నాణ్యత లేని నిత్యావసరాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు
ఏమన్నా అంటే నేతల పేర్లు చెబుతున్నారంటున్న హెచ్‌ఎంలు, ఎంఈవోలు
పౌర సరఫరాల శాఖ నుంచే పురుగుల బియ్యం వస్తున్నాయని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్‌పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.
కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.
కాంట్రాక్టర్లు కారణమంటూ..
⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.
గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.
పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో
⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు.
⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది.
⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment