pk mahanthi
-
వేగంగా విభజన ప్రక్రియ
ఢిల్లీలో ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు హాజరైన సీఎస్ మహంతి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాలపై చర్చ ఏపీ భవన్ విభజనపై ఉన్నతాధికారుల కీలక సమావేశం న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా విభజనకు సంబంధించి మంగళవారం సైతం ఢిల్లీలో కీలక భేటీలు జరిగాయి. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి హాజరై కీలక చర్చలు జరిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనేవారి విభజనకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే దిశగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా ఉన్నతాధికారులు మరో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీ భవన్ విభజనకు సంబంధించి వారు దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క బుధవారం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ కేంద్ర హోంశాఖ ముందు హాజరై తన కసరత్తును వారికి వివరించనుంది. ఇదిలా ఉండగా నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతో పాటు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యావరణ శాఖ, హోంశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొన్నారు. ఈ కమిటీ సుమారు నాలుగు గంటల పాటు రెండు విడతలుగా సమావేశమై అఖిలభారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాల తయారీపై కసరత్తు చేసింది. విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో తమకు ఆప్షన్లు ఉండాల్సిందేనని అఖిలభారత సర్వీసు అధికారులు ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? రోస్టర్ విధానాన్ని అవలంబించాలా? లేక స్థానికత ఆధారంగా నిర్ణయం చేయాలా? అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న అంశంపై వివరాలు తెలియరాలేదు. అధికారుల విభజన మార్గదర్శకాల తయారీ పూర్తి కాలేదని, దీనికి మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీ భవన్ విభజన కొలిక్కి!: ఇక ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, భవనాలు, తదితరాల విభజనకు సంబంధించి ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జీఏడీ ప్రోటోకాల్ ముఖ్య కార్యదర్శి రమణారెడ్డి, జీఏడీ కార్యదర్శి శివశంకర్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉన్న సీఎం కాటేజ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, శబరి బ్లాక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రికి కాటేజ్‌ను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీభవన్‌లో 30 వాహనాలు ఉండగా వాటిని ఆంధ్రకు 15, తెలంగాణకు 14 చొప్పున పంచారు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాడే రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇరువైపులా ఒక్కోటి చొప్పున, ఇక మిగిలిన మరో వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్, వీఐపీ డైనింగ్ హాల్, అంబేద్కర్ఆడిటోరియాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన మే 7 తర్వాతే? ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏపీ భవన్ ఉద్యోగుల విభ జనను ఎలా చేయాలన్నది మే 7 తర్వాతే నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ భవన్లో 31 మంది ఆంధ్రా ప్రాంతం వారు, 11 మంది తెలంగాణవారు, మరో 48 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వీరిని స్థానికత ఆధారంగా పంచితే తెలంగాణకు కొరత ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకు, డబుల్ పోస్టులున్న చోట్ల సీనియర్లు తెలంగాణకు, జూనియర్లను ఆంధ్రాకు కేటాయించేలా మొదట ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. దీనివల్ల కొందరు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న దృష్ట్యా సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరమే ఉద్యోగుల విభ జన చేపడతారని తెలుస్తోంది. అప్పటివరకు కేవలం పోస్టుల విభజనను పూర్తి చేస్తారని తెలుస్తోంది. -
పునర్విభజన విభాగం ఉండాలి: మహంతి
బాధ్యతలు సంతృప్తినిచ్చాయన్న సీఎస్ పొడిగింపు కోరబోనని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒకట్రెండు కమిటీలు పని చేయడం కంటే పునర్విభజనకు ప్రత్యేకంగా ఒక విభాగముంటే మేలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అభిప్రాయపడ్డారు. ‘‘ఎందుకంటే విభజనలో విస్తృతమైన, చాలా రోజులపాటు పని అవసరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మూడు నెలలు పడితే మరికొన్నింటికి ఏడాది దాకా పడుతుంది. అందుకే ప్రత్యేక విభాగంతో పనులు కొంత సులువవుతాయి’’ అని చెప్పారు.విభజనల పనుల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమీక్షకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించిన కాలం నాకు సంతృప్తినిచ్చింది. విభజన నేపథ్యంలో పలు రకాల ఒత్తిడి వాతావరణంలోనూ మచ్చ లేకుండా పనిచేశాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్‌గా చేసిన కాలంలోనే గాక పరిపాలనాపరంగా ప్రభుత్వ లబ్ధి ప్రజలకు సులువైన పద్ధతుల్లో చేరేందుకు చర్యలు తీసుకున్నాం. మీసేవలో సర్వీసులను 300కు పెంచాం. నేను సీఎస్‌గా ఉండగా నాలుగు తుపాన్లు ఎదుర్కొన్నాం. ఉత్తరాఖండ్ బీభత్సంలో మనవాళ్లు చిక్కుకున్నారు. రాష్ట్రంలో అనేక కష్టాలు. ఉద్యమాలతో ఉద్యోగులు విధులకు రాని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. వీటన్నింటినీ అధిగమించగలిగాం. సహచర ఐఏఎస్ అధికారుల సహకారం మరువలేనిది. నిజాయితీగా ఉంటే ఏ రంగంలోనైనా జాతికి సేవలందించవచ్చు. రిటైరయ్యాక పారితోషికం ఆశించకుండా ఏవైనా గౌరవ బాధ్యతలు స్వీకరిస్తా. పాలన నిర్వహణపై పాఠాలు బోధించాలని ఉంది’’ అని చెప్పారు. మహంతి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఆయన 1979 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. స్వరాష్ట్రం ఒడిశా. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. తొలుత రాష్ట్రంలో పనిచేసి 1993లో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. 1999 జనవరిలో మళ్లీ రాష్ట్ర సర్వీసులో చేరారు. 2006లో మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లి 2013 జనవరి 31న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. సాధారణ, భూ పరిపాలన శాఖల్లో పని చేసి 2013 ఏప్రిల్ 30న సీఎస్ అయ్యారు. మహంతి కూతురు శ్వేత 2009లో సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించారు. -
మీ-‘సేవ’పైనా బాదుడు
సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజలకు అన్ని రకాల సేవలూ ఒకే చోట అందుబాటులోకి తేచ్చే ఉద్దేశంతో మీ-సేవ కేంద్రాలను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వాటి నుంచి ఆదాయం పిండుకోవాలని నిర్ణయించింది. ఒక్కో లావాదేవీపై ఇప్పటివరకూ ప్రభుత్వానికి రెండు రూపాయలు మాత్రమే వస్తుంటే.. ఆ ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుగా దానిని ఏకంగా ఏడు రూపాయలకు పెంచేసింది. ఈ భారం మీ-సేవ కేంద్రాలు నిర్వహించే వారిపైన వేయకుండా.. నేరుగా ప్రజల నుంచి వసూలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మీ-సేవ కేంద్రాల్లోని కియోస్క్ కేంద్రాల్లో ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు ఇవ్వకుండా.. కేవలం వారి వద్దనున్న సమాచారం ఆధారంగా జారీ చేసే సర్టిఫికేట్లకు ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి రూ. 20 వసూలు చేస్తున్నారు. దీనిని ఇప్పుడు రూ. 25కు పెంచేశారు. అలాగే కేటగిరి ‘బి’ కింద నోటీసులు, విచారణ, క్షేత్ర పరిశీలన చేయడం తదితర అంశాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రస్తుతం రూ. 30 వసూలు చేస్తుంటే.. ఆ ఛార్జీలను కూడా రూ. 35కు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రస్తుతం 294 సేవలను మీ-సేవ కేంద్రాల్లో అందిస్తున్నారని, 2014 మార్చి నుంచి మరో 150 సేవలు అదనంగా వీటి పరిధిలోకి వస్తాయని సీఎస్ వివరించారు. రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య మూడు కోట్లకు చేరుకుందని, మిగిలిన సేవలు కూడా కలపడం వల్ల లావాదేవీలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీపై రూ. ఐదు పెంచడం వల్ల ప్రభుత్వానికి నేరుగా ఏటా రూ. 15 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. -
ప్రభుత్వ శాఖలన్నింట్లో వెబ్ ఆధారిత సేవలు
సాక్షి, హైదరాబాద్: అన్ని శాఖల్లోనూ వెబ్ ఆధారిత సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 220 రకాల సేవలు అందిస్తున్న మీ-సేవా కేంద్రాలకు మార్చి నాటికి మరో 150 రకాల సేవలను అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి బుధవారం ఈ-గవర్నెన్స్ మార్గదర్శకాలను (జీఓ 1) జారీ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఐసీటీ బృందాలను ఏర్పాటు చేసుకొని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివరించారు. అలాగే అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు ఐటీ శాఖ సహకారంతో స్టేట్ పోర్టల్ ఫ్రేమ్‌వర్క్ కింద తమ వెబ్సైట్లను అభివృద్ధి చేయాలని ఆ మార్గదర్శకాల్లో వివరించారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. -
ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు రూ.65 కోట్లు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కరెంటోళ్ల ప్రతాపం అంతా పేదలపైనే. విద్యుత్ బిల్లు నెల ఆలస్యం అయితే చాలు జరిమానా వేస్తారు. కనెక్షన్ కట్ చేస్తారు. తలుపులు, దర్వాజలు, ఇంట్లోని సామగ్రి తీసుకెళ్తారు. రైతుల నుంచి అయితే స్టాటర్లు, మోటార్లు, కరెంట్ వైర్లు లాక్కెళ్తారు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంట్ సరఫరానే నిలిపివేస్తున్నారు.! కానీ, రూ.కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖలపై చర్యలు తీసుకోవడం లేదు. ట్రాన్స్‌కో నష్టాల్లో ఉండటంతో బకాయిలు వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలను ఆదేశించినట్లు తెలిసింది. మొండి బకాయిలను ఫిబ్రవరిలోగా వసూలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్ర విభజనకు చర్యలు సాగుతుం డగా, మరోపక్క విద్యుత్ బకాయిల పై నేరుగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టి సారించడంగమనార్హం. బకాయిలు రూ.65 కోట్లపైనే.. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు రూ.65 కోట్లపై బడే బకాయిలు ఉన్నాయి. ప్రధానంగా పంచాయతీ, మున్సిపాలిటీల్లో నీటి పథకాలు, వీధి దీపాల బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల వసూలు కోసం అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. కొన్ని సమయాల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించి కరెంటు సరఫరా నిలిపివేసినా పూర్తిస్థాయిలో బకాయిలు వసూలు కాలేదు. పంచాయతీల పరంగా రూ.49.37 కోట్లు బకాయిలు ఉండగా, అందులో కాగజ్‌నగర్ ఈఆర్వో నుంచి రూ.14.04 కోట్లు, ఆదిలాబాద్ రూ.13.95 కోట్లు, మంచిర్యాల రూ.9.83 కోట్లు, భైంసా రూ.5.97 కోట్లు, నిర్మల్ ఈఆర్వో పరిధిలో రూ.5.56 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. పంచాయతీలు రూ.కోట్ల బకాయిలు ఉంటే ప్రభుత్వం గత నెలలో కేవలం రూ.30 లక్షలు చెల్లించింది. రానున్న రోజుల్లో పంచాయతీలే నేరుగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పల్లెల్లో చీకట్లు అలుముకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు రూ.11.46 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో భైంసా మున్సిపాలిటీ రూ.4.81 కోట్లు, నిర్మల్ రూ.3.23 కోట్లు, మందమర్రి రూ.1.48 కోట్లు, మంచిర్యాల రూ.59 లక్షలు, కాగజ్‌నగర్ రూ.43.06 లక్షలు, ఆదిలాబాద్ రూ.47.46 లక్షలు, బెల్లంపల్లి రూ.43.87 లక్షలు చెల్లించాల్సి ఉంది. అనేక శాఖలు సాంఘిక, గిరిజన, వైద్య, ఆరోగ్య, ఉన్నత, పాఠశాల విద్య, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల, పోలీసు, రెవెన్యూ శాఖ, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు, జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఆర్టీసీ, వ్యవసాయ, అటవీ, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవో కార్యాలయాలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో మొండి విద్యుత్ బకాయిల వసూలుపై విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. కాగా ‘న్యూస్‌లైన్’ ఈ విషయంలో విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) అశోక్‌ను వివరణ కోరగా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ శాఖలు బకాయిలు ఉన్నా బిల్లుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరిలోగా ఈ బకాయిలను వసూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు. -
జీవోఎం నోడల్ అధికారిగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి!
సమీర్‌శర్మ, ప్రదీప్ చంద్రల్లో ఒకరిని నియమించే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం)కి నోడల్ అధికారిగా రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని నియమించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.కె.మహంతి భావిస్తున్నారు. భాస్కర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా వెళ్లిపోయినప్పటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిలో కేంద్ర సర్వీసులో ఉన్న రాజీవ్‌శర్మను నియమించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. రాజీవ్‌శర్మ గతంలో శ్రీ కృష్ణ కమిటీకి నోడల్ అధికారిగా పనిచేయడం తెలిసిందే. అయితే రాష్ట్ర సర్వీసుకు రావడానికి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ లేదా పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రలలో ఒకరిని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరు నియమితులైతే వారు.. జీవోఎంకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇదిలాఉండగా తెలంగాణ ఏర్పాటు విషయంలో జీవోఎం విధివిధానాలకు సంబంధించిన అంశాలపై సమాచారాన్ని అందజేసేందుకు ప్రధాన శాఖల ముఖ్యకార్యదర్శులను ఢిల్లీకి పంపించనున్నారు. ఇందుకుగాను రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్, సాగునీటి, ప్రణాళిక, హోం, న్యాయ, విద్య, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్యకార్యదర్శులను ఢిల్లీకి పంపాలని సీఎస్ భావిస్తున్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం లభించగానే ఢిల్లీకి పంపే ముఖ్యకార్యదర్శులకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ జారీ చేయనున్నారు. -
పలు పరిశ్రమలకు రాయితీలు: పీకే మహంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) పచ్చజెండా ఊపింది. పారిశ్రామిక విధానం 2010-15 మేరకు వ్యాట్‌తో పాటు విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వద్ద బ్రెజిల్‌కు చెందిన గెర్డావ్ కంపెనీ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీలు ప్లాంటుతో పాటు రూ. 300 కోట్లతో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకానున్న కోల్గెట్ కంపెనీ టూత్‌పేస్టుల తయారీ యూనిట్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యూనిట్, ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద 800 కోట్లతో ఐటీసీ విస్తరణ ప్లాంటుకు ఎస్ఐపీసీ రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద మహీంద్రా అండ్ మహీంద్రా నెలకొల్పనున్న ట్రాక్టర్ల యూనిట్, మోహన్ స్పిన్టెక్స్, నల్లగొండ జిల్లాలో ఏర్పాటైన విశాఖ ఆస్బెస్టాస్ పరిశ్రమలకు ఇచ్చే వ్యాట్ రాయితీలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమలను ఎస్ఐపీసీ ఆదేశించింది. -
నిత్యావసరాల ధరలు నియంత్రించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో నిత్యావసర సరుకుల ధరలు, భారీ వర్షాలు, సీమాంధ్రలో సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రవాణాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వాకబు చేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర సగటు వర్షపాతం మూడు మిల్లీమీటర్లు కాగా శుక్రవారం 20.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకూ 398.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 443.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం (11 శాతం అధికంగా) నమోదైందని వారు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఈనెల 13 - 15 తేదీల్లో కురిసిన వర్షాలవల్ల 6,375 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. -
ఉద్యోగుల్లో అపోహలు తొలగించండి: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చించి వారిలో అపోహలు, భయాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని ఆదేశించారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం బుధవారం సమీక్షించారు. సమ్మె వలన ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలకు బస్సులను పునరుద్ధరించామని అధికారులు చెప్పారు. వివిధ శాఖల్లో హాజరు, జిల్లాల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. వైద్యసేవలు ఆగకూడదు: సహానీ సమ్మె కారణంగా వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ అధికారులను ఆదేశించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు సమ్మెలో ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 13 నుంచి ఎన్జీవోలు సమ్మెకు పిలుపునిచ్చిన కారణంగా పలు వైద్యాధికారుల కార్యాలయాల్లో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లగా అంతకు పది రోజులు ముందునుంచే పలువురు ఉద్యోగులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ నుంచి 10వేల మందికి పైగా సమ్మెలోకి వచ్చారు. వీరిలో పారామెడికల్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులు అత్యధికంగా ఉన్నారు. శస్త్రచికిత్సలకు ఆటంకం కాకూడదు బోధనాసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని వైద్య కళాశాలల సూపరింటెండెంట్లకు, ప్రిన్సిపాళ్లకు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ శాంతారావు ఆదేశించారు. -
వీవీ శ్రీనివాసరావుకు ఐజీగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ వీవీ శ్రీనివాసరావు(వీవీఎస్ఆర్)కు ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వీవీఎస్ఆర్కు ఐజీగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఏపీఎన్జీఓలు గత అర్థరాత్రి నుంచి బంద్‌ను తీవ్రతరం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ.కే.మహంతి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏపీఎన్జీఓలు బంద్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశమై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో ప్రజలకు అందించే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో సీఎస్ పలు శాఖ ఉన్నతాధికారులో సమావేశమై ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. అయితే ఆరోగ్యం, మున్సిఫల్ పరిపాలన, విద్యుత్ సమ్మె నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీఎన్జీఓలు ప్రకటించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి.