గ‘ఘన’ విజయం | ISRO GSLV rocket successfully launches GSAT-6A communication satellite | Sakshi
Sakshi News home page

గ‘ఘన’ విజయం

Published Fri, Mar 30 2018 1:55 AM | Last Updated on Fri, Mar 30 2018 1:55 AM

ISRO GSLV rocket successfully launches GSAT-6A communication satellite - Sakshi

నింగిలోకి దూసుకెళ్తున్న జీఎస్‌ఎల్వీ ఎఫ్‌–08 రాకెట్‌

శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ యవనికపై భారత్‌ (ఇస్రో) మరోసారి కీర్తిపతాకాన్ని ఎగరేసింది. భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే జీశాట్‌6–ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్‌ 6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్‌ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని (డబుల్‌ హ్యాట్రిక్‌) ఇస్రో నమోదు చేసింది.

బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవగా 27 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం కావటం గమనార్హం. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా మారిన క్రయోజనిక్‌ మూడో దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు పరిణితి సాధించారు. డాక్టర్‌ శివన్‌ ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి ప్రయోగం కావటంతో.. ఆయనలో రెట్టించిన ఉత్సాహం కనిపించింది.

ప్రయోగం జరిగిందిలా..
49.1 మీటర్ల పొడవున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. 4 స్ట్రాపాన్‌ బూస్టర్లు, కోర్‌ అలోన్‌ దశల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్‌ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్‌ అలోన్‌దశలో 138.11 ఘన ఇంధనంతో మొదటిదశను 151 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశారు.

39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 285 సెకన్లలో, ఆ తరువాత క్రయోజనిక్‌ దశను 12.84 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేశారు. అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ వారు వారి అధీనంలోకి తీసుకుని కక్ష్యలో ఉపగ్రహం పరిస్థితిని నియంత్రిస్తున్నారు.

సమష్టి విజయం
ప్రయోగం విజయవంతం శాస్త్రవేత్తల సమష్టి విజయమని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ తెలిపారు. క్రయోజనిక్‌ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఇక భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న విశ్వాసం పెరిగిందన్నారు. వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు చేపడతామని శివన్‌ తెలిపారు.

ఇప్పటిదాకా చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఇకనుంచి అన్ని భారీ ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని, ఈ ఏడాది రాబోవు తొమ్మిది నెలల్లో 10 ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని శివన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ2 ద్వారా చేయనున్నట్టు చెప్పారు.

రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్‌ అభినందనలు
ఇస్రో ఘనవిజయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్‌ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ఇస్రో తీరు గర్వకారణం. స్వదేశీ క్రయోజనిక్‌ దశ ద్వారా విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. జీశాట్‌–6ఏ సమాచార ఉపగ్రహం ద్వారా మరిన్ని అధునాతన మొబైల్‌ యాప్‌లను సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది’ అని ప్రధాని ట్వీట్‌చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా జీశాట్‌–6ఏ విజయవంతం కావటంపై శాస్త్రవేత్తలను అభినందించారు.

దేశ ఖ్యాతి పెంచారు: వైఎస్‌ జగన్‌
సమాచార రంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. భారత పేరు ప్రతిష్టలు పెంచే ఈ క్రతువులో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఉపగ్రహంతో ప్రయోజనం
జీశాట్‌–6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్‌ మల్టీ మీడియా, మొబైల్‌ కమ్యూనికేషన్‌ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్‌ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్‌బ్యాండ్‌ స్పాట్‌ బీమ్స్, ఒక సీబ్యాండ్‌ బీమ్‌ అమర్చి పంపించారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్‌ యాంటెన్నాతో యూజర్‌ కమ్యూనికేషన్‌ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్‌డ్‌ యాంటెన్నా ద్వారా హబ్‌ కమ్యూనికేషన్‌ లింక్‌ అందుబాబులోకి వస్తుంది.

ఇందులోని ఒక బీమ్‌.. రక్షణరంగం, విమానయానం, అంతరిక్ష రంగాలకు అత్యంత అధునాతనమైన శాటిలైట్‌ ఫోన్ల టెక్నాలజీని అందిస్తుంది. మరో బీమ్‌ ద్వారా డిజిటల్‌ మల్టీమీడియా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తుంది. మొబైల్‌ ఫోన్లలో సురక్షితమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement