సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం.
పీఎస్‌ఎల్‌వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్‌ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్‌బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది.
అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం
పీఎస్‌ఎల్‌వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది.
ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే
పీఎస్‌ఎల్‌వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సి–56 లాంఛ్ వెహికల్‌లో వాడిన నావిగేషన్ ఇంటర్‌ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్‌ఎల్‌వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్‌ఎల్‌వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment