29న శ్రీహరికోటలో 100వ ప్రయోగం | 100th launch at Sriharikota on the 29th | Sakshi
Sakshi News home page

29న శ్రీహరికోటలో 100వ ప్రయోగం

Published Sat, Jan 25 2025 4:47 AM | Last Updated on Sat, Jan 25 2025 8:53 AM

100th launch at Sriharikota on the 29th

ఆ రోజు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–15 ప్రయోగించనున్న ఇస్రో

నావిక్‌ వ్యవస్థలో నావిక్‌–2 తొమ్మిదో ఉపగ్రహం

ఈ ఉపగ్రహంతో మరింత కచ్చితంగా భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో).. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్‌–2 ఉప గ్రహాన్ని రోదశిలోకి పంపనుంది. సుమా­రు 2,500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 

ఇది నావి­గేషన్‌ ఉప గ్రహాల సిరీస్‌లో తొమ్మిదవ, నావిక్‌ ఉపగ్రహాల సిరీస్‌లో రెండో ఉపగ్రహం. జీఎస్‌­ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 17వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ దశతో 11వ ప్రయోగం. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నిర్మించిన తర్వాత 100వ ప్రయోగం. ఇన్ని విశేషాల మధ్య ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్ట­డా­నికి ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు.  

నావిక్‌ ఉపగ్రహాలతో ఎన్నో ఉపయోగాలు
నావిగేషన్‌ విత్‌ కాన్ట్సలేషన్‌ (నావిక్‌) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉప­గ్రహ వ్యవస్థ. దేశంలోని వినియోగదా­రులకు కచ్చి­త­మైన స్థానం, వేగం, సమయ సేవలను అందించేందుకు ఈ వ్యవస్థను ఇస్రో రూపొందించింది. భారత భూ భాగాన్ని మించి 1,500 కిలో­మీటర్లు దాకా నావిక్‌ రెండు రకా­లుగా సేవలను అందిస్తుంది. స్థాండర్డ్‌ పొజిష­నింగ్‌ సర్వీస్‌ సేవలు, రిస్ట్రిక్టెడ్‌ సేవలను అంది­స్తుంది. 

2023 మే 29న నావిక్‌–01 ఉపగ్రహానికి అనుసంధానంగా ఇప్పుడు 2వ ఉప గ్రహాన్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు నావిక్‌ సిరీస్‌లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాది­లోనే ప్రయోగించను­న్నారు. నావిగేషన్‌ వ్యవ­స్థను బలోపేతం చేయ­డా­నికి ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం (ఐఆర్‌ఎన్‌­ఎస్‌ఎస్‌) 8 ఉపగ్రహాలను ప్రయో­గించారు. 

ఈ వ్యవస్థను ఇంకా బలోపే­తం చేయడానికి రెండవ తరం నావిక్‌ ఉపగ్ర­హాలను ఇస్రో ప్రయోగిస్తోంది. నావిక్‌–01 ఉపగ్రహాన్ని సరికొత్తగా ఎల్‌–5, ఎస్‌ బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించి ప్రయో­గించారు. దీన్ని న్యూ జనరేషన్‌ ఉపగ్ర­హమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబు­తు­న్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ఎల్‌–1 బాండ్‌లో కొత్తగా సివిలియన్‌ సిగ్నల్‌ను పరిచ­యం చేయ­బో­తున్నారు. 

ఈ ఉపగ్రహంలో అణు గడియా­రా­లను సైతం అమర్చారు. నావిక్‌–2 ఉపగ్ర­హాన్ని ఎల్‌–1, ఎల్‌–5, ఎస్‌ బాండ్‌ నావి­గేషన్‌ పేలోడ్‌­తో కాన్ఫిగరేషన్‌ చేశారు.  ఐఆర్‌ఎన్‌­ఎస్‌ఎస్‌–1 స్థానంలో నావిక్‌–02ను ప్రవేశపెడు­తు­న్నారు. ఇందులో సమయాన్ని కచ్చితంగా అంచనా వేయ­డానికి పరమాణు గడియారా­లను అమ­ర్చారు. 

ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమా­చారం, వాహన చోదకులకు దిశా నిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌక­ర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమా­నయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవస­రా­లకు సైతం ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. 

ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా..
ఈ రాకెట్‌ ప్రయోగాన్ని అత్యంత దగ్గరగా వీక్షించాలనుకునే వారు https://lvg.shar. gov.in/VSCREGISTRATION/ index. jsp  లింక్‌ ఓపెన్‌ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement