సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుగులేని శక్తిగా అవతరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి–46 ప్రయోగం విజయవంతమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)సి–46 ఉపగ్రహ వాహక నౌక 615 కిలోల బరువైన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ)ను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి శాస్త్రవేత్తలు తమ సత్తాచాటారు. ప్రయోగానికి 25 గంటలకు ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
ఇది ముగిసిన వెంటనే పీఎస్‌ఎల్‌వీ సి–46 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో షార్‌లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఐదు వేల మంది కరతాళ ధ్వనులు చేశారు. ప్రయోగించిన తర్వాత 15.25 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సి–46 రాకెట్.. రీశాట్ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరులో ఇస్ట్రాక్ భూకేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. ఉపగ్రహానికి అమర్చిన 3.6 మీటర్లు వ్యాసార్థం కలిగిన రాడియల్ రిబ్ యాంటెన్నా విచ్చుకోవడంతో ఉపగ్రహం పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రయోగ విజయంతో షార్ శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ కె.శివన్ ఆనందాన్ని పంచుకున్నారు.
నాలుగు దశల్లో..
పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించారు. స్ట్రాపాన్ బూçస్టర్లు లేకుండా చేసిన ప్రయోగాన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభించింది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు మొదటి దశను విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండో దశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగో దశను పూర్తి చేశారు.
15.25 నిమిషాలకు 615 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 37 డిగ్రీల వాలులో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ కోర్ అలోన్ దశతో ఇది 14వ ప్రయోగం. అదేవిధంగా ఈ ఏడాది మూడో ప్రయోగం, మొదటి ప్రయోగ వేదిక నుంచి 36వ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 48వ ప్రయోగం, షార్ కేంద్రం నుంచి 72వ ప్రయోగం కావడం విశేషం.
నిఘా అవసరాలను గుర్తించి..
పీఎస్‌ఎల్‌వీ సి–46 రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇది ఉపకరించనుంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్–2బీలో ఎక్స్ బాండ్ అపార్చర్ రాడార్ అనే ఉపకరణాన్ని అమర్చారు. ఈ ఉపగ్రహం దట్టమైన మేఘాలు కమ్ముకుని భూమి కనిపించకపోయినా అత్యంత నాణ్య మైన ఛాయా చిత్రాలను తీసి పంపుతుంది.
ఉగ్ర కదలికలే కాకుండా వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందిస్తుంది. భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందించడం ఉపగ్రహం ప్రత్యేకత. ఇప్పటివరకు రీశాట్–1, రీశాట్–2, స్కాట్‌శాట్ అనే మూడు ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. రీశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఇప్పుడు ప్రయోగించింది నాలుగోది కావడం విశేషం.
జూలైలో చంద్రయాన్–2
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని జూలై 9 నుంచి 16 లోపు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సి–46 ప్రయోగం విజయం అనంతరం మిషన్ కంట్రోల్ రూమ్‌లో శివన్ ఇతర శాస్త్రవేత్తలతో విజయానందాన్ని పంచుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ భారతదేశ నిఘాకు సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయోగంలో రోదసీలోకి పంపిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని చెప్పారు.
ఇందులో అమర్చిన ఎక్స్ బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ఇప్పటివరకు 50 టన్నులు బరువు కలిగిన 354 ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లాయన్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు విడిభాగాలను అందజేస్తున్న ప్రైవేటు కంపెనీలు అద్భుతమైన సాయాన్ని అందజేస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ఉపగ్రహాలనైనా సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలిగే అద్భుతమైన రాకెట్‌లని పీఎస్‌ఎల్‌వీని అభివర్ణించారు. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి మంగళవారం ఎంఆర్‌ఆర్ సమావేశాన్ని నిర్వహించామన్నారు.
చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా ల్యాండర్, రోవర్‌ను సెప్టెంబర్ 6 నాటికి చంద్రుడిపై దించుతామని తెలిపారు. దాదాపు రెండు నెలల పాటు చంద్రయాన్–2 ప్రయాణం చేసి చంద్రుడిపై దిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్, వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ ఎస్.సోమనాథ్, యూఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, ఐపీఆర్‌సీ డైరెక్టర్ టి.మూకయ్య, ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ వి.నారాయణన్, శాక్ డైరెక్టర్ డీకే దాస్, మిషన్ డైరెక్టర్ ఎస్‌ఆర్ బిజూ, శాటిలైట్ డైరెక్టర్ నాడ గౌడ తదితరులు పాల్గొన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
పీఎస్‌ఎల్‌వీ సి–46 ఉప గ్రహాన్ని విజయవం తంగా అంతరిక్షం లోకి ప్రయోగించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment