ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త కొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతోంది. మానవ జీవన గమనంతో పాటు దేశ సాంకేతిక అభివృద్ధికి అవరోధంగా మారింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో రాకెట్ ప్రయోగాలకు సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. రెండు దశాబ్దాల కాలంలో రాకెట్ ప్రయోగం జరగని ఏడాది లేదు. రెండేళ్లకు ముందు వరకు ఏడాదికి ఏడెనిమిది ప్రయోగాలు చేస్తే.. రెండేళ్లలో నాలుగు ప్రయోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కరోనా కుదేలు చేసింది. రెండేళ్లుగా రాకెట్ ప్రయోగాలకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. 2020 మార్చిలో విజృంభించిన కరోనా ప్రభావంతో ఆ ఏడాది రెండు ప్రయోగాలకు పరిమితమైంది. 2015 నుంచి 2019 వరకు ఏడాదికి 7, 8 తగ్గకుండా ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రయోగాల సంఖ్య పెంచడానికి మూడో ప్రయోగ వేదిక అందుబాటులోకి తీసుకు వచ్చింది. చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగం కోసంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇందు కోసం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్‌పట్నం వద్ద మరో ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాలన్నింటిని కులశేఖర్‌పట్నం నుంచి చేసి భారీ ప్రయోగాలను శ్రీహరికోట నుంచి చేయాలని సంకల్పించారు.
భారీ లక్ష్యాలకు కరోనా షాక్
2020లో సుమారు 12 ప్రయోగాలు, 2021లో 16 ప్రయోగాలు చేయాలని ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇస్రోకు కరోనా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూ, సంపూర్ణ లాక్‌డౌన్‌తో ఆ ఏడాది మొత్తానికి రెండు ప్రయోగాలకే పరిమితమైంది. 2021 సంవత్సరాన్ని ‘స్పేస్ రీఫార్మ్ ఇయర్’గా ఇస్రో నిర్ణయించింది. ఈ ఏడాదిలో 16 ప్రయోగాలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో కరోనా రెండో విడత విరుచుకుపడి ఎంతో మందిని షార్ ఉద్యోగులను బలిగొంది. లాక్‌డౌన్ సమయంలో షార్ కేంద్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఇస్రో సెంటర్లలో కరోనా మహమ్మారి విజృంభించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు వెబినార్ సిస్టం ద్వారా ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకుంటూ రాకెట్ ప్రయోగానికి మళ్లీ పూనుకున్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లు వాడుకుంటూ గతేడాదిన రెండు ప్రయోగాలు, ఈ ఏడాది రెండు ప్రయోగాలు మాత్రమే చేయగలిగారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు ప్రయోగాల్లో దురదృష్టవశాత్తూ ఒక్క ప్రయోగం విఫలమైంది.
వెంటాడుతున్న ఒమిక్రాన్
తాజాగా ప్రయోగాలకు సిద్ధమవ్వాలనుకునే సమయంలో ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. దీని ప్రభావం 2022 సంవత్సరంలో జరిగే ప్రయోగాలకు బ్రేక్ పడుతుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన రెండేళ్లలో ఎంతో సాధించాలని అనుకున్న ఇస్రోకు కరోనా మహమ్మారి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ అనే నూతన రాకెట్ ప్రయోగం, చంద్రయాన్–3, గగన్‌యాన్–1 ప్రయోగాలకు సంబంధించి కొన్ని ప్రయోగాత్మక పరీక్షలు కూడా నిర్వహించి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌తో అన్ని ప్రయోగాలకు బ్రేక్ పడింది. దేశంలోని ప్రధానంగా 11 ఇస్రో సెంటర్లలో రాకెట్స్, శాటిలైట్స్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఊపందుకున్న సమయంలో ఒమిక్రాన్‌తో మందగించాయి.
రాబోయే 2022 సంవత్సరంలో ఇస్రో మరెన్నో అద్భుతమైన భారీ ప్రయోగాలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చితే 2022 సంవత్సరం కూడా రాకెట్ ప్రయోగాలకు అవరోధం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో 22 ప్రయోగాలు చేశారు. 2020, 2021 తప్ప మిగిలిన మూడేళ్లు ఆరు ఏడు ప్రయోగాలకు తగ్గకుండా చేయడం విశేషం.
వాణిజ్య పరంగా వెనుకబడిన ఇస్రో
గత కొన్నేళ్లుగా వాణిజ్య పరంగా ఇస్రో తిరుగులేని శక్తిగా అవతరించింది. విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా పంపించి ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయాన్ని తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. 1999 నుంచి 2021 వరకు తీసుకుంటే 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా పంపించి ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు తగ్గకుండా వ్యాపారం చేశారు. 2017లో 29 విదేశీ ఉపగ్రహాలు, 2018లో 33, 2019లో 14 విదేశీ ఉపగ్రహాలను పంపించి ఆదాయ వనరులను పెంచుకున్న ఇస్రో 2020, 2021 సంవత్సరాల్లో ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది.
కేవలం 2020లో 3, 2021లో 3 విదేశీ ఉపగ్రహాలను పంపించి సరిపెట్టుకుంది. కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకునే ప్రయోగాలకు బ్రేక్ పడడమే కాకుండా వాణిజ్య పరంగా విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు కూడా తగ్గిపోవడంలో ఆదాయ వనరులు తగ్గాయి. అయితే శ్రీహరికోట రాకెట్ కేంద్రం భూ మ«ధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ తక్కువగా ఉండడం వల్ల ఇంధనం ఖర్చు తగ్గడంతో తక్కువ ధరలకే విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడంతో మరిన్ని దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచి పంపించుకోవడానికి పలు దేశాలు ఇప్పటికే ఇస్రోతో ఒప్పందం కూడా చేసుకున్నాయని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇస్రోకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment