GSAT-6A
-
తప్పిపోయిన జీశాట్.. షాకింగ్ న్యూస్
సాక్షి, బెంగళూరు : ఇస్రోతో సంబంధాలు కోల్పోయిన ఉపగ్రహం జీశాట్-6ఏ పై అంతరిక్ష నిపుణులు విస్మయానికి గురి చేసే ప్రకటన చేశారు. మరికొద్ది గంటల్లో గనుక అనుసంధానం కాకపోతే అది అంతరిక్షంలో ఓ శకలంగా మిగిలిపోవటం ఖాయమని పేర్కొంటున్నారు. ‘సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు 48 గంటల్లోపు తిరిగి సంధానం అవుతుంటాయి. కానీ, ఇప్పటిదాకా జీశాట్-6ఏ గురించి ఇస్రో ఎలాంటి స్పష్టతకు రాలేకపోతోంది. ఆ లెక్కన్న ఈ ప్రయోగం ముగిసిందనే అనుకోవాలి. అయితే మరికొద్ది గంటలు మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. పూర్తి ఇంధనంతో అంతరిక్ష శకలంగా మిగిలే మొదటి ఉపగ్రహంగా జీశాట్-6ఏ చరిత్రలో మిగిలిపోతుంది’ అని వాళ్లు చెబుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు సుమారు రూ.270 కోట్ల వ్యయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08 ద్వారా జీశాట్- 6ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది. అయితే విద్యుత్ వ్యవస్థలో లోపం వల్లే అనుసంధానం తెగిపోయి ఉంటుందని ఇస్రో అనుమానిస్తోంది. ‘సోలార్ వ్యవస్థ విఫలమైతే బ్యాటరీలు వాటికవే పని చేయాలి. కానీ, అది జరగలేదు. కాబట్టి మొత్తం విద్యుత్ వ్యవస్థ చెడిపోయి ఉంటుందని భావిస్తున్నాం. అయినప్పటికీసంబంధాలను పునరుద్ధరించేందుకు మా వంతు మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం ఇస్రో తన పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం క్లిక్ చెయ్యండి -
‘జీశాట్–6ఏ’లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) /బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్–6ఏ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీశాట్–6ఏ ఉపగ్రహానికి బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. మూడో విడతగా ఆదివారం తెల్లవారుజామున ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొంది. విదేశీ అంతరిక్ష సంస్థలతో సంప్రదింపులు జీశాట్–6ఏ నుంచి సంబంధాలు తెగిపోవడంతో విదేశీ అంతరిక్ష సంస్థలతో ఇస్రో సంప్రదింపులు జరుపుతోంది. మన ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి సిగ్నల్స్ అందకపోయినప్పటికీ మరికొన్ని విదేశీ అంతరిక్ష సంస్థలకు సిగ్నల్స్ అందే అవకాశం ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలను ఇస్రో సంప్రదిస్తోంది. ఎలాగైనా ఈ ఉపగ్రహాన్ని రికవరీ చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ కె.శివన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగంలోనే విషమ పరీక్ష ఎదురైంది. అనుసంధానమయ్యే అవకాశం: శివన్ ప్రస్తుతానికి తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఉపగ్రహంతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. అయితే ముందుగా శాటిలైట్‌తో లింక్ ఏర్పరుకోవడమే దీనిలో ప్రధానమైందని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహాల్లో సాంకేతిక లోపాలు ఒకప్పుడు రాకెట్లు సక్సెస్ కాక ఉపగ్రహాలను సముద్రం పాలు చేసేవారు. ఇటీవల కాలంలో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినా.. ఉపగ్రహాల విషయంలో సాంకేతిక లోపం ఏర్పడి పనికి రాకుండా పోతున్నాయి. గతంలో కూడా ఇన్శాట్ 4సీ ఆర్ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆ ఉపగ్రహాన్ని అలాగే వదిలేశారు. గతేడాది ఆగస్టు 30న పీఎస్ఎల్వీ సీ39 ద్వారా పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహం హీట్‌షీల్డ్ విడిపోకపోవడంతో పనికి రాకుండా పోయింది. -
ఆందోళనలో ఇస్రో..అసలేం ఏం జరిగింది?
-
శాటిలైట్‌తో లింక్ కట్; ఆందోళనలో ఇస్రో
న్యూఢిల్లీ: ఉపగ్రహ ప్రయోగాల్లో అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల కిందట నింగిలోకి పంపిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రతినిధులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి పంపిన ఉపగ్రహం తొలిదశ విజయవంతంకాగా, తుది దశలో మాత్రం సాంకేతిక లోపాలు తలెత్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఉపగ్రహంతో లింక్ కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో తెలిపింది. అసలేం ఏం జరిగింది?: భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే లక్ష్యంతో గత గురువారం ఇస్రో జీశాట్6–ఏ ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. కాగా, శనివారం నాటికి అనూహ్య రీతిలో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీతో ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి. మరింతలోతుకు వెళితే..: జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. హసన్(కర్ణాటక)లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు. శనివారం.. చివరిదైన మూడో లామ్ ఇంజిన్‌ను మండించిన సమయంలోనే ఉపగ్రహంలో లోపాలు తలెత్తాయి. అప్పటి నుంచి జీశాట్6ఏ భూమితో అనుసంధానం కోల్పోయింది. -
జీశాట్–6ఏ కక్ష్య దూరం పెంపు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్ఎల్వీ ఎఫ్08 ఉపగ్రహ వాహక నౌక ద్వారా గురువారం ప్రయోగించిన జీశాట్ 6ఏ ఉపగ్రహ మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజనిక్ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరో విజయాన్ని ఇస్రో నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు. -
గ‘ఘన’ విజయం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ యవనికపై భారత్ (ఇస్రో) మరోసారి కీర్తిపతాకాన్ని ఎగరేసింది. భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే జీశాట్6–ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని (డబుల్ హ్యాట్రిక్) ఇస్రో నమోదు చేసింది. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవగా 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం కావటం గమనార్హం. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా మారిన క్రయోజనిక్ మూడో దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు పరిణితి సాధించారు. డాక్టర్ శివన్ ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి ప్రయోగం కావటంతో.. ఆయనలో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. ప్రయోగం జరిగిందిలా.. 49.1 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ ఎఫ్08 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ దశల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్దశలో 138.11 ఘన ఇంధనంతో మొదటిదశను 151 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశారు. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 285 సెకన్లలో, ఆ తరువాత క్రయోజనిక్ దశను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేశారు. అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు వారి అధీనంలోకి తీసుకుని కక్ష్యలో ఉపగ్రహం పరిస్థితిని నియంత్రిస్తున్నారు. సమష్టి విజయం ప్రయోగం విజయవంతం శాస్త్రవేత్తల సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ తెలిపారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఇక భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న విశ్వాసం పెరిగిందన్నారు. వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు చేపడతామని శివన్ తెలిపారు. ఇప్పటిదాకా చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఇకనుంచి అన్ని భారీ ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని, ఈ ఏడాది రాబోవు తొమ్మిది నెలల్లో 10 ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని శివన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చంద్రయాన్–2 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్ అభినందనలు ఇస్రో ఘనవిజయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ఇస్రో తీరు గర్వకారణం. స్వదేశీ క్రయోజనిక్ దశ ద్వారా విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహం ద్వారా మరిన్ని అధునాతన మొబైల్ యాప్‌లను సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది’ అని ప్రధాని ట్వీట్‌చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జీశాట్–6ఏ విజయవంతం కావటంపై శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ ఖ్యాతి పెంచారు: వైఎస్ జగన్ సమాచార రంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భారత పేరు ప్రతిష్టలు పెంచే ఈ క్రతువులో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉపగ్రహంతో ప్రయోజనం జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్‌బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చి పంపించారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని ఒక బీమ్.. రక్షణరంగం, విమానయానం, అంతరిక్ష రంగాలకు అత్యంత అధునాతనమైన శాటిలైట్ ఫోన్ల టెక్నాలజీని అందిస్తుంది. మరో బీమ్ ద్వారా డిజిటల్ మల్టీమీడియా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తుంది. మొబైల్ ఫోన్లలో సురక్షితమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. -
జీఎస్ఎల్వీ ప్రయోగం నేడే
శ్రీహరికోట/చెన్నై: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్08 వాహకనౌక ద్వారా జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. అనంతరం రాకెట్ రెండోదశలో ద్రవరూప ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. బుధవారం జీఎస్ఎల్వీ వాహకనౌకకు అవసరమైన హీలియం, నైట్రోజన్ వాయువుల్ని నింపడంతో పాటు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల్ని అప్రమత్తం చేయనున్నారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న జీశాట్–6ఏ ఉపగ్రహం 10 ఏళ్లపాటు సేవలందించనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జీశాట్–6ఏ బరువు 2,140 కేజీలు కాగా, అందులో ఇంధనం బరువే 1,132 కేజీలు ఉంటుందని వెల్లడించారు. ఈ ఉపగ్రహంలోని శక్తిమంతమైన ట్రాన్స్పౌండర్లతో మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా 6 మీటర్ల వ్యాసార్థమున్న యాంటెన్నాను జీశాట్–6ఏలో వాడామనీ, దీనిద్వారా ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని సంగ్రహించే వీలు కలుగుతుందని తెలిపారు. ఉపగ్రహాల్ని జీఎస్ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి. -
ఇస్రో శక్తిమంతమైన ప్రయోగం: పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సంసిద్ధమైంది. గురువారం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేజింగ్(షార్) నుంచి సాయంత్రం 04.56 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జీశాట్-6ఏ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. జీశాట్-6 తరహాలోనే జీశాట్-6ఏ కూడా శక్తిమంతమైన ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఏంటీ జీశాట్-6ఏ..? ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్-6ఏ రెండోది. 2015 ఆగష్టులో జీశాట్-6ను ఇస్రో ప్రయోగించింది. కొత్త సాంకేతికత అభివృద్ధికి దోహదపడేందుకు జీశాట్-6ఏను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు జీశాట్-6ఏ మరింత బలం చేకూర్చుతుంది. దాదాపు 2 టన్నులు బరువుండే జీశాట్-6ఏ ఉపగ్రహం పదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తుంది. దీని తయారీ కొరకు ఇస్రో రూ. 270 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక యాంటెన్నా వినియోగం.. జీశాట్-6ఏ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. విచ్చుకుంటే ఆరు మీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడటానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం ఒక్కసారి కక్ష్యలో చేరిన తర్వాత ఇది తెరచుకుంటుంది. ఇప్పటివరకూ ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైనది. మొబైల్ కమ్యూనికేషన్‌తో పాటు మిలటరీ అవసరాలకు కూడా ఈ యాంటెనా ఉపయోగపడనుంది. ఏంటీ ఎస్-బ్యాండ్..? విద్యుదాయస్కాంత స్పెక్ట్రమ్‌లో 2 నుంచి 4 గిగాహెర్జ్ పౌనఃపున్యాల మధ్య ఉండే బ్యాండ్‌ను ‘ఎస్’గా పిలుస్తారు. ప్రస్తుతం ఎస్-బ్యాండ్‌ను వాతావరణ రాడార్లలో, సముద్ర ఉపరితలంపై సంచరించే ఓడల్లో, కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగంలో ఉన్న 4జీ నెట్వర్క్ సైతం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే సేవలు అందిస్తోంది. జీఎస్ఎల్వీ ఎఫ్-08 రాకెట్ ద్వారా.. జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగిస్తోంది. జీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్లను వినియోగించి ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది పన్నెండవది. క్రయోజెనిక్ సాంకేతికతను అందిపుచ్చుకున్న తర్వాత చేస్తున్న ప్రయోగాల్లో ఆరవది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది.