సాక్షి, హైదరాబాద్: అన్ని శాఖల్లోనూ వెబ్ ఆధారిత సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 220 రకాల సేవలు అందిస్తున్న మీ-సేవా కేంద్రాలకు మార్చి నాటికి మరో 150 రకాల సేవలను అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి బుధవారం ఈ-గవర్నెన్స్ మార్గదర్శకాలను (జీఓ 1) జారీ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఐసీటీ బృందాలను ఏర్పాటు చేసుకొని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివరించారు. అలాగే అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు ఐటీ శాఖ సహకారంతో స్టేట్ పోర్టల్ ఫ్రేమ్‌వర్క్ కింద తమ వెబ్‌సైట్లను అభివృద్ధి చేయాలని ఆ మార్గదర్శకాల్లో వివరించారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు.