Satish Dhawan Space Centre (Shar)
-
29న శ్రీహరికోటలో 100వ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో).. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్–2 ఉప గ్రహాన్ని రోదశిలోకి పంపనుంది. సుమారు 2,500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇది నావిగేషన్ ఉప గ్రహాల సిరీస్‌లో తొమ్మిదవ, నావిక్ ఉపగ్రహాల సిరీస్‌లో రెండో ఉపగ్రహం. జీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 17వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ దశతో 11వ ప్రయోగం. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత 100వ ప్రయోగం. ఇన్ని విశేషాల మధ్య ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. నావిక్ ఉపగ్రహాలతో ఎన్నో ఉపయోగాలునావిగేషన్ విత్ కాన్ట్సలేషన్ (నావిక్) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దేశంలోని వినియోగదారులకు కచ్చితమైన స్థానం, వేగం, సమయ సేవలను అందించేందుకు ఈ వ్యవస్థను ఇస్రో రూపొందించింది. భారత భూ భాగాన్ని మించి 1,500 కిలోమీటర్లు దాకా నావిక్ రెండు రకాలుగా సేవలను అందిస్తుంది. స్థాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ సేవలు, రిస్ట్రిక్టెడ్ సేవలను అందిస్తుంది. 2023 మే 29న నావిక్–01 ఉపగ్రహానికి అనుసంధానంగా ఇప్పుడు 2వ ఉప గ్రహాన్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు నావిక్ సిరీస్‌లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే ప్రయోగించనున్నారు. నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్) 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి రెండవ తరం నావిక్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది. నావిక్–01 ఉపగ్రహాన్ని సరికొత్తగా ఎల్–5, ఎస్ బాండ్ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించి ప్రయోగించారు. దీన్ని న్యూ జనరేషన్ ఉపగ్రహమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ఎల్–1 బాండ్లో కొత్తగా సివిలియన్ సిగ్నల్‌ను పరిచయం చేయబోతున్నారు. ఈ ఉపగ్రహంలో అణు గడియారాలను సైతం అమర్చారు. నావిక్–2 ఉపగ్రహాన్ని ఎల్–1, ఎల్–5, ఎస్ బాండ్ నావిగేషన్ పేలోడ్‌తో కాన్ఫిగరేషన్ చేశారు. ఐఆర్ఎన్ఎస్ఎస్–1 స్థానంలో నావిక్–02ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో సమయాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి పరమాణు గడియారాలను అమర్చారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు సైతం ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా..ఈ రాకెట్ ప్రయోగాన్ని అత్యంత దగ్గరగా వీక్షించాలనుకునే వారు https://lvg.shar. gov.in/VSCREGISTRATION/ index. jsp లింక్ ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్లో ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీలు వంపులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు సమాంతర కక్ష్యలోకి వెళ్లిన తరువాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలను అందిస్తాయి. అయితే ఉపగ్రహం బరువు మొత్తం 400కేజీలు అయినప్పటికీ ఇందులో రెండు ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే. మిగిలిన 180 కిలోలు ఉపగ్రహాల్లో ఇంధనం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాకెట్‌కు అన్ని దశలను పూర్తిచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తరువాత ఎంఆర్ఆర్ సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇండో–ఫ్రాన్స్ కలయికతో ‘త్రిష్ణా’
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సెంటర్ నేషనల్ ఎట్యుడస్ స్పాటైలెస్ (సీఎన్ఈఎస్) అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా త్రిష్ణా (థర్మల్ ఇన్ఫ్రా–రెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్మెంట్) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్–ఫ్రాన్స్‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, ఉద్గారత, బయో ఫిజికల్, రేడియేషన్, అధిక టెంపోరల్ రిజల్యూషన్ పర్యవేక్షణ కోసం ఇరు దేశాలు సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నాయి. ఈ ఉపగ్రహంలో రెండు పెద్ద పేలోడ్స్‌ను అమర్చి పంపబోతున్నట్లు ఇస్రో తెలిపింది. త్రిష్ణా ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని, క్లిష్టమైన నీరు, ఆహారభద్రత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ఇప్పటిదాకా ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఒక ఎత్తయితే త్రిష్ణా శాటిలైట్ మరో ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగాన్ని సతీ‹Ù ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
ISRO PSLV-C56: ఇస్రో మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది. ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే పీఎస్ఎల్వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్ఎల్వీ సి–56 లాంఛ్ వెహికల్లో వాడిన నావిగేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్ఎల్వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్ఎల్వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు. -
25న మళ్లీ చంద్రయాన్–3 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్–3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆగస్ట్ 1 నాటికి చంద్రయాన్–3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. -
30న పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్‌ను లూనార్ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం. -
అందీ అందని చందమామ
చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అని వ్యాఖ్యానించాడు. చంద్రుడిని చేరుకోవాలనేది మనిషి చిరకాల స్వప్నం. వీలుంటే చంద్రలోకంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. చంద్రుడిపై కాలుమోపిన మనిషి ఇంతవరకు అక్కడ కాళ్లూనుకోలేదు.అందీ అందకుండా ఊరిస్తున్న చందమామపై దేశదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలను మానుకోలేదు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి రెండో అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా చందమామ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈసారి అంతర్జాతీయ చంద్ర దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న అంశం ‘చంద్రునిపై అన్వేషణలో సమన్వయం, సుస్థిరత’. చంద్రునిపై అన్వేషణలోను, పరిశోధనల్లోను వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సమన్వయం, పరిశోధనల్లో సుస్థిరత కోసం ఐక్యరాజ్య సమితి ఈ అంశాన్ని ఎంపిక చేసుకుంది. మనిషి చంద్రుడిపై కాలుమోపడం నిజంగానే మానవాళికి ముందడుగు. చంద్రుడి ఆనుపానులు పూర్తిగా తెలుసుకోవాలంటే మరిన్ని అడుగులు మునుముందుకు వేయాలి. శాస్త్రవేత్తలు ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఒక్కో అడుగు ముందుకు వేసినప్పుడల్లా చంద్రుడి గురించి కొత్త కొత్త విశేషాలను తెలుసుకుని, మానవాళికి వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి ముందు చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. మానవాళికి ముందడుగు చంద్రుణ్ణి అందుకోవాలనే తపన మనుషుల్లో చాన్నాళ్లుగానే ఉంది. తొలి రోజుల్లో అమెరికా, సోవియట్ రష్యా చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాల్లో పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టాయి. తప్పటడుగుల దశలో జరిపిన దాదాపు అరడజను ప్రయోగాలు విఫలమైన తర్వాత తొలిసారిగా సోవియట్ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్ 12న సోవియట్ రష్యా ప్రయోగించిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడి విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలను సాగిస్తూనే ఉన్నాయి. తొలి దశాబ్దకాలంలో ఈ ప్రయోగాల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాతి నుంచి ప్రయోగాలలో వైఫల్యాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969 జూలై 16న ‘అపోలో–11’ ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా ఇద్దరు వ్యోమగాములు– నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి చేరుకున్నారు. జూలై 20న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు మోపి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ‘నాసా’ 1968 డిసెంబర్ 20న ముగ్గురు వ్యోమగాములతో ‘అపోలో–8’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి మీదకు మనుషులతో చేరుకున్న తొలి వ్యోమనౌక ఇదే. ఇందులో ఫ్రాంక్ ఎఫ్ బోర్మన్–ఐఐ, జేమ్స్ ఏ లవల్ జూనియర్, విలియమ్ ఏ ఆండ్రెస్ చంద్రుడి మీదకు వెళ్లారు. అయితే వారెవరూ చంద్రుడిపై అడుగు మోపకుండానే తిరిగి వచ్చేశారు. తొలి ప్రయోగాలు విఫలం చంద్రుడి కక్ష్యలోకి చేరుకునే తొలి ప్రయత్నాన్ని అమెరికా చేసింది. ‘నాసా’ ఏర్పాటుకు కొద్దికాలం ముందే అమెరికన్ వైమానికదళంలోని బాలిస్టిక్ మిసైల్స్ విభాగం 1958 ఆగస్టు 17న ‘పయోనీర్–0’ ప్రయోగాన్ని చేపట్టింది. భూ కక్ష్యను దాటి ఒక వస్తువును అంతరిక్షంలోకి పంపేందుకు చేసిన తొలి ప్రయోగం ఇది. థోర్ మిసైల్ ద్వారా ‘పయోనీర్–0’ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగం జరిపారు. అయితే, టర్బోపంప్, గేర్‌బాక్స్‌లలో తలెత్తిన లోపాల వల్ల ఇది భూమి నుంచి 16 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. ఈ వైఫల్యానికి కొద్దిరోజుల ముందే 1958 జూలై 29న ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి గల అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను నెలకొల్పింది. ‘పయోనీర్–0’ వైఫల్యం తర్వాత అమెరికా చేపట్టిన ప్రయోగాలన్నీ ‘నాసా’ ద్వారానే జరిగాయి. అమెరికాతో పాటే అప్పటి సోవియట్ రష్యా కూడా 1958 సెప్టెంబర్ 23న ‘లూనా ఈ–1 నం:1’ ప్రయోగాన్ని చేపట్టింది. అప్పటి సోవియట్ రాకెట్ తయారీ సంస్థ దీనిని రూపొందించింది. సోవియట్ రష్యా చేపట్టిన ఈ తొలి ప్రయోగం కూడా విఫలమైంది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయని శాస్త్రవేత్తలు అక్కడితో ఆగిపోలేదు. పట్టువదలకుండా ప్రయోగాలను సాగిస్తూ, మొత్తానికి చంద్రుణ్ణి చేరుకున్నారు. సాహిత్యంలో చంద్రయానం పలు ప్రాచీన నాగరికతల్లో చంద్రుడి ఆరాధన కనిపిస్తుంది. కొన్ని పురాణాల్లో చంద్రలోక వర్ణన కూడా కనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలో గాని మనిషి చంద్రుణ్ణి చేరుకోవడం సాధ్యం కాలేదు. అయితే, చంద్రుణ్ణి చేరుకోవాలనే ఆశ మాత్రం మనిషిలో శతాబ్దాలుగా ఉంది. ప్రాచీన సాహిత్యం ఈ ఆశకు అద్దం పడుతోంది. ప్రాచీన గ్రీకు రచయితలు ఆంటోనియస్ డయోజనీజ్, లూసియన్ ఆఫ్ సమాసతా వంటి వారి రచనల్లో చంద్రయానానికి సంబంధించిన కల్పనలు ఉండేవని చెబుతారు. ఆ రచనలు కాలగతిలో అంతరించడంతో వాటిని సాధికారికమైన ఆధారాలుగా పరిగణించలేం. జర్మన్ ఖగోళవేత్త, రచయిత జోహాన్నెస్ కెప్లర్‘సోమ్నియమ్’ అనే నవలలో మనిషి చంద్రుడిపైకి ఎగిరి వెళ్లడం గురించి రాశాడు. కెప్లర్ మరణానంతరం ఈ నవల 1634లో వెలుగులోకి వచ్చింది. దాదాపు అదేకాలంలో ఇంగ్లిష్ చరిత్రకారుడు, రచయిత ఫ్రాన్సిస్ గాడ్విన్ ‘ది మ్యాన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. గాడ్విన్ మరణానంతరం ఇది 1638లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ భాషల్లో చంద్రయానం గురించి చాలా కాల్పనిక రచనలు వెలువడ్డాయి. కాలం గడిచే కొద్దీ ఈ రచనల్లోని కల్పనలు వాస్తవానికి దగ్గరవుతూ రావడం విశేషం. రిచర్డ్ ఆడమ్స్ లాక్ ‘గ్రేట్ మూన్ హోక్స్’ను 1835లో న్యూయార్క్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ఆరు భాగాలుగా ప్రచురించింది. లాక్ ఈ వ్యంగ్యరచనలో చంద్రునిపై జీవజాలాన్ని, నాగరికతను సర్ జాన్ హెర్షల్ కనుగొన్నట్లు ఎద్దేవా చేస్తూ రాశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ 1865లో ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’ నవల రాశాడు. ఇందులో భూమి నుంచి చంద్రునిపైకి చేరుకోగల సాధనాన్ని తయారుచేసే ప్రక్రియను కొంత శాస్త్రీయంగా వివరించాడు. ఫిరంగి ద్వారా చంద్రునిపైకి ఒక వస్తువును పంపే యత్నాన్ని ఇందులో ప్రస్తావించాడు. దీనిని బట్టి తీవ్రమైన పేలుడుతోనే చంద్రుని వరకు చేరుకోవడం సాధ్యం కాగలదనే విషయంపై అప్పటికే జనాలకు అర్థమైందని అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంగ్లిష్ రచయిత హెచ్.జి.వెల్స్ 1901లో ‘ది ఫస్ట్ మెన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. ఇందులో గురుత్వాకర్షణ పరిధిని అధిగమించగల పదార్థాన్ని తయారు చేసేందుకు ఒక శాస్త్రవేత్త పాత్ర సాగించే ప్రయత్నాలను వివరించాడు. అదే ఏడాది మరో ఇంగ్లిష్ రచయిత జార్జ్ గ్రిఫిత్ ‘ఎ హనీమూన్ ఇన్ స్పేస్’ నవల రాశాడు. భూమి నుంచి చంద్రుని వరకు సాగిన ప్రణయయాత్రకు చెందిన కాల్పనిక నవల ఇది. గ్రిఫిత్ ఇందులో స్పేస్‌సూట్ గురించి వర్ణించాడు. శాస్త్రవేత్తలెవరూ అప్పటికి స్పేస్‌సూట్‌ను ఇంకా తయారు చేయలేదు. వెండితెరపై చంద్రయానం ఇంకా టాకీలు రాక మునుపే చంద్రయానం అంశంగా ఒక సినిమా వచ్చింది. ఫ్రెంచి ఇంద్రజాలికుడు, దర్శకుడు జార్జెస్ మెలీస్ 1902లో ‘లె వోయేజ్ దాన్స్ లా లూన్’ పేరిట మూకీ చిత్రం తీశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘అరౌండ్ ది మూన్’ ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ ప్రాచుర్యం ఉన్న ప్రాంతాల్లో ‘ఎ ట్రిప్ టు ది మూన్’ పేరుతో విడుదల చేశారు. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించిన ఈ చిత్రానికి అప్పట్లోనే కలరైజేషన్ కూడా చేశారు. మెలీస్ చిత్రరంగం నుంచి తప్పుకున్నాక ఈ చిత్రం ప్రింట్ కనిపించకుండా పోయింది. దీనిని 1930 ప్రాంతంలో కొందరు గుర్తించారు. కలరైజ్ చేసిన దీని ఒరిజినల్ ప్రింట్‌ను 1993లో గుర్తించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దానిని 2011లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే పదివేల ఫ్రాంకులు ఖర్చయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం ఇది భారీ బడ్జెట్ చిత్రం కిందే లెక్క. దీని తర్వాత టాకీల కాలం వచ్చాక 1950లో అమెరికన్ దర్శకుడు, నటుడు ఇర్వింగ్ పిషెల్ ‘డెస్టినేషన్ మూన్’ చిత్రాన్ని తీశాడు. ఇందులో మనుషులు చంద్రునిపైకి చేరుకున్న దృశ్యాలను దాదాపు వాస్తవ దృశ్యాలను తలపించేలా చిత్రించడం విశేషం. ఇలాంటి సినిమాలు భారత్‌లో ఆలస్యంగా వచ్చాయి. చంద్రుని మీదకు యాత్రకు సంబంధించి భారత్‌లో విడుదలైన తొలిచిత్రం ‘చాంద్ పర్ చఢాయీ’. టి.పి.సుందరం దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం 1967లో విడుదలైంది. చందమామ నానాటికీ దూరం మన భూమి నుంచి చంద్రుడు నానాటికీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు ఇలా దూరం జరగడాన్ని వారు ‘లూనార్ రెసిషన్’గా పేర్కొంటున్నారు. భూమి నుంచి చంద్రుడు ఎంత వేగంగా దూరం జరుగుతున్నాడో తేల్చేందుకు ఇటీవల శాస్త్రవేత్తలు కచ్చితమైన లెక్క కట్టారు. వారి లెక్క ప్రకారం చంద్రుడు ఏడాదికి 1.5 అంగుళాలు (3.8 సెం.మీ.) చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. చంద్రుడు భూమి నుంచి దూరం జరగడం వల్ల భూమిపై రోజు స్వల్పంగా పెరుగుతుంది. కోట్లాది సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే కాలంలో భూమిపై రోజు పదమూడు గంటలే ఉండేది. భూమిపై జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులకు చంద్రుడే కారణమనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రెండు ప్రయోగాలు.. రెండు విజయాలు చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాలను అమెరికా, రష్యాలు పోటాపోటీగా గడచిన శతాబ్దిలోనే చేపడితే, భారత్ ఈ ప్రయోగాలను ఆలస్యంగా మొదలుపెట్టింది. తొలిసారిగా 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా పంపిన ‘చంద్రయాన్–1’ వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపై నీటి జాడను గుర్తించింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, చంద్రునిపై వాతావరణ వివరాల సేకరణ వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీని తర్వాత ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని 2019 జూలై 22న చేపట్టింది. మొదట ఈ ప్రయోగాన్ని 2013లోనే చేపట్టాలని భావించినా, ల్యాండర్ తయారీని రష్యా సకాలంలో పూర్తి చేయకపోవడంతో జాప్యం జరిగింది. రెండేళ్లు గడిచినా తాత్సారం చేస్తూ వచ్చిన రష్యా చివరకు చేతులెత్తేయడంతో భారత్ ఈ ప్రయోగాన్ని పూర్తిగా స్వయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతతోనే చేపట్టాలని నిశ్చయించుకుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగంలో పంపిన ఎల్వీఎం–3 రాకెట్ విజయవంతంగా ‘చంద్రయాన్–2’ వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, దీని ద్వారా పంపిన ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి చేరుకోకుండానే గల్లంతైంది. ల్యాండర్ విఫలమైనా, చంద్రుని కక్ష్యలోకి చేరుకున్న ఆర్బిటర్ చంద్రునికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తోంది. ఇది ఏడున్నరేళ్లు పనిచేస్తుందని అంచనా. చంద్రునిపైకి చేరుకునే ప్రయోగాలను భారత్ ఆలస్యంగా చేపట్టినా, తొలి రెండు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. చంద్రునిపై ఆవాసాలు! చంద్రుడి వాతావరణం, ఉపరితలంలోని విశేషాలు తెలుసుకోవడానికి దేశ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తుంటే, ఇంకొందరు చంద్రునిపై ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంపై కలలు కంటున్నారు. చంద్రలోక నివాసం ఆలోచన మనుషుల్లో శతాబ్దాలుగా ఉంది. ఇంగ్లిష్ తత్త్వవేత్త, మతబోధకుడు జాన్ విల్కిన్స్ పదిహేడో శతాబ్దిలోనే చంద్రునిపై మానవుల నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆలోచనను వెలిబుచ్చాడు. సోవియట్ రష్యా చంద్రునిపై జరిపిన ప్రయోగం 1959లో విజయవంతం కావడంతో చంద్రునిపై నివాసాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలపై ఆశలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో చంద్రునిపై మనిషి అడుగు మోపడం మాత్రమే సాధ్యమైంది గాని, నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడిక ప్రకారం గ్రహాంతరాలలోని ప్రదేశాలపై గుత్తాధిపత్యం చలాయించడం కుదరదు. దేశాలు గాని, వ్యక్తులు గాని, సంస్థలు గాని చంద్రుడు లేదా ఇతర గ్రహాలపైనున్న స్థలాలతో వ్యాపార లావాదేవీలు సాగించడం చట్టవిరుద్ధం. అయినా, కొన్నేళ్లుగా చంద్రుడిపై ఉన్న స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. తొలిసారిగా 1936 జూన్ 15న డీన్ లిండ్సే అనే అమెరికన్ ఆసామి అంతరిక్షంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తనకే చెందుతాయని ప్రకటించుకున్నాడు. వెర్రిమాలోకాలైన కొందరు జనాలు వాటిని అతడి వద్ద నుంచి కొనుక్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. జనాల్లోని ఈ వేలంవెర్రిని గమనించే అమెరికన్ రచయిత రాబర్ట్ హీన్లీన్ 1949లో ‘ది మ్యాన్ హూ సోల్డ్ ది మూన్’ కథను రాశాడు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడికను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే సంస్థ ఎడాపెడా చంద్రుడిపై స్థలాలను కారుచౌకగా అమ్మిపారేస్తోంది. కొందరు ఔత్సాహికులు చంద్రుడిపై స్థలాలను ఈ సంస్థ వద్ద కొంటున్నారు. ఈ సంస్థ ఇచ్చే స్థలాల పట్టాలను సన్నిహితులకు కానుకలుగా కూడా బహూకరిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–1’, ‘చంద్రయాన్–2’ ప్రయోగాలు రెండూ విజయవంతమైన నేపథ్యంలో భారత్ ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’తో కలసి చేపడుతోంది. ఈ ప్రయోగం చేపట్టడానికి జూలై 14వ తేదీ అనుకూలంగా ఉన్నట్లు ‘ఇస్రో’ అధినేత సోమనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్–3 వ్యోమనౌకను ఎల్ఎంవీ–3 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని సన్నాహాలనూ పూర్తి చేశారు. ‘చంద్రయాన్–3’ ద్వారా చంద్రుని దక్షిణధ్రువంలో ల్యాండర్‌ను సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. ల్యాండర్ చంద్రుని ఉపరితలం మీదకు చేరుకున్నాక, దీనికి అనుసంధానమైన రోవర్ ల్యాండర్ నుంచి విడవడి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దీని ద్వారా చంద్రుని ప్రకంపనలను గుర్తించే సెస్మోమీటర్ వంటి పరికరాలను పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, వాతావరణం, రసాయనాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై ఇప్పటివరకు ఎవరూ చేరుకోని ప్రదేశానికి ల్యాండర్‌ను పంపుతున్నందున ఈ ప్రయోగం భారత్‌కు మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే కీలకంగా నిలుస్తుంది. ఏ మీరిది చదివేసరికి ఈ ప్రయోగం పూర్తయివుంటుంది. చదవండి : భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
