
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 ఉపగ్రహ వాహక నౌక ద్వారా గురువారం ప్రయోగించిన జీశాట్ 6ఏ ఉపగ్రహ మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజనిక్ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరో విజయాన్ని ఇస్రో నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు.