పటాన్‌చెరు: ఆస్ట్రోనాట్స్‌తో కూడిన రాకెట్‌ను ఏడాదిలోగా గగనతలంలోకి పంపనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ మిషన్ తుదిదశకు చేరుకుందని, మానవసహిత రాకెట్ ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మంజీర మిషన్ బిల్డర్స్ రూపొందించిన సిమ్యూలేటెడ్ క్రూ మాడ్యూల్(ఎస్‌సీఎం) ఫ్యాబ్రికేషన్ సెల్‌ను శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో గగన్‌యాన్ ప్రాజెక్టు పూర్తి కానుందని, ఇది సఫలం అయితే అంతర్జాతీయంగా అగ్రదేశాల సరసన భారత్ నిలబడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ సారాబాయి స్పేస్ స్టేషన్ డైరక్టర్ ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరికల్లా మానవసహిత రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమైందన్నారు. మంజీరాలో తయారు చేసిన ఆ పరికరం దేశంలోనే మొదటిదన్నారు.
రాకెట్ ప్రయోగంలో కీలకమైన రెండున్నర టన్నుల బరువు ఉండే సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్‌కు 3 ప్యారాషూట్లు అనుసంధానిస్తారని తెలిపారు. ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా సముద్రంలో దిగేలా రూపొందించామని, ఐదు ఎస్‌సీఎం స్ట్రక్చర్ షెల్ విడిభాగాలను తయారు చేయాలని మంజీర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. 2024 కల్లా రాకెట్‌లో ఆస్ట్రోనాట్స్ వెళ్లగలిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కాగా, మంజీర పరిశ్రమ ఎండీ సాయికుమార్ తమ పరిశ్రమలో తయారు చేసిన ఎస్‌సీఎంను ఉన్నికృష్ణన్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment