
సాక్షి, సూళ్లూరుపేట: ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగం సిద్ధంచేసింది. ఈ నెల 28న ఉ.10.24 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ51తో తొలి అడుగు వేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్ ద్వారా దేశంలోని ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్ బీస్ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్–1 నానో కాంటాక్ట్–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్ ధవన్ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేసి సిద్ధంచేశారు. ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్)కు గురువారం అప్పగించనున్నారు. 27వ తేదీ శనివారం ఉ.9.24 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment