అధికారులు సృష్టించిన నకిలీ పహణీలు
- సృష్టించిన రెవెన్యూ అధికారులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- సమగ్ర విచారణ జరిపించాలంటున్న రైతులు
అశ్వాపురం : ఇద్దరు వ్యక్తులకు చెందినట్లుగా సుమారు 50 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులే ‘మీ సేవ’లో నకిలీ పహణీలు సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరి«ధిలోని నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గులాంమొహిద్దీన్‌కు సుమారు 190 ఎకరాల భూమి ఉంది. ఆయన గ్రామంలోని సుమారు 100 మంది రైతులకు ఆ భూమిని విక్రయించాడు. ఆ భూమికి అనుసంధానంగా గ్రామంలోని ఓ ఇద్దరు రైతులకు ఏడెకరాల భూమి ఉంది. కానీ, ఆ ఇద్దరు రైతులకు 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో 50.31 ఎకరాల భూమి ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు నకిలీ ‘మీ సేవ’ పహణీలు సృష్టించారు. చట్టుపక్కల ఉన్న రైతులు గమనించి అశ్వాపురం తహసీల్దార్ కుసుమకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సెప్టెంబర్ 20న 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో భూమికి సంబంధించి ఆధారాలు ఐదు రోజుల్లో తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదు. గతంలో కూడా మొండికుంటకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద 10 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీ వెలుగులోకి వచ్చింది. కొంతమంది తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా ఆన్‌లైన్ నుంచి తొలగించారు. ఈ నకిలీ పహణీలు గతంలో తహసీల్దార్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన మల్లీశ్వరి హయాంలో ఇచ్చినవని రైతులు పేర్కొంటున్నారు.
-ఆందోళన చెందుతున్న రైతులు..
సర్వే నంబర్లలో ఏ విధమైన భూమి లేకుండా మొండికుంటకు చెందిన వ్యక్తికి 10 ఎకరాలు, రామచంద్రాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు 50.31 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీలు ఇవ్వడంపై ఆ సర్వే నంబర్లకు అనుబంధంగా ఉన్న సర్వే నంబర్ల రైతులు భవిష్యత్తులో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. నెల్లిపాక రెవెన్యూలో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా ‘మీ సేవ’ పహణీలు ఇవ్వని రెవెన్యూ అధికారులు భూమి లేకుండా నకిలీ మీసేవ పహణీలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ మీసేవ పహణీలను తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు.
-ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం..
బి.కుసుమ, తహసీల్దార్, అశ్వాపురం
నకిలీ మీసేవ పహణీల విషయంపై రైతులు ఫిర్యాదు చేశారు. అవి రెండేళ్ల కిందట ఇచ్చినవి. ఈ విషయంపై వీఆర్‌ఓ, ఆర్‌ఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం. పహణీలు ఆన్‌లైన్ నుంచి తొలగిస్తాం.