Rocket experiments
-
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
రాష్ట్రంలో రాకెట్ డిజైన్, తయారీ కేంద్రం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ అభినందన సభ శుక్రవారం ఇక్కడ జరిగింది. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్కైరూట్ ప్రతిపాదించిన సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని, భారత అంతరిక్ష రంగానికి ఇది చరిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. రాకెట్ లాంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదన్న కేటీఆర్, తొలి ప్రయత్నంలోనే అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపగలిగే సత్తా సంపాదించడం మాములు విషయం కాదని చెప్పారు. స్పేస్ టెక్నాలజీకి హైదరాబాద్ రాజధానిగా మారుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్పేస్ టెక్ పాలసీతో హైదరాబాద్‌లోనే రాకెట్లు తయారు చేసి, ఇక్కడి నుంచే ప్రయోగించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీ ప్రతినిధి పవన్ అన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్నమైన విభా గాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సపోర్ట్ ఎకో సిస్టం హైదరాబాద్‌లో ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. చదవండి: Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. -
వెనుకబడిన ఇస్రో..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త కొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతోంది. మానవ జీవన గమనంతో పాటు దేశ సాంకేతిక అభివృద్ధికి అవరోధంగా మారింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో రాకెట్ ప్రయోగాలకు సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. రెండు దశాబ్దాల కాలంలో రాకెట్ ప్రయోగం జరగని ఏడాది లేదు. రెండేళ్లకు ముందు వరకు ఏడాదికి ఏడెనిమిది ప్రయోగాలు చేస్తే.. రెండేళ్లలో నాలుగు ప్రయోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కరోనా కుదేలు చేసింది. రెండేళ్లుగా రాకెట్ ప్రయోగాలకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. 2020 మార్చిలో విజృంభించిన కరోనా ప్రభావంతో ఆ ఏడాది రెండు ప్రయోగాలకు పరిమితమైంది. 2015 నుంచి 2019 వరకు ఏడాదికి 7, 8 తగ్గకుండా ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రయోగాల సంఖ్య పెంచడానికి మూడో ప్రయోగ వేదిక అందుబాటులోకి తీసుకు వచ్చింది. చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగం కోసంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇందు కోసం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్పట్నం వద్ద మరో ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు. పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలన్నింటిని కులశేఖర్పట్నం నుంచి చేసి భారీ ప్రయోగాలను శ్రీహరికోట నుంచి చేయాలని సంకల్పించారు. భారీ లక్ష్యాలకు కరోనా షాక్ 2020లో సుమారు 12 ప్రయోగాలు, 2021లో 16 ప్రయోగాలు చేయాలని ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇస్రోకు కరోనా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూ, సంపూర్ణ లాక్‌డౌన్‌తో ఆ ఏడాది మొత్తానికి రెండు ప్రయోగాలకే పరిమితమైంది. 2021 సంవత్సరాన్ని ‘స్పేస్ రీఫార్మ్ ఇయర్’గా ఇస్రో నిర్ణయించింది. ఈ ఏడాదిలో 16 ప్రయోగాలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో కరోనా రెండో విడత విరుచుకుపడి ఎంతో మందిని షార్ ఉద్యోగులను బలిగొంది. లాక్డౌన్ సమయంలో షార్ కేంద్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఇస్రో సెంటర్లలో కరోనా మహమ్మారి విజృంభించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు వెబినార్ సిస్టం ద్వారా ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకుంటూ రాకెట్ ప్రయోగానికి మళ్లీ పూనుకున్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లు వాడుకుంటూ గతేడాదిన రెండు ప్రయోగాలు, ఈ ఏడాది రెండు ప్రయోగాలు మాత్రమే చేయగలిగారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు ప్రయోగాల్లో దురదృష్టవశాత్తూ ఒక్క ప్రయోగం విఫలమైంది. వెంటాడుతున్న ఒమిక్రాన్ తాజాగా ప్రయోగాలకు సిద్ధమవ్వాలనుకునే సమయంలో ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. దీని ప్రభావం 2022 సంవత్సరంలో జరిగే ప్రయోగాలకు బ్రేక్ పడుతుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన రెండేళ్లలో ఎంతో సాధించాలని అనుకున్న ఇస్రోకు కరోనా మహమ్మారి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఎస్ఎస్ఎల్వీ అనే నూతన రాకెట్ ప్రయోగం, చంద్రయాన్–3, గగన్‌యాన్–1 ప్రయోగాలకు సంబంధించి కొన్ని ప్రయోగాత్మక పరీక్షలు కూడా నిర్వహించి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌తో అన్ని ప్రయోగాలకు బ్రేక్ పడింది. దేశంలోని ప్రధానంగా 11 ఇస్రో సెంటర్లలో రాకెట్స్, శాటిలైట్స్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఊపందుకున్న సమయంలో ఒమిక్రాన్‌తో మందగించాయి. రాబోయే 2022 సంవత్సరంలో ఇస్రో మరెన్నో అద్భుతమైన భారీ ప్రయోగాలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చితే 2022 సంవత్సరం కూడా రాకెట్ ప్రయోగాలకు అవరోధం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో 22 ప్రయోగాలు చేశారు. 2020, 2021 తప్ప మిగిలిన మూడేళ్లు ఆరు ఏడు ప్రయోగాలకు తగ్గకుండా చేయడం విశేషం. వాణిజ్య పరంగా వెనుకబడిన ఇస్రో గత కొన్నేళ్లుగా వాణిజ్య పరంగా ఇస్రో తిరుగులేని శక్తిగా అవతరించింది. విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా పంపించి ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయాన్ని తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. 1999 నుంచి 2021 వరకు తీసుకుంటే 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా పంపించి ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు తగ్గకుండా వ్యాపారం చేశారు. 2017లో 29 విదేశీ ఉపగ్రహాలు, 2018లో 33, 2019లో 14 విదేశీ ఉపగ్రహాలను పంపించి ఆదాయ వనరులను పెంచుకున్న ఇస్రో 2020, 2021 సంవత్సరాల్లో ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది. కేవలం 2020లో 3, 2021లో 3 విదేశీ ఉపగ్రహాలను పంపించి సరిపెట్టుకుంది. కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకునే ప్రయోగాలకు బ్రేక్ పడడమే కాకుండా వాణిజ్య పరంగా విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు కూడా తగ్గిపోవడంలో ఆదాయ వనరులు తగ్గాయి. అయితే శ్రీహరికోట రాకెట్ కేంద్రం భూ మ«ధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ తక్కువగా ఉండడం వల్ల ఇంధనం ఖర్చు తగ్గడంతో తక్కువ ధరలకే విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడంతో మరిన్ని దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచి పంపించుకోవడానికి పలు దేశాలు ఇప్పటికే ఇస్రోతో ఒప్పందం కూడా చేసుకున్నాయని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇస్రోకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. -
అణువిపత్తు లేదిక!
వాషింగ్టన్: ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో సింగపూర్‌లో జరిగిన భేటీ అసాధారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ భేటీ కారణంగా భారీ అణు విపత్తునుంచి ప్రపంచం ఒక అడుగు వెనక్కు వేయగలిగిందన్నారు. తన దేశప్రజల శ్రేయస్సు దిశగా ధైర్యంగా తొలి అడుగు వేసిన కిమ్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ‘చైర్మన్ కిమ్‌కు కృతజ్ఞతలు. అసాధారణమైన భేటీ ఇది. మార్పు సాధ్యమేనని ఈ సమావేశం ద్వారా స్పష్టం చేసింది. తన ప్రజలకు మేలు చేసే దిశగా కిమ్ ధైర్యంగా ఓ అడుగు ముందుకేశారు. ప్రపంచం ఓ భారీ అణువిపత్తు నుంచి ఓ అడుగు వెనక్కు వేసింది’ అని సదస్సు ముగించుకుని వెళ్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ‘ఇకపై రాకెట్ ప్రయోగాలు, అణు పరీక్షలు, పరిశోధనలు జరగవు. బందీలుగా ఉన్న వారు స్వదేశాలకు చేరుకున్నారు. చైర్మన్ కిమ్‌కు ధన్యవాదాలు. మనం భేటీ అయిన ఈ రోజు చరిత్రాత్మకం. ఉత్తరకొరియా ఇకపై అమెరికాకు ఓ హెచ్చరిక కాబోదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం సందర్భంగా మూడో ప్రయోగ కేంద్రాన్నీ (మిసైల్ ఇంజిన్ల ప్రయోగ కేంద్రం) ధ్వంసం చేసేందుకు కిమ్ అంగీకరించారు. మిసైల్ ఇంజిన్ పరీక్ష కేంద్రంతో పాటు మిగిలిన క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసే ప్రణాళికలను కిమ్ త్వరలో వెల్లడిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ‘అణ్వాయుధాలు ఇకపై ఉండబోవని కిమ్ తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కార్యాచరణ ఉంటుందన్నారు. మేం ఆయనకు భద్రతాపరమైన భరోసా ఇచ్చాం. దీనిపై కిమ్ సంతోషంగా ఉన్నారు’ అని ట్రంప్ అన్నారు. దక్షిణ కొరియాలోనూ ఇకపై అమెరికా సైనిక విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేశారు. పరిమితుల్లేని పురోగతి అణ్వాయుధాలను త్యజించిన తర్వాత ఉత్తరకొరియా సాధించే ప్రగతికి పరిమితుల్లేవని.. ప్రపంచంతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకున్న తర్వాత పురోగతి పరుగులు పెడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఉత్తరకొరియా పౌరుల భద్రత, వారి శ్రేయస్సు కోసం సరికొత్త శకంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో వారి నేతగా కిమ్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. సింగపూర్ పర్యటనను నేనెప్పటికీ మరువలేను. ఉత్తరకొరియాలో అణ్వాయుధ నిరాయుధీకరణ విషయంలో భారీ ముందడుగు పడింది’ అని ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో దక్షిణ కొరియా, చైనా పర్యటనకు బయలుదేరారు. కిమ్‌తో ట్రంప్ సమావేశ వివరాలను ఈ దేశాల అధినేతలతో ఆయన పంచుకోనున్నారు. 2020 కల్లా ఉత్తరకొరియా పూర్తిగా నిరాయుధీకరణ చేస్తుందని పోంపియో వెల్లడించారు. ప్యాంగ్యాంగ్కు రండి చారిత్రక సింగపూర్ సదస్సు సందర్భంగా తమ దేశానికి రావాలంటూ ట్రంప్‌ను కిమ్ ఆహ్వానించారు. ఇందుకు ట్రంప్ అంగీకరించారని ఉత్తర కొరియా మీడియా (కేసీఎన్ఏ) ప్రకటించింది. ‘అణ్వాయుధ దేశాలు, ప్రచ్ఛన్నయుద్ధ శత్రువుల మధ్య ఓ అద్భుతమైన మార్పుకు నాంది’గా ఈ సమావేశాన్ని అభివర్ణిస్తూ బుధవారం కథనాన్ని వెలువరించింది. ఉభయ కొరియాల సరిహద్దుల్లో సైనిక విన్యాసాలను నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారని ఈ కథనం పేర్కొంది. ‘కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంతోపాటు అణునిరాయుధీకరణకోసం ఇరుదేశాలు శత్రుత్వం నుంచి బయటకు వచ్చి పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలి’ అని కిమ్ పేర్కొన్నట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. -
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
-
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. ఈ ప్రయోగంలో 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. దీనిపై మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రయోగతేదీని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. -
29న నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్08!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధాలవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగిం చేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 11న రాకెట్ మూడోదశ అయిన క్రయోజనిక్ దశ అనుసంధానం పూర్తయింది. దీంతో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు దశల రాకెట్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 19న రాకెట్ శిఖరభాగాన 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు రాకెట్‌కు అన్ని రకాల సాంకేతిక పరీక్షలు నిర్వహించి 23న మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి ప్రయోగవేదిక (ఉంబ్లికల్ టవర్)కు అనుసంధానించే పనులు చేపట్టనున్నారు. అక్కడ సుమారు ఆరు రోజుల పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం 29న సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
రాకెట్ ప్రయోగాలను వివరించేందుకు నాసా ఆప్!
న్యూయార్క్: రాకెట్ ప్రయోగాల గురించి పిల్లలకు తెలియజేసేందుకుగాను నాసా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ‘ఎల్ఎస్పీ యాక్టివిటీ బుక్’ అనే ఈ ఉచిత ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆప్.. రాకెట్ ప్రయోగానికి ఎలా సన్నద్ధం అవుతారు? ఏ ప్రయోగానికి ఏ వాహకనౌకను ఎంచుకుంటారు? వంటి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఆప్‌లో ఉండే ‘పీటర్ ద పేలోడ్’ అనే పాత్ర పిల్లలకు మార్గనిర్దేశం చేస్తుంది.