mee seva
-
దర్జాగా సర్టిఫికెట్ల దందా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. సర్వీసు చార్జీల కింద రూ.45 తీసుకోవాల్సి ఉండగా సర్టిఫికెట్‌కు రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ముందుగా నిర్వహించే జేఈఈ మెయిన్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే పిల్లల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్రాల నిర్వాహకులు భారీ దందాకు తెరలేపారు. తల్లిదండ్రులకు అవసరం కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొన్నిచోట్ల రూ.4,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది, అంటెండర్లతో కుమ్మౖMð్క ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జేఈఈ మెయిన్ అని కాకుండా సాధారణ రోజుల్లో సైతం తహశీల్దార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకుని కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టకపోతే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచేస్తున్నారని, కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులుండటం గమనార్హం. పౌరసేవకు ఎగనామం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం పౌరసేవల పరిధిలోకి తెచ్చింది. నామమాత్రపు రుసుంతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. అయితే దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు తహసీల్ కార్యాలయాల సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రూ.45 సర్వీసు చార్జీ ఉండే ఓబీసీ సర్టిఫికెట్ కావాలంటే పట్టణ ప్రాంతాల్లోని పలుచోట్ల రూ.4,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. తామే ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, ఆమోదించేలా చూస్తామని చెప్పి వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 70 వేల మంది తల్లిదండ్రులపై ప్రభావం అక్టోబర్ 28వ తేదీన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ అయింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనుంది. కాగా ఏదైనా రిజర్వేషన్ వర్తించాలంటే సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 వేల మంది హాజరు కానుండగా, అందులో దాదాపు 70 వేలమందికి ఈ సర్టిఫికెట్లు అవసరమని అంచనా. దీనిని అసరాగా చేసుకొని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్ కార్యాలయాల సిబ్బంది దందాకు తెరతీశారు. సొమ్ము దండుకున్నా దబాయింపులేహైదరాబాద్లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి కోసం (జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేందుకు) ఓబీసీ సర్టిఫికెట్ అవసరమైంది. దరఖాస్తు చేద్దామని స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడి నిర్వాహకుడు.. ‘మేమే దరఖాస్తు చేస్తాం.. దరఖాస్తు ఫారాన్ని మేమే తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఆన్లైన్లో ఆమోదం పొందేలా చేస్తాం.. అందుకు రూ.1,000 ఖర్చు అవుతుంది’అని చెప్పాడు. రూ.45 దరఖాస్తుకు అంత చెల్లించాలా? అని శ్రీనివాస్.. బాలానగర్‌లోని మరో మీ సేవ కేంద్రానికి వెళ్లి అడగ్గా అక్కడా ఇదే సమాధానం ఎదురైంది. గత్యంతరం లేక రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేశాడు. 12 రోజులు గడిచినా దరఖాస్తును కార్యాలయ సిబ్బంది కనీసం ఓపెన్ కూడా చేయలేదు. మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని అడిగితే ‘అవుతుందిలే.. చేస్తాం.. తహసీల్దార్ కార్యాలయంలో చేయించే వ్యక్తి బిజీగా ఉన్నాడు..’అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిషోర్ అనే వ్యక్తిని కలిశారు. అతను ‘మీరు నేరుగా ఎలా వస్తారు..’అంటూ మండిపడ్డాడు. దీంతో శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని సంప్రదించారు. అంతా కుమ్మక్కే కావడంతో.. ‘మీ దరఖాస్తు ఫారమే లేదు. మీరివ్వలేదు..’అంటూ వాళ్లు బుకాయించారు. రెండురోజులు తిరిగి విసిగిపోయిన శ్రీనివాస్ చివరకు తహసీల్దార్‌ను కలిసి పరిస్థితి వివరించాడు. ఆన్లైన్ ఫారం ప్రింట్ తీసి ఫైల్ సిద్ధం చేయాలని తహసీల్దార్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అయినా వారు పలు కొర్రీలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మళ్లీ తహసీల్దార్‌ను కలవడంతో ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ అయ్యింది. -
ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించాలి... కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టరేట్: మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా తహసీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపు పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య కూడా తీరిందని, ఆదాయ, కుల, రెసిడెన్షియల్ ధ్రుపత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు. ప్రధానంగా రుణసాయం కోసం దరఖాస్తు చేసుకునే బీసీ కులాల వారికి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే గురువారం పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో మృతిచెందిన, షిఫ్టింగ్ అయిన వారి పేర్లను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. పొరపాట్లు జరిగినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా వస్తున్న ఫామ్ 6,7,8 లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసి ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. 1500 పైగా ఓటర్లు ఉన్న బూతులతో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
Aasara Pension: 30 వరకు పింఛన్ల దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరంభించింది. గత ఆగస్టు 31 నాటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా, అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నెల 11 నుండి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమీషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అర్హులైనవారు ఈ నెల 11 నుంచి ఈసేవ, మీసేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఈనెల 30 వరకు అందిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుట్టినతేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
Mee Seva: ‘ఆసరా’ కోసం దర్జాగా దోచేస్తున్నారు..
సాక్షి, కరీంనగర్: ఆసరా అర్జీదారులకు వసూళ్ల బెడద తప్పడం లేదు. ఆసరా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించగా ఆచరణలో వసూళ్ల పర్వం కొనసాగుతూ..నే ఉంది. జిల్లా అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంతో పాటు మారుమూల పల్లెల్లోనూ దోపిడీ దర్జాగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం మొద్దునిద్రలో జోగుతుండటం అర్జీదారులకు శాపంగా మారింది. మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో అధికారులకు ఉన్న అనుబంధమే తమకీ పరిస్థితని బాధితులు వాపోతున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో అర్జీలను నమోదు చేస్తుండగా నిర్వాహకులు ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ఒక్కో అర్జీకి రూ.50 నుంచి రూ.వంద వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇదేంటంటే మాకేమన్న జీతాలిస్తున్నారా అంటూ ఛీత్కారపు మాటలు. అధికారులేం చేస్తున్నట్టు.. ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. సదరు సేవలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మీ సేవ కేంద్రాన్ని రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు ప్రతి నెలా నిర్దేశిత సంఖ్యలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గిర్దావర్, నాయబ్ తహసీల్దార్‌తో పాటు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ తనిఖీలు నిర్వహించాలి. కానీ, కార్యాలయాల్లోనే కూర్చుని తనిఖీ చేసినట్లు మమ అనిపిస్తున్నారు. ఒకవేళ తనిఖీలే జరిగితే గరిష్ట కేంద్రాలు సీజ్ కావాల్సిందే. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫిర్యాదు చేయొచ్చు మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ఏ కేంద్రాలైనా ఆసరా పింఛన్ల అర్జీలను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఒకవేళ రూపాయి అడిగినా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సరిౖయెన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేసే అవకాశముంది. ఒకవేళ సదరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్డీవో, లేదా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సరి. 31 వరకు అవకాశం.. మార్గదర్శకాలివి ► 57 ఏళ్లు నిండినవారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. అర్హులు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే దరఖాస్తుదారుల తరఫున ఈ సేవ కమిషనర్‌కు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. ► జనన, మరణ నమోదు అధికారులు జారీ చేసిన పత్రం, టీసీ, పాఠశాల నుంచి బోర్డు పరీక్షలకు హాజరైన ధ్రువీకరణ పత్రం లేదా ఓటరు కార్డు లేదా ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తుదారు పుట్టిన తేదీని నిర్ణయించనున్నారు. ► పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలకు మించకూడదు. ఆ«ధార్ కార్డులో పేర్కొన్న విధంగా లబ్ధిదారు పేరు, పాస్‌పోర్టు ఫొటో, జిల్లా, మండలం, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ కోడ్, బ్రాంచి, మొబైల్ నంబరు తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయడం తప్పనిసరి. ఆదాయ ధ్రువీకరణ కోసం పరుగులు ► దరఖాస్తుతో పాటు ఆదాయం, బ్యాంకు ఖాతా, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను కోరుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా ఆదాయ ధ్రువపత్రం అందరి వద్ద లేకపోవడంతో దానికోసం పరుగులు పెడుతున్నారు. ► ఆదాయ ధ్రువపత్రం పొందేందుకు రూ.10, రూ.20 విలువ ఉన్న స్టాంపు పత్రం అవసరం. కానీ జిల్లాలో ఇవి కొరత ఉండటంతో రూ.50, రూ.100 విలువ ఉన్న స్టాంపు పత్రాలను కొనాల్సి వస్తోంది. జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు 20కి పైగా స్టాంప్ వెండర్లు ఉన్నారు. ► వీరివద్ద తక్కువ ధర పత్రాలు లేకపోవడంతో అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోంది. రూ.50 విలువ గల పత్రానికి రూ.70, రూ.100 విలువ ఉన్న పత్రానికి రూ.130 వసూలు చేస్తున్నారు. ఇలా ఒక దరఖాస్తుకు రూ.200 వరకు ఖర్చవుతోందని బా«ధితులు ఏకరవు పెడుతున్నారు. పది రోజులుగా ఆధార్ సర్వర్‌డౌన్ జిల్లాలో పదిరోజులుగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సాంకేతిక సమస్యలతో సైట్ ఓపెన్ కావడం లేదు. కేంద్రాల నిర్వాహకులు మౌజ్లతో ఎంత కుస్తీ పట్టినా చివరికి నిరాశే ఎదురవుతోంది. దీంతో రైతులు, పింఛన్ ఆశావహులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నాలుగు ఈసేవా కేంద్రాలు, మండలాల్లో 15, బ్యాంకుల్లో 65 ఆధార్‌సేవా కేంద్రాలు, మీసేవాల్లో 54 కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు జరుగుతోంది. రైతుబీమాకు మూడు రోజులే అవకాశం ఉండడంతో రైతులు రోజూ మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ గడువు ముగిసిందంటే మరో సంవత్సరం వరకు వేచిచూడాల్సిందే. వృద్ధాప్య పింఛన్ వయసును 57కు కుదించడంతో దరఖాస్తు చేసేందుకు చాలామంది మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. తీరా కేంద్రానికి వెళ్లాకా ఆధార్‌లో అర్హత వయసు లేకపోవడంతో తిరుగుముఖం పడుతున్నారు. వీరికి కూడ ఈ నెల ఆఖరు చివరి తేది. సర్వర్ డౌన్ కారణంగా రాష్ట్రమంతటా ఇదే సమస్యని అధికారులు చెబుతున్నారు. వర్షన్లు చేంజ్ కావడం, మాడిఫికేషన్ అయినకొలది బేసిక్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. దీంతో సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు వివరించారు. రూ.వంద తీసుకున్నరు మా నానమ్మ ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేద్దామని కలెక్టరేట్ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లాను. సంబంధిత పత్రాలు తీసుకున్నారు. అయిపోయింది రూ.వంద ఇవ్వమని అడిగారు. ఇదేంటంటే మాకెమన్న ప్రభుత్వమిస్తదా.. అంటూ మాట్లాడారు. వారి ఛీత్కారపు మాటలకు తాళలేక డబ్బులిచ్చేశా. – రాజేందర్, మంకమ్మతోట దర్జాగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులు తీసుకుసేందుకు అవకాశమిచ్చిందని మీ సేవ సెంటర్‌కు వెళ్తే దర్జాగా వసూలు చేస్తున్నారు. మా తాతది అప్లై చేద్దామని భగత్‌నగర్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లా. సంబంధిత పత్రాలిచ్చాకా రూ.80 తీసుకున్నారు. ఇదేంటీ ఉచితం కదా అంటే.. అది పేపరోళ్లు గట్లనే రాస్తరు. వాస్తవం వేరు అన్నారు. – కరుణ, కట్టరాంపూర్ చదవండి: ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం -
Mee Seva: మీ సేవ.. ఇదేం తోవ!
ఆధార్.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అర్హులందరికీ పథకాల లబ్ధిని అందిస్తోంది. ఈనేపథ్యంలో ఆధార్ కార్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆధార్ కార్డుల్లో మార్పులతో అడ్డదారిలో ప్రయోజనాలు పొందుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్ అనుమతులు ఇచ్చింది. అయితే జిల్లాలో మీ సేవ కేంద్రాలను పరిశీలించే ఉన్నతాధికారి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే సెంటర్లకు ఆధార్ అనుమతులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశం అయ్యింది. సాక్షి, ఏలూరు: జిల్లాలో మీసేవ కేంద్రాలను పరిశీలించే ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విధానాలకు తూట్లుపొడుస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అందే సేవలను ప్రైవేటుగా నడిచే కొన్ని మీ సేవ కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మీ సేవ కేంద్రాలకు ఆధార్ అనుమతులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్ అనుమతులు ఉన్నాయి. యూఐడీఏఐ నిబంధనల మేరకు బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే మీ సేవ కేంద్రాలకు మాత్రమే ఆధార్ సెంటర్లకు అనుమతులు ఇస్తున్నారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోను ఆధార్ సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రైవేట్ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవని తేల్చి చెప్పింది. అప్పట్లో వద్దన్నారు.. మళ్లీ ప్రతిపాదనలు ప్రైవేటు వ్యక్తులు నడిపే ఆధార్ సెంటర్లకు ప్రభుత్వ భవనాలు కేటాయించడం కుదరదని గత కలెక్టర్ రేవు ముత్యాలరాజు తేల్చిచెప్పారు. ముత్యాలరాజు జిల్లా నుంచి బదిలీ కావడం కొత్తగా కార్తికేయ మిశ్రా బాధ్యతలు చేపట్టడంతో మరోమారు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు నిర్వాహకులకు ఆధార్ అనుమతులు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. 2013 నుంచి జిల్లాలోనే.. వాస్తవానికి మీ సేవ కేంద్రాలు పరిశీలించే ఉన్నతాధికారి మూడేళ్లకు మించి ఒకేచోట విధులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాకు చెందిన ఉన్నతాధికారి 2013 నుంచి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు. జిల్లా నుంచి బదిలీపై వెళితే జీతం పెరిగే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ఇక్కడ నుంచి కదలడం లేదు. జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని అజమాయిషీ చేస్తున్నారు. సదరు అధికారి కాంట్రా క్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తూ.. తహసీల్దార్ స్థాయి అధికారులతోనే దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టారీతిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ►ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్ అనుమతులు ఉండటంతో, కొందరు ప్రైవేట్ మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు ధ్రువీకరణ పత్రాలు పుట్టించి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ►ఇందుకు జిల్లాస్థాయి మీ సేవ కేంద్రాల ఉన్నతాధికారి ముడుపులు తీసుకుంటూ దస్త్రాన్ని సిద్ధం చేశారు. ►పంచాయతీ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాలు లేకుండానే ఉన్నట్టు ఇప్పటికే కొందరు సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేశారు. ►వీటిని ఆసరాగా తీసుకుని ఉన్నతాధికారి ఆధార్ కేంద్రాల అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ►ఈ అనుమతులు లభిస్తే జిల్లాలో మరోమారు ఆధార్ కార్డుల్లో వయసు తారత మ్యాలు, మార్పులు సులభంగా జరిగే అవకాశం ఉంది. -
వేలిముద్రకు రూ.150
కార్తీక్ మేడ్చల్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేశాక.. ఆధార్ ఆధారిత వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వేలిముద్రలు సమర్పించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రూ.20కి రశీదు చేతిలో పెట్టిన మీసేవ నిర్వాహకుడు రూ.150 ఇవ్వాలని స్పష్టం చేశాడు. గతేడాది ఇదే మీసేవ కేంద్రంలో రూ.50 ఇచ్చానని కార్తీక్ చెప్పినా లాభం లేకపోయింది. కోవిడ్-19 తర్వాత ఇదే రేటు అని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.150 చెల్లించుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఆమోదించాలంటే సదరు విద్యార్థి వేలిముద్రలను దరఖాస్తుతో అప్లోడ్ చేయాలి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ... వేలిముద్రలు అప్లోడ్ చేసే ఆప్షన్ మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చింది. దీనికి రూ.20 రుసుముగా నిర్ణయించింది. అయితే పలు మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే కొన్నిరెట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.10 కోట్లు దాటుతున్న వసూళ్లు! రాష్ట్రంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 చొప్పున బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీజు రూపంలో సర్కారు ఖజానాకు రూ. 2.6 కోట్లు జమవుతోంది. కానీ చాలాచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.50 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. సగటున రూ. 100 చార్జ్జ్ చేస్తున్నారనుకుంటే... ఈ లెక్కన ఏటా రూ.10 కోట్లకు పైగా విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు. కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై కాలేజీలోనే బయో మెట్రిక్ అప్డేషన్ కానిచ్చేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు కంప్యూటర్‌తో కాలేజీలోనే ఒకచోట సెటప్ ఏర్పాటు చేసి అక్కడే వేలిముద్రలు అప్డేట్ చేస్తున్నారు. అలా కాలేజీలోనే దుకాణం తెరిచి ఒ క్కో విద్యార్థికి రూ.200 చార్జ్ చేస్తున్నారు. ఇందులో కాలేజీ సిబ్బందికి సైతం వాటాలందుతున్నాయి. వేలిముద్రల స్వీకరణ ప్రక్రియను ఉచితంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. మీసేవ కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే బదులుగా కాలేజీల్లోనే ప్రత్యేకంగా ఈ సెటప్ ఏర్పాటు చేయాలని, యాజమాన్యాలు సైతం బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే దోపిడీకి ఆస్కారం ఉండదని విద్యార్థులు అంటున్నారు. అయితే మీసేవ కేంద్రాల్లో వసూళ్లపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీలోనే వేలిముద్రలిచ్చే ఆప్షన్ ఉండాలి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బయోమెట్రిక్ విధానం మీసేవ కేంద్రంలో కాకుండా కాలేజీలోనే సమర్పించేలా ఆప్షన్ ఉండాలి. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతరత్రా ఫీజులు తీసుకుంటున్నందున... ఉచితంగా వేలిముద్రలను అప్డేట్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యాలకే అప్పగించాలి. దీంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి... మీసేవ కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చే బాధ తప్పుతుంది. - సాత్విక్, బీటెక్ ఫైనలియర్, శంషాబాద్ -
‘మ్యుటేషన్లు’ మూలకే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కన్నెర్ర జేసినా.. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినా.. ఆఖరికి భౌతికదాడులు జరిగినా.. చాలామంది రెవెన్యూ అధికారుల పనితీరు మారడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పక్షం రోజుల్లోనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో భూ యాజమాన్య హక్కుల కోసం పట్టాదారులు తహసీళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మ్యుటేషన్లు, విరాసత్‌ల అమలు ఆలస్యానికి కరోనా వ్యాప్తి కూడా ఒక కారణమే అయినా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే 24 గంటల్లోనే ఆన్లైన్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుండగా క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం షరా మామూలుగానే స్పందిస్తున్నట్లు పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మీ–సేవలో దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. మ్యుటేషన్ల జారీలో జాప్యం చేస్తోంది. దీంతో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలోనూ ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,14,725 దరఖాస్తులు భూ యాజమాన్య హక్కులు, వారసత్వ భూ బదలాయింపులు కోరుతూ ప్రభుత్వానికి రాగా.. వాటిలో ఇప్పటివరకు 11,89,951 దరఖాస్తులకు మోక్షం కలిగింది. ఇంకా 1,16,476 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 74,610 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉండటం గమనార్హం. తహసీళ్ల చుట్టూ చక్కర్లు : సుపరిపాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆన్లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా చాలా మంది అధికారులు ఇంకా వాటికి అలవాటుపడలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మ్యుటేషన్ వ్యవహారం కొలిక్కి రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు సహా సేల్‌డీడ్, 1బీ, పహాణీ నకలు జతపరిస్తే.. వాటిని డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం రెవెన్యూ అధికారుల విధి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన కాపీల నకళ్లను తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేస్తే తప్ప వాటికి మోక్షం కలగడంలేదు. పట్టాదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దనే ఉద్ధేశంలో దాదాపుగా అన్ని సేవలను ప్రభుత్వం ఆన్లైన్ చేసింది. మీ–సేవలో చేసుకున్న అర్జీ జత పరిచిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసే వాటికి జిరాక్స్‌ల కోసం రెవెన్యూ శాఖ నెలవారీగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నెపంతో దరఖాస్తుదారులను కార్యాలయాలకు పిలిపించి.. బేరసారాలు మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అందుబాటులోకి ఇసుక
ధర్మవరం రూరల్: సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధర్మవరం నియోజకవర్గంలోని పీసీ రేవు వద్ద ఇసుక రీచ్ నుంచి ధర్మవరం మార్కెట్‌యార్డ్‌కు ఇసుకను తోలి నిల్వ ఉంచుతున్నారు. కావాల్సిన వారు మీ సేవలో అనుమతులు తీసుకొని మార్కెట్ యార్డ్‌లో లభించే ఇసుకను తీసుకెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు. టన్ను ఇసుక రూ.625 తాడిమర్రి మండలం పీసీ రేవు వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే దూరాన ఉన్న ఇసుక రీచ్‌కు వెళ్లి ఇసుకను తీసుకురావాలంటే సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక బాడుగలతో పాటు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా పీసీ రేవు వద్ద వున్న రీచ్ నుంచి ఇసుకను తీసుకొచ్చి మార్కెట్‌యార్డ్‌లో నిల్వ చేసేలా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవ చూపారు. ఈ స్టాక్ పాయింట్ నుంచి పట్టణం, రూరల్ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇసుక తీసుకెళ్లవచ్చు. ధర్మవరం మార్కెట్ యార్డ్ నుంచి ఇప్పటి వరకు 1600 టన్నుల ఇసుకను ప్రజలు తీసుకెళ్లినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుకను తీసుకెళ్లవచ్చు. మీ సేవలో ప్రతి రోజూ ఇసుక కోసం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. డంప్ నుంచి తీసుకెళ్లిన ఇసుకను వారి వారి ప్రాంతాలకు 4 గంటలలోపు తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఆ లోపు ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇసుక డంప్ వద్ద నిరంతరం సీసీ కెమరాలతో పర్యవేక్షిస్తుంటామన్నారు. ఇసుకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట గత టీడీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు అంతా తామై ఇసుకను సామాన్యులకు దొరకకుండా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న ఇసుకాసురులకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. తక్కువ ధరకే ఇసుక కంబదూరు: మండలంలోని చెన్నంపల్లిలో ప్రభుత్వం గుర్తించిన రీచ్ ద్వారా ఇసుక విక్రయాలు సాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇసుక రీచ్ ప్రారంభం కావడంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. అవసరమైన వారు టన్నుకు రూ.375 ప్రకారం మీ సేవ కేంద్రంలో చెల్లించి పర్మిట్లు పొంది ఇసుకను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానం అమలులోకి తీసుకురావడంతో ఇసుకాసురుల దోపిడీకి చెక్ పడుతోంది. సామన్య ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభిస్తోంది. -
‘మీ–సేవ’లెక్కడ...?
సాక్షి, హైదరాబాద్ : పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ–సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రావడం, దానికి తోడు దరఖాస్తులు పరిశీలించే అధికారులు కొర్రీలు వేస్తుండటంతో మీ సేవా దరఖాస్తులు పరిష్కారం కాకుండా గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ సేవల రాకతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలకు బ్రేక్ పడినప్పటికీ, తాజాగా యంత్రాంగం పెట్టే మడత పేచీలతో ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ నుంచి మే 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,94,305 అర్జీలు పెండింగ్‌లు ఉన్నాయి. సేవల జాప్యానికి వరుస ఎన్నికలు, దరఖాస్తుతోపాటు మాన్యువల్ కాపీలను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని ఆంక్షలు విధించడం కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ రెండింటితో అర్జీల పెండింగ్ సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. ఎన్నికల నిర్వహణతో బిజీ బిజీ ఈ ఏడాది జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఆ ప్రభావం మీ సేవలపై దాదాపు ఫిబ్రవరి రెండో వారం వరకు పడింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం బిజీ అయ్యింది. ఈ తంతు మీ సేవ దరఖాస్తుల పరిష్కారంపై తీవ్ర ప్రభావం చూపాయి. అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలో తలమునకలు కావడంతో పరిపాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. దీంతో మీ సేవల ఆర్జీల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండాపోయారు. అపరిష్కృత దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత అంశాలే ఉన్నాయి. వీటిలో అగ్రభాగం మ్యూటేషన్లకు సంబంధించినవే. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన క్రయ విక్రయాలు ఇతరత్రా రెవెన్యూ డాక్యుమెంట్ల అప్డేషన్ కోసం మీ సేవలోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. రెండోస్థానం కుల ధ్రువీకరణ దరఖాస్తులు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో ప్రవేశాల సీజన్ కావడంతో కుల, ఆధాయ ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంది. స్టేషనరీ నిధులు స్వాహా... మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు చేరిన అర్జీలను ప్రింట్ అవుట్ తీసుకోవడం, వాటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో అవసరమైన స్టేషనరీ నిధులు ప్రభుత్వం ఆయా శాఖలకు విడుదల చేస్తోంది. ఒక్కో పేపర్ ప్రింట్ అవుట్‌కు రూ.2 వరకు చెల్లిస్తోంది. కానీ అర్జీదారుల నుంచి మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు స్టేషనరీ నిధులను స్వాహా చేస్తున్నారు. -
17 నుంచి ‘మీసేవ’లు బంద్
రాయవరం (ప్రత్తిపాడు): ఈ నెల 17 నుంచి ‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకులు నిరవధిక సమ్మె చేపట్టాలని మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చాలీచాలని ఆదాయంతో, మీసేవ కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో విధిలేక సమ్మెబాట పడుతున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 11,054 మీసేవ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేశారు. వీటిలో నెలకు 500లోపు లావాదేవీలుండే కేంద్రాలు 4,530. మీసేవ ద్వారా అందించే సేవలకు నామమాత్రం కమీషన్ రావడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,020 కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రజలు వెంటనే మీసేవ కేంద్రానికి వెళ్తున్నారు. విద్యుత్ బిల్లులు, వివిధ రకాల పన్నులు, ప్రభుత్వ పరీక్షల ఫీజులు ఇలా దాదాపుగా వందల్లో సేవలు ప్రజలకు అందుతున్నాయి. కమీషన్ చాలకపోవడంతో.. వివిధ రకాల కంపెనీల ద్వారా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్లైన్, శ్రీవెన్, రామ్ ఇన్ఫో, కార్వీ, సీఎంఎస్ కంపెనీలు వీటికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. మీసేవ కేంద్రాలు అందించే సేవలకు ఈ కంపెనీల ద్వారా కేటగిరీ–ఎ, కేటగిరీ–బి కింద కమీషన్ చెల్లిస్తున్నారు. కేటగిరీ–ఎ సర్వీసుకు రూ.11 నుంచి రూ.12.90 ఇస్తుండగా, కేటగిరీ–బి సర్వీసుకు రూ.17 నుంచి రూ.18.50 ఇస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఈ మొత్తాల కంటే తక్కువ కమీషన్ చెల్లిస్తున్నాయి. పైగా కమీషన్లో మీసేవ కేంద్రాలు జారీ చేసే ప్రతి సర్టిఫికేట్కు రూ.1.50, టీడీఎస్, జీఎస్టీ కింద 18 శాతం మినహాయిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ పెంచకపోవడం, తక్కువ కమీషన్ ఇస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకుల డిమాండ్లు ఇవే.. వివిధ సేవలకు చెల్లించే కమీషన్ పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సరైన ఆదాయం లభించనందున, వారికి కనీస వేతనం చెల్లించాలి. అప్లికేషన్ స్కానింగ్‌ను రూ.2 నుంచి రూ.5కు పెంచాలి. ఇటీవల పెంచిన కమీషన్‌తో కేంద్రాల నిర్వాహకులకు ఆర్థిక ప్రయోజనం పూర్తిగా లభించనందున కమీషన్‌ను పూర్తిగా చెల్లించాలి. 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలి. కమీషన్ రివైజ్డ్ కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యుత్ కనెక్షన్‌ను కేటగిరీ–2 నుంచి ప్రత్యేక కేటగిరీకి మార్చాలి. ఆధార్ కేంద్రాలను అన్ని మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలి. ఇలా పలు డిమాండ్లతో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఇబ్బందులు పడుతున్నాం మీసేవ కేంద్రాలకు ఇచ్చే అరకొర కమీషన్ సరిపోకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. సిబ్బంది వేతనాలకు, విద్యుత్ బిల్లులకు ఒక్కోసారి అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలి. – చెక్కా సురేష్‌కుమార్, అధ్యక్షుడు, మండల మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం, రాయవరం. డిమాండ్లను నెరవేర్చాలి ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి. కనీస వేతనం కూడా రాకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారి చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం. – సిరివేలు భానుమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా -
‘మీసేవ’లో సమ్మె!
సాక్షి, హైదరాబాద్: పౌర సేవల సరళీకరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ‘మీ సేవ’లు సమ్మెబాట పట్టాయి. ప్రభుత్వ శాఖల సహకారం అంతంతమాత్రంగా ఉండడం, ఆన్లైన్ పద్ధతిలో చేయాల్సిన పనులను తిరిగి మాన్యువల్ పద్ధతికి మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తున్న మీసేవ నిర్వాహకులు ఆందోళనకు దిగుతున్నారు. నవంబర్ 1 నుంచి మీసేవ సెంటర్లను బంద్ చేసి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ మీసేవ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. ఈమేరకు ఈఎస్డీ(ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ) కమిషనర్ వెంకటేశ్వరరావుకు జేఏసీ ప్రతినిధుల బృందం సమ్మె నోటీసిచ్చింది. ఆలోపు సమస్యలు పరిష్కరించాలని, సమస్యలకు సంబంధించిన వినతిని కూడా సమర్పించింది. ఆన్‌లైన్‌కు విరుద్ధంగా మీసేవ కేంద్రాల్లో పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే సర్వీ సులు అందించాలి. పౌరుల నుంచి దరఖాస్తులను తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత సంబంధిత అధికారుల యూజర్ ఐడీకి దరఖాస్తులను పంపించడం వంటి విధులను మీసేవ కేంద్రాలు నిర్వహిస్తాయి. ఈక్రమంలో పలు కార్యాలయాల్లో కొర్రీలు పెడుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో పంపడంతో పాటు వాటిని ప్రింట్ తీసి మాన్యువల్‌గా ఇస్తేనే అప్డేట్ చేస్తామంటూ తహసీల్దార్ కార్యాలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సేవలందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కుల, ఆదాయ ధ్రువీకరణతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు ఇతర పథకాలకు సంబంధించిన అన్ని దరఖాస్తులను మాన్యువల్‌గా సంబంధిత కార్యాలయాల్లో అందజేయాల్సి వస్తోంది. ఇందుకు సమయంతో పాటు ప్రింట్ అవుట్లకు భారీగా ఖర్చవుతోందని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జీఎస్టీతో ఆదాయం హరించుకుపోతుందని, వీటన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ మీసేవ ఫెడరేషన్ అధ్యక్షుడు బైర శంకర్ ‘సాక్షి’తో అన్నారు. నవంబర్ 1నుంచి బంద్ సమ్మెలో భాగంగా నవంబర్ 1నుంచి మీసేవ కేంద్రాలు బంద్ కానున్నాయి. సమస్యలు పరిష్కరించేవరకు నిరవధికంగా బంద్ పాటిస్తామని తెలంగాణ మీసేవ జేఏసీ స్పష్టం చేసింది. -
ఒక్క రోజులోనే ఈసీ
విజయనగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సురేష్ వనస్థలిపురంలో స్థలం కొనాలని భావించాడు. ముందుగా సదరు స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సర్వే నంబర్ తీసుకుని స్థానిక మీ–సేవ కేంద్రంలో ఈసీ కోసం దరఖాస్తు చేశాడు. అందుకు విధించిన నిర్ణీత గడువు తర్వాత కేంద్రానికి వెళ్లగా.. డిపార్ట్మెంట్ ఆమోద ముద్ర పడలేదని, మరుసటి రోజు రావాలని అటునుంచి సమాధానం వచ్చింది. మరుసటి రోజు వెళ్లగా అదే సమాధానం పునరావృతమైంది. సురేష్ లాంటి వారికి ఇకపై ఈసీ సీసీ ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములకు సంబంధించిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు తిరిగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా జారీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న రోజే వీటిని జారీకి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సరే.. అదే రోజు ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా సర్వర్ డౌన్ వంటి సమస్యలతో ఈసీ, సీసీల జారీ జాప్యానికి పూర్తిగా తెరపడనుంది. సాక్షి, సిటీబ్యూరో: భూముల కొనుగోలు దారులు ఎదుర్కొనే అతపెద్ద సమస్య అయిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు పొందడం. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి పొందే ఈ సర్టిఫికెట్లను ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను జారీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్లక్రితం స్థిరాస్తుల సీసీలు, ఈసీలు జారీ బాధ్యతను ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సీసీ, ఈసీల జారీ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ఇన్నేళ్లు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి ఆమోదిస్తూ వచ్చాయి. మీ–సేవ కేంద్రాల సర్వర్ సాంకేతిక సమస్యలకు తోడు ఈసీ, సీసీల ఆన్లైన్ దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం సదరు సర్టిఫికెట్ల జారీ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో నగరంలో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందారులకు సీసీ, ఈసీ ఇబ్బందులు తప్పడం లేదు. స్థలానికి సంబంధించిన పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోనడం కష్టంగా మారింది. రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్ సేవలు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వచ్చింది. అన్ని సేవలను కంప్యూటరీకరణ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో 1983 నుంచి ఈసీలు, సీసీలు కంప్యూటరీకరించి మీసేవ ద్వారా జారీ చేస్తూ వస్తోంది. కంప్యూటరీకరణ కానివి మాత్రమే సదరు రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం ఈసీ, సీసీలు ఇవ్వడంతో ప్రజలకు ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అక్కడ వీటిని తీసుకునేవారు. ఈసీ, సీసీ సేవలను ఒక్క మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీలు, దస్తావేజుల నకళ్ల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాల్లో దస్తావేజుల జారీకి పెద్ద సమస్య లేకున్నా.. ఈసీ జారీకి మాత్రం పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మీ సేవా కేంద్రం నుంచి ఆన్లైన్లో అభ్యర్థన వెళ్తే దానికి అనుగుణంగా సతబంధిత సబ్ రిజిస్ట్రార్ ఈసీని పంపిస్తారు. అయితే తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతుండడంతో ఈసీ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ–సేవ కేంద్రాల సిబ్బందికి ఈసీల జారీ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థన దశలోనే తప్పులు దొర్లి దరఖాస్తుదారుడికి అవసరం లేని సమాచారం కూడా ఈసీలో దర్శనమిస్తోంది. సన్నకారు రైతులకూ బాదుడు.. గ్రేటర్లో ఏటా సుమారు మూడు లక్షల వరకు ఈసీలు జారీ అవుతాయి. హైదరాబాద్‌లో 75 వేల వరకు, శివార్లలో 2.25 లక్షల వరకు జారీ అవుతాయన్నది అంచనా. మీ–సేవ కేంద్రాల్లో ఈసీ, సీసీల జారీ కోసం డిమాండ్‌ను బట్టి ఆయా సెంటర్ల నిర్వాహకులు యూజర్ చార్జీలను దండుకుంటూ వచ్చారు. మరోవైపు సన్నకారు రైతుల సహకార సంఘాలకు ఈసీలను ఉచితంగానే మంజూరు చేయాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఒక్కో ఈసీకి రూ.125 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సన్నాకారు రైతులకు ఉచితంగా ఈసీలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉండగా.. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఆలాంటిదేమిలేదంటూ వసూళ్లు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ తిరిగి పాత పద్ధతిలోనే సేవలను అందించాలని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే జారీ స్థిరాస్తులకు సంబందించిన ఈసీలు, సీసీల కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ–సేవ కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా వీటిని జారీ చేస్తాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఒక్క రోజులోనే వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ వెసలు బాటును సద్వినియోగం చేసుకోవాలి. – కె.రఘుబాబు, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ (హైదరాబాద్) -
‘సర్వీస్’ పేరుతో దోపిడీ
చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రతీది ప్రైవేట్‌పరం చేసి సర్వీస్ చార్జీల పేరుతో వినియోగదారులను దోచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెబుతూనే పలురకాల చార్జీలు వేస్తోంది. తాజాగా ప్రభుత్వ కన్ను ఏటీపీ కేంద్రాలపై పడింది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా పలు సబ్స్టేషన్లలో వసూలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే మీ–సేవ కేంద్రాల్లో కూడా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించి ప్రతి బిల్లుపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ‘విద్యుత్ బిల్లుల నిరంతర చెల్లింపు కేంద్రం’ (ఏటీపీ)ను ఆ శాఖ నెల్లూరు నగరంలోని మినీబైపాస్రోడ్టులోని మిలీనియం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద, ఏకేనగర్‌లోని విద్యుత్‌భవన్ వద్ద, చిన్నబజారులోని చేపల మార్కెట్ వద్ద ఏర్పాటుచేశారు. దీంతో వేలాది మంది వినియోగదారులు ఏ సమయంలోనైనా బిల్లులు చెల్లిస్తూ కేంద్రాలకు అలవాటుపడ్డారు. మరో రెండు ఈ క్రమంలో గూడూరులో ఒకటి. నెల్లూరులో ఒకటి కేంద్రాలు మంజూరయ్యాయి. నగరంలో ఉన్న మూడు కేంద్రాల ద్వారానే నెలకు 30 వేలమంది వినియోగదారులు రూ.2 కోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు వీటిలో బిల్లులు చెల్లించినందుకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. వారికి ఇచ్చేశారు ఈ ఏటీపీ కేంద్రాలను ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ నిర్వహిస్తుండేది. ఈనెల నుంచి కేంద్రాలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంస్థకు అప్పగించి సర్వీస్ చార్జీ పేరుతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయనున్నారు. సదరు సంస్థ కేంద్రం పనివేళలు మార్చివేసింది. అవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేయనున్నాయి. విద్యుత్ బిల్లు రూ.1–200 వరకు సర్వీస్ చార్జీ రూ.2, రూ.201–1,000 వరకు రూ.5, రూ.1,001–2,500 వరకు రూ.10, రూ.2,500పైగా బిల్లుకు రూ.25 చెల్లించాలి. మరొకటి విద్యుత్ వినియోగదారుడికి వచ్చే బిల్లులోనే సర్‌చార్జి పేరుతో విద్యుత్ సంస్థ రూ.30–50 వరకు వసూలు చేస్తుంటుంది. గత నెల రూ.2,500పైగా బిల్లును ఏటీపీ ద్వారా చెల్లించిన వినియోగదారులు 6,870 మంది ఉన్నారు. అంతే మంది ఈనెల కూడా చెల్లిస్తే వారిపై రూ.25 సర్వీస్ చార్జీ పడనుంది. మొత్తంగా రూ.1,71,750 అదనంగా కడతారు. నెలకు రూ.1,000 వరకు బిల్లు చెల్లించే వారు 30,000 మంది ఉన్నారు. వీరి ద్వారా ప్రైవేట్ సంస్థకు రూ.1,50,000 వస్తుంది. మొత్తంగా కేంద్రాల ద్వారా సంస్థకు సర్వీస్ చార్జీ రూపంలో రూ.7.50 లక్షలు వినియోగదారులు అదనంగా చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మీ–సేవ కేంద్రాలు ఏర్పాటయ్యేనా!
నెల్లూరు(పొగతోట) : జిల్లాలో మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంతమంది స్వార్థపరుల వలన నూతన మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో నాలుగు సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతోంది. నిరుద్యోగులు మీ–సేవ కేంద్రాలకోసం నాలుగు సంవత్సరాల నుంచి ఎదరుచూస్తున్నారు. కోర్టులో స్టే ఉండటంతో గత మూడు సంవత్సరాల నుంచి నూతన మీ–సేవ కేంద్రాలు మంజూరు చేయలేదు. కోర్టులో స్టే ఉన్నా మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు కార్వే, ఏపీఆన్‌లైన్ సంస్థలు 222 సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నోటిఫికేషన్లకు సంబంధించి అధికారులకు కం టెంట్ కేసులు, సంస్థలకు నోటీసులు జారీ కానున్నట్లు సమాచారం. మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకోసం నిరుద్యోగులు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. కోర్టులోఉన్న కేసులను పరిష్కరించడంలో జిల్లా యం త్రాంగం విఫలమైంది. ఫలితంగా జనా భాకు తగ్గట్లు మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉన్న కొద్ది సెంటర్లు ప్రజలనుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 32 లక్షల మంది జనాభా ఉ న్నారు. జనాభాకు తగ్గట్లు మీ– సేవ కేం ద్రాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 204 మీ– సేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మ రో 222 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. మీ– సేవ కేంద్రాల ద్వారా 364 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. విద్యుత్ బిల్లు, రైల్వే టికెట్, నేటివిటీ, ఆదాయం, అడంగళ్, వన్–బి ఇలా ప్రతిదీ మీ–సేవ ద్వారా పొందాల్సిందే. దీనివల్ల మీ– సేవ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. 2014లో 78 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు అప్పటి అధికారులు చర్యలు చేపట్టారు. ఎంపిక ప్రక్రియ సరిగాలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. 2014లో కోర్టు స్టే ఇచ్చింది. అదే స్టే ఇప్పటివరకు కొనసాగుతోంది. దీనివల్ల గతమూడు సంవత్సరాల నుంచి మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కోర్టుకు వెళ్లిన వారి తో కేసు విత్‌డ్రా చేసుకోమని అధికారులు మాట్లాడారు. దానికి వారు మేము కోరిన సెంటర్లు మాకు కేటాయిం చాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి అధికారులు అంగీకరించినట్లు సమాచారం. చివరికి చర్చలు వి ఫలం కావడంతో కోర్టులో స్టే కొనసాగుతోంది. 2014లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అధికారులు విత్‌డ్రా చేసుకుని కొత్త మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కొత్త మీ–సేవ కేంద్రాలు ఏర్పాటును అడ్డుకునేందుకు కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయిం చినట్లు సమాచారం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు మీ–సేవ కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేస్తే బిజినెస్ తగ్గుతుందనే నెపంతో కోర్టులో కేసులు వేస్తున్నట్లు సమాచారం. పాత వాటిని పేరు మార్పు చేసుకోవడానికి రూ.3 నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో మీ– సేవ కేంద్రాలను రూ.7 నుంచి రూ.8 లక్షలకు విక్రయిం చేందుకు బేరం పెట్టినట్లు సమాచారం. నిరుద్యోగులు మీ– సేవ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చినా లక్షలరూపాయలు డిమాండ్ చేస్తుండటంతో వెనుకడుగు వేస్తున్నారు. గతంలో ఆర్డీఓల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించేవారు. ప్రస్తుతం కార్వే, ఏపీఆన్‌లైన్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వాటిపై ఎన్ని ఆరోపణలు చేస్తారో, ఎంతమంది కోర్టును ఆశ్రయిస్తారో వేచి చూడాలి. ఇబ్బందులు లేకుండా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేశాం. నూతన మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ కార్వే, ఏపీ ఆన్లైన్ అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఎటువంటి సమస్యలు లేకుండా నూతన మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. –వి. వెంకటసుబ్బారెడ్డి, ఇన్చార్జి జేసీ -
‘మీ సేవ’లో మనీ ట్రాన్స్ఫర్ మోసం
మెదక్ మున్సిపాలిటీ: ‘మా తమ్ముడి కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని, అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఇచ్చిన డబ్బులు అకౌంట్లోకి రాలేదని అడిగితే’ మీ సేవ నిర్వాహకులు నానా దుర్భాషలాడుతున్నారని ఓ మహిళ మీ సేవ ముందు రోధించింది. ఈ సంఘటన బుధవారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వనం పద్మ, తమ్ముడి కొడుకు అనారోగ్యంతో ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె ఆçస్పత్రి ఖర్చుల కోసం డబ్బులను పంపించేందుకు మార్చి 31న పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ ప్రాంతంలో మీసేవ సెంటర్‌కు వెళ్లింది. రూ.10వేలు నిర్వాహకులకు అప్పగించి తన తమ్ముడి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. దీంతో డబ్బులు తీసుకున్న నిర్వాహకులు డబ్బులు పంపించామని పద్మకు చెప్పి, అందుకు సంబంధించిన రషీదు కూడా ఇచ్చారు. అయితే ఏప్రిల్ 4వ తేదీ ఖాతాలోకి డబ్బులు రాలేదు. ఈ విషయమై బాధితురాలు బుధవారం మీసేవ నిర్వాహకులను ప్రశ్నించింది. నిర్వాహకులు మాత్రం ‘గోల చేయకు ఖాతాలోకి డబ్బులోస్తాయని వెళ్లిపోమ్మంటూ’ గద్దించారు. దీంతో ఆగ్రహించిన ‘డబ్బులు ఇచ్చి వారం రోజులవుతున్నా.. ఇప్పటికీ కూడా డబ్బులు రాలేదంటే’ గద్దిస్తారా? అంటూ నిలదీసింది. దీంతో మీ సేవ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మహిళ అని చూడకుండా దుర్భాషలాడరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ మీ సేవ ముందు బైఠాయించి రోధించింది. అయినప్పటికీ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అక్కడికిచేరుకున్న పోలీసులు బాధితురాలి ఆవేదన విని వెంటనే ఆమె డబ్బులు ఇవ్వాలని మీసేవ నిర్వాహకులను హెచ్చరించారు. అయినప్పటికీ వారు మాత్రం బ్యాంకులోకి సెలవులు ఉండటంతో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంలో ఆలస్యమైందని తెలిపారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలికి డబ్బులు ఇస్తామని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో మీసేవ సెంటర్ల నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సెంటర్లకు వచ్చిన ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. -
‘మీ’–సేవ అర్జీలు బుట్టదాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘మీ–సేవ’ తిరస్కరణ సేవగా మారింది. నిర్దిష్ట రుసుం, సర్వీస్ చార్జీ చెల్లించి మీ–సేవలో సమర్పించిన దరఖాస్తులను రకరకాల కుంటిసాకులతో అధికారులు తిరస్కరించి చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఇలాగైతే అర్జీలు స్వీకరించడం ఎందుకని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల అప్డేట్(మ్యుటేషన్), మైగ్రేషన్ సర్టిఫికేట్(వలస ధ్రువీకరణ), డూప్లికేట్ మార్కుల జాబితా, కొత్త ఇల్లు నిర్మాణం/ఉన్న ఇంట్లో అదనపు గదుల నిర్మాణానికి అనుమతి, రెవెన్యూ రికార్డుల్లో అదనపు సర్వే నంబరు చేర్పు తదితర సేవల కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నీరుగారుతున్న లక్ష్యం లంచాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సర్టిఫికేట్లు జారీ చేయడమే మీ–సేవ కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అధికారుల అలసత్వంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది. ‘‘సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, ముడుపులు సమర్పించాల్సిన అవసరం ఉండదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే చాలు సర్టిఫికేట్ ఇంటికే వస్తుంది. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయి’’ అని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మీ–సేవలో దరఖాస్తు చేసినప్పటికీ ధ్రువపత్రం రావాలంటే సంబంధిత అధికారులను కలిసి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే ఏదో ఒక సాకుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకూ కేవలం ఏడాది వ్యవధిలో 10.25 లక్షల అర్జీలను చెత్తబుట్టలో పడేయడం గమనార్హం. మీ–సేవ ద్వారా రుసుం చెల్లించి ఏడాది కాలంలో మొత్తం 70.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 57.36 లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు. మరో 10.25 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 2.64 లక్షల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బు, సమయం వృథా కరువు వల్ల అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి చాలామంది పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకోసం వలస వెళుతున్నారు. వీరు వలస ధ్రువీకరణ పత్రాలకోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.635 చెల్లించి దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. వలస వెళ్లినట్లు సర్టిఫికేట్ ఇస్తే వారికి పని చూపలేదంటూ ప్రజాప్రతినిధుల నుంచి మాట పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే వలస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని సమాచారం. దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తుండడంతో డబ్బు, సమయం వృథా అవుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది అర్జీలు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్వే, మ్యుటేషన్ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది తిరస్కరించి పక్కన పడేస్తున్నారని, సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతున్నాయని రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవల జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. డబ్బులిస్తేనే ఎన్ఓసీ వచ్చింది ‘‘విశాఖపట్నంలోని నా ఇంటికి అదనపు నిర్మాణానికి గాను నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం నిర్ధిష్ట రుసుం చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేశా. సంబంధిత అధికారిని కలవకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారని వేరేవారు చెప్పడంతో వెళ్లి కొంత డబ్బు ముట్టజెప్పా. వెంటనే ఎన్ఓసీ వచ్చింది. నాతోపాటు దరఖాస్తు చేసిన నా మిత్రుడు సంబంధిత అధికారిని కలవకపోవడంతో అతడి అర్జీ తిరస్కరణ జాబితాలో చేరింది’’ – ప్రసాదరాజు, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం -
మీసేవలపై బాదుడు
పెదవాల్తేరు(విశాఖతూర్పు):సులభంగా.. వేగంగా.. అంటూ మొదలై.. మీ సౌలభ్యానికి.. సౌకర్యానికి అంటూ సాగుతున్న మీసేవలకు ఇక బాదుడు మొదలైంది. మీసేవల రుసుంలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమలులోకి వచ్చిం ది. పలు రకాల సర్వీసులు మీసేవ కేంద్రాల ద్వారానే అందుతుంటాయి. దీంతో ప్రజలు ఆయా అవసరాల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తు తం వసూలు చేస్తున్న రుసులపై రూ.10 అదనపు భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే పలు ప్రైవేట్ మీసేవ నిర్వాహకులు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడు. ఈ నేపథ్యలో ప్రభుత్వం రూ. 10 అదనంగా పెంచడంతో నిర్వాహకులు ఇంకెంత వసూలు చేస్తారోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రారంభం ఇలా.. విశాఖ జిల్లాలో 2004 మార్చిలో ఈసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వీటినే మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 22 మీసేవ కేంద్రాలను రామ్ఇన్ఫో సంస్థ నిర్వహించడం తెలిసిందే. ఈ సంస్థ ఫ్రాంఛైజీలు 200కి పైగా ఉన్నాయి. ఇక ఏపీ ఆన్లైన్ సంస్థకి ఫ్రాంఛైజీలు మరో 200 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 300 వరకు సర్వీసులు అందుతుండగా.. రెగ్యులర్‌గా ఉపయోగించుకునే సర్వీసులు 50 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, రామ్ఇన్ఫో కేంద్రాలలో రోజుకు దాదాపుగా రూ.50లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా రూ.40లక్షల వరకు లావాదేవీలు సాగుతున్నట్టు సమాచారం. ఏ, బీ క్యాటగిరీ సేవలపై భారం మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న ఏ, బీ క్యాటగిరీ సేవలపై సర్వీసు చార్జీలను పెంచారు. ఏ క్యాటగిరీలోని అడంగళ్, వన్‌బీ, పట్టాదారు పాసుపుస్తకం వంటి సేవలు పొందడానికి ఇప్పటివరకు రూ.25 చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ చార్జీ రూ.35కి పెరిగింది. బీ క్యాటగిరీలోని కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కుటుంబ వారసత్వ ధ్రువపత్రం వంటి సేవలు పొందడానికి ఇప్పటి వరకు సర్వీసు చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుండగా.. శనివారం నుంచి ఇది రూ.45కి పెరిగింది. మొత్తమ్మీద ఈ రెండు క్యాటగిరీల సేవలపైనా రూ.10 అదనపు భారం పడినట్టయింది. ఈ రెండు విభాగాలలోను మీసేవ కేంద్రాలలో నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. అంటే జిల్లా ప్రజలపై నెలకు రూ.లక్ష వంతున అదనపు భారం మోపినట్టయింది. ప్రభుత్వ మీసేవ కేంద్రాలలో ధ్రువపత్రాల కోసం రూ.35 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ మీసేవ కేంద్రాలలో స్కానింగ్ చార్జీలంటూ రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై çఫిర్యాదు అందడంతో సీతంపేటలోని ఒక కేంద్రాన్ని అప్పటి తహసీల్దార్ సీజ్ చేయడం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ నిర్వాహకుల వినతి మేరకే చార్జీలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. అదనపు భారం తగదు మీసేవ కేంద్రాలలో అందిస్తున్న సర్వీసులపై అదనపు భారం మోపం అన్యాయం. పదో తరగతి పరీక్షల తరువాత విద్యార్థులంతా ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సర్వీసు చార్జీలు పెంచడం తగదు. – సీహెచ్.రాజ్యలక్ష్మి, గృహిణి, పెదజాలరిపేట ఇప్పటికే ఇష్టానుసారం వసూలు మీసేవ సర్వీసులపై రూ.10 వంతున అదనపు భారం మోపడం విచారకరం. ఇప్పటికే పలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చార్జీలు పెంచడం ప్రజలపై అదనపు భారం మోపినట్టయింది. – సత్తిబాబు, ప్రైవేట్ ఉద్యోగి, కొత్తవెంకోజీపాలెం -
ఏప్రిల్ 1నుంచి.. కొత్త రేషన్ కార్డులు
బాన్సువాడ టౌన్(బాన్సువాడ) : కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి పౌరసరఫరాల శాఖ తీపికబురు అందించింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిగా ఎదురుచూపులు.. గతేడాది మే నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిపేశారు. ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చేంత వరకు కొత్త కార్డులు ఇవ్వడం, కార్డులో మార్పులు, చేర్పులు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే జిల్లాలో 1,700 లకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ –పాస్ (ఎలక్ట్రానిక్ పోర్టల్ ఆక్సెస్ సర్వీసెస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఈ విధానం అమల్లోకి రావడంతో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్టపడింది. దీంతో డీలర్ల వద్ద మిగులు బియ్యం లెక్కలు బయటపడుతున్నాయి. ఈ పాస్ విజయవంతం కావడంతో కొత్త కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. మీ సేవ కేంద్రాల్లో ఈ –పీడీఎస్ వెబ్సైట్ తిరిగి ప్రారంభించాలని డైరెక్టర్‌కు సూచించారు. ఈ వెబ్సైట్ వినియోగంలో రాగానే కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. పాత పద్ధతిలోనే దరఖాస్తులు.. దరఖాస్తుల స్వీకరణ పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. రేషన్ కార్డు కోరుకునే వారు ఆధార్ కార్డు తీసుకుని మీ సేవ కేంద్రాలకు వెళ్లాలి. ఈ పీడీఎస్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలి. మీ సేవ కేంద్రాల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తాయి. వాటిని తహసీల్దార్ పరిశీలించి విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ కార్యదర్శికి అప్పగిస్తారు. దరఖాస్తుదారుడి వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఈ దరఖాస్తులు తిరిగి తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తాయి. తహసీల్దార్ ఆప్రూవ్ చేసిన దరఖాస్తులు సివిల్ సప్లై అధికారుల లాగిన్‌కు చేరుతాయి. డీఎస్వో ఆమోదంతో కొత్త కార్డులను మంజూరు చేస్తారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇంకా రాలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్.. కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. అయితే కొత్త కార్డులకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాల గురించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించనున్నారు. కార్డుల జారీ విషయంలో అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపైన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తారని భావిస్తున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా మా బాబుకు రేషన్ బియ్యం వస్తున్నాయి. నాకు మాత్రం రావడం లేదు. రేషన్ దుకాణంలో అడిగితే కార్డులో నీ పేరు లేదు, అందుకే బియ్యం రావడం లేదు అంటున్నారు. కార్డులో పేరు చేర్చాలని రెండేళ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కార్డులో పేరు చేర్చాలి. – మోచి విజయ, బాన్సువాడ ఉత్తర్వులు వచ్చాయి... కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అర్హులైనవారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కార్డుల జారీపై మార్గదర్శకాలను తెలియజేయనున్నారు. – రమేశ్, డీఎస్వో, కామారెడ్డి -
అర చేతిలో పౌర సేవలు!
సాక్షి, హైదరాబాద్: ‘భారతీయులు సులువుగా, వేగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. సాంకేతికత పట్ల మక్కువ, అందిపుచ్చుకునే విషయంలో విజ్ఞత భారతీయుల్లో ఎక్కువ. ప్రపంచంలో మరే దేశంలో వినియోగించుకోని విధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లను దేశంలో వినియోగిస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా, సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకున్నా దాని వల్ల కలిగే ఫలితాలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తే అద్భుతాలు సాధించవచ్చు. మొబైల్ ఫోన్‌తో వివిధ రకాల పౌర సేవలందించేందుకు ప్రవేశపెట్టిన టీ–యాప్ ఫోలియోను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారని నమ్మకముంది’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సేవలను మొబైల్ ఫోన్ ద్వారా పౌరులకు అందించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) శాఖ రూపొందించిన ‘టీ–యాప్ ఫోలియో’యాప్‌ను మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఏడాదిలో 1,000 రకాల సేవలు వివిధ శాఖల సేవలన్నీంటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి యాప్ రూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా మొబైల్ గవర్నెన్స్ (ఎం–గవర్నెన్స్) సేవల వైపు అడుగులు వేశామని కేటీఆర్ చెప్పారు. ‘మొబైల్ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను అందించడంలో కర్ణాటక తర్వాత దేశంలో రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో యాప్‌ను రూపొందించాం. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను వినియోగించుకోవచ్చు. తొలుత 150 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ల్యాండ్ రికార్డులు, రేషన్ సరఫరా, అత్యవసర సహాయం తదితర సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఏడాదిలో 1,000 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’అని వివరించారు. ప్రజల చేతి వేళ్లపై పాలన.. సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని పుంతలు తొక్కినా సాధారణ ప్రజలకు ప్రయోజనం లేకపోతే నిరర్థకమని సీఎం కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార శూన్యం నుంచి సమాచార విప్లవం వచ్చిందని.. దేశ జనాభాకు సమాన సంఖ్యలో దేశంలో మొబైల్ ఫోన్లు ఉన్నాయన్నారు. ప్రజల చేతి వేళ్లపై పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ‘హైదరాబాద్ నగరంలో పౌర సేవల కోసం తెచ్చిన ‘మై జీహెచ్ఎంసీ’యాప్‌ను ఇప్పటివరకు 3 లక్షల మంది, ‘మై ఆర్టీఏ’యాప్‌ను 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కొత్త సాంకేతిక పరిజ్ఞానాల గురించి నిత్యం పత్రికల్లో వస్తోంది, ప్రజలకు సేవలందించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటాం. ల్యాండ్ రికార్డుల నిర్వహణలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం’అని పేర్కొన్నారు. ‘మీ–సేవ’ నిర్వాహకులకు ఆందోళన వద్దు రాష్ట్రంలో 4,500కి పైగా మీ–సేవ కేంద్రాలున్నాయని, వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ–యాప్ ఫోలియోను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలకు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజల సౌలభ్యత కోసమే టీ–యాప్ ఫోలియోను తీసుకొచ్చామని, మీ–సేవ కేంద్రాల నిర్వాహకుల పొట్టగొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మా వెతలు తీర్చండి మహాప్రభో
కొరిటెపాడు(గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా మా వెతలు తీరడం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్వరరావు, డీఆర్వో నాగబాబు తదితరులు వినతి పత్రాలను స్వీకరించారు. బీటీ విత్తనాలతో నష్టపోయాం.. జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏ రుణమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందగోరు అభ్యర్థులు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రుణాల కోసం అర్జీలను ఇస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది ఫిర్యాదుదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకునే విధానం తెలియక గుంటూరు జిల్లా కేంద్రానికి వచ్చి మీ కోసం కార్యక్రమంలో దరఖాస్తులు ఇస్తున్నారని, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని మీ సేవలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిందని, 2018–19 ఆర్థిక సంవత్సరానికి వచ్చే జూన్ మాసంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఏ రుణం కావాల్సినా కూడా ఆన్లైన్ ద్వారా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సైనికుడి కుటుంబానికి ఊరట తెనాలి: 1965 ఇండో–పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి, ప్రభుత్వ నిరాదరణతో నైరాశ్యంలో ఉన్న సైనికుడి కుటుంబానికి ‘మీకోసం’లో కొంత ఊరట కనిపించింది. గుంటూరులో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో తెనాలికి చెందిన వృద్ధురాలు తోట వెంకాయమ్మ, సుదీర్ఘకాలంగా తమ పట్ల ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ, తమ ఆవేదనను తెలియజేస్తూ అర్జీనిచ్చారు. తన నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ ఆర్మీలో పనిచేస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. 1966లో ప్రభుత్వం చినగంజాంలో వర్షాధారమైన 2.5 ఎకరాల (సర్వే నెం.701/1) భూమిని వీరసైనికుడి తల్లి వెంకాయమ్మ పేరిట కేటాయించింది. కొంతకాలానికి మళ్లీ తీసేసుకుంది. మరోచోట ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ తీసేసుకుని వేరొక చెరువు భూమిని కేటాయించారు. కోర్టు వివాదంతో ఆ భూమీ దక్కలేదు. ప్రత్యామ్నాయంగా వేరొకచోట భూమిని ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇన్నేళ్లుగా పట్టించుకోలేదు. వెంకాయమ్మ భర్త 30 ఏళ్ల క్రితమే మరణించారు. అప్పట్నుంచి బిడ్డల దగ్గర ఉంటూ వస్తోంది. దీనిపై విచారించిన కలెక్టర్ జిల్లాలో అనువైన భూమి అన్వేషణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా రెవిన్యూ అధికారికి అప్పగించినట్టు ఆమె కుమారుడు హనుమంతరావు చెప్పారు. రైతులకు పరిహారం చెల్లించాలి ఖరీఫ్ సీజన్లో నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు రాకపోవటంతో మాగాణి భూముల్లో కంది పంటను సాగు చేశాం. గత మూడేళ్లగా ప్రభుత్వం ప్రోత్సహించి ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీ కంది విత్తనాలు సరఫరా చేస్తుంది. ఆ విత్తనాలను తీసుకుని కందిపంట సాగు చేస్తున్నాం. ఈ ఏడాది మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో వైరస్ సోకి గూడ, పూత లేకుండా చెట్టు ఏపుగా పెరిగింది. ఇప్పటివరకు కౌలు కాకుండా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాము. కానీ పంట పూర్తిగా దెబ్బతిని, కాయలు లేవు. ఉన్నతాధికారులు స్పందించిఎకరాకు రూ.10 వేలు నష్టపరిహాం చెల్లించి ఆదుకోవాలి. – ముండ్రు వెంకట్రావు, తైదల కృపారావు, సోమేపల్లి వీరాంజనేయులు, మోహన్‌చంద్, భువనగిరి వెంకటేశ్వర్లు, శావల్యాపురం మండలం, పిచుకులపాలెం, మతుకుమల్లి, బొందిలపాలెం గ్రామాల రైతులు సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలి గురజాల మండలం, అంబాపురం గ్రామానికి సామాజిక భద్రతా పింఛన్లు 16 మంజూరయ్యాయి. ఆ 16 పింఛన్లుకు గ్రామంలో ఉన్న 6గురు జన్మభూమి కమిటీ సభ్యుల్లో 4గురు సభ్యులు ఆమోదం తెలిపారు. అర్హులను గుర్తించి పింఛన్ల దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి గ్రామ పంచాయితీ కార్యదర్శికి ఐదు నెలల క్రితం అందజేశాం. కానీ ఇంతవరకు ఆన్లైన్లో పొందుపరచలేదు. తాము ఆమోదం తెలిపిన పేర్లు పంపకుండా రాజకీయ ఒత్తిడితో వేరే పేర్లు మంజూరు చేసేందుకు పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీవో ప్రయత్నం చేస్తున్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీసర్పంచిని అనే కించపరుస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. విచారణ జరిపి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి. – ఎం.పార్వతి, అంబాపురం సర్పంచి, ఎం.రమణ, అల్లూరి రాములమ్మ, అర్లి లక్ష్మీ, పింఛన్ల బాధితులు -
మీసేవ... నకిలీ సేవ
వేగం, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించేందుకు ప్రవేశపెట్టిన మీసేవ కేంద్రాలు అక్రమాలకు వేదికవుతున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు నిర్వాహకులు, కాసులకు కక్కుర్తి పడే అధికారులతో కుమ్మక్కై నకిలీ దందా సాగిస్తున్నారు. ఆధార్‌కార్డుల్లో పుట్టినతేదీ, వయసు మార్చడం, జనన, మరణ పత్రాలు, ఆక్వా చెరువుల అనుమతులు, దుకాణాల అనుమతులు.. ఇలా ఏదైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిడమర్రు: అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లాలో ప్రతి ఇంటర్నెట్ సెంటరు మీ సేవాకేంద్రంగా మారిపోతోంది. ప్రస్తుతం 1,570 కేంద్రాలు ఉండగా, వీటి ద్వారా 22 ప్రభుత్వ శాఖలకు చెందిన 316 రకాల పౌరసేవలు అందుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల ఫీజులు తదితర సేవలతో కలిపి మొత్తం 350 సేవల వరకూ మీసేవా కేంద్రాలు అందిస్తున్నాయి. జిల్లాలో నాలుగు ఏజెన్సీలకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లు ద్వారా మీసేవ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రైవేటు భాగస్వామ్య విషయంలో అధికారులు పర్యవేక్షణ కొరడవడంతో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. 1.20లక్షలకు పైగా లావాదేవీలు ప్రతినెలా మీసేవా కేంద్రాల ద్వారా 1.20 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. వీటిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, మున్సిపల్, విద్యుత్ సేవల లావాదేవీలే అధికం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మన జిల్లాలో మొత్తం 44.21 లక్షల దరఖాస్తులు అందితే 3.88 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో రెవెన్యూవి 30 లక్షలు. నకిలీని కనిపెట్టేయొచ్చు నకిలీధ్రువీకరణ పత్రాలపై ప్రజల్లో అధికారులు అవగాహన కనిపించడం లేదు. మీసేవా కేంద్రం ద్వారా జారీ అయిన సర్టిఫికెట్ అసలా, నకిలీనా అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. మీ సేవా అధికారిక వెబ్సైట్లో లాగిన్ పేజీలో కనిపించే ముఖ చిత్రంపై మీ మీసేవ కేద్రం నుంచి పొందిన అప్లికేషన్ నంబర్ నమోదు చేసి మీ దరఖాస్తు వివరాలతోపాటు, జనరేట్ అయిన సర్టిఫికెట్‌ను పరిశీలించవచ్చు. గతంలో తీసుకున్న పత్రాల డేటానూ పరిశీలించవచ్చు. రెండో పద్ధతి స్మార్ట్ ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేటింగ్ ఉన్న బార్కోడ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని మీ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్ చేస్తే సర్టిఫికెట్ డేటా కనిపిస్తుంది. ఇవిగో.. ఉదాహరణలు గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్న ఆకివీడులోని లక్ష్మీ మీసేవా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. నిర్వాహకురాలికి రూ.50 వేలు జరిమానా విధించారు. తాడేపల్లిగుడెం కొబ్బరితోటలోని మీసేవ కేంద్రం నిర్వహకుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం ఏకంగా ఆర్డీఓ సంతకాన్నే ఫోర్జరీ చేసి చిక్కాడు. నిడమర్రు మీసేవా కేంద్రం నిర్వాహకుడు చేపల చెరువుల తవ్వకానికి నకిలీ అనుమతి పత్రాలు తయారు చేసి ఇచ్చి అధికారులకు పట్టుపడ్డాడు. దీంతో అధికారులు ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. వీటన్నిటికంటే ముందు పెనుగొండ కేంద్రంగా నకిలీ ఓటర్ ఐడీల స్కామ్ బయటపడింది. తాజాగా శనివారం నకిలీ రెవెన్యూ, విద్యా ధ్రు«వీకరణ పత్రాల స్కామ్‌ను కుదిపేసింది. దీనిపై నిడమర్రు తహసీల్దార్ సుందర్రాజు స్పందిస్తూ.. అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. -
మీ–సేవాలో రైతు రథం దరఖాస్తులు
అనంతపురం అగ్రికల్చర్: రైతురథం పథకం కింద రాయితీ ట్రాక్టర్ల కోసం మీ–సేవాలో దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. నియోజకవర్గానికి 40 చొప్పున అనంతపురం అర్బన్ మినహా తక్కిన 13 నియోజకవర్గాలకు 520 ట్రాక్టర్లు మంజూరైనట్లు తెలిపారు. రైతు పేరు, 1–బీ, అఫిడవిట్, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్‌తో పాటు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీ–సేవా కేంద్రాల నుంచి మండల వ్యవసాయాధికారులు, అక్కడి నుంచి డివిజన్ అధికారులకు దరఖాస్తులు చేరతాయని తెలిపారు. అన్ని అంశాల పరిశీలించిన తర్వాత జాబితాలు జేడీఏ కార్యాలయానికి వస్తాయన్నారు. ఆ తర్వాత ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రి అనుమతిలో ట్రాక్టర్ల మంజూరు ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. చివరి గడువు లేకున్నా పరిమిత సంఖ్యలో ఉన్నందున ముందుగా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.12.88 కోట్లు
- సబ్ డివిజన్లవారీగా కేటాయింపులు - మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీ నిమిత్తం జిల్లాకు రూ.12.88 కోట్లు కేటాయించారు. ఎస్డీపీ(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద 354 యంత్ర పరికరాల పంపిణీకి రూ.2.18 కోట్లు, ఎస్ఎంఏఎం కింద రూ.10.70 కోట్లు అలాట్ అయ్యాయి. ఎస్డీపీ కింద ట్రాన్స్ప్లాంటర్లు, ల్యాండ్ ప్రిపరేటరీ అండ్ ఎక్విప్మెంట్, ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్మెంట్, పోస్టు హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్, మినీ ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. ఎస్ఎంఏఎం(సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) కింద ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, పవర్ స్ర్పేయర్లు, రోటావేటర్లు, ప్యాడీ రీపర్లు, పవర్ టిల్లర్లు అందిస్తారు. రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేడీఏ సూచించారు. -
తెలంగాణను కాపీ కొట్టిన ఏపీ మీసేవ
అమరావతి: టెక్నాలజీలో తనకు తానే సాటి అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మీసేవ వెబ్ పోర్టల్ ను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి అభాసుపాలైంది. కనీసం వెబ్ సైట్ మాస్టర్ హెడ్‌ను కూడా మార్చకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంచేయడం గమనార్హం. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వ లోగోను కూడా మార్చకుండా తెలంగాణ లోగోను కాపీ కొట్టేసింది. కేవలం ఐటీ శాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి ఫోటోలు, ఇతర కొద్ది సమాచారం మినహా మిగిలినదంతా తెలంగాణ వెబ్‌సైట్‌ను దించేసింది. ఈ మార్పు ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వైరల్ అవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తెలంగాణ లోగో తీసి ఏపీ లోగో పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని పెట్టకుండా ఇంటిగ్రేటెడ్ సర్వీసె స్ డెలివరీ సిస్టమ్ అని ఉంచింది. -
సర్వర్ల మొరాయింపు.!
– మీ–సేవ కేంద్రాల్లో నిండుకున్న స్టేషనరీ – ఇబ్బందుల్లో రైతులు, విద్యార్థులు అసలే ఖరీఫ్ సీజన్.. పంట రుణాల రెన్యూవల్ చేసుకునే మాసం.. ఆపై పిల్లలను పాఠశాలలకు చేర్పించే సమయం.. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ సర్వర్లు సతాయిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు మీ– సేవ కేంద్రాల్లో స్టేషనరీ నిండుకుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇటు రైతులు, అటు విద్యార్థులు తమకు కావాల్సిన సర్టిఫికెట్లు పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. - ధర్మవరం కేస్ స్టడీ.. ముదిగుబ్బ మండలం యర్రగుంటపల్లికి చెందిన రైతు పంట రుణాన్ని రెన్యూవల్ చేసుకునేందుకు అవసరమైన 1బీ, అడంగల్ తీసకునేందుకు మీ–సేవ కేంద్రానికి వెళ్లారు. అక్కడ సర్వర్ బిజీగా ఉందని చెప్పడంతో సాయంత్రం వరకూ కూర్చొన్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇంటికెళ్లిపోయాడు. ఇలా మూడ్రోజులుగా తిరుగుతున్నా పనిజరగడం లేదు. కేస్ స్టడీ.. ధర్మవరం పట్టణానికి చెందిన ఈశ్వరయ్య తన కూతురిని పాఠశాలలో చేర్పించేందుకు గాను కులం, ఆదాయం ధ్రువ్రీకరణ పత్రం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేందుక ప్రయత్నించాడు. అక్కడ స్టేషనరీ లేదని చెప్పడంతో.. మరో కేంద్రానికి వెళ్లాడు..అక్కడా లేకపోవడంతో అనంతపురం వెళ్లి నాలుగైదు సెంటర్లు తిరిగి సర్టిఫికెట్లను తీసుకుని వచ్చాడు. ఖరీఫ్ 2017–18కు గాను జిల్లా వ్యాప్తంగా 6,26,339 మంది రైతులు తమ పంట రుణాలు రెన్యూవల్ చేయాల్సి ఉంది. వీరందరూ రుణాలను రెన్యూవల్ చేసే సమయంలో తప్పనిసరిగా తమ భూమి వివరాలు చూపే 1బీ – అండగల్‌ను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని సర్టిఫికెట్లూ ఆన్లైన్ ద్వారానే ఇస్తుండటంతో ఈ 1బీ–అడంగల్‌ను మీ సేవ కేంద్రాల ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. జిల్లాలో ఏపీ ఆన్లైన్ ద్వారా నిర్వహించే మీ సేవ కేంద్రాలు 259 ఉన్నాయి. కార్వే సంస్థ ద్వారా నిర్వహించే మీ సేవ కేంద్రాలు మరో 140 దాకా ఉన్నాయి. వీటి ద్వారానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు రైతులు 1బీ–అండగల్‌ను పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్వర్లు డౌన్ కావడంతో ఒక్కో మీ సేవ కేంద్రం నుంచి సగటున రోజుకు 30 కూడా 1బీ–అండగల్‌లను ఇవ్వలేకపోతున్నారు. ఈ లోపు పంట రుణాల రెన్యూవల్ గడువు ముగిసిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయమై మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఏపీ ఆన్లైన్ అధికారులను భాస్కర్‌బాబు, హరివర్థన్‌లను వివరణ కోరగా.. సర్వర్ సమస్యకు తామేమీ చేయలేమన్నారు. స్టేషనరీ కొరత ఉన్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. -
మీ సేవల ఏఓగా ఆదినారాయణ
- వెంకట లక్ష్మిని తప్పించిన జేసీ కర్నూలు(అగ్రికల్చర్): మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి బాధ్యతల నుంచి వెంకటలక్ష్మిని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తప్పించారు. తుగ్గలి తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న ఈమె డిప్యూటేషన్‌పై మీసేవ కేంద్రాల పరిపాలనాధికారిణిగా పనిచేస్తున్నారు. ఈమె పనితీరుపై జేసీకి ఫిర్యాదులు రావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ బాధ్యతలను పరీక్షలు, ఆర్టీఐ సబ్జెక్టులను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ తహసీల్దారు ఆదినారాయణకు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆదినారాయణ ఇదే పోస్టులో దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. -
లింక్‌లో తిరకాసు
► మీ సేవ కేంద్రాలకు కీలక లింక్‌కు అధికారుల బ్రేక్ ► 130 మందికి ఇచ్చి 36 మందిని పక్కన పెట్టిన వైనం ► సర్వీసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణ ► కలెక్టరేట్ చుట్టూ నిర్వాహకుల ప్రదక్షిణలు ► కేంద్రాల నిర్వహణ భారమైందని ఆవేదన ఒంగోలు టౌన్ : మీ సేవ కేంద్రాలకు లింక్‌ల పేరుతో అధికారులు తిరకాసు పెట్టారు. ప్రభుత్వ సర్వీసుల(కీలకమైన రెవెన్యూ అంశాలు)కు సంబంధించిన కీలకమైన లింక్‌లు కొందరు నిర్వాహకులకు మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అధికారులు స్పందించక పోవడంతో మీకోసంలో కూడా ఉన్నతాధికారులను కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నారు. అయినప్పటికీ వారి లింక్ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో మీ సేవ కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారిందని, చివరకు అద్దెలు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగంలో గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను చూసి విస్తుపోయిన యంత్రాంగం వారిని ఫిల్టర్ చేయాలన్న ఉద్దేశంతో రాత పరీక్ష, ఇంటర్వూ్యల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఎంపికైన అభ్యర్థులకు సర్వీసులను కేటాయించడంలో ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 130 మందికే సర్వీసుల లింక్.. జిల్లాలో 166 మందికి మీ సేవ కేంద్రాలు మంజూరైతే వారిలో 130 మందికి కీలకమైన రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన లింక్ ఇచ్చారు. మిగిలిన 36మందిని పక్కన పెట్టేశారు. ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లింక్ ఇవ్వాలంటూ ఆ 36మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ లింక్ ఇవ్వకపోవడంతో వారిలో దాదాపు 13మంది మీ సేవ కేంద్రాలను వదులుకునే పరిస్థితికి వచ్చారు. ఖర్చు బారెడు.. ఆదాయం మూరెడు మీ సేవ కేంద్రాలను సంబంధిత నిర్వాహకులు భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ సర్వీసులు ఇవ్వకుండా ఇతరత్రా సేవలు మాత్రమే కేటాయించకపోవడంతో వాటిని బలవంతంగా వదిలించుకునే పరిస్థితిని జిల్లా యంత్రాంగం కల్పిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానమైన కూడళ్లల్లో మీ సేవ కేంద్రం నిర్వహించాలంటే అక్కడి రెంటు, అడ్వాన్స్‌తోనే సంబంధిత నిర్వాహకులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీస అద్దె రూ.6 వేలు, అడ్వాన్స్ లక్ష రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రం నిర్వహించాలంటే రెండు కంప్యూటర్ సిస్టమ్స్, ఒక ప్రింటర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతినెలా నెట్ బిల్ ఎంత లేదనుకున్నా రూ.1500 తక్కువగా ఉండదు. కరెంట్ బిల్లు రూ.800 నుంచి రూ.1200 వరకు వస్తోంది. ఇంత ఖర్చు చేసినా చివరకు నెలకు ఆ మీ సేవ కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.750కు మించకపోవడం గమనార్హం. రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన లింక్ లేని మీ సేవ కేంద్రాలు కేవలం సెల్‌ఫోన్ రీ ఛార్జిలు, కరెంట్ బిల్లులు, పాన్ కార్డులు, మార్కుల లిస్టులకే పరిమితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సేవ కేంద్రాలను ఏవిధంగా నిర్వహించాలంటూ అనేకమంది నిర్వాహకులు వాపోతున్నారు. డిపాజిట్ తిరిగివ్వాలని వినతి.. జిల్లాలో 36 మీ సేవ కేంద్రాలకు చెందిన నిర్వాహకులు తమ నెలవారీ ట్రాన్జాక్షన్ రిపోర్ట్, తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లింక్ ఇవ్వకపోవడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కేంద్రాలను పొందిన తరువాత డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు చేశారని, ఆ డిపాజిట్ అయిన తిరిగి వెనక్కు ఇస్తే మీ సేవలకు ఒక దండం పెట్టుకొని వెళతామంటూ కొంతమంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటం వారి పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ 36మంది నిర్వాహకులకు ప్రభుత్వ సర్వీసులు అందిస్తారా లేక వారిని అలాగే వదిలేస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. -
ఆధార్‌కు 'వంద'నం
► మీ సేవ, ఆధార్ నమోదు కేంద్రాల్లో అడ్డగోలుగా వసూళ్లు ► సేవ ఏ రకమైనా రూ.వంద నుంచి రూ.200 దండుకోవడమే ► సామాన్యుల జేబులకు చిల్లు ► ప్రభుత్వ చార్జీల అమలు ఊసెత్తని ప్రైవేటు ఫ్రాంచైజీలు ► ఎక్కడా కనిపించని సిటిజన్ చార్టర్ ► అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు శూన్యం మీ సేవ, శాశ్వత ఆధార్ నమోదు (పీఈసీ) కేంద్రాలు నిలువు దోపిడీకి చిరునామాగా మారాయి. ఏదైనా సేవ కావాలని సామాన్యుడు ఆ కేంద్రాల గడప తొక్కితే.. ఇక డబ్బులుపిండుకోవడమే ప్రైవేటు ఫ్రాంచైజీల వంతైపోయింది. హీనపక్షం రూ.వంద నుంచి రూ. రెండు వందల దాకా ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. కొన్ని రోజులుగా జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. అధికారులు మాత్రం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు.. ఎవరైనా సమాచారం ఇచ్చినా దానిని పెడచెవిన పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాలకు ఆధార్ తప్పనిసరి. ఐదేళ్లలోపు చిన్నారులకూ ఆధార్ నంబర్ ఉండాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అంగన్వాడీలో చిన్నారుల నమోదు నుంచి మొదలుకొని బ్యాంకింగ్ సేవలు, వాహనాల కొనుగోళ్ల వరకు అన్నీ ఆధార్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఇటువంటి వారందరికీ ఆధార్ సేవలు అందించేందుకు జిల్లాలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ప్రైవేటు మీ సేవ కేంద్రాల్లోనే నెలకొల్పారు. జిల్లాలో ఇలా దాదాపు 30 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఆధార్ నమో దు చేసుకునే వారి నుంచి ఒక్క పైసా కూడా ఫ్రాంచైజీలు తీసుకోకూడదు. ఉచితంగానే వివరాలు నమోదు చేయా లి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం చేసినా ఫ్రాంచైజీలు మాత్రం పట్టించుకోవ డం లేదు. కొత్తగా వివరాల నమోదుకు రూ.100 నుంచి రూ.150 దాకా ప్రజల నుంచి వసూలు చేస్తుండడం గమనార్హం. ఉచితమని సామాన్యులకు తెలియకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. వేలిముద్రల అప్డేట్, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ తదితర వాటిని అప్డేట్ చేస్తే రూ. 25 డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ చార్జీలు ఎక్కడా అమలు కావడం లేదు. అన్నింటికీ రూ. వంద ఇస్తేనే.. ఆధార్ సేవలు అందుతున్నాయి. బాదుడే సేవ నిబంధలనకు విరుద్ధంగా చార్జీ వసూలు చేయడంలోనూ మీ–సేవ కేంద్రాలు ఏమాత్రం తీసిపోవడం లేదు. పలు రకాల ప్రభుత్వ సేవలను ప్రజలకు సలువుగా, వేగవంతంగా అందించేందుకు మీ–సేవకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 30కిపైగా ప్రభుత్వ శాఖల పరిధిలోని సుమారు 320 రకాల సేవలు ఈ కేంద్రాల ద్వారా ప్రజలు పొందుతున్నారు. జిల్లాలో 302 మీ సేవ కేంద్రాలు ఉండగా.. వీటిలో 8 నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 294 ప్రైవేటు ఫ్రాంచైజీల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో నిత్యం సగటున తొమ్మిది వేల మంది ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా సేవలు పొందుతున్నారు. అత్యధికంగా రెవె న్యూ, వ్యవసాయ శాఖల పరిధిలో వినియోగించుకుంటున్నట్లు అధికారుల అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వీస్ చార్జీతోపాటు అదనంగా ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు పిండుకుంటున్నారు. సేవ రకాన్ని బట్టి.. అదనంగా రూ. 50కి పైగా వసూలు చేస్తున్నారు. ఇంకొన్ని ఫ్రాంచైజీలు రూ.వంద వరకు దండుకుంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలు అన్ని రకాల సేవలపై బాదుడు తప్పడం లేదు. చివరకు రేషన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రూ.వంద తీసుకుంటున్నారు. సేవా రుసుం, చట్టపరమైన చెల్లింపులకు మించి ఒక్కపైసా కూడా అదనంగా ఆశించకూడదు. కానీ, ఇది ఏ కేంద్రంలోనూ జరగడం లేదన్నది బహిరంగ సత్యం. నిబంధనల ప్రకారం ప్రతి కేం ద్రంలో పౌర సేవల వివరాలు, చార్జీలను తెలిపే చార్ట్ ఉండాలి. ఇది ఏ కేంద్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం. పైగా అదనంగా డబ్బులు తీసుకున్న మేరకు.. బిల్లులు ఇస్తారా అంటే అదీ లేదు. ఇలా అడుగడుగునా నిబంధనల అతిక్రమణ జరుగుతున్నా అధికారులు దృష్టి సారించిన దాఖలాలు శూన్యం. దీంతో ప్రైవేటు ఫ్రాంచైజీలు చెప్పిందే చార్జీగా మారింది. యాజర్ చార్జీ పెంచినా.. మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూజర్ చార్జీలను పెంచింది. ప్రతి సేవపై అదనంగా రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఈ చార్జీలు ఈ నెల ఏడో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా సేవల రకాన్ని బట్టి తమకు ఇస్తున్న కమీషన్ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ప్రైవేటు ఫ్రాంచేజీలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నమించాయి. దుకాణాల అద్దె, విద్యుత్ చార్జీలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే తమకు కేంద్రాల నిర్వహణ గుదిబండగా మారిందని వివరించారు. ఈ నేపథ్యంలో యూజర్ చార్జీలను ప్రభుత్వం పెంచినా.. ప్రజలనుంచి అడ్డగోలు వసూలు తీరు మాత్రం మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వివరణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్‌కు ‘సాక్షి’ ఫోన్ చేయగా.. ఆయన నుంచి స్పందన కరువైంది. -
‘ఇంటర్నల్’ కిరికిరి!
– మీ సేవా కేంద్రాల్లో మార్కుల నమోదు అస్తవ్యస్తం – గడువు ముంచుకొస్తుండడంతో హెచ్ఎంల ఆందోళన – నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఎస్ఏ–2 గణితం పరీక్షలో 62 మార్కులు వచ్చాయి. అయితే మీసేవా కేంద్రంలో ఆ విద్యార్థినికి కేవలం ఆరు మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అంటే 56 మార్కుల తేడా. మరో పాఠశాలలో ఏ–1 గ్రేడులో నిలిచే విద్యార్థినికి ఎస్ఏ–2 ఇంగ్లీష్‌లో ‘0’ మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అలాగే మరో అమ్మాయికి హిందీలో 47 మార్కులు వస్తే...ఆన్లైన్లో మాత్రం 37 మార్కులు కనిపిస్తున్నాయి. అలాగే బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి, రామాపురం, కొడవండ్లపల్లి పాఠశాలలకు సంబంధించి ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈ ఘటనలు చాలు ఇంటర్నల్ మార్కులు ఆన్లైన్ నమోదు ఎంత అస్తవ్యస్తంగా మారుతోందో తెలుసుకునేందుకు. - అనంతపురం ఎడ్యుకేషన్ పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అయితే 20 ఇంటర్నల్ మార్కుల కేటాయింపుపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో కన్ఫర్మేషన్కు ఈనెల 20తో గడువు ముగుస్తుంది. గడువు ముంచుకొస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. అప్పటిదాకా బాగానే ఉంది... నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్ఏ)–1, 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–1 జవాబు పత్రాలను అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్) పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా పనుల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం సంఘాలు ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్కుల నమోదును మీసేవా కేంద్రాలకు అప్పగించింది. ఒక్కో విద్యార్థికి రూ.3 చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఎఫ్ఏ–3,4, ఎస్ఏ–1 జవాబు పత్రాలను నేరుగా ఆయా మీసేవా కేంద్రాల్లో అప్పగించారు. వారు ఇష్టానుసారంగా నమోదు చేశారు. మరి కొందరి విద్యార్థుల మార్కులను నేటికీ నమోదు చేయలేదు. ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ ఇవ్వలేని దుస్థితి మార్కుల వివరాలను మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఆయా స్కూళ్ల హెచ్ఎంలు వారి యూడైస్ కోడ్ ఆధారంగా ఆన్లైన్లో ఓపెన్ చేసుకుని వారు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా జిల్లాలో మీసేవా వారు ఆన్లైన్లో పొందుపరిచిన విద్యార్థులకు సంబంధించి ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ చేయలేని పరిస్థితి. దీంతో హెచ్ఎంలు కన్ఫర్మేషన్ చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పెండింగ్ పడ్డాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలకు ఆన్లైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడంతో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ముగింపు దశకు చేరుకుంది. ఎటొచ్చి ప్రభుత్వ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఎడిట్ ఆప్షన్ ఇదిలా ఉండగా ఆన్లైన్లో తప్పుల తడకగా నమోదైన వాటిని సరిదిద్దుకునేందుకు హెచ్ఎంలకు అవకాశం ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో వారి వారి విద్యార్థుల మార్కుల జాబితాలను దగ్గర పెట్టుకుని సరిదిద్దుతూ కన్ఫర్మేషన్ చేసే పనిలో హెచ్ఎంలు ఉన్నారు. అయితే ప్రభుత్వం విధించిన గడువు (ఈనెల 20)లోగా అందరి పిల్లల వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదని హెచ్ఎంలు స్పష్టం చేస్తున్నారు. -
‘మీసేవ’ బాదుడు
► ఏ, బీ కేటగిర సేవలకు వర్తింపు ► ప్రజలపై ఏటా రూ.5.80 లక్షల భారం ► ప్రస్తుత చార్జీలే అధికమంటున్న సామాన్యులు ► 70కేంద్రాల్లో ఏడాదిలో 57,589 పత్రాల జారీ ఆదిలాబాద్æఅర్బన్: ప్రభుత్వం ‘మీసేవ’ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకుగాను సర్వీసు చార్జీలను పెంచేసింది. మీసేవ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెంచిన సర్వీస్ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుకున్న సమయానికి కావాల్సిన ధ్రువపత్రం పొందేందుకు మీసేవ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెంచిన సర్వీస్ చార్జీలతో జనాలపై కొంత భారం పడనుంది. ఇదిలా ఉండగా, రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సేవలను కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’ అనే రెండు విభాగాలుగా చేసి సుమారు 60 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ సేవలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ రకాల సర్వీసులను కూడా మీసేవ కేంద్రాలు నిర్వర్తిస్తున్నాయి. కేటగిరి ‘ఏ’ లో ఉండే సేవల సర్వీస్ చార్జీలు ప్రస్తుతం రూ.25 ఉండగా, రూ.35కు పెరిగాయి. కేటగిరి ‘బీ’లో ఉండే సేవల సర్వీస్ చార్జీలు ప్రస్తుతం రూ.35 ఉండగా, రూ.45కు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న చార్జీలతోనే సామాన్య జనాలు ఇక్కట్లు పడుతుండగా.. పెంచిన చార్జీలతో ప్రజలపై మళ్లీ భారం పడింది. ప్రజలపై భారం.. మీసేవ కేంద్రాల ద్వారా పొందే సేవలకు సర్వీస్ చార్జీలు పెంచడంతో ఆ భారం ప్రజలపై పడింది. జిల్లాలో 70 మీసేవ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఏడాదికి రూ.9వేల నుంచి రూ.12వేల వరకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలు ఏడాదిలో 58వేల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. పెంచిన చార్జీ ప్రకారం ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 లెక్కేసుకున్నా.. ఏడాదికి రూ.5.80 లక్షల భారం ప్రజలపై పడనుంది. కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’లోని సేవలకు సర్వీస్ చార్జీలు పెరగడమే కాకుండా ఐదు కన్నా ఎక్కువగా ఉన్న స్కానింగ్ కాపీలకు ఒక్కోదానికి రూ.2 చొప్పున వసూలు చేస్తారు. (అంటే ఒక డెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలనుకుంటే దరఖాస్తుతో పాటు మనం ఆధార్, రేషన్ జిరాక్స్ కాపీలు అందజేస్తాం. అలా 10 కాపీలు ఇవ్వాల్సి వస్తే అందులో ఐదింటికి ఒక్కో పేజీ స్కానింగ్ కోసం రూ.2చొప్పున తీసుకుంటారు) కాగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా 57,589 వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మీసేవలు ఇలా.. మీసేవ కేంద్రాలు రెవెన్యూ, విద్యా, విద్యుత్, మున్సిపల్, ఆర్టీఏ, హౌసింగ్, ఈసీ, రిజిస్ట్రార్ వంటి శాఖల సేవలను సైతం అందిస్తున్నాయి. కేటగిరి ఏ, బీలలో రెవెన్యూ సేవలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీలకు చార్జీలు పెరిగాయి. మిగతా శాఖల సర్వీసులకు చార్జీలు పెంచలేదు. అయితే కేటగిరి ‘ఏ’లో పహణీ, అడంగల్, వన్ బీ, ఆర్వోఆర్ లాంటి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కేటగిరి ‘బీ’ ద్వారా కుల, ఆదాయ, రెసిడెన్సీ, ఓబీసీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ల్యాండ్ కన్వర్షన్, ఎఫ్ పిటిషన్, డిపెండెంట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, అప్లికేషన్లు తదితర 60 రకాల సేవలు పొందవచ్చు. సిటిజన్ చార్ట్ ప్రకారం ఆయా ధ్రువపత్రాలకు గడువును బట్టి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఆన్ లైన్ సమస్యలతో సమయానికి సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. పెంచిన భారం ప్రజలపైనే.. ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మంచి సేవలందిస్తున్నా.. చార్జీలు పెంచి భారం వేస్తోంది. ప్రజలకు ఏది తప్పనిసరి అవసరమో దానికే చార్జీలు పెంచడం సరికాదు. ప్రస్తుతం ఉన్న చార్జీల భారం మోయలేకనే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ పెంచి మరింత భారం మోపారు. – దేవన్న, ఆదిలాబాద్ ఓ విధంగా మంచిదే.. మీసేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సర్వీస్ చార్జీలు పెంచడమనేది ఓ విధంగా మంచిదే. ఇలా చేయడంతో మీసేవ నిర్వాహకులు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, అవకతవకలకు పాల్పడకుండా ఉంటారు. ప్రజలకు కొంత భారమే అయినా మంచి పరిణామమే. – రఘువీర్ సింగ్, మీసేవ జిల్లా కో ఆర్డినేటర్ -
మీ-సేవ కేంద్రాల అక్రమాలపై విచారణ
కర్నూలు (అగ్రికల్చర్) : అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మీసేవ కేంద్రాలపై మీసేవా కేంద్రాల పరిపాలన అధికారి వెంకటలక్ష్మి బుధవారం విచారణ చేపట్టారు. ఈనెల 25న సాక్షిలో మీ సేవ.. వారిష్టం.. అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి జాయింట్ కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని.. మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారిని ఆదేశించారు. ఈ మేరకు కొత్తబస్టాండు సమీపంలోని యూకాన్ షాపేలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి అధిక వసూళ్లపై విచారణ జరిపారు. ఆధార్ కార్డు ప్రింట్లు తీసి ఇవ్వడానికి రూ.25 తీసుకోవాల్సి ఉండగా, రూ.100 డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పత్తికొండకు చెందిన మల్లికార్జున స్టేట్మెంటును కూడా రికార్డు చేశారు. అదేవిధంగా ప్యాపిలిలోని మీ సేవ కేంద్రం అక్రమ వసూళ్లపై కూడా విచారణ జరపనున్నట్లుగా ఆమె వివరించారు. -
మీ సేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు
నగదు రహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమంలో జేసీ గిరీషా చిత్తూరు (కలెక్టరేట్): మీసేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిర్వహించాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని మీ సేవా ఆపరేటర్లకు నగదు రహిత లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. లో భాగంగా కామన్ సర్వీస్ సెంటరు ద్వారా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మన జిల్లాలో మీసేవా కేంద్రాల ద్వారా నగదు రహిత, బ్యాంకింగ్ సేవలు చేపట్టనున్నామన్నారు. మీసేవా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం విచ్చేసే ప్రజల నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. అదేగాక సామాజిక పింఛనుదారులకు పింఛను మొత్తాలను బయోమెట్రిక్ విధానంతో వారి బ్యాంకు ఖాతాలోని నగదును ట్రాన్సఫర్ చేసుకుని, పింఛను మొత్తాలను అందించే ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు కూడా మీసేవా కేంద్రాల్లో నగదును అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి మీసేవా కేంద్రంలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకుని నగదు లావాదేవీలను నడపాలన్నారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ఈ-పాస్ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. దీనిని వందశాతం మేరకు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం మీ సేవా ఆపరేటర్లు ఈ-పాస్ యంత్రాలు, మొబైల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్, మెబైల్ వాలెట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏవిధంగా జరపాలనే విషయాలను ఈ శిక్షణ ద్వారా పూర్తి స్థారుులో అవగాహన పొందాలన్నారు. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీలోని మార్పులను ఆపరేటర్లు పూర్తిస్థారుులో అవగాహన పెంచుకుని, ప్రజాసేవ చేయాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీయం రామ్మోహన్, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కౌంటర్లలో స్వైప్‌మిషన్లు
అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగకేంద్రాలు, సేవా కేంద్రాల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) టి.విజయభాస్కర్ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి 60 స్వైప్‌మిషన్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు రోజుల్లో అనంతపురం, తాడిపత్రిలో రెండు చొప్పున, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, కదిరిలో ఒక్కొక్కటి చొప్పున ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపారు. -
ఇక ఇంటికే సర్టిఫికెట్లు
‘మీ సేవ’లకు షాక్.. అక్రమాలకు బ్రేక్ త్వరలోనే అందుబాటులోకి ‘మీసేవ’ యాప్ మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.. పోస్టులో ఇంటికే రానున్న ధ్రువీకరణ పత్రాలు పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ నుంచే ప్రారంభం సర్టిఫికెట్ల కోసం ఇక మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. నిర్ణీత వ్యవధిలో సర్టిఫికెట్లు మన ఇంటికే చేరతారుు. ఎవరికీ అదనంగా చెల్లింపులు చేయకుండా ధ్రువీకరణ పత్రాలు చేతికందుతారుు. మరీ అత్యవసరమైతే అదనపు రుసుము చెల్లించి ఒక రోజు వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే ‘మీసేవ యాప్’ను అందుబాటులోకి తేనుంది. మన జిల్లాలోనే ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది. ఇందూరు: మీ సేవ కేంద్రాలకు కాలం చెల్లనుంది.. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో వారు ఉపాధి పొందుతున్న కేంద్రాలకే దెబ్బ తెచ్చింది.. మీ సేవ కేంద్రాల్లో బోగస్ సర్టిఫికెట్లు సృష్టించడం, క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తెప్పించి దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రభుత్వం ముకుతాడు వేయనుంది. మీ సేవ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలు స్వతహాగా తమ మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకునేలా ’మీ-సేవ’ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు మన జిల్లా నుంచే ఓ డిప్యూటీ తహసీల్దార్, మరి కొందరు ఉద్యోగులు కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని పనితీరును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు మొన్నటివరకు రెవెన్యూ కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్‌కు వివరించగా, వారు ఓకే చెప్పారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం 230 మీ సేవ కేంద్రాలున్నారుు. వీటి ద్వారా కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు 26 రెవెన్యూ సేవలు పొందే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బోగస్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. సరైన సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తులు చేరుుంచడం, ఎవరి పేరుపై ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇవ్వడం, దరఖాస్తులు చేసుకున్న క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేరుుస్తున్నారు. ఇలా చేరుుంచినందుకు దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారుల దృష్టికి రాగా, అధికారులే మీ సేవ కేంద్రాల ఆపరేటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల మీ సేవ కేంద్రాల ఆపరేటర్లతో జిల్లా కేంద్రంలో సమావేశం జరిపిన ఓ ఉద్యోగి ’మీరు ఏం చేసినా బయటకు తెలియకుండా చేసుకోండి’ అని దర్జాగా చెప్పడం గమనార్హం. సదరు ఉద్యోగికి మీ సేవ కేంద్రాల నుంచి మాముళ్లు అందుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ చెక్ పెట్టేందుకే యాప్.. మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మీ సేవ యాప్ ఏర్పాటుకు పూనుకుంది. జిల్లాకు చెందిన, ఈ- సేవా, మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారి రమణ్రెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మీ సేవ యాప్‌కు శ్రీకారం చుట్టారు. అది పని చేసే విధానాలపై మంత్రి కేటీఆర్‌కు వివరించగా, బాగుందని ప్రశంసించారు. దీనిని రాష్ట్రమంతటా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మీ సేవ యాప్‌కు సంబంధించిన మరికొన్ని సాప్ట్వేర్ అప్లికేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండు, మూడు నెలల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా నిజామాబాద్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ ప్రారంభమైతే మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ప్రజలు మీ సేవ కేంద్రాలకు కాకుండా వారి మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ‘డిజిటల్ కీ’కి మంగళం! ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటే, వీఆర్వో నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలన చేసి, తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అరుుతే, మీ సేవ యాప్‌తో ఈ విధానానికి ఫుల్స్టాప్ పడనుంది. మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోగానే సంబంధింత వీఆర్వో లాగిన్‌లో పరిశీలన చేస్తాడు. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్‌లో పరిశీలన జరిపి, ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే పోస్టులో రానుంది. ఎప్పడు కావాలంటే అప్పుడు కాకుండా నిర్ణీత కాల పరిమితిలోనే అందుతుంది. ఒకవేళ అత్యవసరం అరుుతే రుసుము ఎక్కువ చెల్లిస్తే ఒక్క రోజులో అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అరుుతే సర్టిఫికెట్లను పరిశీలన చేయడానికి ప్రభుత్వం వీఆర్వో, తహసీల్దార్లకు ట్యాబ్‌లను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచింది. అరుుతే సర్టిఫికెట్లు ముద్రించి ఇంటికే పోస్టులో పంపడానికి ప్రత్యేక ప్రింటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాలకు చెందిన డిజిటల్ కీని ఉపయోగించి, మీసేవ ఆపరేటర్లు అడ్డగోలుగా సర్టిపికెట్లు సృష్టిస్తున్నారు. వారి ఆటలకు చెక్ పెట్టేలా డిజిటల్ కీ కాకుండా, వేలిముద్రల కీ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండు నెలల్లో అమలు కావచ్చు.. మీ సేవ యాప్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు నెలల్లో ఇది అమలు కావచ్చు. నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా నుంచే మీ సేవ యాప్‌ను రూపొందించి ఐటీ మంత్రి కేటీఆర్‌కు వివరించాం. ఇది చాలా బాగా పని చేస్తుందని, ప్రజలకు సులభంగా ఉంటుందని ఆయన అన్నారు. యాప్‌తో మీ సేవ ఆపరేటర్ల ఆటలకు ముకుతాడు పడనుంది. - రమణ్‌రెడ్డి, మీ సేవ కేంద్రాల ఏవో -
మీసేవా కేంద్రం సీజ్
షామీర్పేట్(మెడ్చల్): వినియోగదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మీసేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మెడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలోని శ్రీ భువనేశ్వరి కమ్యూనికేషన్స్ పేరిట నడుపుతున్న మీసేవా కేంద్రంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో.. షామీర్పేట్ తహశీల్దార్ రవీందర్‌రెడ్డి శుక్రవారం మీసేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. -
మీ సేవా కేంద్రాలకు అదనంగా 151 సర్వీసులు
కర్నూలు (అగ్రికల్చర్): మీ సేవా కేంద్రాలకు అదనం 151 సర్వీసులు రానున్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటనారాయణ తెలిపారు. గురువారం మీ సేవా ఆపరేటర్లకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఎస్సీ, మీసేవా, డిజిటల్ ఇండియా తదితర వాటిపై మీ సేవా ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 320 సేవలు లభిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్కిల్ డెవలప్మెంట్ తదితర వాటికి సంబంధించి 151 సర్వీసులు రానున్నాయని వివరించారు. కొత్త సర్వీసుల నుంచి మాస్టర్ ట్రైనర్లు ఇస్మాయిల్, యశ్వంత్‌లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్టిక్ట్ మేనేజర్ రాకేష్‌బాబు, డీడీఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం అర్బన్ : జిల్లాలోని 224 గ్రామపంచాయతీల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
‘మీ సేవా’ అధికవసూళ్లపై ప్రత్యేక సెల్
అనంతపురం అర్బన్ : మీ సేవా, ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా వసూళ్లపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ సేవల విషయంలో ప్రజలు కొత్తగా నమోదుకు ఉచితంగానూ, సవరణకు రూ.15 మాత్రమే చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. ఇంతకు మించి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే 1800 425 6401 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. -
త్వరలో 'మీ సేవ 2.0'
సాక్షి, హైదరాబాద్ : 'మీ సేవ'.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం అందించే అన్నిరకాల పౌరసేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన వ్యవస్థ. సరిగ్గా పదేళ్ల కిందట ప్రారంభమైన 'మీ సేవ'.. అనేక కేంద్రాలుగా విస్తరించడం, ‘ఇ– సేవ’ ల్ని 'మీ సేవ'గా మార్చి కీలక శాఖల ధ్రువీకరణ పత్రాలను ఈ వ్యవస్థ ద్వారా జారీ అయ్యే ఈ పత్రాలకు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ విధానంలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం త్వరలో 'మీసేవ 2.0'ను ప్రారంభించనుంది. మారిన అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం మరింత పారదర్శకత కోసం సరికొత్త ‘మీ సేవ 2.0 ప్రాజెక్టు’ను త్వరలో ప్రజల ముంగిటకు తీసుకరానున్నదని, అందుకు సంబంధించిన పక్రియ దాదాపు పూర్తికావచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ-గవర్నెన్స్ కు కొనసాగింపుగా ఎం-గవర్నెన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకరావాలని, తద్వారా పౌరసేవలు అందించటంలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలని ప్రబుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సేవ ద్వారా 225రకాల, మీ సేవ ద్వారా 375రకాల సేవల్ని అందిస్తున్నారు. వీలైనన్ని ప్రభుత్వంలోని 35 శాఖల సేవలు పౌరులకు ఇక నుంచి మీ సేవ 2.0 ప్రాజెక్ట్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో పది జిల్లాలు 31 జిల్లాలుగా రూపాంతరం చెందిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా సాగిన మీ సేవలు అక్టోబర్ 26, 27 తేదీల నుంచి వేగం అందుకున్నాయి. -
మళ్లీ మొదటికి!?
– గ్రామాల్లో నిలిచిన మీ–సేవ కేంద్రాల ప్రక్రియ – రద్దు దిశగా 158 కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ అనంతపురం అర్బన్ : గ్రామాల్లో కొత్తగా మీ–సేవ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరోమారు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. అనుమతి కోసం హైదరాబాద్‌లోని సంస్థ అధికారుల దష్టికి ఇక్కడి అధికారులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. నిబంధనల మేరకు దరఖాస్తులు పూర్తి చేయని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 158 కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 158 గ్రామాలను గుర్తించడంతో పాటు దరఖాస్తు చేసుకోవాలంటూ నోటిఫికేషన్ని మూడు నెలల క్రితం జారీ చేశారు. అయితే 158 గ్రామాలకు 82 గ్రామాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. మిగతా 76 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు రాలేదని సమాచారం. 244లో కేవలం రెండింటికే అర్హత మీ–సేవ ఏర్పాటు చేసేందుకు 82 గ్రామాల్లో నుంచి వచ్చిన 244 దరఖాస్తుల్లో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్, కంప్యూటర్ కోర్సు చేసినట్లు సర్టిఫికెట్, ఆధార్ కార్డు తప్పని సరిగా జత చేయాలనే నిబంధన ఉందని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ప్రకారం రెండు దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. మిగతా 242 దరఖాస్తులు నిబంధనల మేరకు లేకపోవడం పక్కకు పెట్టినట్లు తెలిసింది. మళ్లీ నోటిఫికేషన్ దిశగా... మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరో దఫా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర స్థాయి నుంచి అనుమతి తప్పని సరి అన్నారు. దీంతో విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరోమారు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన వెంటనే, 158 కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని వారు తెలిపారు. మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు మారోమారు నోటిఫికేషన్ జారీ చే స్తే గతంలో చేసుకున్న దరఖాస్తులు చెల్లవని అధికారులు తెలిపారు. నవంబరు ఒకటి తరువాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని, అప్పుడు అందరూ కొత్తగా మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
మానకొండూరు(కరీంనగర్ జిల్లా): మానకొండూరు మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద ఉన్న ఓ ఏటీఎంలోకి చొరబడ్డ దొంగను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద గతేడాది ఇండిక్యాష్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో సామాన్య ప్రజల మాదిరిగానే రంజిత్ అనే వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి షట్టరును మూసేయడంతో అక్కడే ఉన్నవారికి అనుమానం కలిగి బయట రావాలని, ఎవరు నీవు అంటూ ప్రశ్నించారు. కాసేపటికి ఏటీఎం నుంచి బయటికి వచ్చిన అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రంజిత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ స్కూడ్రైవర్ దొరికిందని, సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
‘మీ సేవ’లో నకిలీ పహణీలు
సృష్టించిన రెవెన్యూ అధికారులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సమగ్ర విచారణ జరిపించాలంటున్న రైతులు అశ్వాపురం : ఇద్దరు వ్యక్తులకు చెందినట్లుగా సుమారు 50 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులే ‘మీ సేవ’లో నకిలీ పహణీలు సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరి«ధిలోని నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గులాంమొహిద్దీన్కు సుమారు 190 ఎకరాల భూమి ఉంది. ఆయన గ్రామంలోని సుమారు 100 మంది రైతులకు ఆ భూమిని విక్రయించాడు. ఆ భూమికి అనుసంధానంగా గ్రామంలోని ఓ ఇద్దరు రైతులకు ఏడెకరాల భూమి ఉంది. కానీ, ఆ ఇద్దరు రైతులకు 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో 50.31 ఎకరాల భూమి ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు నకిలీ ‘మీ సేవ’ పహణీలు సృష్టించారు. చట్టుపక్కల ఉన్న రైతులు గమనించి అశ్వాపురం తహసీల్దార్ కుసుమకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సెప్టెంబర్ 20న 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో భూమికి సంబంధించి ఆధారాలు ఐదు రోజుల్లో తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదు. గతంలో కూడా మొండికుంటకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద 10 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీ వెలుగులోకి వచ్చింది. కొంతమంది తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా ఆన్లైన్ నుంచి తొలగించారు. ఈ నకిలీ పహణీలు గతంలో తహసీల్దార్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన మల్లీశ్వరి హయాంలో ఇచ్చినవని రైతులు పేర్కొంటున్నారు. -ఆందోళన చెందుతున్న రైతులు.. సర్వే నంబర్లలో ఏ విధమైన భూమి లేకుండా మొండికుంటకు చెందిన వ్యక్తికి 10 ఎకరాలు, రామచంద్రాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు 50.31 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీలు ఇవ్వడంపై ఆ సర్వే నంబర్లకు అనుబంధంగా ఉన్న సర్వే నంబర్ల రైతులు భవిష్యత్తులో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. నెల్లిపాక రెవెన్యూలో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా ‘మీ సేవ’ పహణీలు ఇవ్వని రెవెన్యూ అధికారులు భూమి లేకుండా నకిలీ మీసేవ పహణీలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ మీసేవ పహణీలను తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు. -ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం.. బి.కుసుమ, తహసీల్దార్, అశ్వాపురం నకిలీ మీసేవ పహణీల విషయంపై రైతులు ఫిర్యాదు చేశారు. అవి రెండేళ్ల కిందట ఇచ్చినవి. ఈ విషయంపై వీఆర్ఓ, ఆర్ఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం. పహణీలు ఆన్లైన్ నుంచి తొలగిస్తాం. -
'మీ సేవ' నుంచే విద్యుత్ కనెక్షన్ల మంజూరు
తిరుపతి రూరల్: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ( సదరన్ డిస్కం) పరిధిలోని ఎనిమిది జిల్లాలో కొత్తగా ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీలకు సంబంధించి కొత్త కనెక్షన్లను ఇకపై మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సదరన్ డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై.దొర కోరారు. శనివారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందేందుకు నిబంధనలను సరళతరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ఎల్టీ కేటగిరిలో గృహ విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, సాధారణ, దేవాలయాలకు విద్యుత్ కనెక్షన్లు, హెటీ కేటగిరిలో పరిశ్రమలు(సాధారణం), ఇతర సర్వీసులు, మౌళిక, పర్యాటకం, ప్రభుత్వ, ప్రైవేటు ఎత్తిపోతలు, వ్యవసాయం, సిపిడబ్ల్యుఎస్, రైల్వే ట్రాక్షన్, టౌన్‌షిప్స్, రెసిడెన్షియల్ కాలనీస్, గ్రీన్ పవర్, తాత్కలిక సర్వీసులను పొందడానికి మీ-సేవా కేంద్రం నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేరు మార్చుకోవాలన్నా.. ఎల్టీ కేటగిరికి సంబంధించి పేరు, కేటగిరి, లోడ్ మార్పు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా మీ-సేవా ద్వారానే బుక్ చేసుకోవాలని సీఎండీ హెచ్‌వై దొర సూచించారు. ప్రస్తుత విద్యుత్ లైన్ల నుంచి కనెక్షన్‌ను మంజూరు చేసే సందర్భాల్లో డెవలప్మెంట్ చార్జీలను కూడా మీ-సేవా కేంద్రం ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి సర్వీసును మంజూరు చేసే సందర్భాల్లో మాత్రమే సంబంధిత డెవలప్మెంట్ చార్జీలను ఏపీఎస్పీడీసీయల్ సబ్-డివిజన్ కార్యాలయాల్లో చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. కల్యాణ మండపాలు, ఎన్టీయార్ సుజల పథకం, తాత్కాలిక సర్వీసులు, ఎన్టీయార్ జలసిరి సర్వీసులకు సంబంధించి మాత్రమే ఏపీఎస్పీడీసీయల్ కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మీసేవ సిబ్బంది మాయాజాలం
వీఆర్వో, ఆర్ఐ సంతకాలతో దరఖాస్తులు శోధన్‌నగర్ మీ సేవ కేంద్రంగా దందా సహకరిస్తున్న తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది గుట్టురట్టు చేసిన అధికారులు నెల్లూరు (రూరల్/ పొగతోట): రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండా మీసేవ సిబ్బంది అక్రమంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు చేయిస్తున్నారు. నెల్లూరులోని శోధన్‌నగర్ మీసేవ(ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని) అడ్డాగా రెండు నెలలుగా ఈ అక్రమాల పర్వం గుట్టుగా సాగుతోంది. అయితే మరీ శ్రుతి మించి నెల్లూరు ఆర్ఐ సంతకాలతో సిద్ధం చేసిన దరఖాస్తులను వెంకటాచలం మండలం వాసులకు విక్రయించడం, అక్కడి అధికారులు అప్రమత్తం కావడంతో గుట్టు రట్టయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాజర్ మీసేవలో దాడులు నిర్వహించి సిబ్బందిలో ఒకరితో పాటు వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని తన సంతకంతో ఉన్న దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. జరగాల్సిందిలా.. కుల, ఆదాయ పత్రాల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకుని నిర్ణీత వ్యవధి వరకు ఆగాలి. దరఖాస్తుతో పాటు వీఆర్వో, ఆర్ఐ ధ్రువీకరించిన సర్టిఫికెట్ సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తు మీసేవ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ అధికారులు అన్నీ పరిశీలించాక డిజిటల్ సైన్‌తో సర్టిఫికెట్‌ను అప్రూవల్ చేయాలి. జరుగుతోందిలా.. నిబంధనల మేరకు ప్రక్రియ సాగాలంటే కొంత వ్యవధి పడుతుండటంతో మీసేవ సిబ్బందిలో కొందరు అక్రమాలకు తెరదీశారు. అందరి సంతకాలు తామే చేయించి రెండు రోజుల్లో అందిస్తామని దరఖాస్తుదారులకు వల వేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ అపరేటర్ల సహకారం కూడా ఉండటంతో వీరి దందాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.200 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ సంతకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సంతకం మినహా పేర్లు, అడ్రసుపై వైట్నర్తో కనిపించకుండా చేసి జెరాక్స్ తీయించారు. కులధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారి నుంచి నగదు తీసుకుని ఆర్ఐ సంతకం చేసిన ఖాళీ దరఖాస్తును నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆర్ఐ సంతకం ఉండడంతో రెవెన్యూ అధికారులు విచారించకుండా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల సహకారం ఉండటంతో గంటల వ్యవధిలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. బయటపడిందిలా.. వెంకటాచలం మండలం, అనికేపల్లికి చెందిన కొందరు గిరిజనులు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం శుక్రవారం నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న వాచ్‌మన్ దరఖాస్తు ఫారాలను ఇచ్చారు. వాటిని తీసుకుని అనికేపల్లి వీఆర్వో శ్రీహరి వద్దకు వెళ్లారు. దరఖాస్తులపై నెల్లూరు ఆర్ఐ సంతకం గమనించిన వీఆర్వో వెంటనే ఆయనకు సమాచారం అందించాడు. దీంతో ఆర్ఐ షేక్ నాజర్ మీ సేవ సెంటర్‌కు వెళ్లి పరిశీలించగా వాచ్‌మన్ నున్నా శివకుమార్ వద్ద తన సంతకం ఉన్న జెరాక్స్ పత్రాలను స్వాధీనం చేసుకుని విచారించాడు. తనకేమీ తెలియదని, కంప్యూటర్ ఆపరేటర్ భువనేశ్వరి జెరాక్స్ తీసుకు రమ్మంటే, తీసుకొచ్చానని తెలిపాడు. దీంతో భువనేశ్వరి, శివకుమార్లను తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్, ఆర్ఐ నాజర్‌లు వారి చెప్పిన సమాచారాన్ని నమోదు చేసుకుని తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు అప్పగించారు. అనంతరం మీ సేవ కేంద్రం మేనేజర్ వ్యక్తిగత పూచీకత్తుపై వారిని తీసుకెళ్లారు. బాధ్యులపై కఠిన చర్యలు: జి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, నెల్లూరు ఆర్ఐ, వీఆర్వో సంతకాలు ఉన్న జెరాక్సు పత్రాలతో కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్ఐకి సూచించాను. మీ సేవ కేంద్రాల్లో జరిగే అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చిన మా కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేశాం. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు: ఏ. మహమ్మద్‌ఇంతియాజ్, జేసీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు మంజూరు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తాం. -
మీ సేవ ఉద్యోగిపై దాడి
నెల్లూరు(క్రైమ్): మీ సేవ ఉద్యోగిపై ఆర్టీసీ కండక్టర్ దాడి చేసి గాయపర్చిన ఘటన శోధన్నగర్లోని మీ సేవ కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన ధర్మవరపు ఉపేంద్ర ఆరేళ్లుగా శోధన్నగర్లోని మీ సేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ నరసింహరావు పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రానికి వచ్చారు. నేరుగా రావడంతో ఉపేంద్ర అతడ్ని క్యూలో రావాల్సిందిగా సూచించారు. తాను ఆర్టీసీ కండక్టర్‌నని క్యూలో రావడం కుదరదని ఉపేంద్రతో ఆయన గొడవకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో నరసింహరావు కౌంటర్ ముందున్న నంబర్ బోర్డుతో ఉపేంద్ర తలపై కొట్టారు. గాయపడిన ఉపేంద్రను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాలుగో నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి నెల్లూరు(పొగతోట): విధి నిర్వహణలో ఉన్న మీ సేవ కంప్యూటర్ ఆపరేటర్‌పై దాడి చేసిన వ్యక్తిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మీ – సేవ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సలీమ్ కోరారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగి నరసింహరావు చెక్కతో కొట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మీ సేవ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రేపటిలోగా ‘లైఫ్ ఎవిడెన్స్’ ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: ఆసరా పింఛన్‌దారులందరూ ఆగస్టు 31లోగా తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు, రుణాలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను ఆమె స్వీకరించారు. పింఛన్ ఆగిపోకుండా సకాలంలో ఖాతాలో జమ కావాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరని, ఇప్పటి వరకు లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసుకోని ఆసరా పింఛన్‌దారులందరూ వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు ఆధార్‌కార్డు తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలన్నారు. మీ కోసంలో వచ్చిన వినతి పత్రాలన్నింటిని త్వరితగతిన పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జేసీ సూచించారు. -
‘మీ సేవ’లో సంస్కరణలు
∙వినియోగదారులకు సేవలు వేగవంతం ∙పారదర్శకత పెంపునకు చర్యలు కాజీపేట : మీ సేవ కేంద్రాల్లో సంస్కరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విని యోగదారులకు ఇకపై సేవలు వేగవంతం చేసేలా ప్రక్షాళన ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ వేడుకల నుంచే సంస్కరణ చర్యలు అమల్లోకి వచ్చినట్లు ఆయా కేంద్రాలకు, సం బంధిత అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో టీఎస్ ఆన్లైన్ కేంద్రాలు, సీఎస్సీ, ఈసేవ కేంద్రాలు అన్ని కలిపి సుమారు 600 సెంటర్లు.. 36 విభాగాలకు చెందిన 322 సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈసేవ కేంద్రాలు ప్రతి లావాదేవీకి రూ.5 నుం చి 10 వరకు ప్రభుత్వం నుంచి కమీషన్ పొం దుతున్నాయి. కమీషన్లు సకాలంలోనే అందుతున్నా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో కేంద్రాల్లో లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈఎస్డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) పర్యవేక్షణ కిందకు తీసుకొచ్చింది. దీంతో ఈఎస్డీ నిరంతర పర్యవేక్షణ సాగించి ఈసేవ కేంద్రాల పనితీరును గాడిన పెట్టనుంది. టీఎస్టీఎస్కు బాధ్యతలు... జిల్లాలో మీసేవ కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం అమలు చేయనుంది. అన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలను సైతం ఏర్పాటు చేయనుంది. ఇలా హైదరాబాద్ నుం చే అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెస్తున్న సాంకేతిక వ్యవస్థతో కేంద్రాల పనితీరు మెరుగుపర్చి వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా కృషిచేస్తున్నారు. మీసేవలో మధ్యవర్తులుగా కొనసాగుతున్న ఏజెన్సీల స్థానంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్)కు బాధ్యతలు కట్టబెట్టింది. నిర్వాహకుల వేతనాల పెంపు... మీసేవా కేంద్రాల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల నిర్వహణ నిబంధనలను కఠినతరం చేసింది. మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్ల జీతాలను ప్రభుత్వం 50 శాతం పెంచింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరి వేతనాలు రూ.10 వేలకు పెరగవచ్చు. ఇవి కూడా ఏజెన్సీలకు కాకుండా నేరుగా ఆపరేటర్ల ఖాతాల్లో జమ అవుతాయి. ఇకపై మీసేవా కేంద్రాల్లో టోకెన్ పద్ధతి పెట్టి 15 నిమిషాల్లో లావాదేవీలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. -
ఇక అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఇప్పటి వరకు కేవలం 72 మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు కార్యక్రమం జరుగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఆధార్ నమోదు లేకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ నమోదును మరింత అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాలో ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు మీసేవ కేంద్రాల డైరక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. జిల్లాలో మొత్తం 395 మీసేవ కేంద్రాలు ఉన్నాయి.ఇందులో 72 కేంద్రాల్లో ఆధార్ నమోదు సదుపాయం ఉండగా మిగిలిన వాటికి ఈ నెల 22లోగా ఆధార్ కిట్లు సరఫరా చేస్తారు. ఈ మేరకు ఏపీ ఆన్లైన్, కార్వే, సీఎంఎస్‌లను ఆదేశించినట్లు మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలోనూ ఆధార్ నమోదు ఉంటుందని ఆమె విలేకర్లకు వెల్లడించారు. -
ఏపీఈపీడీసీఎల్‌కు ‘మీ–సేవ’లు
కస్టమర్ సర్వీస్ సెంటర్ల నుంచి తొలగనున్న పలు సేవలు అధికారులకు స్పష్టం చేసిన సీఎండీ ఎంఎం నాయక్ సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సేవలను వినియోగదారులకు అందించేందుకు మీ–సేవ కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 67 కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే ఏ సేవకైనా దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ వాటిని నడుపుతోంది. ఇక మీదట దశల వారీగా వాటిలో అందుతున్న సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించి అక్కడి నుంచే ప్రజలకు అందేలా చేయాలని డిస్కం భావిస్తోంది. ఈ విషయాలను అధికారులకు సీఎండీ ఎంఎం నాయక్ స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఐదు జిల్లాల సర్కిల్ అధికారులతో సీఎండీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కస్టమర్ సర్వీస్ సెంటర్ల అంశంపై సీఎండీ ప్రధానంగా చర్చించారు. ఐదు జిల్లాల్లోనూ వందలాది మీ–సేవ కేంద్రాలు ఉన్నందున కేటగిరి 1,2,7 విద్యుత్ కొత్త సర్వీసుల కోసం దరఖాస్తులను వాటి ద్వారా స్వీకరించే ఏర్పాటు చేస్తే వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుందని అధికారులకు సీఎండీ సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐటీ జీఎం శ్రీనివాసమూర్తి ధ్రువీకరించారు. రానున్న రోజుల్లో అన్ని సేవలను మీ సేవా కేంద్రాల నుంచే అందించాలని డిస్కం భావిస్తున్నట్లు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు. -
మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు తొలగిన అడ్డంకి
అనంతపురం అర్బన్: పంచాయతీల పరిధిలో 158 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 7న ‘‘వెబ్సైట్ లాక్’’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి సాంకేతిక అవాంతరాలు తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ap.mee seeva.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 158 మీ సేవ కేంద్రాలకు సంబంధించి పంచాయతీల జాబితా వివరాలనుwww.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. -
దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో కామన్ సర్వీసు సెంటర్లు(మీసేవకేంద్రాలు) ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తగిన ఆర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గవర్నెన్స్ పాలనలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మీసేవ కేంద్ర తరహాలో కామన్ సర్వీస్సెంటర్లు ఏర్పాటు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది వరకే మీసేవ కేంద్రాలు ఉన్న పంచాయతీలను మినాహాయించి మిగిలిన పంచాయతీల్లో కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులయి, కంప్యూటర్ డిప్లమో కలిగి తెలుగు, ఇంగ్లిషులలో చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల, దరఖాస్తులు చేసుకునేందుకు WWW.ESEVA.AP.GOV.IN, WWW.AP.MEESEVA.GOV.IN, WWW.APIT.AP.GOV.IN, WWW.ONLINEAP.MEESEVA.GOV.IN, WWW.MEESEVAONLINEAP.IN, WWW.KURNOOL.AP.GOV.IN వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. -
మాకేంటి!
– మీ సేవ కేంద్రం మంజూరుకు ముడుపులు ఇవ్వాల్సిందే – చేతివాటం ప్రదర్శిస్తోన్న మీ సేవ ఉన్నతాధికారి – సహకరిస్తున్న కంపెనీ అధికారి కర్నూలు: ‘మీ సేవ’ కేంద్రం కావాలా నాయనా.. అయితే మాకేంటి అని కొందరు యథేచ్ఛగా మామూళ్లకు పాల్పడుతున్నారు. వారి చేతులు తడపకపోతే ఫైళ్లకు బూజు పట్టిస్తున్నారు. ముడుపులు అందాకే పనులు మొదలు పెడతామని తేల్చి చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు పలు రకాల సేవలను అందిస్తోంది. జిల్లాలో 360 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. పట్టణ పరిధిలో కార్వే సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో సీఎంసీ సంస్థలు వీటికి సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ఇటీవల మరో 50 సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వం వీటిని కేటాయిస్తోంది. అందుకు తగిన అర్హతలుండి ప్రజాదర్బారులో జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత మీ సేవ పరిపాలనాధికారికి ఆ దరఖాస్తును పంపుతారు. అక్కడి నుంచి ఒక వారంలోగా ఎంఆర్వో కార్యాలయానికి చేరుతుంది. తదనంతరం ఎంఆర్వో ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) దరఖాస్తుదారుడి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ఆర్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఆర్వో సర్టిఫై చేసి దరఖాస్తుదారుడు అన్ని విధాలా అర్హుడు అంటూ ఆర్డీవోకు ఓ నివేదిక పంపుతారు. ఆ తర్వాత ఎంఆర్వో నివేదికను ఆధారం చేసుకుని ఆర్డీవో ఆమోదముద్ర వేస్తారు. తిరిగి ఆ ఫైల్ మీ సేవ అధికారి వద్దకు వెళ్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో కేంద్రానికి రూ. 50 వేల వరకు వసూళ్లు ఐదు వేల జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ కాలనీల్లో ఒక మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగుల దరఖాస్తు చేస్తే.. ఆ దరఖాస్తు ఎంఆర్వో నుంచి ఆర్డీవో.. అక్కడి నుంచి ఏవో మీ సేవ.. తర్వాత జేసీ ప్రోసిడింగ్ ఉత్తర్వులు.. మళ్లీ ఏవో మీ సేవ.. అనంతరం కంపెనీ మేనేజర్‌తో అగ్రిమెంట్.. చివరగా డిజిటల్ కీ ఫైల్ వరకు ఫైళు నడుస్తుంది. అయితే ఆర్డీవో నుంచి మీ సేవ కార్యాలయానికి దరఖాస్తు వచ్చాక.. జేసీ వద్దకు ఫైల్ వెళ్లాలంటే కచ్చితంగా మామూళ్లు ముట్టజెప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కంపెనీతో అగ్రిమెంట్ తీసుకునే సమయంలోనూ మేనేజర్‌కు కొంత ముట్టజెప్పక తప్పదు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడు వద్ద నుంచి అన్ని దశలు కలుపుకుని సుమారు రూ. 30–50 వేల వరకు సొమ్ము గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మంజూరు చేసిన 50 సెంటర్ల యజమానుల నుంచి కూడా ఇదే విధంగా డబ్బులు తీసుకుని అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో వాళ్లు కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా: సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ మీ సేవ కేంద్రాల దరఖాస్తులను ఏ అధికారి అయినా పెండింగ్‌లో పెట్టినా.. ఒకవేళ డబ్బులు డిమాండ్ చేసినా.. నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఏ ఒక్కరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. -
‘మీ సేవ’ లావాదేవీలు 7 కోట్లు పైనే
నేడు మరిన్ని సేవలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ‘మీసేవ’ విభాగం రూ.7 కోట్ల లావాదేవీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాల విభాగాలకు చెందిన కొత్త సేవలను శుక్రవారం హోటల్ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. -
అధిక వసూళ్లు
మీ సేవ కేంద్రాలో నిలువుదోపిడీ ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకోని అధికారులు నర్సంపేట :రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం సాదా బైనావూల కార్యక్రవూన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనావూల అవ్ముకాలు, కొనుగొళ్లు భారీగా జరిగారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్ఓఆర్ స్కీం లేకపోవడంతో తవు భూవుులను పట్టాలు చేసుకోవడానికి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఊరుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇబ్బందులను గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయూలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుం లేకుండా కేవలం మీ సేవ కేంద్రాల్లో రూ.35 చెల్లించి ఉచితంగా పహానీలు చేరుుంచుకునే విధంగా పట్టాల జారీ కార్యక్రవూన్ని చేపట్టింది. దీంతో రైతులు అందుకు అనుగుణంగానే సాదా బైనావూల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా చేపట్టిన సాదా బైనావూల నుంచి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిని ఆసరాగా తీసుకున్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులు రైతుల వద్ద నుంచి రూ.35 కాకుండా భారీగా వసూలు చేస్తున్నట్లు రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు ఏకంగా రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వుుఖ్యంగా నల్లబె ల్లి వుండలంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం రూ.35లే అనుకుని మీసేవ కేంద్రాలకు వెలుతున్న రైతులు ఒక్కో దరఖాస్తుకు రూ.100 నుంచి రూ.150 వరకు తీసుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు అధికారులు ఒక్కో దరఖాస్తు ఫారంకు రూ. 35 తీసుకోవాలని నిత్యం చెబుతున్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మీ సేవ కేంద్రాల బాధ్యులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న మీ సేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
1200 మీ సేవా కేంద్రాలు బంద్!
- సర్వీస్ ప్రొవైడర్ మార్పుతో ఆటంకం - లైఫ్ సర్టిఫికేట్ కోసం వచ్చే - పెన్షనర్లకు తప్పని తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మీ సేవా కేంద్రాలు వారం రోజులుగా మూతపడ్డాయి. ఆయా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రభుత్వం మార్చడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఓవైపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే వచ్చే నెల పింఛన్ వస్తుందని అధికారులు చెబుతుండడం, మరోవైపు మీసేవా కేంద్రాలు మూతపడడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మీ సేవా కేంద్రాలను ఎప్పుడు తెరుస్తారో అర్థంకాక కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాల కోసం దరఖాస్తుల సమర్పించిన సాధారణ ప్రజానీకం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సర్టిఫికేట్లు అందకపోతే పాలీసెట్, ఈసెట్, ఎంసెట్.. తదితర కౌన్సెలింగ్‌లలో అడ్మిషన్లు కోల్పోతామేమోనని ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా జరిగిందంటే..! రాష్ట్రవ్యాప్తంగా 110 మీ సేవా కేంద్రాలు ప్రభుత్వ అధీనంలోనూ, 4 వేలకుపైగా కేంద్రాలు ప్రైవేటు, మూడు సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మూడింటిలో ఒకటైన రామ్ ఇన్ఫర్మాటిక్స్ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ గత నెల 31తో ముగిసినందున, సదరు కాంట్రాక్ట్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్)కు అప్పగించారు. దీంతో రామ్ ఇన్ఫర్మాటిక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 1200 ప్రైవేటు ఫ్రాంఛైజీ(కేంద్రాల)లకు మీసేవా సర్వీసులను ఈ నెల 1నుంచి నిలిపివేశారు. ఆయా కేంద్రాలకు సర్వీస్ రెన్యువల్ నిమిత్తం నిర్వాహకులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని టీఎస్టీఎస్ సూచించింది. ఈ క్రమంలో కొన్ని కేంద్రాలకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి, నిర్వాహకుని వివరాల్లో తేడాలుండడంతో ఆయా దరఖాస్తులను టీఎస్టీఎస్ పక్కనబెట్టింది. ముందస్తు నోటీసులివ్వకుండా అకస్మాత్తుగా సర్వీసులను నిలిపివేయడం వల్ల వివిధ సర్టిఫికెట్ల నిమిత్తం వచ్చే దరఖాస్తుదారులకు అసౌకర్యం కలిగిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 110 మీ సేవాకేంద్రాల నిర్వహణ కాంట్రాక్ట్‌ను కొత్తగా నెట్‌ఎక్సెల్ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాంట్రాక్టర్ నుంచి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను బదిలీ చేసుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని కేంద్రాల్లో సర్వీసులకు అంతరాయం కలిగినట్లు మీ సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. -
‘మీ సేవ’కులకు 50 శాతం వేతన పెంపు
కొత్త సర్వీస్ ప్రొవైడర్‌గా నెట్ ఎక్స్ఎల్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘మీ సేవ’ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు (ఆపరేటర్లు, మేనేజర్) 50 శాతం మేర వేతనాలను పెంచినట్లు సుపరిపాలన ప్రత్యేక కమిషనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 అధీకృత కేంద్రాల్లోని ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతన పెంపు వర్తిస్తుం దని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 125 లావాదేవీలు, జిల్లాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 75 లావాదేవీలను లక్ష్యాలుగా నిర్దేశించామని తెలిపారు. ఉద్యోగుల ఉత్పాదకతపై మూడు నెలలకోసారి సమీక్ష జరపాలని నిర్ణయించామన్నారు. గత సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ గడువు మే 31తో ముగిసినందున, కొత్తగా నెట్ ఎక్స్ఎల్ సంస్థను నియమించామని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రతపై తొలగని ఆందోళన: మరోవైపు ఉద్యోగులకు వేతన పెంపు నిర్ణయం కొంత మేరకు సంతృప్తి ఇచ్చినప్పటికీ, ఉద్యోగ భద్రత విషయమై ఆందోళన మాత్రం తొలగలేదని మీ సేవ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు జెన్నీఫర్ తెలిపారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా సర్కారు గుర్తించాలని డిమాండ్ చేశారు. -
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నేతల దాడి
వరికుంటపాడు: మండలంలోని గువ్వాడి క్లస్టర్ పంచాయతీ కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డిపై టి.బోయమడుగుల టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ వర్గీయులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి వరికుంటపాడులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డి ఏడాది క్రితం గువ్వాడి పంచాయతీ క్లస్టర్‌కు కార్యదర్శిగా నియమితులయ్యారు. టి.బోయమడుగుల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ అనుచరులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.దానిద్వారా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కోసం మీసేవలో దరఖాస్తు చేశారు. మీసేవలో జరిగిన తప్పువల్ల మరణ ధ్రువీకరణ పత్రంలో చనిపోయిన తేదీ తప్పు దొర్లింది. దీంతో టీడీపీ నేత మీసేవ ద్వారా వచ్చిన సర్టిఫికెట్లో చనిపోయిన తేదీ ఏదైతే నమోదైందో అదే తేదీతో తిరిగి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. అలా కాదనడంతో వివాదం మొదలైంది. దీనిపై ఎంపీపీ వెంకటాద్రి వద్ద పంచాయతీ జరిగింది. కానీ కార్యదర్శి తేదీ మార్చి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన్ను టి.బోయమడుగుల పంచాయతీ కార్యదర్శిగావున్న బాధ్యతలను తొలగించి వేరే కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. యినా ఆ టీడీపీ నేత పలు రకాలుగా బయటి వ్యక్తులతో దుర్భాషలాడుతున్నారని తెలుసుకొని శుక్రవారం రాత్రి పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డి సదరు నేతకు ఫోన్ చేసి అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది జరిగిన కొంతసేపటికి టీడీపీ నేత అనుచరులు వరికుంటపాడులోని తన గదిలో పిడిగుద్దులు గుప్పించి రికార్డులను చించేశారు. చుట్టుపక్కల వారు రావడంతో మోటర్‌బైక్‌లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాధితుడు ఎస్సై కె.నాగార్జునరెడ్డికి తనపై జరిగిన దాడిని వివరించి మోటర్‌బైక్‌లను వారికి అప్పగించారు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిపై కార్యదర్శుల ఖండన పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్‌చేసి తగిన చర్యలు తీసుకోకపోతే సోమవారం విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ధర్నా చేపడతామన్నారు. గతంలో కూడా మహ్మదాపురం సర్పంచ్ బంధువు పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణపై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. -
అన్ని పథకాలకు ఆధార్
నెలాఖరులోగా మీసేవలో మరో వంద సేవలు: సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: అన్ని పథకాల సేవలకు ఆధార్ నూరుశాతం అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ సీఎంవోలో గురువారం ఐటీ శాఖతో పాటు 10 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీసేవ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 329 సేవలకుతోడు అదనంగా మరో వంద సేవలను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాషమంతటా నగదు రహిత పథకం అమలులోకి రావాల్సి ఉందని, ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీ నుంచి ఇన్పుట్ సబ్సిడీ వరకు రైతులకు బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా అవకతవకలకు తావుండదన్నారు. శాటిలైట్ దృశ్యాలద్వారా పంట నష్టాన్ని తెలుసుకునేందుకు సర్వే నంబర్ ఆధారంగా పంట వివరాలను నమోదు చేయాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన అన్ని బయోమెట్రిక్ మిషన్ల కోసం ఒకేసారి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖ, విభాగం కోర్ డాష్‌బోర్డులో త్రీస్టార్ రేటింగ్స్ సాధించాలని సూచించారు. ప్రతి గ్రామంలోను ఒక డ్వాక్రా సంఘాన్ని బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి తరహాలోనే కృష్ణమ్మకు హారతి.. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణమ్మకు నిత్యహారతి ఇవ్వాలని, లేజర్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పది శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన పేద, మధ్యతరగతి వర్గాలకు సత్వరం న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ కేసు పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ‘రోను’పై అప్రమత్తంగా ఉండాలి నవ్యాంధ్రప్రదేశ్‌కు సంక్షోభాలు వారసత్వంగా సంక్రమించాయని, వాటిని అవకాశంగా మలుచుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు. రోను తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, తీర ప్రాంత కలెక్టర్లు, పలు శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు నేల మెత్తబడుతుంది కాబట్టి పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం ముమ్మరం చేయాలన్నారు. వర్షాలు, ఈదురుగాలులకు జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి భోజనం, తాగునీరు అందించాలని ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని సహాయక చర్యలు చేపట్టేలా అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం కావాలని ఆదేశించారు. నవ్యాంధ్రకు సంక్షోభాలు సంక్రమించాయని, అయితే గత ఏడాది వచ్చిన హుద్‌హుద్ తుపాను సంక్షోభాన్ని అధిగమించామన్నారు. కేంద్రంతో చాలా పనులున్నాయ్: బాబు కేంద్రంతో చాలా పనులున్నాయని, చేయించుకోవాల్సినవి చాలా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు ఆదుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలసిన సందర్భంగా కోరినట్లు చెప్పారు. గురువారం రాత్రి విజయవాడలోని నాక్ కల్యాణ మండపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకే కాకుండా.. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరానన్నారు. అంతకుముందు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్‌లు సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. -
‘మీ సేవ’ నుంచి రేషన్ కార్డులు
► రూ.35 చెల్లించి దరఖాస్తు చేస్తే చాలు ► 30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి ► ఆన్లైన్’ సేవలతో మధ్యవర్తుల ► ప్రమేయం లేకుండా చర్యలు పోచమ్మమైదాన్ : కొత్త రేషన్ కార్డు(ఆహార భద్రత కా ర్డు)కు మీరు అర్హులా? అయితే నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేస్తే చాలు. నిర్ణీత 30 రోజుల తర్వాత రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ప్రభుత్వం పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. గతంలో రేషన్ కార్డు కోసం చెప్పుల రిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆన్లైన్లో జరుగనుంది. కొత్తగా కార్డు కావాలనుకునేవారు తెల్ల కాగితంపై వివరాలను రాసి, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌తో స్థానిక మీసేవలో రూ.35 చెల్లించి, దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, దరఖాస్తుదారులు అర్హులా? అనర్హులా? అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ క్రమంలో అర్హులైన వారి వివరాలను సంబంధి త రేషన్ షాపుకు అలాట్ చేస్తారు. మార్పులు.. చేర్పులకు.. జిల్లాలో ఇప్పటిదాకా అంత్యోదయ కార్డులు 58,487, ఆహార భద్రత కార్డులు 9,14,542, అన్నపూర్ణ కార్డులు 141 ఉన్నాయి. పొట్ట చేత పట్టుకుని వలస వచ్చి ఆయా చోట్ల స్థిరపడిన వారంతా ఎక్కువగా ఒక చోట ఉండరు. వారి ఆర్థిక, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో ఇంటి అద్దెలను ఒకచోటి నుంచి మరోచోటికి మార్చుతారు. అరుుతే ఇలా ఇళ్లు మారిన సమయంలో రేషన్ కార్డును స్థానిక రేషన్ షాప్‌కు మార్చుకోవడం కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలోనే ప్రహసనంగా మారిన రేషన్ కార్డుల బదిలీ ప్రక్రియను సులభతరం చేశారు. కొత్తగా పెళ్లయిన వారు రేషన్ కార్డులు పొందేందుకు మొదట కుటుంబంలో ఉన్న వారి పేరును తొలగించాలి. ఆ తరువాత తెల్ల కాగితంపై సదరు వ్యక్తి స్వయంగా రాసి, దానికి కొత్తగా మారిన ఇంటి కరెంట్ బిల్లును జోడించి మీ సేవా కేంద్రంలో అందించి, రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. 30 రోజుల్లో వారికి సంబంధించిన కార్డు జారీ ప్రక్రియ పూర్తి అవుతుంది. పేర్లు తప్పుగా పడినా సంబంధిత ఆధారాల తో జత చేసి దరఖాస్తు చేస్తే, మార్పులు చేస్తారు. -
మీ-సేవ ద్వారానే ఇళ్ల ప్లాన్లు
► సిబ్బంది ఆచి... తూచి వ్యవహరించకుంటే ఇంటికే ► శాటిలైట్ ఏరియా చిత్రం ఉంటేనే ప్లాన్ మంజూరు ► 13 రకాల పత్రాలతో వస్తేనే అనుమతి బాపట్ల : ఎంకి పెళ్ళి ఇంకొకరి చావుకొచ్చింది.. అన్నట్లుంది పట్టణ ప్రణాళికా విభాగం పరిస్థితి. ఒక పక్క అనుమతి లేని.. పరిమితికి మించి నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోకపోతే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తోందని హెచ్చరికలు. మరో పక్క ప్లాన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు 13 రకాలైన పత్రాలు జతపర్చాలనే నిబంధనలు. ఇవిగాక తాజాగా ప్రతి ప్లాన్ మీ-సేవ కేంద్రాల ద్వారానే తీసుకోవాలనడంతో ఆ శాఖ ఆన్లైన్ సేవలు అందించేందుకు తలమునకలైంది. జిల్లాలోని 12 మున్సిపాల్టీల్లో ఈనెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తులు నమోదు చేయాలని నిబంధనలను ఉంచగా సర్వర్ల మొరాయింపు సమస్యతో ప్లాన్లు నమోదు చేయటం అంతంతమాత్రంగానే ఉంది. సిబ్బంది కొరత, అన్ని పత్రాలను ఆన్లైన్లో పొందుపరచటంతో ఇల్లు కట్టుకోవాలంటే అన్నీ సమస్యలే అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. ఆచి.. తూచి వ్యవహరించాలి.. ఈనెల ఒకటో తే దీ నుంచి మీ సేవ ద్వారానే ఇంటి ప్లానుకు దరఖాస్తు చేసుకోవాలనే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీంతోపాటు శాటిలైట్ ద్వారా ఆయా ప్రాంతాలు చూపించే చిత్రాన్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి దరఖాస్తు ద్వారా పొందుపరిచాలని నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం ఆయా మున్సిపాల్టీ పరిధిలోని శాటిలైట్ చిత్రంలో ప్లాన్ ఇచ్చే ప్రాంతంలో ఖాళీ స్థలాన్ని చూపిస్తేనే ప్లాన్‌కు అనుమతి తీసుకుంటుంది. వీటితోపాటు పరిశీలన పత్రం, బిల్డింగ్ దరఖాస్తు, మున్సిపాల్టీకి చెల్లించాల్సిన చలానా ఫారమ్స్, ఆస్తికి సంబంధించిన రికార్డులను జిరాక్స్‌లపై గజిటెడ్ ఆఫీసర్ సంతకాలు, లింకు డాక్యుమెంట్‌పై గజిటెడ్ ఆఫీసర్ సంతకం, ఈసీ కాపీ, ఇటీవల చెల్లించిన ఇంటి పన్ను రశీదు, ఖాళీ స్థలానికి సంబంధించిన పన్ను చెల్లించింది, ఇంటి యజమాని స్థలం వద్ద నిలబడి ఫొటో, లెసైన్స్డ్ సర్వేయర్ గీసిన ప్లాన్ 4 కాపీలు, ఇంటి ముందు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ చూపించే డాక్యుమెంట్, అఫిడవిట్‌తోపాటు రూ.10 స్టాంపు పేపరుపై నోటరీ సంతకాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌కు సంబంధించి ఎలాంటి అక్రమ కట్టడం చేయబోమని రూ.100 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించాలి. ఇలా 13 రకాలైన పత్రాలతో ప్లాన్ అనుమతికి పొందుపరిచాల్సి ఉంటుంది. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 12 మున్సిపాల్టీలు ఉండగా వాటిలో పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైల్స్‌నే కదిలించేందుకు సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బాపట్ల మున్సిపాల్టీలో 16 ఫైల్స్ చక్కబెట్టగా మిగిలిన మున్సిపాల్టీలో కనీసం అడుగు ముందుపడలేదు. ఇంటి యజమానులకు తిప్పని తిప్పలు.. ఆన్లైన్ పద్ధతి వలన ఇంటి యజమానులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. సర్వర్లు అందుబాటులో లేకపోవటంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 13 రకాలైన దరఖాస్తు ఫారాలను సమర్పించటంతోపాటు రూ.100 స్టాంపు పేపరుపై ‘నేను నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించను..’ అనే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. వివిధ కార్యాలయాలకు.. భవనాల క్రమబద్ధీకరణకు ప్లాన్లు మున్సిపాల్టీ స్థాయిని ఆధారం చేసుకుని అక్కడ నుంచి రీజినల్ డెరైక్టర్ కార్యాలయానికి, తిరిగి హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే రాజధాని నేపథ్యంలో ఎన్నో ఆశలతో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన వెంచర్లు, అపార్టుమెంట్లకు సంబంధించిన ప్లాన్లు, బహుళ సముదాయ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన చాలా ప్లాన్లు ఇటీవల జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉండిపోయాయి. -
‘డబుల్’ గందరగోళం!
♦ రెండు పడకగదుల ఇళ్ల దరఖాస్తులో అయోమయం ♦ మీసేవ కేంద్రాలకు స్వీకరణ బాధ్యతలు అప్పగింత ♦ ఆన్లైన్లో నమోదుతో పాటు నమూనా దరఖాస్తును కలెక్టరేట్లో ఇవ్వాలని కొర్రీ ♦ వృథా పని.. చార్జీల భారమంటూ నిర్వాహకుల గగ్గోలు ♦ రెండు పడకగదుల ఇళ్ల దరఖాస్తులో అయోమయం ♦ మీసేవ కేంద్రాలకు స్వీకరణ బాధ్యతలు అప్పగింత ♦ నమూనా దరఖాస్తును కలెక్టరేట్లో ఇవ్వాలని కొర్రీ ♦ వృథా పని.. చార్జీల భారమంటూ నిర్వాహకుల గగ్గోలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘డబుల్’ బెడ్రూం ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మీసేవ నిర్వాహకులను ఇబ్బందుల్లో పడేసింది. గత నెలాఖరు వరకు ఈ దరఖాస్తులను కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించిన యంత్రాంగం.. గత సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ బాధ్యతల్ని మీసేవ కేంద్రాలకు అప్పగించింది. రూ.25 చెల్లించి సమీపంలోని మీసేవ కేంద్రంలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అర్జీదారులకు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ఆన్లైన్ పద్ధతిలో వివరాల నమోదు అనంతరం అర్జీదారులు ఇచ్చిన నమూనా దరఖాస్తులను ప్రతి మంగళవారం కలెక్టరేట్లో సమర్పించాలని జిల్లా యంత్రాంగం కొర్రీ పెట్టింది. ఇది మారుమూల ప్రాంతాల్లో ఉన్న మీసేవ నిర్వాహకులకు ఇబ్బందుతు తెచ్చిపెడుతోంది. ‘డబుల్’ వర్క్.. జిల్లాలో 620 పౌర సేవా కేంద్రాలున్నాయి. ఇందులో ఏపీ ఆన్లైన్ కేంద్రాలు 161, మీసేవ కేంద్రాలు 140, ఈసేవ కేంద్రాలు 316 ఉన్నాయి. ఇవికాకుండా మరో మూడు కేంద్రాలు పౌరసేవలందిస్తున్నాయి. తాజాగా మీసేవ కేంద్రాలకు డబుల్ బెడ్రూం దరఖాస్తుల స్వీకరణ బాధ్యతల్ని జిల్లా యంత్రాంగం అప్పగించింది. అర్జీదారులు ముందుగా రూ.25 చెల్లించి దరఖాస్తు నమూనాను పూరించి మీసేవ కేంద్ర నిర్వాహకుడికి ఇవ్వాలి. అనంతరం వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సదరు నమూనా దరఖాస్తును జిల్లా కలెక్టరేట్లో సమర్పించాలి. అయితే ఆన్లైన్ ద్వారా వివరాల్ని నమోదు చేసినప్పటికీ.. నమూనా దరఖాస్తును కలెక్టరేట్లో సమర్పించాలని యంత్రాంగం ఆదేశించడం డబుల్ పని చేసినట్లవుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీల భారం తడిసి మోపెడు.. మీసేవ కేంద్రాల్లో రూ.25 చెల్లించి దరఖాస్తును సమర్పించాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. కానీ ఈ మొత్తం నుంచి కేవలం రూ.6 మాత్రమే నిర్వాహకుడి ఖాతాకు చేరుతుంది. మిగతా మొత్తం జిల్లా ఖజానాలో జమవుతుంది. అయితే వారానికి సగటున వంద దరఖాస్తు చేసినప్పటికీ.. వాటిని కలెక్టరేట్లో సమర్పించడానికి మీసేవ నిర్వాహకుడికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని పరిగి, వికారాబాద్‌లకు చెందిన పలువురు నిర్వాహకులు ‘సాక్షి’తో వాపోయారు. నగర శివారు ప్రాంతాల్లోని నిర్వాహకులకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. గ్రామీణ ప్రాంతంలోని నిర్వాహకులకు మాత్రం ఇది తలకుమించిన భారమవుతోంది. -
‘డబుల్’ కష్టాలు
♦ డబుల్బెడ్రూం ఇళ్లకు దరఖాస్తుల వెల్లువ ♦ మండుటెండల్లో మహిళల ఇబ్బందులు తాండూరు రూరల్ : మీ సేవా కేంద్రాల వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకునేందుకు మహిళలు ఎగబడ్డారు. ఆన్లైన్లో దరఖాస్తుకు మీ సేవా కేంద్రాల ఎదుట బారులుతీరుతున్నారు. మండుటెండలను లెక్కచేయకుండా చిన్న పిల్లలతో సహా మహిళలు మీ సేవా కేంద్రాలకు చేరుకొని దరఖాస్తులు చేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పలేదని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఇవేమీ ప్రజలు పట్టించుకోవడం లేదు. మీ సేవా కేంద్రాల వద్ద మాత్రం మహిళలు దరఖాస్తులు చేసుకునేందుకు తాండూరులోని వివిధ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. ఇదే అదునుగా మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు ఫారం రూ.25 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వినాయక్‌చౌక్ వద్ద ఉన్న మీ సేవా కేంద్రం వద్ద మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. మండుటెండల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లో తోపులాట కూడా చోటు చేసుకుంది. -
ఇంకా ఆంధ్రపదేశ్‌లోనేనా..!
ఒకే సర్టిఫికెట్లో రెండు రాష్ట్రాల పేర్లు పెద్దపల్లిరూరల్ : మీసేవ కేంద్రం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం పొందితే ఒకే సర్టిఫికెట్లో రెండు రాష్ట్రాల పేర్లు ఉండడం చూసి అవాక్కయ్యూరు. గోదావరిఖనికి చెందిన రాజేందర్ తన తండ్రి మరణధ్రువీకరణ పత్రం కోసం పెద్దపల్లి మీసేవ కార్యాలయంలో సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ధ్రువీకరణపత్రం తీసుకుని ‘ఆంధ్రప్రదేశ్’ అని ఉండడంతో అవాక్కయ్యూడు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ధ్రువీకరణపత్రాల్లో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అనే పేరును తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ అవసరాల కోసం తీసుకున్న సర్టిఫికెట్లను బ్యాంకు అధికారులకు చూపితే తెలుగులో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని, ఇంగ్లిష్‌లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం’ అని రాసి ఉందని నిరాకరిస్తున్నారని బాధితులు తెలిపారు. -
రెవెన్యూలో ప్రజా పోర్టల్
నేడు ఆవిష్కరించనున్న మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చర్యలు చేపట్టారు.తమ భూమి రికార్డుల కోసం యజమానులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాలు, ‘మీ సేవా’ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాష్ట్రంలోని ఏప్రాంతంలో ఉండే రైతు అయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఇట్టే చూసుకునేలా కొత్తగా ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌ను సీసీఎల్ఏ రూపొందించారు. ‘మా భూమి’ పోర్టల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆవిష్కరిస్తారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సీసీఎల్ఏ తెలిపింది. -
నేటి నుంచి వైజాగ్ మ్యాచ్ టిక్కెటు
విశాఖపట్నం: భారత్, శ్రీలంకల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్‌కు నేటి నుంచి (గురువారం) టిక్కెట్లు అమ్ముతారు. నగరంలోని 18 ‘మీసేవ’ కార్యాలయాలలో 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు రేట్లు ఉన్న టిక్కెట్లను అభిమానులు కొనుక్కోవచ్చు. -
గ్రేటర్ 'ఓటరు నమోదు'లో విచిత్రం..
- భారతీయురాలు కాదంటూ దరఖాస్తు తిరస్కరణ - కుషాయిగూడ మీ సేవా కేంద్రం తీరుతో విస్తుపోయిన మహిళ హైదరాబాద్: 'ఓటు మీ హక్కు.. ఆ హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి' అంటూ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఈసీ చేసిన ప్రచారానికి జాగృతురాలైన ఓ మహిళ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె పుట్టి పెరిగింది ఈ గడ్డపైనే. విదేశాలు కాదుకదా పక్క రాష్ట్రం వెళ్లొచ్చిన దాఖలాలూ లేవు. కానీ మీ సేవా వెబ్ పోర్టల్ మాత్రం ఆమెను భారతీయురాలిగా గుర్తించలేదు. హైదరాబాద్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీకి చెందిన నేరళ్ల అనిత గత నవంబరు 17న కుషాయిగూడలోని మీసేవా కేంద్రంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఓటరుగా నమోదయింది లేనిది తెలుసుకునేందుకు సోమవారం అదే మీసేవా కేంద్రానికి వెళ్లింది. అయితే దరఖాస్తు తిరస్కరణకు గురైందని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ‘మీరు భారతీయురాలు కానందున దరఖాస్తును తిరస్కరిస్తున్నం’ అని కంప్యూటర్ లో కనిపించడంతో ఆశ్చర్యపోయింది. 'నేను భారతీయురాలు కాకపోవడమేంటి?' అని అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. సిస్టమ్ ఓకే చెప్పనిదే తామేమీ చేయలేమని వారు బదులిచ్చారు. చేసేదేమీలేక మీసేవ వాళ్లిచ్చిన జిరాక్స్ కాపీతో అక్కడి నుంచి వెళ్లిపోయిందా మహిళ. -
మీ సేవ మొబైల్ యాప్ ఆవిష్కరణ
విజయవాడ: మీ సేవ సౌకర్యాలు మొబైల్ నుంచి వినియోగించుకునే యాప్‌ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా మీ సేవలో పొందే 18 రకాల సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈసీని ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చని కొద్దిరోజుల్లో మిగిలిన 17 సేవలు అందుబాటులో తీసుకోస్తామని తెలిపారు. -
మీసేవా కేంద్రంలో అగ్నిప్రమాదం
గోదావరిఖని (కరీంనగర్) : మూసి ఉన్న మీ సేవా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అందులో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కాలనీకి చెందిన బాలసాని శ్రీనివాస్ సైబర్నెట్ పేరుతో మీసేవాకేంద్రంతో పాటు, కంప్యూటర్ సెంటర్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈరోజు సాయంత్రం సెంటర్ మూసేసి బయటికి వెళ్లిన సమయంలో లోపలి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తాళాలు పగులగొట్టడానికి ప్రయత్నించగా.. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు. రూ. 2 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. -
మీసేవ కేంద్రాల్లో నిలువు దోపిడీ
అధికంగా వసూళ్లు చేస్తున్నా.. పట్టించుకోని అధికారులు పులివెందుల రూరల్ : పట్టణంలోని మీసేవ కేంద్రాలలో ప్రజలను యథేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని మీసేవ ప్రాంచైజ్‌లు, ఏపీ ఆన్లైన్ కేంద్రాలలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సేవలను మీసేవ కేంద్రాలకు అప్పగించడం పనులు సులువుగా జరుగుతాయని ప్రజలు భావించారు. అయతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు వసూళ్లు చేస్తుండటంతో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతోందని ప్రజలు చెబుతున్నారు. రైతులకు సంబంధించి అడంగల్, 1బిలకు రూ. 25లు తీసుకోవాల్సి ఉండగా.. రూ. 50లు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు బీసీ రుణాలకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించడంతో అందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో జత చేయాల్సి ఉంది. దీంతో మీసేవ కేంద్రాలలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆన్లైన్లో పంపిస్తామని చెప్పి రూ. 200లు వసూళ్లు చేస్తున్నారు. ఇందుకు రూ. 100లు కూడా ఖర్చు కాదు. ఈ పత్రాలను తహశీల్దార్ కార్యాలయంలో అప్రూవల్ చేయాల్సి ఉంది. ఇందుకు మీసేవ నిర్వాహకులు ప్రతి సర్టిఫికెట్‌కు ఓ రేటు నిర్ణయించి అప్రూవల్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, రేషన్ కార్డు ప్రింట్ అవుట్ ఇతరత్రా సర్టిఫికెట్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ధరలకే తీసుకొనే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను వందగజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో పేదల నివాసాలను గరిష్టంగా వందగజాల వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలు, ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఆక్రమించుకున్న స్థలాలకు క్రమబద్ధీకరణ జీవో వర్తించదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం జారీ చేసిన జీవో 296లో స్పష్టం చేశారు. జీవోలోని ముఖ్యాంశాలు, విధి విధానాలిలా ఉన్నాయి. ⇒ గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న ఆక్రమిత ఇళ్లకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ⇒ అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత నివాసాల క్రమబద్ధీకరణ అని ఈ పథకాన్ని పిలుస్తారు. అమలు ఈ నెల 15 నుంచి ఆరంభమవుతుంది. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ⇒ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 15 నుంచి 120 రోజుల్లోగా ‘మీసేవ’ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపుతారు. సబ్ కలెక్టరు/ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన డివిజనల్ స్థాయి రెగ్యులరైజేషన్ కమిటీ (డీఎల్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆయా మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక అధికారి సభ్యునిగానూ, తహశీల్దారు సభ్య కన్వీనరుగాను ఉంటారు. తహశీల్దారు ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హమైనదో కాదో నిర్ధారించడం కోసం డీఎల్ఆర్సీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తహశీల్దార్లకు జిల్లా కలెక్టరు/రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నిర్దిష్ట ప్రొఫార్మా, చెక్‌లిస్టు పంపుతారు. మహిళల పేరిటే పట్టాలు ⇒ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రూపొందిస్తారు. కుటుంబంలో మహిళలు లేని పక్షంలో కుటుంబ పెద్ద అయిన పురుషుని పేరుతో తయారు చేస్తారు. ⇒ అందిన ప్రతి దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాలి.హాడీఎల్పీసీ నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో దరఖాస్తుదారు 90 రోజుల్లోగా జేసీ-1కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాలకు వర్తించదు... ⇒ అభ్యంతరంలేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. ⇒ మాస్టర్‌ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లోని దరఖాస్తులను, అనుమతించిన లేఅవుట్లలోని ఖాళీ స్థలాలనూ పరిశీలించరు. నీటివనరులు, శ్మశాన వాటికలు, నీటిపారుదల, తాగునీటి ట్యాంకులు ప్రాంతాల్లోని ఆక్రమణదారుల దరఖాస్తులను అనుమతించరు. ప్రజావసరాలకు పనికొచ్చే స్థలాలు, అతి విలువైన స్థలాలనూ ఈ జీవో నుంచి మినహాయిస్తారు. ⇒ పట్టా పొందిన రెండేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి. -
రెండేళ్ళలో తెలంగాణ ప్రతీ గ్రామంలో మీ సేవా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ తెలంగాణలో భాగంగా అన్ని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో కొత్తగా 5,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్‌లోగా 1,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,800 మీ సేవా కేంద్రాలున్నాయి. -
మీసేవ... మరింత పారదర్శకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మీసేవ కేంద్రాలకు ధ్రువపత్రాల కోసం వెళితే సరైన స్పందన ఉండడం లేదు... అక్కడ ఉండాల్సిన సిబ్బంది ఉండడం లేదు... ఒక్కో ధ్రువపత్రానికి నిర్దేశించిన దాని కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు... కనీసం ఏ సర్టిఫికెట్లు ఇచ్చామన్న రిజిస్టర్లు కూడా మీ సేవ కేంద్రాలలో ఉండడం లేదు. కొన్నిచోట్ల పనివేళల్లో కూడా మీసేవ కేంద్రాలు తెరచి ఉండడం లేదు...అనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలోని కేంద్రాల నిర్వహణ విషయంలో పారదర్శకంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలకు కీలకంగా ఉపయోగపడే ధ్రువపత్రాలను జారీ చేసే మీ-సేవకేంద్రాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. మీసేవా కేంద్రాలతో పాటు శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు ఎలా ఉండాలన్న దానిపై ఆయన ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. ముఖ్యంగా పింఛన్లు, ఇతర సామాజిక అవసరాల కోసం ఉపయోగపడే ఆధార్ కార్డుల్లో అడ్డగోలుగా వయసును సవరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగా కాకుండా మీసేవా కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించి తీరాల్సిందేనని, ప్రతి నెలలో స్థానిక తహసీల్దార్ తన పరిధిలోని కేంద్రాలన్నింటినీ తనిఖీ చేసి నివేదికను పంపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓలు కూడా తమ పరిధిలోకి వచ్చే కేంద్రాలలో నెలలో 10శాతం కేంద్రాలను తనిఖీ చేయాల్సిందేనని, నిబంధనల ప్రకారం లేకపోతే సెంటర్లను మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మీసేవా కేంద్రాలద్వారా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీనంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు.. మీసేవా కేంద్రాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గ ంటల వరకు కచ్చితంగా తెరచి ఉంచాలి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మాత్రమే భోజన విరామం తీసుకోవాలి. ఆదివారం, ప్రభుత్వ సెలవుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాలి. మీసేవ ద్వారా సేవలు పొందే వ్యక్తి సమర్పించే అనుబంధ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రతి మీసేవా కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. ధరల పట్టికను కేంద్రంలో ప్రదర్శించాలి. మీసేవ కోసం వచ్చే వినియోగదారుల నుంచి సిటిజన్ చార్టర్ బోర్డులో నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేయాలి. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అదనపు రుసుమూ వసూలు చేయరాదు. ప్రతి కేంద్రంలో రిజిస్టర్‌తో పాటు ఫిర్యాదు పెట్టె కూడా ఉంచాలి. ఆ పెట్టెను తెరిచే అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. అనుమతి లభించిన చోట మాత్రమే మీసేవా కేంద్రాన్ని నిర్వహించాలి. ప్రదేశం మార్చి నిర్వహించకూడదు. ఆధార్ నమోదును ఉచితంగా చేయాలి. నమోదు/సవరణల కోసం సంబంధిత అధికారి సంతకం, స్టాంప్ ఉంటేనే చేయాలి. సవరణల కోసం కేవలం రూ.15 మాత్రమే వసూలు చేయాలి. సవరణల కోసం జనన ధ్రువపత్రం లేదా 10వ తరగతి సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్టు లేదా గెజిటెడ్ అధికారి లెటర్‌హెడ్‌పై జారీ చేసిన జనన ధ్రువపత్రం ఉండాలి. శాశ్వత ఆధార్ కేంద్రాలు కూడా అనుమతి ఇచ్చిన చోటనే నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదేశం మార్చకూడదు. సంచార ఆధార్ నమోదు కేంద్రాలకు సంబంధించి బ్లూమ్సొల్యూషన్స్కు మాత్రమే అనుమతి ఉంది. సవరణల కోసం శాశ్వత ఆధార్ కేంద్రాలకు వర్తించే నియమాలను పాటించి తీరాలి. ప్రతి నెలా మొదటి శనివారంలో స్థానిక తహసీల్దార్ తన పరిధిలోని మీసేవా కేంద్రాలను తనిఖీ చేసి నిబంధన ప్రకారం నడుస్తోందని కేంద్ర తనిఖీ నివేదిక పూర్తి చేసి 10వ తేదీలోగా జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓలు కూడా తమ పరిధిలోని 10 శాతం కేంద్రాలను నెలలో తనిఖీ చేయాలి. నిబంధనలను మొదటిసారి అతిక్రమిస్తే సదరు మీసేవా కేంద్రాన్ని 15 రోజుల పాటు నిలిపివేసి రూ.2వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అతిక్రమిస్తే 15 రోజుల పాటు నిలిపివేసి రూ.5వేల జరిమానా విధిస్తారు. మూడోసారి అతిక్రమిస్తే సెంటర్‌ను రద్దు చేసి ఈఎస్డీ రూల్స్‌లోని క్లాజ్ 19,20,21 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వినియోగదారులకు మీసేవా కేంద్రాల వల్ల కలిగే అసౌకర్యాలను తహసీల్దార్, ఆర్డీఓ లేదా 1800-425-1442 లేదా 1100 అనే టోల్‌ఫ్రీనంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. -
‘మీ సేవ’లకు మొబైల్ గవర్నెన్స్
టెక్నాలజీతో పౌరులకు చేరువగా ప్రభుత్వ సేవలు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మొబైల్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘డిజిటల్ తెలంగాణ’కార్యక్రమంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సర్వీసుల్లో మూడు(బర్త్, డెత్ సర్టిఫికెట్లు, అడంగల్ కాపీ) సేవలను మొబైల్ ద్వారా అందించే యాప్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల ద్వారా పౌరులకు ప్రస్తుతం 321 రకాల సేవలు అందుతున్నాయని, త్వరలోనే వీలైనన్ని ఎక్కువ సేవలను మొబైల్ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖలో తొలిసారిగా ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టామని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇకపై యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల్లో దర్శన టికెట్లు, వసతి సదుపాయాలను భక్తులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పొందవచ్చని, త్వరలోనే బాసర, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు ఈ సేవలను విస్తరిస్తామన్నారు. ఐటీ శాఖ రూపొందించిన దేవాదాయ శాఖ ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి డిజిటల్ అక్షరాస్యతను నేర్పించేందుకుగానూ ప్రభుత్వం డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలు నిమిత్తం నాస్కామ్ ఫౌండేషన్‌తో సర్కారు ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రధాన సమస్యలైన అధ్యాపకులు, ల్యాబొరేటరీల కొరతను అధిగమించేందుకు వర్చువల్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్), ఐఐఐటీ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. -
సదా 'మీ సేవ'లో..
2011లో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో 334 సేవలు మొబైల్ యాప్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం సాక్షి: ఏదేని ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందాలంటే సంబంధిత కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. వారం గడిచినా సర్టిఫికెట్లు అందుతాయన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో ‘మీ సేవా’ కేంద్రాలు ప్రారంభించింది. మనకు కావాల్సిన పత్రాల వివరాలు, రుసుం చెల్లిస్తే రెండు లేదా మూడు రోజుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం మీ సేవా ద్వారా పోందే అన్ని సేవలను ఇక నుంచి మొబైల్ ద్వారా అందించనుంది. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘మీ సేవ’ విశేషాలు మీకోసం.. కేంద్రాల పనితీరు దర ఖాస్తుదారులు ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ’ రూపొందించిన నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా సిబ్బంది దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తహశీల్దార్/ఆర్డీఓ కార్యాలయాలకు చేరవేస్తారు. తహశీల్దారు వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర విచారణాధికారులకు పంపిస్తారు. డిజిటల్ కీ ఆధారంగా వీఆర్వో, ఆర్ఐ, డీటీలు విచారణ నివేదికలు తహశీల్దారుకు సమర్పిస్తారు. నివేదికలపై సంతృప్తి చెందితే వాటిని రెండు కాపీలు తీస్తారు. ఒక దానిపై సంతకం చేసి కార్యాలయ స్టాంప్ వేసి భద్రపరుస్తారు. మరో దానిని డిజిటల్ సంతకంతో దరఖాస్తుదారునికి జారీ చేస్తారు. వ్యక్తిగతంగానూ జారీ ఈసేవా కేంద్రాల ద్వారానే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా ధ్రువపత్రాలు పొందే అవకాశాన్ని కల్పించారు. పుట్టినరోజు, నివాస తదితర ధ్రువపత్రాలతోపాటు, పెన్షన్ కోసం వ్యక్తిగత దరఖాస్తులు తీసుకోవడానికి సీసీఎల్ఏ ఆయోదం తెలిపింది. పత్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారుల సంతకంతో జారీ చేస్తారు. అయితే అత్యవసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన వారికి మాత్రమే ఈ విధానంలో జారీ చేస్తున్నారు. అక్రమాలకు చెక్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను మీ సేవా కేంద్రాలతో మిళితం చేసింది. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్‌లో మొదటి ఇసుక విక్రయ కేంద్రాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇసుక కావాలనుకునేవారు మీసేవా కేంద్రాల్లో టన్నుకు రూ.375 చెల్లించాలి. రశీదు తీసుకుని ఇసుక కేంద్రాలకు వెళ్లి లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు సొంతంగా సమకూర్చుకోవాలి. ప్రారంభం కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ, తదితర పత్రాల జారీలో చోటు చేసుకుంటున్న అవకతవకలు నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సర్టిఫికెట్లను ఆన్లైన్ విధానంలో జారీచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘మీ సేవా’ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని 2011 నవంబర్ 4న చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. 10 సేవలతో మొదలై, ప్రస్తుతం 34 శాఖలకు చెందిన 334 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7 వేలకు పైగా కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు క్రోడీకరించి కొత్త నిబంధనలు రూపొందించింది. సంబంధిత అధికారుల సంతకాన్ని డిజిటలైజ్ చేసింది. రాష్ర్ట విభజన అనంతరం రెండు రాష్ట్రాలు వేరుగా సేవలు అందిస్తున్నాయి.ఈ కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ అప్లికేషన్ మీ సేవలో అందిస్తున్న సేవలన్నింటినీ మొబైల్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తొలి విడతలో 19 పౌర సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు చెల్లింపు, డాష్‌బోర్డు, చెల్లింపు స్థితి, మీ సేవ కేంద్రాలు వివరాలు తెలుసుకోనే వెసలుబాటు కల్పించారు. మీ సేవకు సంబంధించి వాట్సాఫ్ నంబరు 9100199992కు మెసేజ్ కూడా చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బ స్టాఫ్లు, ఆసుపత్రుల వివరాలు ఇందులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో వయోజన విద్య సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ధ్రువపత్రాల జారీ ఆలస్యంగా జరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు సమయానికి సర్టిఫికెట్లు పొందలేక పోతున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ‘స్టేట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం’ కమిటీని నియమించింది. ఈ కమిటీకి డెరైక్టర్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చక్రపాణిని నియమించారు. -
సదా మీ సేవలో...
2011లో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో 334 సేవలు మొబైల్ యాప్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఏదేని ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందాలంటే సంబంధిత కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. వారం గడిచినా సర్టిఫికెట్లు అందుతాయన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో 'మీ సేవా' కేంద్రాలు ప్రారంభించింది. మనకు కావాల్సిన పత్రాల వివరాలు, రుసుం చెల్లిస్తే రెండు లేదా మూడు రోజుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం మీ సేవా ద్వారా పోందే అన్ని సేవలను ఇక నుంచి మొబైల్ ద్వారా అందించనుంది. ఇందుకు సంబంధించిన యాప్‌ను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా 'మీ సేవ'విశేషాలు మీకోసం.. - స్కూల్ ఎడిషన్ కేంద్రాల పనితీరు దరఖాస్తుదారులు 'షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ' రూపొందించిన నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా సిబ్బంది దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తహశీల్దార్/ఆర్డీఓ కార్యాలయాలకు చేరవేస్తారు. తహశీల్దారు వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర విచారణాధికారులకు పంపిస్తారు. డిజిటల్ కీ ఆధారంగా వీఆర్వో, ఆర్ఐ, డీటీలు విచారణ నివేదికలు తహశీల్దారుకు సమర్పిస్తారు. నివేదికలపై సంతృప్తి చెందితే వాటిని రెండు కాపీలు తీస్తారు. ఒక దానిపై సంతకం చేసి కార్యాలయ స్టాంప్ వేసి భద్రపరుస్తారు. మరో దానిని డిజిటల్ సంతకంతో దరఖాస్తుదారునికి జారీ చేస్తారు. వ్యక్తిగతంగానూ జారీ ఈసేవా కేంద్రాల ద్వారానే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా ధ్రువపత్రాలు పొందే అవకాశాన్ని కల్పించారు. పుట్టినరోజు, నివాస తదితర ధ్రువపత్రాలతోపాటు, పెన్షన్ కోసం వ్యక్తిగత దరఖాస్తులు తీసుకోవడానికి సీసీఎల్ఏ ఆయోదం తెలిపింది. పత్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారుల సంతకంతో జారీ చేస్తారు. అయితే అత్యవసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన వారికి మాత్రమే ఈ విధానంలో జారీ చేస్తున్నారు. అక్రమాలకు చెక్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను మీ సేవా కేంద్రాలతో మిళితం చేసింది. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్‌లో మొదటి ఇసుక విక్రయ కేంద్రాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇసుక కావాలనుకునేవారు మీసేవా కేంద్రాల్లో టన్నుకు రూ.375 చెల్లించాలి. రశీదు తీసుకుని ఇసుక కేంద్రాలకు వెళ్లి లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు సొంతంగా సమకూర్చుకోవాలి. ప్రారంభం కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ, తదితర పత్రాల జారీలో చోటు చేసుకుంటున్న అవకతవకలు నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సర్టిఫికెట్లను ఆన్లైన్ విధానంలో జారీచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 'మీ సేవా' కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని 2011 నవంబర్ 4న చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. 10 సేవలతో మొదలై, ప్రస్తుతం 34 శాఖలకు చెందిన 334 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7 వేలకు పైగా కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు క్రోడీకరించి కొత్త నిబంధనలు రూపొందించింది. సంబంధిత అధికారుల సంతకాన్ని డిజిటలైజ్ చేసింది. రాష్ర్ట విభజన అనంతరం రెండు రాష్ట్రాలు వేరుగా సేవలు అందిస్తున్నాయి.ఈ కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ అప్లికేషన్ మీ సేవలో అందిస్తున్న సేవలన్నింటినీ మొబైల్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తొలి విడతలో 19 పౌర సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు చెల్లింపు, డాష్‌బోర్డు, చెల్లింపు స్థితి, మీ సేవ కేంద్రాలు వివరాలు తెలుసుకోనే వెసలుబాటు కల్పించారు. మీ సేవకు సంబంధించి వాట్సాఫ్ నంబరు 9100199992కు మెసేజ్ కూడా చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బ స్టాఫ్లు, ఆసుపత్రుల వివరాలు ఇందులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో వయోజన విద్య సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ధ్రువపత్రాల జారీ ఆలస్యంగా జరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు సమయానికి సర్టిఫికెట్లు పొందలేక పోతున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం 'స్టేట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం' కమిటీని నియమించింది. ఈ కమిటీకి డెరైక్టర్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చక్రపాణిని నియమించారు -
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు
మీ సేవ కేంద్రాల ద్వారా జారీకి రెవెన్యూశాఖ ఏర్పాట్లు ♦ కార్డున్న వారికే పథకాల లబ్ధి ♦ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల మందికి కార్డులు ♦ పాత కార్డులున్న రైతులకు పునరుద్ధరణ ♦ ప్రతి కార్డుకు ‘ఆధార్’ అనుసంధానం సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలను అందించే ఉద్దేశంతో.. ప్ర భుత్వం కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్ఈసీ)లను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.20 లక్షలమంది కౌలురైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రుణ అర్హత కార్డులున్న 2.70 లక్షల మందికి ఈ ఏడాది వాటిని పునరుద్ధరించనున్నారు. కార్డులు లేని సుమారు 2.5 లక్షల మంది కౌలు రైతులకు వాటిని కొత్తగా అందజేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీతో అందజేస్తున్న విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను ఇకపై కౌలు రైతులకూ అందజేయనుంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలతో పాటు, మార్కెట్ యార్డుల్లో పంటలను నిల్వ ఉంచుకునే సదుపాయం, కనీస మద్దతు ధరను పొందే అవకాశం.. తదితర అంశాల్లోనూ వారికి బాసటగా నిలవాలని భావిస్తోంది. బ్యాంకుల రుణాలు ఇప్పటివరకు భూముల యజమానులకే అందుతున్నాయని, వాస్తవానికి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా, వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వీటిని జారీ చేయనుంది. ప్రయోజనాలు ఇలా.. రుణ అర్హత కార్డులను పొందనున్న కౌలురైతులకు ఇకపై బ్యాంకుల నుంచి పంట రుణాలతో పాటు ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, మౌలిక సదుపాయాలను పొందేందుకు వీలు కలగనుంది. ప్రకృతి విపత్తులతోగానీ, వ్యవసాయ పరికరాల లోపం వల్ల గానీ పంట నష్టపోతే బీమా ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. ఈ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను మరింత పటిష్టంగా అమలుచేయొచ్చని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. భూమిపై హక్కును క్లెయిం చేసుకునేందుకు గానీ, సమర్థించుకునేందుకు గానీ ఈ కార్డులను సాక్ష్యంగా వినియోగించుకునేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.మీ సేవ ద్వారా ఎల్‌ఈసీలు జారీ కౌలు రైతులకు ఎల్ఈసీలను మీ సేవకేంద్రాల ద్వారా అందించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. వీటిని పొందాలనుకునే/ రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమీపంలోని మీ సేవకేంద్రాల్లో, గ్రామ లేదా, మండల రెవెన్యూ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు తమ ఆధార్/రేషన్ కార్డు/ఓటర్ ఐడీ/పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయాలి. కార్డు పొందేందుకు రూ.35 రుసుము చెల్లించాలి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన 15 రోజుల్లో కొత్త/ రెన్యువల్ కార్డులను మీసేవ కేంద్రాల నుంచే పొందవచ్చు. ఈ కార్డు ఏడాది (జూన్ 1 నుంచి మే 31 వరకు) మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిఏటా రెన్యువల్ చేయించుకోవాలి. -
మీ సేవ ద్వారా పుష్కర దర్శనం టికెట్లు
భద్రాచలం చిత్రకూటమండపంలో సువర్ణ పుష్ప పూజలు భద్రాచలం: గోదావరి పుష్కరాల సమయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వైదిక కమిటీ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది సమావేశమై దీనిపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కర భక్తులకు ఆర్జిత సేవలు కల్పించాలనే లక్ష్యంతో సువర్ణ పుష్ప పూజలను గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలన చేస్తున్నట్లుగా తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనంనకు రూ. 200, శీఘ్ర దర్శనానికి రూ.50 టికెట్టుగా నిర్ణయించే విషయమై చర్చించారు. గోదావరి పుష్కరకాలంలో మీ సేవ కేంద్రాల ద్వారా టికెట్లను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. పుష్కరాల సమయంలో పురోహితులకు దేవస్థానం ద్వారా గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లుగా ఈవో చెప్పారు. ఆలయ వేళల్లో మార్పు.. సాధారణ రోజుల్లో ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి రాత్రి 9గంటలకు ఆలయం తలుపులు వేస్తారు. గోదావరి పుష్కరాలు జరిగే జులై 14 నుంచి 25 వరకూ తెల్లవారు ఝా మున 4గంటల నుంచి 12 గంటల వరకూ ఆల యం తలుపులు తెరిచి ఉంచుతారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ ఆల యాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. -
అంగట్లో మీ సేవ !
విజయనగరం కంటోన్మెంట్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు అక్రమ వసూళ్లకు నిలయంగా మారాయి. ఈ కేంద్రాల నుంచి రాబడి అధికంగా వస్తుండడంతో వీటిపై మోజు పెరిగింది. దీంతో ఒకరి పేరున ఉన్న కేంద్రాలను మరొకరు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రం ఫర్నిచర్, కంప్యూటర్లతో కలిపి సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. కొందరైతే వీటిని లీజుకు తీసుకుంటున్నారు. అది కూడా ఆధార్ సెంటర్ మంజూరైన కేంద్రాలకు మాత్రమే ఈ విధమైన గిరాకీ ఉంది. మిగతా ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలు లక్ష నుంచి రెండు లక్షల వరకూ పలుకుతున్నాయి. ఎవరికి కేటాయించిన కేంద్రాలను వారే నిర్వహించాలి. కానీ ఇష్టమొచ్చినట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో 200కు పైగా మీ సేవా కేంద్రాలున్నాయి. వీటిని డీఎంసీ, సీఎంఎస్ అనే ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటి పర్యవేక్షణను జిల్లా కేంద్రంలోని ఈ జిల్లా మేనేజర్ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నిర్వాహకులు నచ్చినట్టు పేర్లు మార్చుకుంటున్నారు. ఒకరికి కేటాయించిన కేంద్రాన్ని మరొకరికి అమ్మేస్తున్నారు. ఈ విక్రయాల వ్యవహారం జోరుగా సాగుతోంది. అలాగే కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేయడంతో విక్రయాలు మరింత జోరందుకుంటున్నాయి. దీంతో తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో మంజూరు చేయవలసిన వివిధ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డు కోసం వచ్చిన వారి నుంచి రూ. 60 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఎక్కడా ఉచితంగా తీస్తున్న దాఖలాలు లేవు. నిబంధనలు గాలికి! కొన్ని కేంద్రాల్లో నిబంధనలు పాటించడం లేదు. వాస్తవానికి మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది యూనిఫారం ధరించాలని గతంలో జాయింట్ కలెక్టర్ రామా రావు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకూ అమలు కాలేదు. అదేవిధంగా కేంద్రాలకు పింక్ కలర్ వేయాలి. కానీ పింక్ కలర్ కాకున్నా పింక్ కలర్ కర్టెన్లు వేసి వాటిని దర్జాగా నిర్వహిస్తున్న వైనం జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో అధికంగా కనిపిస్తోంది. రూ. 10 నుంచి 50 రూపాయలు ఫీజున్న సేవలు రూ. 20 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఆధార్ తీసుకున్న వారి నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నా సరిగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల కలెక్టరేట్లో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఒక చోట అనుమతి మరోచోట నిర్వహణ పలు కేంద్రాలు మంజూరైనా కాకుండా మరోచోట నిర్వహిస్తున్నారు. సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించాల్సిన కేంద్రాన్ని లచ్చయ్యపేటలో నిర్వహిస్తున్నారు. అలాగే విజయనగరంలోని వేణుగోపాలపురానికి మంజూరైన కేంద్రాన్ని నెల్లిమర్ల ప్రాంతానికి తరలించారు. ఆధార్ సెంటర్లు కూడా నచ్చిన వారికి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. మెరకముడిదాం మండలంలో అసలు మీ సేవా కేంద్రమే లేదు. కొన్ని మండలాల్లో మండల కేంద్రంలో మొదటి మీ సేవా కేంద్రానికే ఆధార్ సెంటర్ నమోదు చేయాల్సి ఉండగా రెండో సెంటర్‌కు ఇచ్చారు. కఠిన చర్యలు తప్పవు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే పార్వతీపురం పరిధిలోని ఓ కేంద్రం నిర్వహకునిపై చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ బి.రామారావు తెలిపారు. ఇక ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
ఆధార్ దోపిడీ
మీసేవ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారారుు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆధార్‌కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో ఉన్న ఆందోళనను ఆసరాగా చేసుకుని కార్డు జారీకి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సామాన్యులను కష్టాలకు గురిచేస్తోంది. సులభతరంగా అందాల్సిన కార్డు లు, మార్పులు-చేర్పుల వంటి సేవలు కష్టసాధ్యంగా మారాయి. వీటిని జయించాలంటే ఆధార్ సెంటర్లో చేస్తున్న సిబ్బంది చేయి తడపాల్సి వస్తోం ది. కాదంటే రోజుల తరబడి ఆధార్ కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ ధార్ సెంటర్‌కు వెళ్లింది మొదలు.. కార్డు దరఖాస్తు ఫారం ఇవ్వడానికి ఓ రేటు, దాన్ని నింపడానికి మరో ధర, క్యూలైన్లో త్వరగా వెళ్లడానికి ఓ రేటు లేదా టోకెన్ పద్ధతిలో సరిగ్గా సమయానికి వచ్చి ఐరిస్ మిషన్ ఎ దుట ఫొటో దిగడానికి ఓ రేటు నిర్ణయిం చారు. దాదాపుగా ప్రతీ ఆధార్సెం టర్లో, పని జరగడానికి రూ.100 చె ల్లించడం ఆనవాయితీగా మారింది. ఉచిత సేవలకు.. పైసలు.. ఇటీవల కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు అమలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారుు. కార్డులు జారీ చేసేందుకు మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేకంగా ఆధార్‌సెంటర్లు మంజూరు చేశారు. ఆధార్సెంటర్లో కార్డులు జారీ, మార్పులు చేర్పులు తదితర పనులకు ఒక్కోకార్డుకు రూ.25 నుంచి రూ.30 వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ ప్రజల అమాయకత్వం, అవగాహనలేమిని ఆసరాగా చేసుకుని సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ప్రతీకార్డుకు సొమ్ము తీసుకుంటూనే మరోవైపు ప్రజల నుంచి అంతకు ఐదింతలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ ఆధార్ కేంద్రాల పనితీరును జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్లు చూడాలి. ఆధార్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా? లేదా అనే అంశాలపై వీరు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రాలపై ఆరోపణలు వచ్చినప్పుడే తప్పా మిగతా సమయంలో అధికారులు ఇటువైపు కన్నెతి చూడటం లేదు. ఫలితంగా ఆధార్ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల కొన్ని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు పద్ధతిలో ఆసరా పథకానికి అనుగుణంగా వయస్సు పెంచి ఆధార్‌కార్డులు జారీ చేసిన తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే అంశంపై హన్మకొండ, ఆర్ట్స్‌కాలేజీ ఎదుట ఉన్న ఓ మీసేవా కేంద్రాన్ని ఇటీవల సీజ్ చేశారు. ఆధార్ సెంటర్ల పనితీరులో మార్పు వచ్చే వరకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శివ.. శివా.. జిల్లా మారుమూల ప్రాంతాలతో పోల్చితే నగరంలో మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. శివనగర్ మీసేవా కేంద్రంలో ఆధార్‌సెంటర్ కేంద్రంలో నిర్వాహకులు సామాన్యుల నుంచి డబ్బుల వసూలు చేస్తున్నారంటూ రెండు నెలల క్రితం అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. అ యినా అధికారులు చర్యలు తీసుకోలేదు. సోమవారం ఇదే కేంద్రంలో ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియను పరిశీలించగా మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ఈ కేంద్రంలో 30 మంది ఆధార్‌కార్డు కోసం వేచి ఉన్నారు. వీరిలో పదిమందితో మాటలు కలపగా.. ఏడుగురు ఆధార్‌కార్డు కోసం రూ.100 చెల్లించినట్లుగా తెలిపారు. అంతకుముందు చార్‌బౌళిలో ఉన్న ఆ దార్సెంటర్కు వెళ్లగా అక్కడ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా రూ.100 యూజర్‌ఛార్జీల్లో భాగం అనుకుంటున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో దందా మరింత జోరుగా సాగుతోంది. అడ్రస్ మార్పు కోసం.. ఇంటి చిరునామా మార్చుకునేందుకు శివనగర్‌లో ఉన్న ఆధార్ కేంద్రానికి వచ్చాను. ఈ పని అయ్యేందుకు రూ.100 చెల్లించాలని ఇక్కడి సిబ్బంది తెలిపారు. దీనితో డబ్బులు చెల్లించి క్యూ లైన్లో నిల్చున్నాను. - పుష్ప, కరీమాబాద్ కొత్తగా పేరు చేర్చాలి.. గతంలో మా కుటుంబానికి ఆధార్‌కార్డు ఉంది. మా చిన్నబాబు పేరును ఆధార్‌కార్డులో చేర్చేందుకు వచ్చా ను. ఫారం నింపేప్పుడు రూ 100 ఇవ్వమంటే ఇచ్చా ను. రెండు, మూడు రోజుల్లో అవుతుందని చెప్పారు. - దేవులపల్లి లత, ఎస్‌ఆర్‌ఆర్‌తోట -
రుణాల కోసం ఎస్బీఐలో నకిలీ వన్ బీలు
అనుమానంతో గుర్తించిన బ్యాంకు అధికారులు దొంగ వన్‌బీలేనని తేల్చిన రెవెన్యూ అధికారులు మహబూబాబాద్‌లోని ఓ మీసేవా కేంద్రం ద్వారా దందా నెల్లికుదురు : నకిలీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా వాటిని తలదన్నేలా దొంగ సాఫ్ట్వేర్లు పుట్టుకొస్తున్నాయి. ముగ్గురు తహసీల్దార్ల ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన వన్‌బీలను మీసేవా కేంద్రాల్లో తీసుకొచ్చి కొందరు, దొంగ పట్టాపాస్ పుస్తకాలను తయారు చేయించి మరికొందరు ఎన్ని బ్యాంకులుంటే అన్ని బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో మండలంలోని మదనతుర్తి, నైనాల గ్రామాలకు చెందిన కొందరు గతంలో రుణాలు పొందారు. వారే మళ్లీ రుణాల కోసం మహబూబాబాద్‌లోని ఓ మీసేవ కేంద్రంలో కొత్త సర్వే నంబర్లతో తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ వన్‌బీలు తయారు చేయించి ఎస్బీఐలో దరఖాస్తులు చేసుకున్నారు. దొంగ వన్‌బీల బండారం బయటపడిందిలా.. గతంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి ఇప్పుడు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని అనుమానం వచ్చిన ఎస్బీఐ శాఖ అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆరాతీశారు. తహసీల్దార్ తోట వెంకటనాగరాజుకు వివరించగా నకిలీ(ఫేక్) వన్‌బీలను రె వెన్యూ సిబ్బందితో పరిశీలించారు. 122 కంప్యూటర్ పహణీలు, వన్‌బీలు పరిశీలించగా మదనతుర్తి గ్రామానికి చెందినవి 16, నైనాలకు చెందినవి 2 నకిలివీగా తేలడంతో రెవెన్యూ, బ్యాంకు అధికారులు కంగుతిన్నారు. నకిలీ కంప్యూటర్ పహాణీలు, వన్‌బీలు ఉన్నవారి వివరాలు.. మండలంలోని మదనతుర్తి గ్రామశివారు తండాలకు చెందిన గుగులోతు హేమచంద్రు, గుగులోతు నరేందర్,గుగులోతులాలు,గుగులోతురాజు,భూక్య సుక్య, గుగులోతు లక్ష్మి, గుగులోతు చంత్రు, గుగులోతు వీరన్న, గుగులోతు పంతులు, గుగులోతు జవహార్‌లాల్, గుగులోతు శ్రీను, గుగులోతు లచ్చు, భూక్య మోహన్, గుగులోతు మాన్సింగ్, భూక్య జగ్మల్, నైనాల గ్రామానికి చెందిన గుగులోతు హచ్చాలి, గుగులోతు మగ్తి పేర్లు ఉన్నారుు. విచారణ చేపడితే ఇలాంటివిఇంకెన్నోబయట పడే అవకాశాలున్నాయి. అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతోనే.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నెల్లికుదురు రెవెన్యూ కార్యాలయంలోని ఇద్దరు రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి వందల మంది రైతులకు భూమి లేకున్నా తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు రాసివ్వడంతో మహబూబాబాద్ మండలంలోని అమనగల్ సిండికేట్ బ్యాంకులో రుణాలిచ్చారు. ఇలా తెల్లకాగితంపై సుమారు 408 మందికి రాసివ్వగా రూ.4 కోట్ల వరకు రుణాలు మంజూరయ్యూరుు. అరుుతే సంబంధిత ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి దొంగ వన్‌బీలు, పాస్ పుస్తకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని బ్యాంకుల్లో పూర్తి విచారణ చేపడితే ఇలాంటివెన్నో వెలుగులోకి వస్తాయని మండల ప్రజలు అనుకుంటున్నారు. దొంగ వన్‌బీలపై అధికారలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి. తహసీల్దార్ తోట వెంకటనాగరాజును వివరణ కోరగా ఫేక్ వన్‌బీలు మీసేవా కేంద్రం నుంచి తీసినవే అవి దొంగవని తేలింది. విచారణ జరిపిన అనంతరం పూర్తి సమాచారంతో వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసులకు సమాచారం అందిస్తాం.