connection cut
-
‘జీశాట్–6ఏ’లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) /బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్–6ఏ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీశాట్–6ఏ ఉపగ్రహానికి బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. మూడో విడతగా ఆదివారం తెల్లవారుజామున ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొంది. విదేశీ అంతరిక్ష సంస్థలతో సంప్రదింపులు జీశాట్–6ఏ నుంచి సంబంధాలు తెగిపోవడంతో విదేశీ అంతరిక్ష సంస్థలతో ఇస్రో సంప్రదింపులు జరుపుతోంది. మన ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి సిగ్నల్స్ అందకపోయినప్పటికీ మరికొన్ని విదేశీ అంతరిక్ష సంస్థలకు సిగ్నల్స్ అందే అవకాశం ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలను ఇస్రో సంప్రదిస్తోంది. ఎలాగైనా ఈ ఉపగ్రహాన్ని రికవరీ చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ కె.శివన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగంలోనే విషమ పరీక్ష ఎదురైంది. అనుసంధానమయ్యే అవకాశం: శివన్ ప్రస్తుతానికి తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఉపగ్రహంతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. అయితే ముందుగా శాటిలైట్‌తో లింక్ ఏర్పరుకోవడమే దీనిలో ప్రధానమైందని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహాల్లో సాంకేతిక లోపాలు ఒకప్పుడు రాకెట్లు సక్సెస్ కాక ఉపగ్రహాలను సముద్రం పాలు చేసేవారు. ఇటీవల కాలంలో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినా.. ఉపగ్రహాల విషయంలో సాంకేతిక లోపం ఏర్పడి పనికి రాకుండా పోతున్నాయి. గతంలో కూడా ఇన్శాట్ 4సీ ఆర్ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆ ఉపగ్రహాన్ని అలాగే వదిలేశారు. గతేడాది ఆగస్టు 30న పీఎస్ఎల్వీ సీ39 ద్వారా పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహం హీట్‌షీల్డ్ విడిపోకపోవడంతో పనికి రాకుండా పోయింది. -
బిల్లు కట్టలేదని ఫీజు పీకేశారు
చేవెళ్ల : చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి రెండు నెలల విద్యుత్ బకాయిలు కట్టలేదని అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. రెండు నెలలకు సంబంధించి రూ. 14వేల విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉంది. దీంతో మంగళవారం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే... చేవెళ్ల మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లును కార్యాలయమే చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా విద్యుత్‌బిల్లుకు సంబంధించి బిల్లు చేసి ఎస్టీఓకు పంపిస్తారు. అక్కడ బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలైతే డీడీని విద్యుత్ అధికారులకు ఇస్తారు. అయితే రెండు నెలలుగా ఎస్టీఓ నుంచి డీడీ రాకపోవటంతో వేచి చూసిన విద్యుత్ అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. దీంతో కార్యాలయంలో జరగాల్సిన రోజువారీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అసలే వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమ) సెలవులు రావటంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. మంగళవారమైనా చేయించుకుందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొంతమంది పనులు మానుకొని వచ్చామని సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వివాదం పెట్టుకున్నారు. ఆన్లైన్ లేకపోతే మాన్యూవల్‌గానైనా చేయాలని కోరారు. అయితే తనకు అలాంటి అధికారం లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉంటేనే చేస్తానని సబ్ రిజిస్ట్రార్ వారితో చెప్పారు. రెండు రోజులు గడువిచ్చాం: విద్యుత్ ఏఈ మురళీధీర్ విద్యుత్ ఏఈ మురళీధీర్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం భవనం ప్రైవేటుదని తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే రెండు నెలలు వేచి చూశామని రూ. 14వేల బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పటికీ బిల్లు రాకపోవటంతోనే తొలగించినట్లు చెప్పారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ రెండురోజుల కోసం అనుమతి కోరటంతో సాయంత్రం విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చినట్లు చెప్పారు. రెండు రోజులు చూసి బిల్లు రాకపోతే మళ్లీ తొలగిస్తామని తెలిపారు. సాయంత్రం కనెక్షన్ ఇచ్చినా అప్పటికే సమయం అయిపోవటంతో అందరూ వెళ్లిపోయారు. బిల్లు చేసి పంపించాం.. బకాయిలకు సంబంధించి బిల్లు చేసి మా కార్యాలయం నుంచి ఎస్టీఓకు పంపించాం. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ అధికారులకు డీడీ రూపంలో బిల్లు వెళ్లాలి. కానీ ఎస్టీఓ నుంచి డీడీ వెళ్లలేదన్నారు. పైనుంచి నిధులు రాలేదని అందుకు డీడీ పంపలేదని చెప్పారు. విద్యుత్ అధికారులు అడిగితే రెండురోజుల్లో వస్తుందని నాలుగైదు రోజులుగా చెబుతున్నారు. – రాజేంద్రకుమార్, సబ్‌రిజిస్ట్రార్, చేవెళ్ల -
ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు రూ.65 కోట్లు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కరెంటోళ్ల ప్రతాపం అంతా పేదలపైనే. విద్యుత్ బిల్లు నెల ఆలస్యం అయితే చాలు జరిమానా వేస్తారు. కనెక్షన్ కట్ చేస్తారు. తలుపులు, దర్వాజలు, ఇంట్లోని సామగ్రి తీసుకెళ్తారు. రైతుల నుంచి అయితే స్టాటర్లు, మోటార్లు, కరెంట్ వైర్లు లాక్కెళ్తారు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంట్ సరఫరానే నిలిపివేస్తున్నారు.! కానీ, రూ.కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖలపై చర్యలు తీసుకోవడం లేదు. ట్రాన్స్‌కో నష్టాల్లో ఉండటంతో బకాయిలు వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలను ఆదేశించినట్లు తెలిసింది. మొండి బకాయిలను ఫిబ్రవరిలోగా వసూలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్ర విభజనకు చర్యలు సాగుతుం డగా, మరోపక్క విద్యుత్ బకాయిల పై నేరుగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టి సారించడంగమనార్హం. బకాయిలు రూ.65 కోట్లపైనే.. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు రూ.65 కోట్లపై బడే బకాయిలు ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ, మున్సిపాలిటీల్లో నీటి పథకాలు, వీధి దీపాల బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల వసూలు కోసం అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. కొన్ని సమయాల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించి కరెంటు సరఫరా నిలిపివేసినా పూర్తిస్థాయిలో బకాయిలు వసూలు కాలేదు. పంచాయతీల పరంగా రూ.49.37 కోట్లు బకాయిలు ఉండగా, అందులో కాగజ్‌నగర్ ఈఆర్వో నుంచి రూ.14.04 కోట్లు, ఆదిలాబాద్ రూ.13.95 కోట్లు, మంచిర్యాల రూ.9.83 కోట్లు, భైంసా రూ.5.97 కోట్లు, నిర్మల్ ఈఆర్వో పరిధిలో రూ.5.56 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. పంచాయతీలు రూ.కోట్ల బకాయిలు ఉంటే ప్రభుత్వం గత నెలలో కేవలం రూ.30 లక్షలు చెల్లించింది. రానున్న రోజుల్లో పంచాయతీలే నేరుగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పల్లెల్లో చీకట్లు అలుముకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు రూ.11.46 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో భైంసా మున్సిపాలిటీ రూ.4.81 కోట్లు, నిర్మల్ రూ.3.23 కోట్లు, మందమర్రి రూ.1.48 కోట్లు, మంచిర్యాల రూ.59 లక్షలు, కాగజ్‌నగర్ రూ.43.06 లక్షలు, ఆదిలాబాద్ రూ.47.46 లక్షలు, బెల్లంపల్లి రూ.43.87 లక్షలు చెల్లించాల్సి ఉంది. అనేక శాఖలు సాంఘిక, గిరిజన, వైద్య, ఆరోగ్య, ఉన్నత, పాఠశాల విద్య, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల, పోలీసు, రెవెన్యూ శాఖ, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు, జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఆర్టీసీ, వ్యవసాయ, అటవీ, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవో కార్యాలయాలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో మొండి విద్యుత్ బకాయిల వసూలుపై విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. కాగా ‘న్యూస్‌లైన్’ ఈ విషయంలో విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) అశోక్‌ను వివరణ కోరగా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ శాఖలు బకాయిలు ఉన్నా బిల్లుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరిలోగా ఈ బకాయిలను వసూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు.