అహ్మదాబాద్: భగభగమండే భానుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్షనౌక ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన తన కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనావేశారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఎన్‌జీవో ఏర్పాటుచేసిన ‘భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘ భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్(ఎల్) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. ఆరో తేదీన ఎల్1 పాయింట్‌లోకి చేరగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తాం. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుంది.
ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలుపెడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేíÙంచనుంది. స్పేస్‌క్రాఫ్ట్ తన కక్ష్యలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలంపై మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘ ప్రధాని మోదీ ఉద్భోదించినట్లు అమృతకాలంలో భారత్ ‘భారతీయ స్పేస్ స్టేషన్’ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment