Why Is International Moon Day Celebrated? History, Significance And Other Facts Inside - Sakshi
Sakshi News home page

International Moon Day Facts Telugu: అందీ అందని చందమామ

Published Sun, Jul 16 2023 7:24 AM | Last Updated on Sun, Jul 16 2023 12:21 PM

Why Is International Moon Day Celebrated? Here's All You Need To Know - Sakshi

చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఎంతో ఉద్విగ్నంగా ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అని వ్యాఖ్యానించాడు. చంద్రుడిని చేరుకోవాలనేది మనిషి చిరకాల స్వప్నం. వీలుంటే చంద్రలోకంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. చంద్రుడిపై కాలుమోపిన మనిషి ఇంతవరకు అక్కడ కాళ్లూనుకోలేదు.అందీ అందకుండా ఊరిస్తున్న చందమామపై దేశదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలను మానుకోలేదు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి రెండో అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా చందమామ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

ఈసారి అంతర్జాతీయ చంద్ర దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న అంశం ‘చంద్రునిపై అన్వేషణలో సమన్వయం, సుస్థిరత’. చంద్రునిపై అన్వేషణలోను, పరిశోధనల్లోను వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సమన్వయం, పరిశోధనల్లో సుస్థిరత కోసం ఐక్యరాజ్య సమితి ఈ అంశాన్ని ఎంపిక చేసుకుంది. మనిషి చంద్రుడిపై కాలుమోపడం నిజంగానే మానవాళికి ముందడుగు. చంద్రుడి ఆనుపానులు పూర్తిగా తెలుసుకోవాలంటే మరిన్ని అడుగులు మునుముందుకు వేయాలి. శాస్త్రవేత్తలు ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఒక్కో అడుగు ముందుకు వేసినప్పుడల్లా చంద్రుడి గురించి కొత్త కొత్త విశేషాలను తెలుసుకుని, మానవాళికి వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి ముందు చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 

మానవాళికి ముందడుగు
చంద్రుణ్ణి అందుకోవాలనే తపన మనుషుల్లో చాన్నాళ్లుగానే ఉంది. తొలి రోజుల్లో అమెరికా, సోవియట్‌ రష్యా చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాల్లో పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టాయి. తప్పటడుగుల దశలో జరిపిన దాదాపు అరడజను ప్రయోగాలు విఫలమైన తర్వాత తొలిసారిగా సోవియట్‌ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్‌ 12న సోవియట్‌ రష్యా ప్రయోగించిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడి విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలను సాగిస్తూనే ఉన్నాయి. తొలి దశాబ్దకాలంలో ఈ ప్రయోగాల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాతి నుంచి ప్రయోగాలలో వైఫల్యాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969 జూలై 16న ‘అపోలో–11’ ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా ఇద్దరు వ్యోమగాములు– నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌ చంద్రుడిపైకి చేరుకున్నారు. జూలై 20న అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై తొలి అడుగు మోపి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ‘నాసా’ 1968 డిసెంబర్‌ 20న ముగ్గురు వ్యోమగాములతో ‘అపోలో–8’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి మీదకు మనుషులతో చేరుకున్న తొలి వ్యోమనౌక ఇదే. ఇందులో ఫ్రాంక్‌ ఎఫ్‌ బోర్‌మన్‌–ఐఐ, జేమ్స్‌ ఏ లవల్‌ జూనియర్, విలియమ్‌ ఏ ఆండ్రెస్‌ చంద్రుడి మీదకు వెళ్లారు. అయితే వారెవరూ చంద్రుడిపై అడుగు మోపకుండానే తిరిగి వచ్చేశారు.

తొలి ప్రయోగాలు విఫలం
చంద్రుడి కక్ష్యలోకి చేరుకునే తొలి ప్రయత్నాన్ని అమెరికా చేసింది. ‘నాసా’ ఏర్పాటుకు కొద్దికాలం ముందే అమెరికన్‌ వైమానికదళంలోని బాలిస్టిక్‌ మిసైల్స్‌ విభాగం 1958 ఆగస్టు 17న ‘పయోనీర్‌–0’ ప్రయోగాన్ని చేపట్టింది. భూ కక్ష్యను దాటి ఒక వస్తువును అంతరిక్షంలోకి పంపేందుకు చేసిన తొలి ప్రయోగం ఇది. థోర్‌ మిసైల్‌ ద్వారా ‘పయోనీర్‌–0’ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగం జరిపారు. అయితే, టర్బోపంప్, గేర్‌బాక్స్‌లలో తలెత్తిన లోపాల వల్ల ఇది భూమి నుంచి 16 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే అట్లాంటిక్‌ సముద్రంలో కూలిపోయింది. ఈ వైఫల్యానికి కొద్దిరోజుల ముందే 1958 జూలై 29న ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి గల అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను నెలకొల్పింది. ‘పయోనీర్‌–0’ వైఫల్యం తర్వాత అమెరికా చేపట్టిన ప్రయోగాలన్నీ ‘నాసా’ ద్వారానే జరిగాయి. అమెరికాతో పాటే అప్పటి సోవియట్‌ రష్యా కూడా 1958 సెప్టెంబర్‌ 23న ‘లూనా ఈ–1 నం:1’ ప్రయోగాన్ని చేపట్టింది. అప్పటి సోవియట్‌ రాకెట్‌ తయారీ సంస్థ దీనిని రూపొందించింది. సోవియట్‌ రష్యా చేపట్టిన ఈ తొలి ప్రయోగం కూడా విఫలమైంది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయని శాస్త్రవేత్తలు అక్కడితో ఆగిపోలేదు. పట్టువదలకుండా ప్రయోగాలను సాగిస్తూ, మొత్తానికి చంద్రుణ్ణి చేరుకున్నారు.

సాహిత్యంలో చంద్రయానం
పలు ప్రాచీన నాగరికతల్లో చంద్రుడి ఆరాధన కనిపిస్తుంది. కొన్ని పురాణాల్లో చంద్రలోక వర్ణన కూడా కనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలో గాని మనిషి చంద్రుణ్ణి చేరుకోవడం సాధ్యం కాలేదు. అయితే, చంద్రుణ్ణి చేరుకోవాలనే ఆశ మాత్రం మనిషిలో శతాబ్దాలుగా ఉంది. ప్రాచీన సాహిత్యం ఈ ఆశకు అద్దం పడుతోంది. ప్రాచీన గ్రీకు రచయితలు ఆంటోనియస్‌ డయోజనీజ్, లూసియన్‌ ఆఫ్‌ సమాసతా వంటి వారి రచనల్లో చంద్రయానానికి సంబంధించిన కల్పనలు ఉండేవని చెబుతారు. ఆ రచనలు కాలగతిలో అంతరించడంతో వాటిని సాధికారికమైన ఆధారాలుగా పరిగణించలేం. జర్మన్‌ ఖగోళవేత్త, రచయిత జోహాన్నెస్‌ కెప్లర్‌‘సోమ్నియమ్‌’ అనే నవలలో మనిషి చంద్రుడిపైకి ఎగిరి వెళ్లడం గురించి రాశాడు. కెప్లర్‌ మరణానంతరం ఈ నవల 1634లో వెలుగులోకి వచ్చింది. దాదాపు అదేకాలంలో ఇంగ్లిష్‌ చరిత్రకారుడు, రచయిత ఫ్రాన్సిస్‌ గాడ్విన్‌ ‘ది మ్యాన్‌ ఇన్‌ ది మూన్‌’ నవల రాశాడు. గాడ్విన్‌ మరణానంతరం ఇది 1638లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ భాషల్లో చంద్రయానం గురించి చాలా కాల్పనిక రచనలు వెలువడ్డాయి. కాలం గడిచే కొద్దీ ఈ రచనల్లోని కల్పనలు వాస్తవానికి దగ్గరవుతూ రావడం విశేషం.

రిచర్డ్‌ ఆడమ్స్‌ లాక్‌ ‘గ్రేట్‌ మూన్‌ హోక్స్‌’ను 1835లో న్యూయార్క్‌కు చెందిన ‘ది సన్‌’ పత్రిక ఆరు భాగాలుగా ప్రచురించింది. లాక్‌ ఈ వ్యంగ్యరచనలో చంద్రునిపై జీవజాలాన్ని, నాగరికతను సర్‌ జాన్‌ హెర్షల్‌ కనుగొన్నట్లు  ఎద్దేవా చేస్తూ రాశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్‌ వెర్న్‌ 1865లో ‘ఫ్రమ్‌ ది ఎర్త్‌ టు ది మూన్‌’ నవల రాశాడు. ఇందులో భూమి నుంచి చంద్రునిపైకి చేరుకోగల సాధనాన్ని తయారుచేసే ప్రక్రియను కొంత శాస్త్రీయంగా వివరించాడు. ఫిరంగి ద్వారా చంద్రునిపైకి ఒక వస్తువును పంపే యత్నాన్ని ఇందులో ప్రస్తావించాడు. దీనిని బట్టి తీవ్రమైన పేలుడుతోనే చంద్రుని వరకు చేరుకోవడం సాధ్యం కాగలదనే విషయంపై అప్పటికే జనాలకు అర్థమైందని అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంగ్లిష్‌ రచయిత హెచ్‌.జి.వెల్స్‌ 1901లో ‘ది ఫస్ట్‌ మెన్‌ ఇన్‌ ది మూన్‌’ నవల రాశాడు. ఇందులో గురుత్వాకర్షణ పరిధిని అధిగమించగల పదార్థాన్ని తయారు చేసేందుకు ఒక శాస్త్రవేత్త పాత్ర సాగించే ప్రయత్నాలను వివరించాడు. అదే ఏడాది మరో ఇంగ్లిష్‌ రచయిత జార్జ్‌ గ్రిఫిత్‌ ‘ఎ హనీమూన్‌ ఇన్‌ స్పేస్‌’ నవల రాశాడు. భూమి నుంచి చంద్రుని వరకు సాగిన ప్రణయయాత్రకు చెందిన కాల్పనిక నవల ఇది. గ్రిఫిత్‌ ఇందులో స్పేస్‌సూట్‌ గురించి వర్ణించాడు. శాస్త్రవేత్తలెవరూ అప్పటికి స్పేస్‌సూట్‌ను ఇంకా తయారు చేయలేదు.

వెండితెరపై చంద్రయానం
ఇంకా టాకీలు రాక మునుపే చంద్రయానం అంశంగా ఒక సినిమా వచ్చింది. ఫ్రెంచి ఇంద్రజాలికుడు, దర్శకుడు జార్జెస్‌ మెలీస్‌ 1902లో ‘లె వోయేజ్‌ దాన్స్‌ లా లూన్‌’ పేరిట మూకీ చిత్రం తీశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్‌ వెర్న్‌ నవలలు ‘ఫ్రమ్‌ ది ఎర్త్‌ టు ది మూన్‌’, ‘అరౌండ్‌ ది మూన్‌’ ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌ ప్రాచుర్యం ఉన్న ప్రాంతాల్లో ‘ఎ ట్రిప్‌ టు ది మూన్‌’ పేరుతో విడుదల చేశారు. తొలుత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చిత్రించిన ఈ చిత్రానికి అప్పట్లోనే కలరైజేషన్‌ కూడా చేశారు. మెలీస్‌ చిత్రరంగం నుంచి తప్పుకున్నాక ఈ చిత్రం ప్రింట్‌ కనిపించకుండా పోయింది. దీనిని 1930 ప్రాంతంలో కొందరు గుర్తించారు. కలరైజ్‌ చేసిన దీని ఒరిజినల్‌ ప్రింట్‌ను 1993లో గుర్తించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దానిని 2011లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే పదివేల ఫ్రాంకులు ఖర్చయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం ఇది భారీ బడ్జెట్‌ చిత్రం కిందే లెక్క. దీని తర్వాత టాకీల కాలం వచ్చాక 1950లో అమెరికన్‌ దర్శకుడు, నటుడు ఇర్వింగ్‌ పిషెల్‌ ‘డెస్టినేషన్‌ మూన్‌’ చిత్రాన్ని తీశాడు. ఇందులో మనుషులు చంద్రునిపైకి చేరుకున్న దృశ్యాలను దాదాపు వాస్తవ దృశ్యాలను తలపించేలా చిత్రించడం విశేషం. ఇలాంటి సినిమాలు భారత్‌లో ఆలస్యంగా వచ్చాయి. చంద్రుని మీదకు యాత్రకు సంబంధించి భారత్‌లో విడుదలైన తొలిచిత్రం ‘చాంద్‌ పర్‌ చఢాయీ’. టి.పి.సుందరం దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం 1967లో విడుదలైంది. 

చందమామ నానాటికీ దూరం
మన భూమి నుంచి చంద్రుడు నానాటికీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు ఇలా దూరం జరగడాన్ని వారు ‘లూనార్‌ రెసిషన్‌’గా పేర్కొంటున్నారు. భూమి నుంచి చంద్రుడు ఎంత వేగంగా దూరం జరుగుతున్నాడో తేల్చేందుకు ఇటీవల శాస్త్రవేత్తలు కచ్చితమైన లెక్క కట్టారు. వారి లెక్క ప్రకారం చంద్రుడు ఏడాదికి 1.5 అంగుళాలు (3.8 సెం.మీ.) చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. చంద్రుడు భూమి నుంచి దూరం జరగడం వల్ల భూమిపై రోజు స్వల్పంగా పెరుగుతుంది. కోట్లాది సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే కాలంలో భూమిపై రోజు పదమూడు గంటలే ఉండేది. భూమిపై జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులకు చంద్రుడే కారణమనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. 

రెండు ప్రయోగాలు.. రెండు విజయాలు
చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాలను అమెరికా, రష్యాలు పోటాపోటీగా గడచిన శతాబ్దిలోనే చేపడితే, భారత్‌ ఈ ప్రయోగాలను ఆలస్యంగా మొదలుపెట్టింది. తొలిసారిగా 2008 అక్టోబర్‌ 22న ‘చంద్రయాన్‌–1’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా పంపిన ‘చంద్రయాన్‌–1’ వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపై నీటి జాడను గుర్తించింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, చంద్రునిపై వాతావరణ వివరాల సేకరణ వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీని తర్వాత ‘చంద్రయాన్‌–2’ ప్రయోగాన్ని 2019 జూలై 22న చేపట్టింది. మొదట ఈ ప్రయోగాన్ని 2013లోనే చేపట్టాలని భావించినా, ల్యాండర్‌ తయారీని రష్యా సకాలంలో పూర్తి చేయకపోవడంతో జాప్యం జరిగింది. రెండేళ్లు గడిచినా తాత్సారం చేస్తూ వచ్చిన రష్యా చివరకు చేతులెత్తేయడంతో భారత్‌ ఈ ప్రయోగాన్ని పూర్తిగా స్వయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతతోనే చేపట్టాలని నిశ్చయించుకుంది. ‘చంద్రయాన్‌–2’ ప్రయోగంలో పంపిన ఎల్వీఎం–3 రాకెట్‌ విజయవంతంగా ‘చంద్రయాన్‌–2’ వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, దీని ద్వారా పంపిన ల్యాండర్‌ చంద్రుని ఉపరితలానికి చేరుకోకుండానే గల్లంతైంది. ల్యాండర్‌ విఫలమైనా, చంద్రుని కక్ష్యలోకి చేరుకున్న ఆర్బిటర్‌ చంద్రునికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తోంది. ఇది ఏడున్నరేళ్లు పనిచేస్తుందని అంచనా. చంద్రునిపైకి చేరుకునే ప్రయోగాలను భారత్‌ ఆలస్యంగా చేపట్టినా, తొలి రెండు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. 
  
చంద్రునిపై ఆవాసాలు! 
చంద్రుడి వాతావరణం, ఉపరితలంలోని విశేషాలు తెలుసుకోవడానికి దేశ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తుంటే, ఇంకొందరు చంద్రునిపై ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంపై కలలు కంటున్నారు. చంద్రలోక నివాసం ఆలోచన మనుషుల్లో శతాబ్దాలుగా ఉంది. ఇంగ్లిష్‌ తత్త్వవేత్త, మతబోధకుడు జాన్‌ విల్కిన్స్‌ పదిహేడో శతాబ్దిలోనే చంద్రునిపై మానవుల నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆలోచనను వెలిబుచ్చాడు. సోవియట్‌ రష్యా చంద్రునిపై జరిపిన ప్రయోగం 1959లో విజయవంతం కావడంతో చంద్రునిపై నివాసాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలపై ఆశలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో చంద్రునిపై మనిషి అడుగు మోపడం మాత్రమే సాధ్యమైంది గాని, నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడిక ప్రకారం గ్రహాంతరాలలోని ప్రదేశాలపై గుత్తాధిపత్యం చలాయించడం కుదరదు. దేశాలు గాని, వ్యక్తులు గాని, సంస్థలు గాని చంద్రుడు లేదా ఇతర గ్రహాలపైనున్న స్థలాలతో వ్యాపార లావాదేవీలు సాగించడం చట్టవిరుద్ధం. అయినా, కొన్నేళ్లుగా చంద్రుడిపై ఉన్న స్థలాలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగుతోంది. తొలిసారిగా 1936 జూన్‌ 15న డీన్‌ లిండ్సే అనే అమెరికన్‌ ఆసామి అంతరిక్షంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తనకే చెందుతాయని ప్రకటించుకున్నాడు. వెర్రిమాలోకాలైన కొందరు జనాలు వాటిని అతడి వద్ద నుంచి కొనుక్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. జనాల్లోని ఈ వేలంవెర్రిని గమనించే అమెరికన్‌ రచయిత రాబర్ట్‌ హీన్లీన్‌ 1949లో ‘ది మ్యాన్‌ హూ సోల్డ్‌ ది మూన్‌’ కథను రాశాడు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడికను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లూనార్‌ రిజిస్ట్రీ’ అనే సంస్థ ఎడాపెడా చంద్రుడిపై స్థలాలను కారుచౌకగా అమ్మిపారేస్తోంది. కొందరు ఔత్సాహికులు చంద్రుడిపై స్థలాలను ఈ సంస్థ వద్ద కొంటున్నారు. ఈ సంస్థ ఇచ్చే స్థలాల పట్టాలను సన్నిహితులకు కానుకలుగా కూడా బహూకరిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి
‘చంద్రయాన్‌–1’, ‘చంద్రయాన్‌–2’ ప్రయోగాలు రెండూ విజయవంతమైన నేపథ్యంలో భారత్‌ ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్‌–3’ ప్రయోగం చేపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగాన్ని జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’తో కలసి చేపడుతోంది. ఈ ప్రయోగం చేపట్టడానికి జూలై 14వ తేదీ అనుకూలంగా ఉన్నట్లు ‘ఇస్రో’ అధినేత సోమనాథ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌–3 వ్యోమనౌకను ఎల్‌ఎంవీ–3 రాకెట్‌ ద్వారా అంతరిక్షానికి పంపేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని సన్నాహాలనూ పూర్తి చేశారు. ‘చంద్రయాన్‌–3’ ద్వారా చంద్రుని దక్షిణధ్రువంలో ల్యాండర్‌ను సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలం మీదకు చేరుకున్నాక, దీనికి అనుసంధానమైన రోవర్‌ ల్యాండర్‌ నుంచి విడవడి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దీని ద్వారా చంద్రుని ప్రకంపనలను గుర్తించే సెస్మోమీటర్‌ వంటి పరికరాలను పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, వాతావరణం, రసాయనాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రయాన్‌–3 ద్వారా చంద్రునిపై ఇప్పటివరకు ఎవరూ చేరుకోని ప్రదేశానికి ల్యాండర్‌ను పంపుతున్నందున ఈ ప్రయోగం భారత్‌కు మాత్రమే కాకుండా, యావత్‌ ప్రపంచానికే కీలకంగా నిలుస్తుంది. ఏ మీరిది చదివేసరికి ఈ ప్రయోగం పూర్తయివుంటుంది.

చదవండి : భారత్‌లో టెస‍్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement