వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో ఏమని ట్వీట్ చేస్తారో ఆయనకే తెలీదు. ఈసారి ఆయన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మీద పడ్డారు. ‘అంతరిక్ష పరిశోధనలకు కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. అవన్నీ చంద్రుడిపై పరిశోధనలకే నాసా ఎందుకు ఖర్చు చేస్తోంది ? 50 ఏళ్ల క్రితమే మనం చంద్రుడిపై కాలు పెట్టాం కదా. రక్షణ, సైన్స్ రంగాల్లో ఇంకా అతి పెద్ద లక్ష్యాలను సాధించాలి. అంగారకుడిపై అధ్యయనం చేయాలి (చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమే కదా)’ అని ట్వీట్ చేశారు.
ఇంకేముంది సోషల్ మీడియా ఆయనపై ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఈ ట్వీట్ ఒక వైరల్‌గా మారింది. జోకులు, మెమెలు, వెటకారాలు, వెక్కిరింపులు ఒకటేమిటి నెటిజన్లు ట్రంప్‌ని ఓ ఆటాడుకున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని అయిదో క్లాసు చదివే పిల్లల్ని అడిగినా చెబుతారు. అలాంటిది భూమికి 3.39 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడు చంద్రుడిలో భాగం ఎలా అవుతాడు ? అగ్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు.
ట్రంప్ అంత అజ్ఞానా అంటూ ఒకరు ఆశ్చర్యపోతే, మరొకరు ట్రంప్ తండ్రి ఆయనకి ఖగోళ శాస్త్రం గురించి ఎన్నడూ చెప్పలేదా? అని విస్తుపోయారు. అసలు అంతరిక్షమంటేనే ఓ రహస్యాల పుట్ట. అంగారకుడిలో చంద్రుడిని భాగం చేసి కొత్త రహస్యాన్ని ప్రపంచానికి ట్రంప్ బట్టబయలు చేశారు అంటూ మరొకరు వ్యంగ్య బాణాలు విసిరారు. అంతరిక్షానికి సంబంధించి అధ్యక్షుడి ట్రాక్ రికార్డు చూస్తే నాసా ట్రంప్ సహాయ సహకారాలు బాగా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని సలహాలిచ్చారు. గతంలో గ్లోబల్ వార్మింగ్‌పై ట్రంప్ ట్వీట్‌కు మన అస్సామీ అమ్మాయి ఆస్తా శర్మ వెదర్‌కి, క్లైమేట్‌కి తేడా తెలుసుకోవాలంటూ చురకలంటించడం తెల్సిందే.
మెక్సికోపై సుంకాల వడ్డింపు రద్దు
మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 5శాతం సుంకం విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. మధ్య అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాకను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మెక్సికో హామీ ఇవ్వడంతో ఆ దేశంపై సుంకం వడ్డించాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రకటించిన ప్రకారం జూన్ 10 నుంచి మెక్సికో ఉత్పత్తులపై సుంకం విధింపు అమల్లోకి రావలసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment