క్రయోజనిక్ ఇంజిన్; ఎన్‌జీఎల్‌వీ ఊహా చిత్రం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్‌జీఎల్‌వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్‌ఎల్‌వీ, ఏఏస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం03, ఎస్‌ఎస్‌ఎల్‌వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది.
గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్‌జీఎల్‌వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
6న ‘ఎల్‌పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు.
ఎన్‌జీఎల్‌వీ విశేషాలు...
► ఎన్‌జీఎల్‌వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు
► వెడల్పు 5 మీటర్లు.
► పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి.
► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు
► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు.
► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది.
► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్‌జీఎల్‌వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment