చాలాచోట్ల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కు
జేఈఈ మెయిన్‌కు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం తల్లిదండ్రుల అగచాట్లు
సర్టిఫికెట్‌కు ఇంత అని చెబుతూ వసూళ్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు
సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి అనే ఫిర్యాదులు
డబ్బులు ఇవ్వకుంటే రోజుల తరబడి పెండింగ్‌లో దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. సర్వీసు చార్జీల కింద రూ.45 తీసుకోవాల్సి ఉండగా సర్టిఫికెట్‌కు రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం ముందుగా నిర్వహించే జేఈఈ మెయిన్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే పిల్లల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్రాల నిర్వాహకులు భారీ దందాకు తెరలేపారు. తల్లిదండ్రులకు అవసరం కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొన్నిచోట్ల రూ.4,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది, అంటెండర్లతో కుమ్మౖMð్క ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జేఈఈ మెయిన్ అని కాకుండా సాధారణ రోజుల్లో సైతం తహశీల్దార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకుని కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టకపోతే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచేస్తున్నారని, కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులుండటం గమనార్హం.
పౌరసేవకు ఎగనామం
దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం పౌరసేవల పరిధిలోకి తెచ్చింది. నామమాత్రపు రుసుంతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. అయితే దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు తహసీల్ కార్యాలయాల సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
రూ.45 సర్వీసు చార్జీ ఉండే ఓబీసీ సర్టిఫికెట్ కావాలంటే పట్టణ ప్రాంతాల్లోని పలుచోట్ల రూ.4,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. తామే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, ఆమోదించేలా చూస్తామని చెప్పి వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
70 వేల మంది తల్లిదండ్రులపై ప్రభావం
అక్టోబర్ 28వ తేదీన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ అయింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనుంది. కాగా ఏదైనా రిజర్వేషన్ వర్తించాలంటే సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 వేల మంది హాజరు కానుండగా, అందులో దాదాపు 70 వేలమందికి ఈ సర్టిఫికెట్లు అవసరమని అంచనా. దీనిని అసరాగా చేసుకొని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్ కార్యాలయాల సిబ్బంది దందాకు తెరతీశారు.
సొమ్ము దండుకున్నా దబాయింపులే
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి కోసం (జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేందుకు) ఓబీసీ సర్టిఫికెట్ అవసరమైంది. దరఖాస్తు చేద్దామని స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడి నిర్వాహకుడు.. ‘మేమే దరఖాస్తు చేస్తాం.. దరఖాస్తు ఫారాన్ని మేమే తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఆన్‌లైన్‌లో ఆమోదం పొందేలా చేస్తాం.. అందుకు రూ.1,000 ఖర్చు అవుతుంది’అని చెప్పాడు.
రూ.45 దరఖాస్తుకు అంత చెల్లించాలా? అని శ్రీనివాస్.. బాలానగర్‌లోని మరో మీ సేవ కేంద్రానికి వెళ్లి అడగ్గా అక్కడా ఇదే సమాధానం ఎదురైంది. గత్యంతరం లేక రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేశాడు. 12 రోజులు గడిచినా దరఖాస్తును కార్యాలయ సిబ్బంది కనీసం ఓపెన్ కూడా చేయలేదు. మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని అడిగితే ‘అవుతుందిలే.. చేస్తాం.. తహసీల్దార్ కార్యాలయంలో చేయించే వ్యక్తి బిజీగా ఉన్నాడు..’అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిషోర్ అనే వ్యక్తిని కలిశారు.
అతను ‘మీరు నేరుగా ఎలా వస్తారు..’అంటూ మండిపడ్డాడు. దీంతో శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని సంప్రదించారు. అంతా కుమ్మక్కే కావడంతో.. ‘మీ దరఖాస్తు ఫారమే లేదు. మీరివ్వలేదు..’అంటూ వాళ్లు బుకాయించారు. రెండురోజులు తిరిగి విసిగిపోయిన శ్రీనివాస్ చివరకు తహసీల్దార్‌ను కలిసి పరిస్థితి వివరించాడు. ఆన్‌లైన్ ఫారం ప్రింట్ తీసి ఫైల్ సిద్ధం చేయాలని తహసీల్దార్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అయినా వారు పలు కొర్రీలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మళ్లీ తహసీల్దార్‌ను కలవడంతో ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment