సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ అభినందన సభ శుక్రవారం ఇక్కడ జరిగింది. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్కైరూట్ ప్రతిపాదించిన సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని, భారత అంతరిక్ష రంగానికి ఇది చరిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. రాకెట్ లాంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదన్న కేటీఆర్, తొలి ప్రయత్నంలోనే అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపగలిగే సత్తా సంపాదించడం మాములు విషయం కాదని చెప్పారు. స్పేస్ టెక్నాలజీకి హైదరాబాద్ రాజధానిగా మారుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్పేస్ టెక్ పాలసీతో హైదరాబాద్‌లోనే రాకెట్‌లు తయారు చేసి, ఇక్కడి నుంచే ప్రయోగించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీ ప్రతినిధి పవన్ అన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్నమైన విభా గాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సపోర్ట్ ఎకో సిస్టం హైదరాబాద్‌లో ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు.
చదవండి: Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే..
Comments
Please login to add a commentAdd a comment