ఇస్రో తదుపరి చైర్మన్‌గా నారాయణన్‌ | Who Is V Narayanan Newly Appointed As ISRO Chairman, Know Interesting Facts About Him In Telugu | Sakshi
Sakshi News home page

ఇస్రో తదుపరి చైర్మన్‌గా నారాయణన్‌

Published Wed, Jan 8 2025 7:11 AM | Last Updated on Wed, Jan 8 2025 9:46 AM

V Narayanan Appointed New ISRO Chief

ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తదుపరి ఛైర్మన్‌గా వి.నారాయణన్‌ (Narayanan) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇస్రో తదుపరి చైర్మన్‌గా వి.నారాయణన్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, నారాయణన్‌ రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్‌ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.

నారాయణన్‌ ఖరగ్‌పూర్‌ ఐఐటీలో క్రయోజనిక్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు అతనికి సిల్వర్ మెడల్ లభించింది. ఇక, 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్‌ సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఇస్రో చైర్మన్‌గా బాధత్యలు చేపట్టనున్న నేపథ్యంలో నారాయణన్‌ స్పందించారు. ఈ సందర్బంగా కేరళలోని తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ కోసం మాకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ ఉంది. మా వద్ద ప్రభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రయోగాల్లో ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఎల్పీఎస్సీ డైరెక్టర్‌గా నారాయణన్‌ జీఎస్‌ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నారాయణన్‌ సారథ్యంలోనే పలు ఇస్రో మిషన్‌ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటివరకు 183 లిక్విడ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను, కంట్రోల్‌ పవర్‌ ప్లాంట్‌లను అందించింది. పలు ఇస్రో ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటిల్లో ఆదిత్య స్పేస్‌క్రాప్ట్‌ రూపకల్పన, జీఎస్‌ఎల్వీ ఎంకే 3 మిషన్‌ వంటి కీలకమైనవి. కాగా, ప్రస్తుత చైర్మన్‌ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement