స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పూర్తి స్వరూపం ఇది. ఇది ఇస్రో డిజైన్ చేసిన ఊహాచిత్రం, ప్రయోగవేదికపై మొదటిదశ అనుసంధానం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్ ద్వారా 142 కేజీల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ అనే ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధానం చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా మారిపోవడంతో పలు దేశాలు చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బుల్లి ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందించింది.
వాణిజ్య ప్రయోగాలకు వీలుగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ..
ఇప్పటివరకు ఇస్రో.. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్లతో ఉపగ్రహాలను రోదసి లోకి పంపించింది. ప్రస్తుతం ఆరో రకం రాకెట్‌గా ఎస్‌ఎస్‌ఎల్‌వీని తయారు చేసింది. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీని మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎల్‌వీని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
2016లోనే ప్రతిపాదన..
2016లో ప్రొఫెసర్ రాజారాం నాగప్ప నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ నివేదిక ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించుకునేందుకు వీలుగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ప్రతిపాదించారు. 2016లో లిక్విడ్ ప్రొపల్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సోమనాథ్(ప్రస్తుత ఇస్రో చైర్మన్) 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో పంపే వెహికల్ అవసరాన్ని గుర్తించారు.
► 2017 నవంబర్ నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డిజైన్‌ను రూపొందించారు. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 2018 డిసెంబర్ నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీని పూర్తిస్థాయిలో తయారుచేశారు.
► 2020 డిసెంబర్ నుంచి 2022 మార్చి 14 వరకు రాకెట్ అన్ని దశలను విడివిడిగా ప్రయోగాత్మకంగా ప్రయోగించి తరువాత వెహికల్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి ప్రయోగానికి చర్యలు చేపట్టారు.
ప్రయోగం ఇలా..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతోనే ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధన దశ ఉండదు. నాలుగో దశలో వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా రూపకల్పన చేశారు. ఈ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment