ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్
పిల్లలు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచన
స్పేస్‌టూన్ కార్టూన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తాను చిన్నప్పుడు కార్టూనిస్టు కావాలని అనుకునేవాడినని, ఇప్పటికీ కార్టూన్లు వేయడం అంటే చాలా ఇష్టమని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన స్పేస్‌టూన్ కార్టూన్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేరళలో కార్టూనిస్టులు ఎక్కువగా ఉండటంతో కార్టూన్లు అంటే చాలా ఆసక్తి ఉండేదని పేర్కొన్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యామని, ఆ ప్రయోగం విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. ప్రపంచ పటంలో ఇస్రోకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.
ఏదైనా విషయాన్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పే సత్తా కార్టూనిస్టులకు ఉందని, కార్టూనిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి పలువురు ప్రముఖ కార్టూనిస్టులు గీసిన కార్టూన్లను సోమనాథ్ తిలకించారు. ఆ తర్వాత ఆయన కూడా స్వయంగా ఓ కార్టూన్ గీశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఏదైనా విషయాన్ని నవ్వుకొంటూనే సులువుగా అర్థమయ్యేలా చెప్పడం కార్టూనిస్టులకే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సు«దీర్‌నాథ్, హైదరాబాద్ పొలిటికల్ కార్టూనిస్టుల ఫోరం గౌరవ అధ్యక్షుడు నర్సిమ్, కార్టూనిస్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment