ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కరెంటోళ్ల ప్రతాపం అంతా పేదలపైనే. విద్యుత్ బిల్లు నెల ఆలస్యం అయితే చాలు జరిమానా వేస్తారు. కనెక్షన్ కట్ చేస్తారు. తలుపులు, దర్వాజలు, ఇంట్లోని సామగ్రి తీసుకెళ్తారు. రైతుల నుంచి అయితే స్టాటర్లు, మోటార్లు, కరెంట్ వైర్లు లాక్కెళ్తారు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కరెంట్ సరఫరానే నిలిపివేస్తున్నారు.! కానీ, రూ.కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖలపై చర్యలు తీసుకోవడం లేదు. ట్రాన్స్‌కో నష్టాల్లో ఉండటంతో బకాయిలు వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలను ఆదేశించినట్లు తెలిసింది. మొండి బకాయిలను ఫిబ్రవరిలోగా వసూలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్ర విభజనకు చర్యలు సాగుతుం డగా, మరోపక్క విద్యుత్ బకాయిల పై నేరుగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టి సారించడంగమనార్హం.
బకాయిలు రూ.65 కోట్లపైనే..
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు రూ.65 కోట్లపై బడే బకాయిలు ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ, మున్సిపాలిటీల్లో నీటి పథకాలు, వీధి దీపాల బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల వసూలు కోసం అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. కొన్ని సమయాల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించి కరెంటు సరఫరా నిలిపివేసినా పూర్తిస్థాయిలో బకాయిలు వసూలు కాలేదు. పంచాయతీల పరంగా రూ.49.37 కోట్లు బకాయిలు ఉండగా, అందులో కాగజ్‌నగర్ ఈఆర్‌వో నుంచి రూ.14.04 కోట్లు, ఆదిలాబాద్ రూ.13.95 కోట్లు, మంచిర్యాల రూ.9.83 కోట్లు, భైంసా రూ.5.97 కోట్లు, నిర్మల్ ఈఆర్‌వో పరిధిలో రూ.5.56 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.
పంచాయతీలు రూ.కోట్ల బకాయిలు ఉంటే ప్రభుత్వం గత నెలలో కేవలం రూ.30 లక్షలు చెల్లించింది. రానున్న రోజుల్లో పంచాయతీలే నేరుగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పల్లెల్లో చీకట్లు అలుముకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు రూ.11.46 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో భైంసా మున్సిపాలిటీ రూ.4.81 కోట్లు, నిర్మల్ రూ.3.23 కోట్లు, మందమర్రి రూ.1.48 కోట్లు, మంచిర్యాల రూ.59 లక్షలు, కాగజ్‌నగర్ రూ.43.06 లక్షలు, ఆదిలాబాద్ రూ.47.46 లక్షలు, బెల్లంపల్లి రూ.43.87 లక్షలు చెల్లించాల్సి ఉంది.
అనేక శాఖలు
సాంఘిక, గిరిజన, వైద్య, ఆరోగ్య, ఉన్నత, పాఠశాల విద్య, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల, పోలీసు, రెవెన్యూ శాఖ, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు, జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఆర్టీసీ, వ్యవసాయ, అటవీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంపీడీవో కార్యాలయాలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో మొండి విద్యుత్ బకాయిల వసూలుపై విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. కాగా ‘న్యూస్‌లైన్’ ఈ విషయంలో విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్‌ఈ) అశోక్‌ను వివరణ కోరగా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ శాఖలు బకాయిలు ఉన్నా బిల్లుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరిలోగా ఈ బకాయిలను వసూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు రూ.65 కోట్లు
Published Wed, Dec 25 2013 12:57 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement