
జీశాట్–6ఏ ఉపగ్రహం కక్ష్యలో తిరుగుతున్న ఊహా చిత్రమిది
శ్రీహరికోట (సూళ్లూరుపేట) /బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్–6ఏ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీశాట్–6ఏ ఉపగ్రహానికి బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
శుక్ర, శనివారాల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. మూడో విడతగా ఆదివారం తెల్లవారుజామున ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
విదేశీ అంతరిక్ష సంస్థలతో సంప్రదింపులు
జీశాట్–6ఏ నుంచి సంబంధాలు తెగిపోవడంతో విదేశీ అంతరిక్ష సంస్థలతో ఇస్రో సంప్రదింపులు జరుపుతోంది. మన ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి సిగ్నల్స్ అందకపోయినప్పటికీ మరికొన్ని విదేశీ అంతరిక్ష సంస్థలకు సిగ్నల్స్ అందే అవకాశం ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలను ఇస్రో సంప్రదిస్తోంది. ఎలాగైనా ఈ ఉపగ్రహాన్ని రికవరీ చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ కె.శివన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగంలోనే విషమ పరీక్ష ఎదురైంది.
అనుసంధానమయ్యే అవకాశం: శివన్
ప్రస్తుతానికి తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఉపగ్రహంతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. అయితే ముందుగా శాటిలైట్‌తో లింక్ ఏర్పరుకోవడమే దీనిలో ప్రధానమైందని ఆయన పేర్కొన్నారు.
ఉపగ్రహాల్లో సాంకేతిక లోపాలు
ఒకప్పుడు రాకెట్లు సక్సెస్ కాక ఉపగ్రహాలను సముద్రం పాలు చేసేవారు. ఇటీవల కాలంలో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినా.. ఉపగ్రహాల విషయంలో సాంకేతిక లోపం ఏర్పడి పనికి రాకుండా పోతున్నాయి. గతంలో కూడా ఇన్‌శాట్ 4సీ ఆర్ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆ ఉపగ్రహాన్ని అలాగే వదిలేశారు. గతేడాది ఆగస్టు 30న పీఎస్‌ఎల్‌వీ సీ39 ద్వారా పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ ఉపగ్రహం హీట్‌షీల్డ్ విడిపోకపోవడంతో పనికి రాకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment