‘న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్’ అనే మరో రాకెట్ తయారీకి ఇస్రో శ్రీకారం
భవిష్యత్‌లో చేపట్టే భారీ ప్రయోగాలకు వీలుగా రూపకల్పన
2028 నాటికి ప్రయోగాత్మక పరీక్ష..
2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి..
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకూ ఎన్‌జీఎల్‌వీనే..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్‌జీఎల్‌వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్‌ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.
వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్‌జీఎల్‌వీ తయారీని ఇస్రో చేపట్టింది.
రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
ఎన్‌జీఎల్‌వీ విశేషాలు..
► ఎన్‌జీఎల్‌వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు
► రాకెట్ వెడల్పు 5 మీటర్లు
► దశల్లోనే రాకెట్ ప్రయోగం
► పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ తరహాలో ఎన్‌జీఎల్‌వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు
► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు
► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్‌లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు.
షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్
షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment