శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్వీ ఎఫ్–08 వాహక నౌక
శ్రీహరికోట/చెన్నై: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్08 వాహకనౌక ద్వారా జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించారు.
అనంతరం రాకెట్ రెండోదశలో ద్రవరూప ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. బుధవారం జీఎస్‌ఎల్వీ వాహకనౌకకు అవసరమైన హీలియం, నైట్రోజన్ వాయువుల్ని నింపడంతో పాటు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల్ని అప్రమత్తం చేయనున్నారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న జీశాట్–6ఏ ఉపగ్రహం 10 ఏళ్లపాటు సేవలందించనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జీశాట్–6ఏ బరువు 2,140 కేజీలు కాగా, అందులో ఇంధనం బరువే 1,132 కేజీలు ఉంటుందని వెల్లడించారు.
ఈ ఉపగ్రహంలోని శక్తిమంతమైన ట్రాన్స్‌పౌండర్లతో మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా 6 మీటర్ల వ్యాసార్థమున్న యాంటెన్నాను జీశాట్–6ఏలో వాడామనీ, దీనిద్వారా ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని సంగ్రహించే వీలు కలుగుతుందని తెలిపారు. ఉపగ్రహాల్ని జీఎస్‌ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్‌ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి.
Comments
Please login to add a commentAdd a comment