Chandrayaan-3 Updates: కీలక దిశగా చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/తిరువనంతపురం/శ్రీహరికోట: విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దశ దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు పెట్టారు. తద్వారా ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా దించాలన్నది లక్ష్యం. చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. -
జీఎస్ఎల్వీ మార్క్3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందన్నారు. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఎల్వీఎం3–ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకోసం ఇస్రో అధికారులు శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం షురూ అయింది. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం ఉదయానికి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం రాత్రి షార్కు చేరుకుని ప్రయోగంపై సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్‌వెబ్ పేరుతో చేస్తున్న రెండో ప్రయోగమిది. देखें | 36 उपग्रहों को ले जाने वाला LVM3-M3 वनवेब इंडिया-2 मिशन श्रीहरिकोटा के स्पेसपोर्ट से लॉन्च किया गया। @isro #ISRO #LVM3M3/#Oneweb India-2 Mission - https://t.co/pqnE7LbXBy pic.twitter.com/9w2yK7e8gA — Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) March 26, 2023 -
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యాన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రాకెట్ వివరాలు... ప్రయోగం ఇలా... ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్–యూఎస్ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇది షార్ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ–డి1 సిరీస్‌లో రెండోది కావడం విశేషం. ఎస్ఎస్ఎల్వీ–డీ2కు ప్రత్యేక పూజలు తిరుమల: ఎస్ఎస్ఎల్వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు. -
శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో మరో విషాదం నెలకొంది. సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి షార్కు వచ్చారు. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కాగా, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటలో వ్యవధిలోనే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం కలిగించింది. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఐ కాల్చుకోవడాన్ని చూసిన సిబ్బంది శ్రీహరికోట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చింతామణి ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ చిన్నకన్నన్ శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు) -
PSLV-C54 Launch: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ54
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. కాగా, పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగంరాజరాజన్లు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
విక్రమ్–ఎస్ ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు. ప్రైవేట్‌రంగంలో తొలి రాకెట్ కావడంతో దీనిని ప్రారంభ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రాకెట్ మూడు అతిచిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ పేలోడ్స్ రోదసీలో భూమికి అతి తక్కువ దూరం అంటే 81 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ఇది 83 కేజీల మూడు పేలోడ్స్‌ను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఘన ఇంధనంతో కూడిన సింగిల్ స్టేజ్ రాకెట్ కావడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్ ద్వారా స్పేస్‌కిడ్జ్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థకు చెందిన 2.5 కేజీల ఫన్–శాట్‌ను కక్ష్యలోకి పంపుతున్నారు. దీనిని ఐఐటీ విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు సంయుక్తంగా తయారుచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్–స్పేస్ టెక్, ఆర్మేనియాకు చెందిన బజూమ్‌క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన పేలోడ్లను రాకెట్ మోసుకెళ్లనుంది. -
21న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ మార్క్–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డం(యూకే)కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్ వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో అర్బిట్) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాలు, వాటితోపాటు ఫ్యూయల్‌ను కలిపితే 5.21 టన్నుల బరువుగా నిర్ధారించింది. జీఎస్ఎల్వీ మార్క్–3 ఎం–2 లాంటి భారీ రాకెట్‌ను వాణిజ్యపరంగా వాడుకునేందుకు వన్ వెబ్ కంపెనీ మూడుసార్లు 36 చొప్పున 108 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో రెండుసార్లు జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో ఇప్పటికే సిద్ధమైంది. వన్ వెబ్ కంపెనీ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెంది వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఇస్రోతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. -
కుంగిపోరాని నింగి పయనం
కొన్నేళ్ళుగా నిరీక్షిస్తున్న కల నిజమవుతోందని ఆనందిస్తున్న వేళ ఆఖరి నిమిషంలో అర్ధంతరంగా కల కరిగిపోతే ఎలా ఉంటుంది? భారతదేశ రాకెట్ల సేనలోకి సరికొత్తగా వచ్చి చేరిన ‘చిన్న ఉపగ్రహ వాహక నౌక’ (ఎస్ఎస్ఎల్వీ) తొలి ప్రయోగం ఆ భావననే కలిగించింది. గడచిన మూడేళ్ళలో అనేక సార్లు వాయిదాపడ్డ ఈ రాకెట్ వినువీధి ప్రయోగం విజయవంతమైనా, ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే మిషన్‌లో అది విఫలమవడం తీపి, చేదుల మిశ్రమ అనుభూతి. వినువీధిలో దేశానికి ఎన్నో విజయాలను అందించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగి, తప్పొప్పుల ఆత్మ పరిశీలనకు దిగాల్సిన స్థితి. వాణిజ్యపరంగా వివిధ దేశాల, సంస్థల ఉపగ్రహాలను విహాయసంలోకి పంపుతూ, వాణిజ్యపరంగానూ రెక్కలు విప్పుకోవడానికి మరికొన్నాళ్ళు వేచిచూడక తప్పని పరిస్థితి. 34 మీటర్ల పొడవు, 120 టన్నుల బరువున్న ‘ఎస్ఎస్ఎల్వీ–డి1’ను ఆదివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో రూపొందించిన భూగ్రహ పరిశీలక మైక్రో – శాటిలైట్ ‘ఈఓఎస్–02’, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళలో చదివే ఆడపిల్లలు తయారుచేసిన ‘ఆజాదీ శాట్’ – ఈ రెండు ఉపగ్రహాలనూ దానితో పాటు పంపారు. వాటిని మోసుకుంటూ, రూ. 56 కోట్ల విలువైన భారతదేశ సరికొత్త రాకెట్ దూసుకెళ్ళింది. మూడు దశల్లోనూ రాకెట్ ప్రయోగం విజయవంతంగానే సాగింది. ప్రణాళిక ప్రకారం నింగిలో దాదాపు 12 నిమిషాలు ప్రయాణించాక అది రెండు ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టాలి. ముందుగా ‘ఈఓఎస్–2’నూ, ఆ తర్వాత కొద్ది సెకన్లకు ‘ఆజాదీశాట్’నూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలి. సరిగ్గా ఇక్కడే ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ఇక్కట్ల పాలైంది. ఉపగ్రహాలు రెండూ నిర్ణీత సమయం ప్రకారం విడివడ్డాయి. అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరూ ఊహించినట్టే సాగింది. కానీ, ఇస్రో మాటల్లో చెప్పాలంటే ‘రాకెట్ తుది దశలో కొంత డేటా నష్టం జరిగింది’. వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళాల్సిన ఉపగ్రహాలు కాస్తా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లోకి వెళ్ళాయి. ఆజాదీ శాట్ అనేది ‘హ్యామ్’ అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ల గ్రహణశక్తిని పెంచడానికి ఉద్దేశించినది. అనుకున్న దాని కన్నా తక్కువ కక్ష్యలోకి చేరడంతో, అస్థిరంగా మారి ఆ ఉపగ్రహాలు నిరుపయోగమయ్యాయి. తక్కువ కక్ష్యలోకి చేరడమంటే అవి అంతరిక్షంలో ఉండక, అనతికాలంలోనే భూమి పైకి ఇంటిదారి పడతాయన్న మాట. చిన్న శాటిలైట్లతో నింగిలోకి ప్రయాణం వరకు విజయవంతమైనా, ‘ఎస్ఎస్ఎల్వీ–డి1’ తన మిషన్‌ను పూర్తి చేయడంలో మాత్రం విఫలమైందని అంటున్నది అందుకే! రాగల కాలంలో ‘ఎస్ఎస్ఎల్వీ’ రాకెట్ తమకు ప్రధాన ప్రయోగ వాహక నౌక అవుతుందని ఇస్రో ఆశలు పెట్టుకొంది. తీరా ఉపగ్రహాలను పంపాల్సిన కక్ష్యలో జరిగిన పొరపాటు ఊహించని ఎదురుదెబ్బ. చిన్న ఉపగ్రహాలను వాణిజ్యస్థాయిలో నింగిలోకి పంపడమనేది కొన్ని వందల కోట్ల డాలర్ల విలువైన కొత్త విపణి. ఆ మార్కెట్లో జెండా పాతాలనుకుంటున్న భారత్ ఆశలకు ఇది అవాంతరం. అలాగే, రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలతో నిమ్న భూ కక్ష్య ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో మనకు కొన్ని దశాబ్దాల రికార్డుంది. కానీ, కొత్త సిరీస్ భూ పరిశీలక ఉపగ్రహాలను (ఈఓఎస్లను) పంపడంలో రెండేళ్ళలో మనకిది రెండో వైఫల్యం. నిరుడు శక్తిమంతమైన ‘ఈఓఎస్– 03’ని ‘జీఎస్ఎల్వీ–ఎఫ్10’తో పంపాలని యత్నించాం. ప్రయోగ వైఫల్యంతో అది సాధ్యం కాలేదు. చాలాకాలంగా కేవలం 5 నుంచి వెయ్యి కిలోల లోపల బరువుండే చిన్న ఉపగ్రహాలను సైతం ఇతర, భారీ ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లతోనే అంతరిక్షంలోకి పంపాల్సి వస్తోంది. అనేక వ్యాపారసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనాశాలలు తమ చిన్న ఉపగ్రహాలను ఈ పెద్ద ఉపగ్రహాలతో కలిపి మోసుకెళ్ళేలా చేయడానికి దీర్ఘకాలం వేచిచూడక తప్పని పరిస్థితి. దానికి ఖర్చు, నిరీక్షణ సమయం ఎక్కువే. గత పదేళ్ళలో అంతరిక్ష డేటా, కమ్యూనికేషన్, నిఘా, వాణిజ్య అవసరాలు పెరగడంతో అలాంటి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ప్రత్యేక వాహక నౌకలకు గిరాకీ హెచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న ఇస్రో లాంటి వాటికి ఇది పెద్ద వ్యాపార అవకాశం. అందుకే, చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే ‘ఎస్ఎస్ఎల్వీ’ని అది రూపొందించింది. ఇప్పుడున్న పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ లాంటి ఇతర ఉపగ్రహ నౌకల తయారీకి ఒక్కోదానికీ 70 నుంచి 80 రోజులకు పైగా పడుతుంది. అందులో పదోవంతు ఖర్చుతో, 72 గంటల్లోనే అయిదారుగురి బృందం ఎస్ఎస్ఎల్వీని సిద్ధం చేయగలదు. రాగల పదేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా పదుల వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలు నింగికి పోనున్న వేళ భారత్‌కు ఇది అద్భుత అవకాశం. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి చకచకా తలుపులు తీస్తున్న మన దేశంలో ఇప్పటికే కనీసం మరో 3 ప్రైవేట్ సంస్థలు చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లను తయారు చేస్తున్నాయి. ఏటా 2–3 ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన ప్రభుత్వ ఇస్రో సైతం ఎస్ఎస్ఎల్వీ సఫలమైతే వారానికో ప్రయోగం చేయగలదు. కరోనాతో పాటు కొంత పనితీరులో జాప్యంతో ఇప్పటికే నాలు గేళ్ళుగా ఈ ప్రయోగం ఆలస్యమైంది. అలాగని తాజా వైఫల్యంతో కుంగిపోనక్కర లేదు. సెన్సార్ పనితీరులో లోపం ఒక్కటీ పక్కనపెడితే ‘ఎస్ఎస్ఎల్వీ’ పనితీరు బాగుండడం ఇస్రో విజయమే. ఇప్పుడిక జరిగిన తప్పును నిపుణుల సంఘం విశ్లేషించనుంది. అనంతరం సరిదిద్దిన తదుపరి వెర్షన్ రాకెట్ (ఎస్ఎస్ఎల్వీ–డి2)తో ఇస్రో మళ్ళీ ముందుకు వస్తుంది. దాంతో వినువీధిలో మన అంతరిక్ష శోధనల వాణిజ్య పతాక ఎగురుతుంది. ఎందుకంటే, ప్రతి వైఫల్యం ఓ కొత్త విజయానికి సోపానమే! -
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. తొలి మూడు దశలు విజయవంతం ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది. అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్ రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగమంతా సక్సెస్ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్, కె.శివన్ తదితరులు విచ్చేసి, ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు. ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది. -
ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడో దశ తర్వాత ఈవోఎస్-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది. చదవండి: ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
ఈనెల 7న ఎస్ఎస్ఎల్వీ తొలి ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయారుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇది కూడా చదవండి: మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త! -
నెలాఖరులో నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ద్వారా 142 కేజీల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ అనే ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధానం చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా మారిపోవడంతో పలు దేశాలు చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బుల్లి ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను రూపొందించింది. వాణిజ్య ప్రయోగాలకు వీలుగా ఎస్ఎస్ఎల్వీ.. ఇప్పటివరకు ఇస్రో.. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్లతో ఉపగ్రహాలను రోదసి లోకి పంపించింది. ప్రస్తుతం ఆరో రకం రాకెట్‌గా ఎస్ఎస్ఎల్వీని తయారు చేసింది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీని మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 2016లోనే ప్రతిపాదన.. 2016లో ప్రొఫెసర్ రాజారాం నాగప్ప నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ నివేదిక ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించుకునేందుకు వీలుగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ప్రతిపాదించారు. 2016లో లిక్విడ్ ప్రొపల్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సోమనాథ్(ప్రస్తుత ఇస్రో చైర్మన్) 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో పంపే వెహికల్ అవసరాన్ని గుర్తించారు. ► 2017 నవంబర్ నాటికి ఎస్ఎస్ఎల్వీ డిజైన్‌ను రూపొందించారు. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 2018 డిసెంబర్ నాటికి ఎస్ఎస్ఎల్వీని పూర్తిస్థాయిలో తయారుచేశారు. ► 2020 డిసెంబర్ నుంచి 2022 మార్చి 14 వరకు రాకెట్ అన్ని దశలను విడివిడిగా ప్రయోగాత్మకంగా ప్రయోగించి తరువాత వెహికల్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి ప్రయోగానికి చర్యలు చేపట్టారు. ప్రయోగం ఇలా.. ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతోనే ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధన దశ ఉండదు. నాలుగో దశలో వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా రూపకల్పన చేశారు. ఈ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. -
PSLV-C52 రాకెట్ ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్‌డౌన్
-
28న ‘ప్రైవేట్’తో ఇస్రో తొలి ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగం సిద్ధంచేసింది. ఈ నెల 28న ఉ.10.24 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51తో తొలి అడుగు వేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా దేశంలోని ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్ బీస్ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్–1 నానో కాంటాక్ట్–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్ ధవన్ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. కాగా, పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేసి సిద్ధంచేశారు. ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్)కు గురువారం అప్పగించనున్నారు. 27వ తేదీ శనివారం ఉ.9.24 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. -
శ్రీహరికోట షార్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. యూపీఎస్‌లో సాంకేతిక లోపంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేడే కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ♦ ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతులు మీదుగా బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. 10 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం ♦ బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం. ♦ రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు ప్రయోగ పనులు. ♦ ‘ల్యాబ్’ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్. ♦ జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది ♦ బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండోదశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ ♦ గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు. ♦ గురువారం సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది. ♦ ఇది షార్ కేంద్రం నుంచి 76వ ప్రయోగం. ♦ జీఎస్ఎల్వీ మార్క్–2 సిరీస్‌లో 14వ ప్రయోగం. ♦ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లతో నిర్వహిస్తున్న 8వ ప్రయోగం. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్ 2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవకక్ష్య)లోకి మాత్రమే పంపేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), నావిగేషన్ శాటిలైట్స్ (దిక్సూచి ఉపగ్రహాలు)ను భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పని చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. దీని తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ద్వారా జీఐశాట్–2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ 47 రాకెట్
సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక దూసుకెళ్లింది. 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్ఎల్వీ సంకేతాలను అందుకోనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్ డా. శివన్ అన్నారు. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఇస్రో బృందానికి ఇలాంటి మరెన్నో అద్భుతమైన విజయాలు దక్కాలని ఆయన మనసారా ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం : శ్రీవారిని దర్శించుకున్న శివన్
సాక్షి, శ్రీహరి కోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బుధవారం చేపట్టనున్న పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 ఫ్లోక్-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘షార్’లో ప్రమాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో వాహన అనుసంధాన భవనంలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకెట్ పరికరాలు అనుసంధానం చేసే ప్లాట్ ఫారాలు కూలి రూ. 2కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. త్రుటిలో ప్రాణ నష్టం తప్పిం ది. షార్‌లోని రెండో వీఏబీ భవనంలో రాకెట్ అనుసంధానం చేసే ఎఫ్సీవీఆర్పీ ప్లాట్ ఫారాలు న్నాయి. పరికరాలు మోసుకెళ్లే గేర్ బాక్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని సరిచేసేప్పుడు అయిల్ లీకై రెండు ప్లాట్‌ఫారాలు కూలిపోయాయి. ప్రమాద సమయంలో సిబ్బంది టీ తాగేందుకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు. -
షార్‌లో హై అలర్ట్..
సాక్షి, నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు. మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. -
చంద్రయాన్ -1కి చంద్రయాన్-2కి తేడా ఏంటి?
అసలు చంద్రయాన్-2 ప్రయోగానికి ఎంత ఖర్చయ్యింది? ఇప్పటివరకు చంద్రుడిపై ఎవరూ చేరుకోని ప్రాంతంపై మనం ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రయాన్-2 మిషన్ ప్రయోజనాలేంటి? చంద్రుడి మీదకు పంపుతున్న ల్యాండర్‌కు విక్రమ్ అనే పేరు ఎందుకు పెట్టారు? శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు కేంద్రంగా ఎలా మారింది? దేశంలో ఏ ప్రాంతానికి లేని ఆవశ్యకత శ్రీహరికోటకు ఏముంది? ఈ విషయాలు తెలుసకుందాం.. చంద్రయాన్-2 విశేషాలను కింది వీడియోలో వీక్షించండి.. -
షార్ డైరెక్టర్‌గా రాజరాజన్ బాధ్యతల స్వీకరణ
సూళ్లూరుపేట: షార్ నూతన డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎస్.పాండ్యన్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనుండడంతో బాధ్యతలను ఆయనకు అప్పగించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను షార్ డైరెక్టర్‌గా నాలుగు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా షార్‌లోనే ఉంటూ పాండ్యన్‌తో కలిసి అన్ని విభాగాలను సందర్శించి అవగాహన చేసుకున్నారు. ఈ నెల 15న చంద్రయాన్–2 ప్రయోగం నిర్వహించనున్న దృష్ట్యా ఆయన ముందుగానే విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్–2 పనులు జరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన షార్ మాజీ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ చంద్రయాన్–2 ప్రయోగం అయ్యేదాకా ఇక్కడే ఉంటారని షార్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
నిఘా ఉపగ్రహం..నింగికేగింది!
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుగులేని శక్తిగా అవతరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి–46 ప్రయోగం విజయవంతమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)సి–46 ఉపగ్రహ వాహక నౌక 615 కిలోల బరువైన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ)ను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి శాస్త్రవేత్తలు తమ సత్తాచాటారు. ప్రయోగానికి 25 గంటలకు ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది ముగిసిన వెంటనే పీఎస్ఎల్వీ సి–46 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో షార్‌లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఐదు వేల మంది కరతాళ ధ్వనులు చేశారు. ప్రయోగించిన తర్వాత 15.25 నిమిషాలకు పీఎస్ఎల్వీ సి–46 రాకెట్.. రీశాట్ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరులో ఇస్ట్రాక్ భూకేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. ఉపగ్రహానికి అమర్చిన 3.6 మీటర్లు వ్యాసార్థం కలిగిన రాడియల్ రిబ్ యాంటెన్నా విచ్చుకోవడంతో ఉపగ్రహం పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రయోగ విజయంతో షార్ శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ కె.శివన్ ఆనందాన్ని పంచుకున్నారు. నాలుగు దశల్లో.. పీఎస్ఎల్వీ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించారు. స్ట్రాపాన్ బూçస్టర్లు లేకుండా చేసిన ప్రయోగాన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభించింది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు మొదటి దశను విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండో దశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగో దశను పూర్తి చేశారు. 15.25 నిమిషాలకు 615 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 37 డిగ్రీల వాలులో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ రాకెట్ కోర్ అలోన్ దశతో ఇది 14వ ప్రయోగం. అదేవిధంగా ఈ ఏడాది మూడో ప్రయోగం, మొదటి ప్రయోగ వేదిక నుంచి 36వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 48వ ప్రయోగం, షార్ కేంద్రం నుంచి 72వ ప్రయోగం కావడం విశేషం. నిఘా అవసరాలను గుర్తించి.. పీఎస్ఎల్వీ సి–46 రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇది ఉపకరించనుంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్–2బీలో ఎక్స్ బాండ్ అపార్చర్ రాడార్ అనే ఉపకరణాన్ని అమర్చారు. ఈ ఉపగ్రహం దట్టమైన మేఘాలు కమ్ముకుని భూమి కనిపించకపోయినా అత్యంత నాణ్య మైన ఛాయా చిత్రాలను తీసి పంపుతుంది. ఉగ్ర కదలికలే కాకుండా వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందిస్తుంది. భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందించడం ఉపగ్రహం ప్రత్యేకత. ఇప్పటివరకు రీశాట్–1, రీశాట్–2, స్కాట్‌శాట్ అనే మూడు ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. రీశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఇప్పుడు ప్రయోగించింది నాలుగోది కావడం విశేషం. జూలైలో చంద్రయాన్–2 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని జూలై 9 నుంచి 16 లోపు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. పీఎస్ఎల్వీ సి–46 ప్రయోగం విజయం అనంతరం మిషన్ కంట్రోల్ రూమ్‌లో శివన్ ఇతర శాస్త్రవేత్తలతో విజయానందాన్ని పంచుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ భారతదేశ నిఘాకు సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయోగంలో రోదసీలోకి పంపిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని చెప్పారు. ఇందులో అమర్చిన ఎక్స్ బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. పీఎస్ఎల్వీ రాకెట్లు ఇప్పటివరకు 50 టన్నులు బరువు కలిగిన 354 ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లాయన్నారు. పీఎస్ఎల్వీ రాకెట్‌కు విడిభాగాలను అందజేస్తున్న ప్రైవేటు కంపెనీలు అద్భుతమైన సాయాన్ని అందజేస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ఉపగ్రహాలనైనా సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలిగే అద్భుతమైన రాకెట్లని పీఎస్ఎల్వీని అభివర్ణించారు. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి మంగళవారం ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా ల్యాండర్, రోవర్‌ను సెప్టెంబర్ 6 నాటికి చంద్రుడిపై దించుతామని తెలిపారు. దాదాపు రెండు నెలల పాటు చంద్రయాన్–2 ప్రయాణం చేసి చంద్రుడిపై దిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్, వీఎస్ఎస్సీ డైరెక్టర్ ఎస్.సోమనాథ్, యూఆర్ఎస్సీ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, ఐపీఆర్సీ డైరెక్టర్ టి.మూకయ్య, ఎల్పీఎస్సీ డైరెక్టర్ డాక్టర్ వి.నారాయణన్, శాక్ డైరెక్టర్ డీకే దాస్, మిషన్ డైరెక్టర్ ఎస్ఆర్ బిజూ, శాటిలైట్ డైరెక్టర్ నాడ గౌడ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సి–46 ఉప గ్రహాన్ని విజయవం తంగా అంతరిక్షం లోకి ప్రయోగించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షించారు. -
వినీలాకాశంలో బ్రహ్మాస్త్రం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు విజయగర్వంతో రెపరెపలాడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ–సీ45 ఉపగ్రహ వాహక నౌక స్వదేశీ ఎమిశాట్ (ఈఎంఐశాట్) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి మోసుకెళ్లింది. షార్ కేంద్రం నుంచి 71వ ప్రయోగాన్ని, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సిరీస్‌లో 47వ ప్రయోగాన్ని, పీఎస్ఎల్వీ–క్యూఎల్ సిరీస్‌లో తొలి ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో శాస్త్రవేత్తలు తమ విజయవిహారాన్ని కొనసాగించారు. మొత్తంగా ఈ ఏడాది ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది కావడం విశేషం. ప్రయోగం తీరిలా.. ఆదివారం ఉదయం 6.27 గంటలకు ప్రారంభమైన పీఎస్ఎల్వీ సీ–45 ప్రయోగ కౌంట్‌డౌన్ 27 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్తగా రూపొందించిన మొట్టమొదటి పీఎస్ఎల్వీ సీ45 (పీఎస్ఎల్వీ–క్యూఎల్) సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ నాలుగో దశ (పీఎస్04 మోటార్)ను రెండుసార్లు రీస్టార్ట్ చేసి రెండు సార్లు ఆఫ్ (నిలుపుదల) చేసేలా రూపొందించారు. పీఎస్4 దశలో అమర్చిన 436 కిలోల బరువు కలిగిన ఎమిశాట్ ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన «ధృవ కక్ష్యలోకి 17.18 నిమిషాలకు ప్రవేశపెట్టారు. ఆ తరువాత పీఎస్4 దశను 3,611 సెకన్లకు మొదటిగా రీస్టార్ట్ చేసి 3,621 సెకన్లకు కటాఫ్ చేశారు. మళ్లీ 6,530 సెకన్లకు మళ్లీ రెండోసారి రీస్టార్ట్ చేసి 6,541 సెకన్లకు కటాఫ్ చేశారు. ఆ తర్వాత 6,626 సెకన్లకు (1.50 గంటలకు) 504 కిలోమీటర్ల ఎత్తులో 14 ఉపగ్రహాలను, 6,901 (1.55 గంటలకు) 508 కిలోమీటర్ల ఎత్తులో మరో 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఆ తరువాత కూడా పీఎస్4 దశను రెండుసార్లు ఆర్బిట్ చేంజ్ అనే పేరుతో మరో సరికొత్త ప్రయోగం చేశారు. ఉపగ్రహాలను వదిలిపెట్టిన తరువాత మరో గంటపాటు దీన్ని ఎక్స్‌పర్‌మెంటల్‌గా చేయడంతో ప్రయోగం పూర్తయ్యేసరికి సుమారు 3 గంటల సమయం తీసుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం విజయవంతంకావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. వీక్షణకు గ్యాలరీ ప్రయోగాలను వీక్షించేందుకు షార్ కేంద్రంలో ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని మూడు వేలమంది వచ్చి తిలకించేలా ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ప్రయోగానికి ఐదు వేలు, తర్వాత పదివేల మంది చూసే అవకాశం కల్పించనున్నారు. శత్రు రాడార్ల పనిపట్టే ఎమిశాట్ ప్రయోగంలో ప్రధాన ఉపగ్రహమైన ఎమిశాట్ బరువు 436 కిలోలు. దీన్ని 748 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించే సామర్థ్యం ఎమిశాట్ సొంతం. దీని సాయంతో శత్రు దేశాల రాడార్లను పసిగట్టడంతోపాటు దానికి తగ్గట్టుగా దేశ భద్రతా చర్యలు చేపట్టొచ్చు. ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్ చేయడం ఇదే ప్రథమం. మిగతా 28 ఉపగ్రహాల్లో 24 అమెరికావి. ఈ 24 ఉపగ్రహాలు నౌకల కదలికను గుర్తించడంలో ఆ దేశానికి సాయం అందించనున్నాయి. మిగిలిన 4 ఉపగ్రహాలు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్‌కి చెందినవి. నింగిలోకి 29 ఉపగ్రహాలు ఈ ఉపగ్రహ వాహక నౌక 436 కిలోలు బరువు కలిగిన ఎమిశాట్ (ఈఎంఐశాట్) అనే మిలటరీ ఉపగ్రహంతోపాటు 220 కిలోలు బరువు గల అమెరికాకు చెందిన ఫ్లోక్–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్ పేరుతో మరో 4 చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకార్ట్–1 ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్ టెక్శాట్ అనే చిన్న తరహా 28 ఉపగ్రహాలను అలవోకగా రోదసీలోకి మోసుకెళ్లింది. అనంతరం వాటిని భూమికి 748, 504 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోని 3 రకాల కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ రాకెట్ మరోమారు గ’ఘన’ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇస్రో చరిత్రలో సువర్ణ అధ్యాయం: శివన్ ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణ అధ్యాయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ అన్నారు. ఈ రాకెట్లో నాలుగోదశ(పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేశామని, అది సక్సెస్ కావడంతో భారతీయ విద్యార్థులు సొంతంగా శాటిలైట్ తయారుచేసి తెస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయోగిస్తామన్నారు. ఒకే ప్రయోగం ద్వారా సన్ సింక్రనస్ ఆర్బిట్లోనే 3 రకాల కక్ష్యల్లోకి 29 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. 4స్ట్రాపాన్ బూస్టర్లతో చేసిన ఈ ప్రయోగానికి పీఎస్ఎల్వీ క్యూఎల్ అని పేరుపెట్టారు. విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రానికి 9 మంది హైస్కూల్ విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో హ్యూమన్ మిషన్ ప్రోగ్రాం గురించి కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందులో బాగా ప్రతిభ కనపరిచిన వారికి స్పేస్ ట్రెక్నాలజీలో సీటు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలిపారు. మే రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్–2బీ, పీఎస్ఎల్వీ సీ47 ద్వారా కార్టోశాట్, ఆ తరువాత చంద్రయాన్–2 ప్రయోగాలుంటాయని తెలిపారు. శ్రీహరికోటలో గ్యాలరీలో కూర్చుని ప్రయోగాన్నిచూస్తున్న వీక్షకులు -
నింగిలోకి సగర్వంగా...
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత వాయుసేనకు విశేష సమాచార సేవలందించేందుకు ఉద్దేశించిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ రంగానికి సాంకేతికంగా కీలకమైన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ ద్వారా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో షార్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం నింగిలోకి పంపింది. 19 నిమిషాల 20 సెకన్లలో ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది ఏడో విజయం కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన వాటిలో 69వ విజయవంతమైన ప్రయోగం. 2,250 కిలోల బరువు కలిగిన మిలటరీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ జీశాట్–7ఏ. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో పరిపూర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని అంతరిక్ష ప్రయోగాలు చేసే శక్తిగా ఎదిగిందని మరోసారి నిరూపించారు. 18 ఏళ్లు కఠోర శ్రమ ఫలితమే ఇస్రో 18 ఏళ్లు కఠోరశ్రమ ఫలితమే తాజా వరుస విజయాలకు బాటవేసిందని చెప్పొచ్చు. సాయంత్రం 4.10 గంటలకు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెద్ద శబ్దంతో జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ నిప్పులు చిమ్ముతూ జీశాట్–7ఏను మోసుకుని నింగికేగింది. ఒక్కొక్క దశ విజయవంతంగా ప్రయాణం సాగిస్తుంటే మిషన్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేతల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో నాలుగు వైపులా అమర్చిన నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్ అలోన్ దశ విజయవంతంగా పనిచేసింది. రెండు, మూడు దశలు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో ఈ భారీ ప్రయోగాన్ని సునాయాసంగా నిర్వహించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి మూడో దశలో అమర్చిన 14,996 టన్నుల క్రయోజనిక్ ఇంజిన్ల సాయంతో రాకెట్ శిఖరభాగంలో అమర్చిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని 19.20 నిమిషాలకు నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో 3.5 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలతోపాటు చంద్రయాన్–2 ప్రయోగంలో రోవర్‌ను, ల్యాండర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం) వారు దానిని తమ అధీనంలోకి తీసుకుని, అంతా సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. 2019లో 32 మిషన్లు లక్ష్యం: శివన్ ప్రయోగం విజయానంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలించిదన్నారు. ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే జీఎస్ఎల్వీ ప్రయోగాలు మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తు అని శివన్ అన్నారు. సమాచార ఉపగ్రహాలను మనం పంపుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను పంపేస్థాయికి ఎదిగామని విజయగర్వంతో చెప్పారు. ఇస్రో 2019 ఏడాదిలో 32 మిషన్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2019 ప్రథమార్ధంలో చంద్రయాన్–2 ప్రయోగం చేపడతామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎప్పుడు లేని విధంగా జీఎస్ఎల్వీ ఎఫ్11 రాకెట్‌లోని రెండోదశలోని ద్రవ ఇంధనాన్ని 2.5 టన్నులు పెంచడంతో ఆ దశ సక్సెస్ అయ్యిందన్నారు. తర్వాత క్రయోజనిక్ దశలో 3 టన్నులు ఇంధనం పెంచడంతో ఈ దశ కూడా విజయవంతం అయ్యిందన్నారు. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే ప్రయోగంలో సాధించామని గర్వంగా చెప్పారు. 35 రోజుల్లో 3 ప్రయోగాలు సైతం ఇస్రో చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం భరత జాతికి కొత్త ఏడాదికి కానుక అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్, సీఎం అభినందనలు జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్లో పంపిన జీశాట్–7ఏ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్తవేత్తల బందానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్తవేత్తలు పనితీరు దేశానికి గర్వకారణమని వారు కొనియాడారు. శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు జీశాట్–7ఏను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విజయాలను ఇస్రో సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వాయుసేనకు అండదండ జీశాట్–7ఏ బరువు: 2,250 కేజీలు ఉపగ్రహ జీవితకాలం: 8 ఏళ్లు వ్యయం: రూ.500–800 కోట్లు ట్రాన్స్పాండర్లు: కేయూ బ్యాండ్. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అతిచిన్న యాంటెన్నాతోనైనా సిగ్నల్స్‌ను గ్రహిస్తాయి. ఇతర బ్యాండ్లతో పోల్చి చూస్తే విస్తృతమైన కవరేజ్ ఉంటుంది. వర్షాలు, ఇతర వాతావరణమార్పుల్ని బాగా తట్టుకోగలవు. బెంగళూరు: ఇస్రో ప్రయోగించిన జీశాట్–7ఏ ఉపగ్రహంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జీశాట్–7ఏని ప్రత్యేకంగా భారతీయ వైమానిక దళ, ఆర్మీ అవసరాల కోసమే రూపొందించారు. వాయుసేనకు చెందిన రాడార్ స్టేషన్లు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహానికి అనుసంధానిస్తారు. తద్వారా కదనరంగంలో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సమాచార సరఫరా వేగవంతం అవుతుంది. ఎంతో దూరంలో ఉండే ప్రత్యర్థుల విమానాలను కూడా గుర్తించడానికి వీలు కలుగుతుంది. యుద్ధ విమానాల పర్యవేక్షణ కూడా ఈ ఉపగ్రహం సాయంతో చేయవచ్చు. రాడార్ల కంటే అత్యంత శక్తిమంతమైన సిగ్నల్స్‌ను కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ ద్వారా ఈ ఉపగ్రహం అందిస్తుంది. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరమవుతుంది. డ్రోన్ల పనితీరు సులభం జీశాట్–7ఏతో వాయుసేనలో డ్రోన్ల నిర్వహణ సులభమవనుంది. యూఏవీ (గాలిలో ఎగిరే మానవరహిత వాహనం)లను భూస్థావరం నుంచి కాకుండా ఉపగ్రహం ద్వారా నియంత్రించవచ్చు. డ్రోన్లు ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి సమాచారం పంపడానికి సాయపడుతుంది. అమెరికా నుంచి సముద్ర గస్తీ డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్న తరుణంలో జీశాట్–7ఏ ఉపగ్రహంతో వాటి పనితీరు మరింత సులభం కానుంది. అత్యంత ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు సుదూరం నుంచి కూడా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించగలవు. గతంలో రుక్మిణి ప్రయోగం 2013లో ఇస్రో జీశాట్–7ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని రుక్మిణి అని పిలుస్తారు. ఈ రుక్మిణి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడింది. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, సముద్ర తీర గస్తీ విమానాల కదలికలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని రుక్మిణి ఉపగ్రహం ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు రుక్మిణిని మరింత అధునీకరించి జీశాట్–7ఏను ప్రయోగించారు. ఇందులో ఏ అంటే అడ్వాన్స్డ్ అని అర్థం. జీశాట్–7ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. మరికొన్నేళ్లలో జీశాట్–7సీ ఉపగ్రహాన్ని ప్రయోగించి నెట్వర్క్ ఆపరేషన్లను బలోపేతం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో 320 మిలటరీ ఉపగ్రహాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 320 మిలటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో సగం అమెరికాకు చెందినవే. ఆ తరవాత అత్యధిక సైనిక ఉపగ్రహాలు కలిగిన దేశాల్లో రష్యా, చైనా ఉన్నాయి. ఈ విషయంలో చైనాయే మనకి అతి పెద్ద శత్రువు. సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో ఉపగ్రహాల్ని చైనా ప్రయోగించింది. చివరికి యాంటీ శాటిలైట్ ఆయుధాలు.. అంటే ఉపగ్రహాల్నే కూల్చే ఆయుధాల్ని కూడా పరీక్షించింది. భారత్‌కు ఇప్పటివరకు 13 మిలటరీ ఉపగ్రహాలే ఉన్నాయి. భూమిపై నిఘా, యుద్ధనౌకలకు దిక్సూచి, కమ్యూనికేషన్లకి ఉపయోగపడుతున్నాయి. మిలటరీ ఉపగ్రహాల సహకారంతోనే పాకిస్తాన్‌పై లక్షిత మెరుపుదాడుల సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయగలిగాం. ఉపయోగాలివీ... సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈసారి మాత్రం పూర్తిగా వాయుసేన, ఆర్మీ కోసం దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో అభివృద్ధి చేశారు. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును కనిపెడుతుంది. మిలటరీకి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పటిదాకా పంపిన 35 సమాచార ఉపగ్రహాల్లోకెల్లా ఇది ప్రత్యేకమైనది. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసమే దీన్ని రూపొందించినట్టు ఇస్రో ప్రకటించింది. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): వరుస ప్రయోగాలు, విజయాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. దీంతో ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు విమానయాన వ్యవస్థకు సేవలు అందించనుంది. భారత కాలమాన ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్ఎల్వీ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. సిబ్బంది, శాస్త్రవేత్తల అంకితభావంతోనే విజయాలు సిబ్బంది సమష్టి కృషి వల్లే జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కె శివన్ పేర్కొన్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ప్రయోగించిన జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) విజయవంతం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. శ్రీహరికోట నుంచి 35 రోజుల్లో మూడు ప్రయోగాల విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిని ఇస్రో విజవంతంగా ముగించిందని, వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు చేస్తామని శివన్ తెలిపారు. వైఎస్ జగన్ అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎస్ఎల్వీ–ఎఫ్11 ప్రయోగం విజయవంతమవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాభివృద్దికి కృషి చేయాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ఇస్రోకు మరో వాణిజ్య విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) పీఎస్ఎల్వీ–సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాఎస్ఏఆర్, ఎస్1–4లను 230.4 టన్నుల బరువున్న పీఎస్ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)–సీ42 వాహక నౌక ఆదివారం రాత్రి సరిగ్గా 10.08 గంటలకు రోదసిలోకి మోసుకెళ్లింది. 33 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వాహక నౌక దూసుకెళ్లిన తర్వాత నాలుగు దశల్లో, 17.44 నిమిషాల్లో రెండు ఉపగ్రహాలు భూమికి 583 కి.మీ. దూరంలోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి చేరాయి. ఆ వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు కరతాళధ్వనులతో సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్ని ప్రధాని మోదీ అభినందించారు. అంతరిక్ష వ్యాపారంలో భారత సామ ర్థ్యాన్ని ఈ ప్రయోగం చాటిచెప్పిందన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో వాణిజ్యపరంగా మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 241 విదేశీ ఉపగ్రహాలను షార్ నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. ఆదివారం నాటి ప్రయోగంతో కలిపి మొత్తంగా 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి పంపింది. ప్రయోగం ముగిసిన అనంతరం ఇస్రో చైర్మన్ శివన్ ప్రయోగంలో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయోగానికి ముందు శివన్ దంపతులు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ–సీ42 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉపగ్రహాల విశేషాలివీ.. 445 కిలోల బరువున్న నోవాఎస్ఏఆర్ ఉపగ్రహంలో ఎస్–బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్, ఆటోమేటిక్ ఐడింటిఫికేషన్ రిసీవర్ అనే ఉపకరణాలను అమర్చారు. అడవుల మ్యాపింగ్, భూ వినియోగం, మంచు కప్పబడిన ప్రాంతాలను పర్యవేక్షిచడం, వరదలాంటి విపత్తులను గుర్తించడం, సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయో కనిపెట్టి, గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాటికి సూచనలు ఇవ్వడం ఈ ఉపగ్రహం చేస్తుంది. ఇక ఎస్1–4 ఉపగ్రహం 444 కిలోల బరువు ఉంది. ఇది సర్వే వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీ విపత్తులను గుర్తించడం చేస్తుంది. శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ–42 రాకెట్‌తో రెండు బ్రిటన్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): రాబోయే ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. ఆదివారం పీఎస్ఎల్వీ సీ–42 ప్రయోగం విజయవంతమైన తర్వాత షార్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో జీఎస్ఎల్వీ మార్గ్– డీ1 ద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని, జీఎస్ఎల్వీ మార్గ్– డీ2 ద్వారా జీశాట్–29 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. వీటితో పాటు జీఎల్ఎల్వీ మార్గ్–2 ద్వారా జీశాట్–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతామన్నారు. అలాగే ఏరియన్–5 రాకెట్ ద్వారా జీశాట్–11ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు శివన్ వెల్లడించారు. ఈ నాలుగు భారీ ఉపగ్రహాలతో దేశంలో కనెక్టివిటీ 100 జీబీపీఎస్‌కు చేరుతుందనీ, తద్వారా సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. 2019, జనవరి 3 నుంచి ఫిబ్రవరి 16లోపు చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఏటా రూ.220 కోట్లు అర్జిస్తోందన్నారు. వచ్చే అక్టోబర్‌లో మరో 30 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని శివన్ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన మంగళయాన్–1 ఇప్పటికీ చక్కగా పనిచేస్తూ కీలక సమాచారాన్ని పంపిస్తోందని పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ -
నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్08
-
జీఎస్ఎల్వీ ప్రయోగం నేడే
శ్రీహరికోట/చెన్నై: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్08 వాహకనౌక ద్వారా జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. అనంతరం రాకెట్ రెండోదశలో ద్రవరూప ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. బుధవారం జీఎస్ఎల్వీ వాహకనౌకకు అవసరమైన హీలియం, నైట్రోజన్ వాయువుల్ని నింపడంతో పాటు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల్ని అప్రమత్తం చేయనున్నారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న జీశాట్–6ఏ ఉపగ్రహం 10 ఏళ్లపాటు సేవలందించనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జీశాట్–6ఏ బరువు 2,140 కేజీలు కాగా, అందులో ఇంధనం బరువే 1,132 కేజీలు ఉంటుందని వెల్లడించారు. ఈ ఉపగ్రహంలోని శక్తిమంతమైన ట్రాన్స్పౌండర్లతో మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా 6 మీటర్ల వ్యాసార్థమున్న యాంటెన్నాను జీశాట్–6ఏలో వాడామనీ, దీనిద్వారా ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని సంగ్రహించే వీలు కలుగుతుందని తెలిపారు. ఉపగ్రహాల్ని జీఎస్ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి. -
పీఎస్ఎల్వీ సీ-34కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం
బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగం శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న ఉదయం 9.25 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-34 ఉపగ్రహ వాహకనౌకకు కౌంట్‌డౌన్ సమయాన్ని కొంత మార్పు చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎంఆర్ఆర్ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభించి 39.30 గంటల అనంతరం ప్రయోగించాలని ముందుగా అనుకున్నారు. కొంత సమయాభావం వల్ల 48 గంటలకు కౌంట్‌డౌన్ సమయాన్ని పెంచారు. అంటే సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సమావేశాన్ని పూర్తి చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. రాత్రికి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రయోగంలో 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్లో ప్రత్యేకతలు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ- సీ-34)లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ సిరీస్‌లో 36వ ప్రయోగం కావడం విశేషం. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో చేయడం ఇది 14వ ప్రయోగం. గతంలో 10 ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ ఈసారి ఒకేసారి 20 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ రాకెట్‌లోని నాల్గో దశను ప్రయోగాత్మకంగా మరో ప్రయోగం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా బహుళ ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ ఉపగ్రహాలను పంపాలంటే వాటిని వివిధ రకాల కక్ష్యల ప్రవేశపెట్టేందుకు నాల్గో దశను (పీఎస్-4) మాత్రమే ఉపయోగించాలి. అందుకోసం ఇప్పుడు ప్రయోగాత్మకంగా పీఎస్-4 ప్రయోగించనున్నారు. -
అంతరిక్షంలో ట్వంటీ ట్వంటీ
రికార్డుల ‘కోట’... - మొట్ట మొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాల ప్రయోగం - 26 ఉపగ్రహాల ప్రయోగంతో అమెరికా మొదటి స్థానం - 22 ఉపగ్రహాలతో రష్యా ద్వితీయం.. తృతీయస్థానంలో నిలువనున్న భారత్ - దేశ కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేస్తోన్న శ్రీహరికోట - ఉపగ్రహ ప్రయోగాలతో అంచెలంచెలుగా ఎదుగుతున్న షార్ - ఐదు దశాబ్దాల్లో 89 ఉపగ్రహాల ప్రయోగాలు దిగ్విజయం - వాణిజ్య ప్రయోగాల్లో దూసుకెళ్తూ.. అర్ధసెంచరీకి పైగా విజయాలు శ్రీహరికోట... ఆకాశవీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే జగద్విదితం చేసిన రికార్డుల కోట.. మరో కీర్తి శిఖరాన్ని చేరుకోబోతోంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించబోతోంది. ప్రపంచంలో ఇదివరకే 26 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి అమెరికా తొలిస్థానంలో ఉండగా, 22 ఉపగ్రహాల ప్రయోగంతో రష్యా రెండో స్థానంలో ఉంది. తాజాగా 20 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ మనదేశం మూడోస్థానంలో నిలవబోతోంది. వాణిజ్యపరంగా నాలుగు దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుండటంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఎంఆర్ఆర్ సమావేశం జరగనుంది. రేపు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో ఐదు దశాబ్దాల ఇస్రో గమనం, నిర్వహించిన ప్రయోగాలు, వాణిజ్య ప్రయోగాలు, ప్రస్థానంపై ఫోకస్. - మొలకల రమణయ్య, సాక్షి, సూళ్లూరుపేట శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తరువాత చిన్నపాటి లాంచ్ప్యాడ్ల మీద ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించారు. చిన్న చిన్న ప్రయోగాల్లో రాటుదేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగవేదికను నిర్మించారు. దీనిపై 1990 నుంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తరువాత భవిష్యత్తులో అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. ప్రయోగవేదికల తీరు ఇలా.. ► షార్‌లో నిర్మించిన మొదటి ప్రయోగవేదికకు సంబంధించి మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)ని రాకెట్ ప్రయోగించే చోటుకు తీసుకెళ్లి విడిభాగాలను అనుసంధానం చేస్తారు. అనంతరం రాకెట్‌ను ప్రయోగవేదిక మీదే ఉంచి ఎంఎస్టీ వెనక్కి వచ్చేస్తుంది. ► రెండో ప్రయోగవేదికను ఇందుకు భిన్నంగా నిర్మించారు. ఈ ప్రయోగవేదికకు సంబంధించి రాకెట్ అనుసంధాన భవనం వేరుగా, ప్రయోగానికి హుంబ్లీకల్ టవర్ (యూటీ)ను వేరుగా నిర్మిం చారు. రాకెట్‌ను వ్యాబ్‌లో అనుసంధానం చేసిన తరువాత రైల్వే ట్రాక్‌లాంటి పట్టాలపై తీసుకెళ్లి హుంబ్లీకల్ టవర్‌ను అనుసంధానం చేసేలా డిజైన్ చేసి నిర్మించారు. ఇప్పుడు రెండో వ్యాబ్‌ను కూడా ఇదే తరహాలోనే నిర్మిస్తున్నారు. రెండు వ్యాబ్లు భవిష్యత్తులో నిర్మించబోయే మూడో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో పీఎస్ఎల్వీ రాకెట్లకు మొదటి ప్రయోగవేదిక, జీఎస్ఎల్వీ, మార్క్-2 రాకెట్లుకు రెండో ప్రయోగవేదిక, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాలకు రెండో వ్యాబ్‌ను డిజైన్ చేశారు. రెండో వ్యాబ్ సామర్థ్యం.. రెండో రాకెట్ అనుసంధానం భవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో వసతులుండేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతమున్న మొదటి వ్యాబ్ ఎత్తు 80 మీటర్లు, రెండో వ్యాబ్ ఎత్తు 96 మీటర్లు, వెడల్పు 36 మీటర్లతో 22 అంతస్తులుండేలా డిజైన్ చేశారు. ఇందులో 82 మీటర్లు ఎత్తు కలిగి 450 టన్నుల బరువు సామర్థ్యమున్న భారీ క్రేన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ఫ్లాట్పారంలకు రూ.70 కోట్లు, డోర్లు (తలుపులకు) రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్ (టాక్టర్‌కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికి కలిపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ప్రాజెక్టుకు సంబంధించి ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.628.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అయితే 2013లో రూ.363.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ప్రస్తుతం పెరిగిన ధరలనుగుణంగా పరిశీలిస్తే అది కాస్తా రూ.628,95 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. రెండోవ్యాబ్ పూర్తయితే సంవత్సరానికి 10 నుంచి 12 ప్రయోగాలు చేసే స్థాయికి చేరడమే కాకుండా ఇది ఇస్రోకు మరో మణిహారం అవుతుంది. ‘వాణిజ్య’ ప్రయోగాల్లో అర్ధ సెంచరీ దాటి... వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇస్రో అర్థ సెంచరీని దాటింది. ఆంట్రిక్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్న విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్య పరంగా దూసుకుపోతోంది. 1999 మే 26న పీఎస్ఎల్వీ సీ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్ఆర్-టబ్‌శాట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన కిట్‌శాట్-3 విదేశీ ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపించడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించారు. వీటిన్నిటినీ పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారానే పంపించి విజయాలు సాధించడం విశేషం. కాగా, ఈనెల 22న 17 విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపనున్న ఇస్రో వాణిజ్యపరంగా బలమైన సంస్థగా పురోగమిస్తోంది. వాణిజ్యపరంగా ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల వివరాలు... జర్మనీ: టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2 కెనడా: క్యాన్ఎక్స్-2, ఎన్ఎల్ఎస్-5, ఎన్ఎల్ఎస్-1, షఫై ్పర్, నియోశాట్, ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్-7.2, ఎన్ఎల్ఎస్-14 సింగపూర్ : ఎక్స్‌శాట్, వెలాక్సీ, టెలియోస్-1, కెంట్రిడ్జ్, వెలాక్సీ-సీ1, వెలాక్సీ-11, గెలాషియో, ఎథినోక్సాట్ జపాన్: క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్ డెన్మార్క్: ఆయుశాట్-2, ఎన్ఎల్ఎస్8.3 ఆస్ట్రియా: ఎన్ఎల్ఎస్8.1, ఎన్ఎల్ఎస్8.2 ఫ్రాన్స్: స్పాట్-06, స్పాట్-07, స్విట్జర్లాండ్: క్యూబ్‌శాట్-4, టీశాట్-1. అల్జీరియా: ఆల్‌శాట్-24, ఇటలీ: అజిల్, సౌత్ కొరియా: కిట్‌శాట్, అర్జెంటీనా: ఫ్యూహెన్‌శాట్, ఇజ్రాయెల్: టెక్సార్, లక్సెంబర్గ్: వెజల్‌శాట్, టర్కీ: క్యూబ్‌శాట్-3, బెల్జియం: ప్రోబా, ఇండొనేసియా: లాపాన్-టబ్‌శాట్, లపాన్-ఏ2. నెదర్లాండ్స్: డెల్ఫీ-సీ3, యూకే: స్ట్రాడ్-1, డీఎంసీ-1, డీఎంసీ-2, డీఎంసీ-3, సీబీటీఎన్-1, డీ-ఆర్బిట్శైల్. యూఎస్ఏ: - లిమూర్-01, 02, 03, 04 ప్రయోగాత్మక ప్రయోగాల్లో దిట్ట... ప్రయోగాత్మక ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో సత్తా చాటుతోంది. ఇటీవల చేపట్టిన రీయూజబుల్ లాంచింగ్ వెహికల్- టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ ప్రయోగం విజయంతో ఇస్రో మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించింది. ఇస్రో యాభై ఏళ్ల చరిత్రలోకి వెళితే... అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు 1961లో డాక్టర్ హోమీ జే బాబా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(డీఏఈ)ని ప్రారంభించారు. 1962లో ఇది ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(ఐఎన్సీఓఎస్పీఏఆర్)’గా రూపాంతరం చెందింది. 1963 నవంబర్ 21న ఐదు దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. ఆ తరువాత రష్యా నుంచి ఆర్యభట్ట, రోహిణి ఉపగ్రహాలను ప్రయోగించారు. అనంతరం స్వయం సమృద్ధి సాధించేందుకు ఐఎన్సీఓఎస్పీఏఆర్ను 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా మార్పు చేశారు. తూర్పు తీరాన పులికాట్ సరస్సు, బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలో మీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతాన్ని 1969లో రాకెట్ ప్రయోగాల కోసం గుర్తించారు. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాక మొదటి ప్రయోగవేదిక నుంచి 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వీ-3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ ఇచ్చిన విజయాలతో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమయ్యారు. నేడు అత్యంత బరువైన మూడు టన్నుల బరువున్న ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు దోహదపడే స్పేష్ షటిల్ లాంటి ప్రయోగాత్మక ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం చేస్తున్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు), ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు), గ్రహాంతర ప్రయోగాలు(చంద్రయాన్-1, మంగళ్యాన్) లాంటి ప్రయోగాలు విజయవంతంగా చేపట్టడంలో ఇస్రో ఘనత శ్లాఘనీయం. ► రాకెట్‌లోని విడిభాగాలను తిరిగి ఉపయోగించేందుకు దోహదపడే స్పేస్ క్యాప్యూల్స్ రికవరీ ప్రయోగాన్ని 2007 జనవరి 10న పీఎస్ఎల్వీ-సీ7 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ► భవిష్యత్తులో మూడు టన్నుల ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు, అలాగే వ్యోమగాములను పంపేందుకు ఉపయోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ కేర్ మాడ్యూల్ (వ్యోమగాముల గది) ప్రయోగాన్ని 2014 డిసెంబర్ 18న విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఎస్-200 బూస్టర్లు సామర్థ్యాన్ని, ఎల్-110 దశ సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతోనే ఈ ఏడాది ఆఖరులో జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కూడా సన్నద్దమవుతున్నారు. ► మే 23న ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా తొలిసారిగానే విజయవంతంగా చేపట్టారు. శ్రీహరికోటకు ఆ పేరెలా వచ్చిందంటే..? శ్రీహరికోట అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియని మారుమూల దీవి. పడవ ప్రయాణమే తప్ప.. బస్సు, కారు తెలియని ప్రాంతం. నేడు మానవుడికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న టీవీ, మాట్లాడుతున్న ఫోన్, ఇంట్లోనే ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్, టెలీమెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, భూమిలోపల దాగివుండే నిధి నిక్షేపాలు, సముద్రాల నుంచి వచ్చే ప్రమాదాలను తెలిపే వ్యవస్థలు, గ్లోబల్ పొజిషిన్ సిస్టం (జీపీఎస్), చంద్రుడు, అంగారకుడు గ్రహాలపైకి పరిశోధనలు చేసే కేంద్రంగా మారింది. బంగాళాఖాతానికి పులికాట్ సరస్సుకు మధ్యలో దట్టమైన అడవుల మధ్య ఆరు పంచాయతీల పరిధిలో 54 గ్రామాలతో శ్రీహరికోట దీవి విస్తరించి ఉంది. దీవిలో పూర్వం రావణాసురుడు అరకోటి లింగాలను పూజించాడని, అందుకే దీనికి శ్రీహరికోట అని పేరు వచ్చిందని ప్రతీతి. అలాంటి శ్రీహరికోట నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు రాకెట్ ప్రయోగకేంద్రంగా తయారైంది. ఆ 20 ఉపగ్రహాలు ఇవీ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 22న పీఎస్ఎల్వీ సీ-34 ద్వారా మూడు స్వదేశీ, 17 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. భూమికి అతి దగ్గరగా ఉన్న సూర్యానవర్తన ధృవకక్ష్యలోకి (సన్ సింక్రోనస్ ఆర్బిట్) ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవి అక్కడి నుంచి భూమ్మీద జరిగిన మార్పులను చిత్రాలు తీసి పంపిస్తాయి. కార్టోశాట్-2సీ భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ సిరీస్‌ను ఇస్రో 2005లో రూపొందించింది. ఇప్పటివరకు కార్టోశాట్-1, 2, 2ఏ, 2బీలను అంతరిక్షంలోకి పంపించారు. తాజాగా పంపుతున్న కార్టోశాట్-2సీ 727 కిలోల బరువుంది. ఈ ఉపగ్రహం భూమికి 505 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రోసన్ అర్బిట్ నుంచి పనిచేస్తుంది. ఇందులో అమర్చిన అత్యంత శక్తివంతమైన పాంక్రోమేటిక్ అండ్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. వీటి ఆధారంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీరప్రాంతపు భూముల సమాచారంతోపాటు సాగునీటి పంపిణీ, రోడ్డు నెట్వర్క్ సమాచారం అందిస్తుంది. అలాగే మ్యాప్‌లను తయారు చేస్తుంది. లపాన్-ఏ3 (ఇండోనేషియా) లపాన్-ఏ3 అనే ఈ ఉపగ్రహం 120 కిలోల బరువుంటుంది. ఈ మల్టీస్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ను భూమి వినియోగం, సహజ వనరులు, వాతావరణ పరిశోధనకు ఉపయోగించుకోనున్నారు. బిరోస్ (జర్మనీ) బిరోస్ అంటే బెర్లిన్ ఇన్ఫ్రార్డ్ ఆప్టికల్ సిస్టం. జర్మనీకి చెందిన జర్మన్ ఏరో స్పేస్‌సెంటర్ (డీఎల్ఆర్) రూపొందించింది. 130 కిలోల బరువు కలిగిన అతి చిన్న సైంటిఫిక్ ఉపగ్రహం. అధిక ఉష్ణోగ్రతలను తెలియజేసే పరికరాలు ఇందులో ఉన్నాయి. స్పేస్‌లో ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎం-3 ఎంశాట్ (కెనడా) మారిటైమ్ మానిటరింగ్ అండ్ మెసేజింగ్ మైక్రో శాటిలైట్ (ఎం-3 ఎంశాట్)ను కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (కెనడా) సంయుక్తంగా తయారు చేశాయి. ఈ 85 కిలోల ఉపగ్రహం ఆటోమేటిక్ ఐడింటిఫికేషన్ సిస్టం సంకేతాలను అందిస్తుంది. జీహెచ్‌జీశాట్-డీ (కెనడా) 25.5 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భూమి పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహాన్ని కెనడాలోని స్పేస్ ఫ్లైట్ ల్యాబొరేటరీ, యూనివర్సిటీ అఫ్ టొరంటో ఇన్స్టిట్యూట్ ఫర్ ఏరోస్పేస్ స్టడీస్ రూపొందించాయి. ఈ ఉపగ్రహంలోని పరికరాలు వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల (కార్బన్ డైఆక్సైడ్, మీథేన్)ను కొలిచి సమాచారాన్ని అందిస్తాయి. స్కైశాట్ జెన్2-1 (యూఎస్ఏ) 110 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహంలోని పరికరాలు భూమిని పరిశోధిస్తూ ఫొటోలు, హైక్వాలిటీ వీడియోలు తీసి పంపుతాయి. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టెర్రాబెల్లా, గూగుల్ కంపెనీ తయారుచేశాయి. భూమ్మీద జరిగే మార్పులను ఎప్పటికప్పడు సబ్-మీటర్ రెజుల్యూషన్ ఇమేజెస్, హెచ్డీ క్వాలిటీ వీడియోలు తీసి పంపుతుంది. డౌవ్ శాటిలైట్స్ (యూఎస్ఏ) 4.7 కిలోల బరువు కలిగిన డౌవ్ శాటిలైట్స్‌లో మొత్తం 12 బుల్లి ఉపగ్రహాలున్నాయి. ఇవి కక్ష్యలో పావురాల్లా తిరుగుతూ పని చేస్తాయని డౌవ్ శాటిలైట్స్ అనే పేరు పేట్టారు. ఇవి కూడా భూమిని పరిశోధిస్తూ మార్పులను చిత్రాలుగా తీసి పంపుతాయి. సత్యభామ శాట్ (చెన్నై) 1.5 కిలోల బరువుండేఈ బుల్లి ఉపగ్రహాన్ని చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ చదువుతున్న విద్యార్థులు తయారు చేశారు. ఈ ఉపగ్ర హంలో అమర్చిన పరికరాలు గ్రీన్హౌస్ వాయువుల డేటాను సేకరిస్తుంది. ముఖ్యంగా వాటర్ వాపర్, కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌కు సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి పంపుతుంది. స్వయంశాట్ (పుణే) పుణే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కేజీ బరువు కలిగిన ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేశారు. ఇందులో అమర్చిన పరికరాలు పాయింట్ టు పాయింట్ మెసేజింగ్ సర్వీసెస్‌ను అందిస్తాయి. మరో మైలురాయికి సంసిద్ధం షార్‌లోని రెండో ప్రయోగ వేదికలో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డిం గ్లో పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని శనివారం ప్రయోగవేదిక మీదకు చేర్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 22న ఉదయం 9.25 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 5 దశాబ్దాల్లో 89 ఉపగ్రహాలు ఇస్రో ఆవిర్భావం తరువాత సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇప్పటిదాకా 89 ఉపగ్రహాలు, 53 రాకెట్ ప్రయోగాలు, స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం, మరో స్పేస్ షటిల్ ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. 53 ప్రయోగాల్లో 46 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇందులో 34 విజయాలు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే కావడం విశేషం. 1962 నుంచి 1978 దాకా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ-3 ఈ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఆ వెంటనే 1980 జూలై 18న చేపట్టిన ఎస్ఎల్వి-3 ఈ2 ప్రయోగం విజయవంతమైంది. ఎస్ఎల్వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాల్లో మూడు విజయవంతమయ్యాయి. 1987 మార్చి 24న ఏఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లోనూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా రెండు విజయవంతమయ్యాయి. మరో రెండు విఫలమయ్యాయి. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లలో చిన్న తరహా ఉపగ్రహాలను పంపారు. మోస్తరు ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు 1993 సెప్టెంబర్ 20న పీఎస్ఎల్వీ లాంటి భారీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్పటిదాకా 35 ప్రయోగాలు చేపట్టగా మొదటిది మినహా మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. వాణిజ్యపరమైన ప్రయోగాలకు పీఎస్ఎల్వీ రాకెట్ అత్యంత కీలకంగా మారింది. మళ్లీ మరో అడుగు ముందుకేసి జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపట్టారు. ఈ సిరీస్‌లో 10 ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి. ఏడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకే తలమానిమైన చంద్రయాన్-1, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు మొదటి ప్రయత్నంలోనే దిగ్విజయం కావడం ఇస్రో సత్తాకు నిదర్శనం. 2008లో పీఎస్ఎల్వీ సీ9 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చరిత్ర కూడా ఇస్రోకే దక్కింది. ఈనెల 22న పీఎస్ఎల్వీ సీ34 ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.