధ్యలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌కు జనవరి 6వ తేదీన చేరుకుంటుందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తెలిపారు. ముంబై ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోమనాథ్‌ సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1, అంతకముందు విజయవంతమైన చంద్రయాన్‌ 3 మిషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘ఆదిత్య ఎల్‌1 దాదాపుగా గమ్యాన్ని చేరుకుంది. జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎల్‌-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఎల్-1 కక్ష్యలోకి పంపేందుకు మండించాల్సిన ఆరు ఇంజన్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఎల్‌-1 పాయింట్‌లో భూమికి సూర్యునికి మధ్య గ్రావిటీ ఉండదు. అయితే అక్కడ జీరో గ్రావిటీ ఉండటం మాత్రం అసాధ్యం ఎందుకంటే చంద్రుడు, మార్స్‌, వీనస్‌ గ్రహాలకు సంబంధించిన గ్రావిటీ ప్రభావం ఈ పాయింట్‌లో కొంత మేర ఉంటుంది’ అని సోమనాథ్‌ తెలిపారు. 

‘శాటిలైట్‌ ఎల్‌1 పాయింట్‌లో కుదరుకున్నప్పటి నుంచి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది.  అందులోని  పరికరాలు పనిచేసినంత కాలం సూర్యునికి సంబంధించిన డేటా భూమికి పంపిస్తూనే ఉంటుంది. సూర్యునిలో జరిగే చాలా చర్యలకు భూమి మీద వాతావరణ మార్పులకు మధ్య ఉండే సంబంధాన్ని ఎల్‌1 ద్వారా పరిశోధనలు చేసి కనిపెట్టగలమని ఆశిస్తున్నాం’ అని సోమనాథ్‌ చెప్పారు.

ప్రజ్ఞాన్‌ రోవర్‌ కథ ఇక ముగిసినట్లే..

‘14 రోజుల మిషన్‌ తర్వాత చంద్రయాన్‌ 3లో భాగమైన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుని మీద హాయిగా నిద్ర పోతున్నాడు. రోవర్‌ ఇక ఎప్పటికీ నిద్ర పోతూనే ఉంటాడు. ప్రజ్ఞాన్‌ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ పనిచేస్తాడనుకున్నాం. ల్యాబ్‌లో కూడా ఇది విజయవంతంగా పరీక్షించి చూశాం. దురదృష్టవశాత్తు  చంద్రునిపై మాత్రం ఇది జరగలేదు. ల్యాబ్‌లో సాధ్యమైనవి కొన్ని చంద్రునిపై నిజంగా సాధ్యపడవు. రేడియేషనే ఇందుకు కారణం’అని సోమనాథ్‌ తెలిపారు. దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సూర్యున్ని అధ్యయనం చేసేందుకుగాను భారత్‌ తొలిసారిగా ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement