విద్యుత్ కనెక్షన్లు కట్ చేసిన ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సరఫరా పునరుద్ధరణ
గుట్టుచప్పుడు కాకుండా మీటర్లు తెచ్చి బిగిస్తున్న సిబ్బంది
విద్యుత్ మీటర్లపై ‘సాక్షి’లో తప్పు రాశారని చెప్పాలని
బాధితులపై అధికారుల ఒత్తిడి
తిరస్కరించిన బాధితులు.. ‘సాక్షి’ వాస్తవాలే రాసిందని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లో మగ్గుతున్న దళిత, గిరిజనుల ఇళ్లలో మళ్లీ విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకు)కు తూట్లు పొడుస్తూ పాత బకాయిల పేరుతో దళిత, గిరిజనుల ఇళ్లకు తొలగించిన కరెంట్ మీటర్లను గురువారం నుంచి అధికారులు గుట్టుచప్పడు కాకుండా తిరిగి బిగిస్తున్నారు.
‘ఎస్సీ, ఎస్టీలకు షాక్.. ఉచిత విద్యుత్ కట్’ అనే శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ‘సాక్షి’లో ప్రస్తావించిన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామానికి చెందిన బర్ల ప్రశాంతి, నేమవరపు సీత, కొల్లి విమల, బల్లి రమాదేవి, కొల్లి బుచ్చమ్మ ఇండిబిగింజ లక్ష్మి తదితరుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు బిగించారు.
తమ ఇళ్లకు తిరిగి విద్యుత్ వెలుగులు వచ్చేలా చేసిన ‘సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విద్యుత్ మీటర్లు తొలగించలేదని, ‘సాక్షి’లో తప్పు రాశారని చెప్పాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేయగా... ‘సాక్షి’లో వాస్తవాలు రాశారని, అందువల్లే తమకు తిరిగి కరెంటు వచ్చిందని బాధితులు బదులివ్వడం గమనార్హం.
రెడ్డిగణపవరం పంచాయతీకి చెందిన గిరిజన మహిళ కాక వెంకమ్మ ఇంటికి గురువారం విద్యుత్ అధికారులు వచ్చి ‘బకాయిలు రూ.40వేలు కట్టినట్టు సాక్షికి చెప్పావు... అంత ఎప్పుడు కట్టావు..’ అని ప్రశ్నించగా... ఆమె అన్ని లెక్కలను బిల్లులతో సహా చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. దీంతో మీటరు బిగించి విద్యుత్ అధికారులు వెళ్లిపోయారు.
అదేవిధంగా గత ప్రభుత్వం 2019లో జీవో ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ తెలిపారు.
దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించకపోగా, ఇప్పుడు రూ.15వేల నుంచి రూ.40 వేల వరకు బకాయిలు ఉన్నట్టు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేసిందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ‘సాక్షి’ చొరవతో నెల రోజులుగా చీకట్లో మగ్గిపోతున్న దళిత, గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment