
యుద్ధవీరులు 25 లక్షలు.. తెరవెనుక సైన్యం మరో కోటి
మార్చి నుంచి జూన్ వరకు పరీక్షలే పరీక్షలు
వార్షిక, ప్రవేశపరీక్షలతో వేడెక్కుతున్న వాతావరణం
విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉక్కిరిబిక్కిరి
తొలుత ఇంటర్, అవి ముగిసీ ముగియకముందే టెన్త్
ఆ తర్వాత జేఈఈ మెయిన్... ఈఏపీ సెట్
జూన్ 15న నీట్ పీజీతో ముగియనున్న సీజన్
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా.
ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.
మార్చి టు జూన్..
మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి.
ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే.
తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు.
విద్యార్థుల వెనుక కీలకంగా..
రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే.
ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్‌లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు.
విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి.
పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం
టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్‌గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు.
– ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం)
ఒకింత టెన్షన్‌గానే ఉంది
గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు.
– ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్)
––––––––––––––––––
పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం..
అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం.
– సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల)
Comments
Please login to add a commentAdd a comment